అగ్ని మహా పురాణము

Table of Contents

రాజు యొక్క దినచర్యా కథనము

పుష్కరుడు చెప్పెను: పరశురామా! రాజు ప్రతిదినము చేయవలసిన పనులు చెప్పెదను. ఇంకను ఘడియరాత్రి ఉన్నదనగా రాజు వివిధ మంగళ వాద్యధ్వనులు, వందిమాగధుల స్తుతులు, మంగళ గీతములు వినుచు మేల్కొనవలెను. పిదప గూఢచారులను చూడవలెను. వీరు రాజసేవకులు అని గూఢచారులను గూర్చి ఎవ్వరికిని తెలియకూడదు. పిదప యథావిధిగ ఆయవ్యయముల లెక్కలు వినవలెను. శౌచాద్య నంతరము స్నాన గృహము ప్రవేశించి, ముందుగ దంత ధావనముచేసి పిదప స్నానము చేయవలెను. సంధ్యోపాసనానంతరము శ్రీమహావిష్ణువును పూజించవలెను. పిదప పవిత్రుడై అగ్ని హోత్ర ముచేసి పితృ తర్పణములు చేయవలెను. పిదప బ్రాహ్మణాశీర్వాదములు గ్రహించి వారికి సువర్ణసహితముగా పాలు ఇచ్చు గోవును దానము చేయవలెను. చందనము, అలంకారము ధరించి అద్దమునందును, సువర్ణయుక్తమగు ఘృతమునందును తన ముఖము చూచు కొనవలెను. దైవిక కథాదులు విని, వైద్యుడు చెప్పిన ఔషధము సేవించి, మంగళవస్తువులు స్పృశించి, గురుదర్శనముచేసి, ఆతని ఆశీర్వాదములు పొంది రాజసభలో ప్రవేశించవలెను.

రాజసభలో బ్రాహ్మణులను, అమాత్యులను కలిసి తన దర్శనము నిమిత్తమై వచ్చియున్నట్లు ద్వారపాలకుడు చెప్పిన ప్రజలకు దర్శనమీయవలెను. ఇతిహాస శ్రవణా నంతరము రాజ్యకార్యములను పర్యవేక్షించవలెను. వాటిలో చాల అవశ్యకములగు వాటిని గూర్చి నిర్ణయములు తీసికొని, ప్రజల వ్యవహారములు చూచి, మంత్రులతో గుప్త విషయములను చర్చించవలెను. ఒక్కనితో మాత్రముగాని, చాలమందితోగాని, మూర్ఖులతోగాని, విశ్వాసయోగ్యులు కానివారితోగాని మంత్రణము చేయ గూడదు. సర్వదా గుప్త రూపముననే చేయవలెను. ప్రకటముగ చేయరాదు. రాజ్యమునందు ఎట్టి బాధలును రాని విధమున, మంత్రణములను రహస్యముగా ఉంచవలెను, మంత్రణము రహస్యముగా ఉంచుటకు ఉపాయము తన ఆకార చేష్టాదులందు ఎన్నడును, ఎట్టి మార్పులను లేకుండ చూచుకొనుటయే. ఏలనన బుద్ధిమంతులు ఆకారచేష్టాదుల ద్వారా గుప్తములగు మంత్రణములను కూడ కనిపెట్టివేయుదురు. జ్యోతిష్కులు, మంత్రులు, వైద్యులు చెప్పిన మాటలను రాజు వినవలెను. అట్లు చేయుటచే ఐశ్వర్యమును పొందును. ఏలనన వీరు రాజును అనుచిత కార్యములనుండి మరల్చి హితకార్యములందు ప్రవర్తింపచేయుదురు. మంత్రణలు ముగిసిన పిదప రథాదులను నడపుట, శస్త్ర ప్రయోగము మొదలగు వాటితో కొంతసమయము వ్యాయామము చేయవలెను. యుద్ధాది సమయములందు రాజు స్నానమొనరించి, బాగుగా పూజచేసిన శ్రీమహావిష్ణువును, హోమానంతరము ప్రజ్వలించుచున్న అగ్నిని, దానమానాదులచే సత్కృతులగు బ్రాహ్మణులను చూడవలెను. దానాద్యనంతరము వస్త్రాలంకారాదులతో అలంకరించుకొని పరీక్షించిన అన్నము భుజించవలెను. తాంబూల సేవనము చేసి ఎడమప్రక్కగా కొంతసేపు శయనించవలెను. ప్రతిదినము శాస్త్రచింతనము, యోధ-అన్నభాండార, శస్త్రాగారముల పర్యవేక్షణము చేయవలెను. దినాంతమున సాయంసంధ్యను ఉపాసించి, ఇతర కార్యములను గూర్చి విచారించి, ఆవశ్యకములగు పనులపై గూఢచారు లను పంపి, రాత్రి భోజనానంతరము అంతఃపురములోనికి వెళ్లవలెను. అచట సంగీత వాద్యాదులతో మనోరంజనము చేసుకొని ఆత్మరక్షణోపాయములను చక్కగా చేసికొని నిద్రించవలెను. రాజు ప్రతిదినము ఇట్లే చేయవలెను. (235)