అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాయశ్చిత్తములు (ఆ)

దేవాలయాదులలో అర్చనాదులు చేయుటలో ఏవైన లోపములు వచ్చినచో అట్టి లోపములు చేసినవాడు ప్రాయశ్చిత్తము చేయవలెను. పూజా లోపము కలిగినచో నూట ఎనిమిది పర్యాయములు జపముచేసి, రెట్టింపు పూజ చేయవలెను. పంచోపనిషన్మంత్రములతో హోమముచేసి బ్రాహ్మణ భోజనము చేయించవలెను. సూతిక కలవారుగాని, అంత్యజులుగాని, రజస్వలగాని దేవుని స్పృశించినచో నూరు పర్యాయములు జపముచేసి పంచోపనిషన్మంత్రములతో పూజ రెట్టింపు అభిషేకము చేయవలెను. హోమమునందు లోపము ఉన్నచో బ్రాహ్మణ భోజనము హోమస్నానము, అర్చనము చేయవలెను. హోమద్రవ్యము ఎలుకలు మొదలగు వాటిచే భక్షింపబడినను, కీటకములతో కూడినను ఆ భాగమును త్యజించి, మిగిలిన దానిని జలముతో ప్రోక్షించి దేవాదిపూజ చేయవలెను. అంకురార్పణము భిన్నమైనను, ఛిన్నమైనను దానిని పరిత్యజించవలెను. ఆ అంకురార్పణ పాత్ర అస్పృశ్యులచే స్పృశింపబడినచో దానిని మరొక పాత్రలో ఉంచి సమర్పించవలెను. పూజాకాలము నందు, దేవమానుష విఘ్నములను తొలగించుటకును, మంత్ర ద్రవ్యాది వ్యత్యాసము కలిగినపుడును మూల మంత్రమును జపించి మరల జపము చేయవలెను. దేవాలయము నందలి కుంభము నష్టమైనపుడు శతవార జపము, దేవతా ప్రతిమ చేతి నుండి జారిపడి పోయినచో ఉపవాసము చేసి నూరు హోమములు చేసినచో శుభమగును. పాపముచేసి పశ్చాత్తాపము చెందువానికి హరినామస్మరణమే పరమ ప్రాయశ్చిత్తము. చాంద్రాయణము, పరాకము, ప్రాజాపత్యము పాపములను తొలగించును. సూర్య, శివ, శక్తి, విష్ణు మంత్రముల జపము కూడ పాపములను నశింపచేయును. గాయత్రీ, ప్రణవ, స్తోత్ర మంత్రముల జపము కూడ పాప వినాశకము. సూర్య, శివ, శక్తి, విష్ణువుల ‘క’ కారముతో ప్రారంభమై ‘రా’ బీజముతో కూడినవియు రాది, ఆది, రాంత మంత్రములును ఒక్కొక్కటి కోట్యధిక ఫలమును ఇచ్చును. ఓం హ్రీంలతో ప్రారంభమైన నమః అంతము నందుండు చతుర్థ్యంత మంత్రములు సర్వకామ ప్రదములు.

నృసింహ ద్వాదశాక్షరీ-అష్టాక్షరీ మంత్రముల జపము పాప సమూహములను నశింపచేయును. అగ్నిపురాణమును చదివినను, విన్నను సకల పాపములు తొలగిపోవును. ద్వి విద్యారూపుడైన విష్ణువు అగ్నిరూపుడుగాను, పరమాత్మగాను, దేవతల ముఖముగను సర్వ వేదములందును గానము చేయబడును. ప్రవృత్తి మార్గమునందును, నివృత్తి మార్గము నందును పూజించబడినవాడైన విష్ణువు యొక్క హవనము ధ్యానము అర్చనము జపము స్తుతి నమస్కారము చేసిన శరీరము నందలి సకల పాపములను తొలగించును. పది విధములైన స్వర్ణ దానములు ద్వాదశవిధ ధాన్య దానములు తులా పురుషదానము మొదలైన షోడశ మహా దానములు అన్న దానములు ఇవి సర్వ పాపములను తొలగించును. తిథి, వార, నక్షత్ర, సంక్రమణ, యోగ, మన్వంతర ఆరంభాది కాలములందు సూర్య, శివ, శక్తి, శ్రీమహావిష్ణు వ్రతాదులు పాపనాశకములు. గంగ, గయ, ప్రయాగ, కాశి, అయోధ్య, అవంతి, కురుక్షేత్రము, పుష్కరము, నైమిషము, పురుషోత్తముడు, సాలగ్రామము, ప్రభాసము, ఈ తీర్థములు అన్నియు సర్వపాప వినాశకములు. నేనే జ్యోతిరూపమైన పరబ్రహ్మను అను ధ్యానము సకల పాపవినాశకము. బ్రహ్మ పురాణము, అగ్ని పురాణము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల, అవతారముల పూజ, దేవతా ప్రతిష్ఠ, ప్రతిమాదులు, జ్యోతిః శాస్త్ర పురాణములు, స్మృతులు, తపస్సు, వ్రతములు, అర్థ శాస్త్రము, సృష్టి తత్త్వము, ఆయుర్వేద, ధనుర్వేదములు, శిక్ష, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, అభిధానము, కల్పము, న్యాయము, మీమాంస ఇంకా ఇతరమైన అన్ని విద్యలును హరియే, ఒకే విష్ణువు వ్యక్తా వ్యక్త రూపములలో ఉన్నాడు. అతని వలననే ఈ జగము జనించి, ఆతని యందే ఉన్నదని తెలిసికొనిన వానిని చూడగనే పాపములు అన్నియు నశించును. శ్రీమహావిష్ణువే అష్టాదశ విద్యారూపుడు, సూక్ష్మ-స్థూల స్వరూపుడు, అపరుడు, జ్యోతీరూపుడు అక్షర పరబ్రహ్మము, నిర్మలుడు. (174)