అగ్ని మహా పురాణము

Table of Contents

వేదశాఖా కీర్తనము

పుష్కరుడు పలికెను:

సర్వానుగ్రాహకములగు వేదమంత్రములు నాల్గు పురుషార్ధములను ఇచ్చును. ఋక్, యజుః, సామ, అధర్వములని వేదములు నాలుగు. వీటి మంత్రముల సంఖ్య ఒక లక్ష. ఋగ్వేదమునకు, సాంఖ్యాయనము ఆశ్వలాయనమని రెండు శాఖలు. వీటిలో ఒక వెయ్యి ఋగ్వేద బ్రాహ్మణములలో రెండువేల మంత్రములు ఉన్నవి. కృష్ణ ద్వైపాయనాదులు ఋగ్వేదమును ప్రమాణముగా అంగీకరించిరి. యజుర్వేదమున పందొమ్మిది వందల తొంబది తొమ్మిది మంత్రములున్నవి. బ్రాహ్మణములందు వెయ్యి మంత్రములు ఉన్నవి. శాఖలు ఎనుబది ఆరు. కాండ్వి, మాధ్యందినీ, కఠి, మైత్రాయణి, తైత్తరీయ, వైశంపాయనిక-మొదలగు శాఖలు యజుర్వేదమునందు వున్నవి. సామవేదమున కౌథుమ శాఖ అథర్వణా యణి శాఖ-అను రెండు శాఖలున్నవి. దీనిలో వేదము ఆరణ్యకము, ఉక్థకము, ఊహము-అను నాలుగు గానములున్నవి. సామ వేదములో తొమ్మిదివేల నాలుగు వందల ఇరువది ఐదు మంత్రములు వున్నవి. ఇవి బ్రహ్మకు సంబంధించినవి. ఇది సామవేద మానము.

సుమంతువు -జాజలి-శ్లోకాయణీ- శౌనకుడు పిప్పలాదుడు ముంజకేశుడు, మొదలగు వారు అధర్వ వేదమునకు శాఖా ప్రవర్తకులగు ఋషులు. దీనిలో పదహారువేల మంత్రములు నూరు ఉపనిషత్తులు వున్నవి. శ్రీ మహావిష్ణువు వ్యాసరూపమున అవతరించి వేదశాఖా విభాగమును చేసెను. వేదశాఖా భేదాదులు ఇతిహాసములు పురాణములు. ఇవన్నియు విష్ణు స్వరూపములు. లోమహర్షణుడను సూతుడు, వ్యాసుని నుండి పురాణాదులు గ్రహించి, ప్రచారముచేసెను. ఆతనికి సుమతి అగ్ని వర్చసుడు, మిత్రము శింశపాయనుడు, కృతవ్రతుడు, సావర్ణి-అను ఆరుగురు శిష్యు లుండిరి. శింశపాయనాదులు పురాణ సంహితను రచించిరి. శ్రీ మహావిష్ణువే బ్రహ్మాది అష్టాదశ పురాణముల రూపము నను అష్టాదశ విద్యారూపమునను ఉన్నాడు. సప్రపంచ, నిష్ప్రపంచ, మూర్తామూర్త, స్వరూపధారియగు శ్రీమహావిష్ణువు అగ్ని పురాణరూపమున నున్నాడు. అతనిని తెలుసుకొని పూజించి స్తుతించినచో భుక్తిముక్తులు లభించును. విజయశీలుడగు విష్ణువు ప్రభావ సంపన్నుడు. అగ్ని సూర్యాది రూపముననున్నవాడు. ఆ విష్ణువే అగ్నిరూపమున దేవతాదుల ముఖముగనున్నాడు. ఆతడే పరమగతి, వేద పురాణములందు యజ్ఞమూర్తిగ వర్ణింపబడు చున్నాడు. ఈ అగ్ని పురాణము విష్ణువు యొక్క మహత్తర రూపము. ఈ అగ్ని మహా పురాణమునకు కర్తయు శ్రోతయు కూడ జనార్దనుడే. అందుచే ఈ అగ్ని మహాపురాణము సర్వవేదమయము, సర్వ విద్యామయము, సర్వ జ్ఞానమయము, పుణ్యము శ్రేష్ఠము. చదువు వారికిని వినువారికిని సర్వాత్ముడగు శ్రీహరియే స్వరూపము. ఈ పురాణము విద్యార్థులకు విద్యను ధనార్థులకు ఐశ్వర్యమును, రాజ్యార్థులకు రాజ్యమును, ధర్మకాములకు ధర్మమును, స్వర్గకాములకు స్వర్గమును, పుత్రకాములకు పుత్రులను, గనాదికాములకు గోవులను, గ్రామ కాములకు గ్రామములను ఇచ్చును. కామార్థులకు సర్వ సౌభాగ్యములను, గుణకీర్తులను ఇచ్చును. జయకాములకు జయమును, సర్వకాములకు సర్వమును ముక్తి కోరువారికి ముక్తిని ఇచ్చును. పాపములు చేసిన వారికి పాపములు తొలగించును. (271)