అగ్ని మహా పురాణము
శరీరావయవములలో నాడీ ప్రమాణము
అగ్నిదేవుడు పలికెను:
శ్రోత్ర, త్వక్ నేత్ర, జిహ్వా, నాసికలు- జ్ఞానేంద్రియములు, ఆకాశము సర్వ భూత వ్యాప్తము. శబ్ద స్పర్శ రూప రస గంధములు ఆకాశాది గుణములు. పాయు ఉపస్థ, కర, పాద, వాక్కులు కర్మేంద్రియములు. ఉత్సర్గ, ఆనంద, గ్రహణ, ఆగమన, వాగాదికములు వీటి కర్మలు. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచేంద్రియముల విషయములు పంచ మహా భూతములు, మనస్సు, బుద్ధి మహత్తత్త్వము మూల ప్రకృతి అనునవి ఇరువది నాలుగు తత్త్వములు. పురుషుడు వీటి అన్నింటికి అతీతుడు. మత్స్యోద కములవలె ఈ రెండును పరస్పర సంయుక్తములై వియుక్తములై ఉండును. రజస్సత్వ తమోగుణములు ప్రకృతినాశ్రయించి వుండును. అంతః కరణోపాధికల పురుషుడు జీవుడు. ఉపాధిరహితుడగు ఆ జీవుడే సర్వకారణమగు బ్రహ్మ. పరమ పురుషుని తెలుసుకొనినవాడు పరమపదమును పొందును. దేహమునందు ఏడు ఆశయము లున్నవి. రుధిర, శ్లేష్మ, ఆమ, పిత్త, పక్వ, వాయు, మూత్ర ఆశయములని అవి ఏడు. స్త్రీలకు ఎనిమిదవ గర్భాశయము కూడ ఉండును. అగ్ని వలన పిత్తము, పిత్తము వలన పక్వాశయము ఏర్పడును. ఋతు కాలమున యోని వికసించును. గర్భాశయము పద్మము వలె ఉండును. అచట వుంచబడిన వీర్యము గర్భాశయము చేరును. ఆ గర్భాశయము రజో వీర్యములను ధరించును. వీర్యమువలన శరీరము కాలక్రమమున కేశములు ప్రకటములగును. ఋతు సమయమున యోని వాత పిత్త కఫములచే ఆవృతమైనచో అది వికసించదు. బుక్కము వలన పుక్కసము ప్లీహ యకృత్ కోష్ఠాగ, హృదయ, వ్రణ, తండకములు ఏర్పడును. ఇవన్ని ఆశయమునందు నిబద్ధములై వుండును. పచ్యమానమగు రసము యొక్క సారము నుండి ప్లీహయకృత్ పుట్టును. రక్త ఫేనము నుండి పుక్కసము పుట్టును. రక్త పిత్త తండకములు కూడ ఈ విధముగనే పుట్టును. రక్త ప్రసారము వలన బుక్క పుట్టును. రక్త మాంస ప్రసారము వలన ప్రేగులు ఏర్పడును. మానవుని ప్రేగులు మూడున్నర బారలు వుండును. వేదవేత్తలగు పురుషుల యొక్కయు, స్త్రీల యొక్కయు ప్రేగులు మూడు బారలుండును. రక్త వాయు సంయోగముచే కామము ఉదయించును. కఫ ప్రసారముచే హృదయము ప్రకటమగును. అది కమలమువలె వుండును. దాని ముఖము క్రిందికి వుండును. దాని మధ్యనున్న ఆకాశములో జీవుడుండును. చైతన్యముతో సంబంధించిన అన్ని భావములును దానియందే ఉండును. దాని ఎడమ ప్రక్క ప్లీహ, దక్షిణ భాగమున యకృత్ క్లోమములు ఉండును. ఈ శరీరమున కఫ రక్తములను ప్రవహింపచేయు స్రోతస్సుల వలన భూతాను మానముచే ఇంద్రియముల ఉత్పత్తి జరుగును, నేత్రములందలి శుక్ల మండలము కఫము వలన ఏర్పడును. ఇది తండ్రికి సంబంధించినది. కృష్ణభాగము వాతమువలన కలుగును. ఇది తల్లి అంశమునకు సంబంధించినది. త్వఙ్మండలము పిత్తముచే ఉత్పన్నమగును. ఇవి మాతృ పితృ సముద్భవములు. మాంస, రక్త, కఫముల వలన జిహ్వయు, మేదోరక్త కఫముల వలన, అండకోశము ఉత్పన్నమగును. ప్రాణమునకు శిరస్సు హృదయము, నాభి కంఠము, జిహ్వ శుక్రము రక్తము గుదము మూత్రాశయము గుల్ఫములు కండరములు అను పదునారు స్థానములు.
అగ్నిదేవుడు పలికెను:
రెండు చేతులందును రెండు, చరణములందును నాలుగు, పీటమునందును నాలుగు, కంఠము నందును పాదాది శిరః పర్యంత సకల శరీరమంతటను పదునారు జాలము లుండును. మాంసజాల, స్నాయుజాల, శిరాజాల, అస్థిజాలములు వేర్వేరుగా రెండు మణి బంధనములందును గుల్ఫములందును పరస్పరాబద్ధములై ఉండును. శరీరమున ఆరు కూర్చములు ఉండును. రెండు హస్తములు, రెండు పాదములు, కంఠము, మేడ్రము వీటియందుండును. పృష్ఠ మధ్య భాగమున మేరు దండము, దాని సమీపమున నాలుగు మాంస రజ్జువులు, వాటిని బంధించి వుంచిన తొమ్మిది పేశీలు వుండును. ఏడు సీవనిలు వుండును. వాటిలో ఐదు శిరస్సునందును ఒకటి మేడ్రము నందును ఒకటి జిహ్వయందును ఉండును. ఎముకలు పదునెనిమిది వేలు. సూక్ష్మములు స్థూలములు కలిసి అరువది నాలుగు దంతములు. ఇరువది నఖములు హస్త, పాదములందలి శలాకలు, నాల్గు స్థానము లందుండును. వ్రేళ్ళలో అరువది పార్ష్ణుల యందు రెండు, గుల్ఫములందు నాలుగు, ఆరత్నులయందు నాలుగు, జంఘలయందు నాలుగు ఉండును. జానువుల యందు రెండేసి కపోలములందు రెండు, ఊరువుల యందు రెండు, ఫలక మూల భాగము లందు రెండు ఎముకలు ఉండును. ఇంద్రియ స్థానములందున శ్రోణ ఫలకము నందును రెండేసి ఎముకలు ఉండును. భగమునందు కొంచెము ఎముకలుండును. ఇంద్రియ స్థానములందున శ్రేణఫలకమునందును రెండేసి ఎముకలుండును. వీపుయందు నలుబదియైదు కంఠమునందు నలుబదియైదు ఉండును. గ్రీవయందు జతృకము అను ప్రదేశము నందు రెండేసి ఉండును. లలాట, నేత్ర, కపోల, నాసికా, పద, పరుశు తాలువులందు అర్ధర్బుదము డెబ్బదిరెండు అస్థువులు ఉండును. శిరస్సు యందు రెండు శంఖములు, నాలుగు కపాలములు, వక్షఃస్థలమున పదునేడు అస్థులు వుండును. రెండు వందల పది సంధులు ఉండును. వీటిలో శాఖలలో అరువది ఎనిమిది, యేబది తొమ్మిది, మధ్యయందు ఎనుబది మూడు వుండును. తొమ్మిది వందల స్నాయువులు వుండును. వీటిలో అంతర ప్రదేశమున రెండు వందల ముప్పది ఉండును. డెబ్బది ఊర్ధ్వగాములు శాఖలలో ఆరు వందల స్నాయువులు ఉండును. పేశీలు ఐదు వందలు. వీటిలో నలుబది ఊర్థ్వగాములు శాఖలలో నాలుగు వందలు, అంతరాధియందు అరువది వుండును.
స్త్రీలకు పురుషుల కంటే ఇరువది నాలుగు మాంసపేశీలు, వీటిలో పది స్తనము లందును, యోనియందు పదమూడు, గర్భమునందు నాలుగు ఉండును. శరీరము నందు ముప్పదివేల తొమ్మిది యేబది ఆరు వేలు నాడులు ఉండును. చిన్నచిన్న కాలువలు మడులలో నీరు ప్రవహింప చేసినట్లు ఈ నాడులు శరీరమునందంతటను రసమును ప్రవహింపచేయును. క్లేద లేపాదులు వాటి కార్యమే. డెబ్బది రెండు కోట్ల రోమ కూపములు అంజలులు అను చెప్పబడు మజ్జామేదో, మూత్ర, పిత్త, శ్లేష్మ, మల, రక్త, రసములును ఈ దేహము నందుండును. పూర్వ పూర్వ అంజలుల కంటే ఉత్తరోత్తర అంజలులు ఒకటిన్నర రెట్లు అధికము. ఒక అంజలిలో సగము వీర్యము సగము ఓజస్సు వుండును. స్త్రీలలో రజస్సుకు సంబంధించిన నాలుగు అంజలులు వుండును. ఈ శరీరము మల దోషాదుల పిండము అని తెలుసుకొని దీనిపై ఆసక్తిని విడువవలెను. (370)
