అగ్ని మహా పురాణము

Table of Contents

రాజ సహాయ సంపత్తి వర్ణనము

పుష్కరుడు పలికెను:

అభిషేకానంతరము, ఉత్తముడగు రాజు మంత్రి సమేతుడై శత్రువులను జయించవలెను. సత్కుల ప్రసూతుడు, నీతి శాస్త్రజ్ఞుడు అగు బ్రాహ్మణుని గాని, క్షత్రియుని గాని సేనాపతిగా నియమించవలెను. ద్వారపాలకులు గూడ నీతిజ్ఞులై యుండవలెను. దూత కూడ మృదుభాషియై, అత్యంత బలసామర్థ్యవంతుడై ఉండవలెను. స్త్రీగాని, పురుషుడు గాని తాంబూలధారి కావచ్చును. కాని ఆ వ్యక్తి రాజభక్తి కలిగి, క్లేశసహిష్ణువై, స్వామిప్రీతి పాత్రము కావలెను. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, సమాశ్రయములను ఆరు గుణములను సమయానుసారముగా ప్రయోగిం పగలుగు వానిని సాంధివిగ్రహకునిగా నియమింపవలెను. రాజరక్షకుడు సర్వదా ఖడ్గముబూని యుండవలెను. సారథి సేనాది విషయకమగు మంచి జ్ఞానము కలవాడై ఉండవలెను. పాకశాల అధ్యక్షుడు రాజ హితాభిలాషియై, చతురుడై సర్వదా పాకశాలలోనే ఉండవలెను. రాజసభా సదస్యులు ధర్మవేత్తలై ఉండవలెను. వ్రాయసగాండ్రు వివిధ లిపివేత్తలై రాజహితైషులై ఉండవలెను. ద్వారపాలకులు రాజహితచింతకులై, రాజు ఎప్పుడు తమను పిలచునో తెలిసినవారై ఉండవలెను. ధనాధ్యక్షుడు రత్నపరీక్షా నిపుణుడై, ధనమును వృద్ధి చేయుటయందు ఆసక్తి కలవాడై ఉండవలెను. రాజవైద్యుడు ఆయుర్వేద నిపుణుడై యుండవలెను. గజాధ్యక్షుడు గజవిద్య యందు ప్రవీణుడై ఉండవలెను. దుర్గాధ్యక్షుడు రాజహితైషియై బుద్ధిమంతుడై ఉండవలెను. శిల్పులు వాస్తువిద్యా విశారదులై ఉండవలెను. యంత్రముల ద్వారా ఆయుధములు ప్రయోగించుట, చేతితో శస్త్రములను విడచుట, శస్త్రములను ప్రయోగింపకుండుట. విడచిన శస్త్రములను నివారించుట మొదలగు యుద్ధ రీతులందు ప్రవీణుడు, రాజు హితమును కోరువాడు అగు వానిని శస్త్రాచార్య పదమునందు నియమించవలెను. వృద్ధుని అంతఃపురాధ్యక్షుని చేయవలెను. అంతఃపురమునందలి అన్ని కార్యములను నిర్వహించుటకు ఏబది సంవత్సరముల స్త్రీలను, డెబ్బది సంవత్సరముల పురుషులను నియమించవచ్చును. సర్వదా జాగరూకులైన వారినే ఆయుధాగారమున నియమింపవలెను. భృత్యులకు వారివారి కార్యములను బట్టి జీవిక ఏర్పరుపవలెను. ఉత్తమ, మధ్యమ, అధమ కార్యానుసారముగా అట్టివారినే ఆయా కార్యములందు నియోగించవలెను. విజయాభిలాషియగు రాజు స్వహితైషులగు వారినే సహాయకులుగా నియమించవలెను. ధర్మకార్యములందు ధర్మాత్ములను, యుద్ధమునందు శూరులను, ధనార్జనమునందు అర్థ కుశలులను నియమించ వలెను. శుద్ధమగు ప్రవర్తన, ఆలోచన కలవారినే ఆయా కార్యములందు నియోగించవలెను.

స్త్రీల సంరక్షణ విషయమున నపుంసకులను నియమించవలెను. క్రూరకార్యములందు తీక్ష్ణ స్వభావులగు వారిని నియోగించవలెను. ధర్మార్థ కామములను హరించుట యందు ఏ పురుషుడు సమర్థుడుగ కనబడునో ఆతనిని నియమించవలెను. నీచ కార్యములందు అట్టివానినే నియోగించవలెను. పురుషులను అనేక విధముల పరీక్షించిన పిదపనే వారిని తగు కార్యములందు నియోగించవలెను. మంత్రితో ఆలోచనలు చేయుచుండ వలెను. కొందరికి వృత్తికల్పించి ఏనుగులున్న అడవులలో వారికి నివాస మేర్పరచి వారి విషయము తెలుసుకొనుచుండుటకై ఉత్సాహవంతులగు అధ్యక్షులను నియమించవలెను. ఎవరికి ఏ కార్యమునందు నైపుణ్యము ఉండునో వారిని ఆ కార్యమునందు నియమించవలెను. తండ్రి తాతలనుండి తరతరాలుగా వచ్చుచున్న భృత్యులను అన్ని కార్యములందును నియోగించవచ్చును. వారందరును సమానులేగాన వారిలో ఎవరినికూడ ఇతరులపై అధికారిగ నియమించగూడదు. ఇతర రాజుల నుండి తనను ఆశ్రయించుటకై వచ్చినవారికి, వారు దుష్టులైనను, మంచివారైనను ప్రయత్నపూర్వకముగ ఆశ్రయమీయవలెను. వారు దుష్టులని తెలిసినచో వారిని విశ్వసించగూడదు. వారి జీవికా వృత్తిని తన అధీనమునందు ఉంచుకొనవలెను. ఇతర దేశముల నుండి వచ్చిన వారిని గూఢచారుల ద్వారా బాగుగా పరీక్షించి తగువిధమున సత్కరించవలెను. శత్రు, అగ్ని, విష, సర్ప, ఖడ్గములు ఒక ప్రక్క దుష్టులగు భృత్యులు మరొక ప్రక్క. వీరిలో దుష్టభృత్యులు అధిక భయంకరులు. రాజు గూఢచారులనే నేత్రములుగ ఉపయోగించవలెను. అందుచే అన్నివిషయములు తెలుసుకొనుటకై గూఢచారులను సమకూర్చు కొనవలెను. జనులచే గుర్తింప శక్యముకాని వారిని శాంత, కోమలస్వభావము కలవారిని, గూఢచారులనుగా నియమించవలెను. వారు ఒకరికొకరు కూడ తెలియనివారుగా ఉండవలెను. వారిలో కొందరు వర్తకులుగాను, కొందరు మంత్ర తంత్ర వేత్తలుగాను, కొందరు జ్యోతిష్కులుగాను, కొందరు వైద్యులుగాను, కొందరు సన్యాసులుగాను, కొందరు బలాబల విచారణ కర్తలుగాను సంచరించు చుండవలెను. రాజు ఒక్కగూఢచారి చెప్పినది నమ్మకూడదు. చాలమంది ఒకే విధముగ చెప్పిన యెడలనే నమ్మవలెను. భృత్యులలో ఎవనికి తనపై అనురాగమున్నదో ఎవనికి లేదో, ఎవనిలో ఏ సద్గుణములున్నవి, ఏ దుర్గుణములున్నవి, శుభచింతకుడెవడు, అశుభ చింతకుడెవడు అను విషయములను తెలిసికొనవలెను. ప్రజల అనురాగమును పెంచు కార్యములను మాత్రము చేయవలెను. వారికి వైముఖ్యము కలుగు పని చేయకూడదు. ప్రజానురాగమును పెంచు లక్ష్మిగల రాజే నిజమైన రాజు. అందరిని రంజింప చేయుట చేతనే అతడు ‘రాజు’ అని చెప్పబడుచున్నాడు.