అగ్ని మహా పురాణము

Table of Contents

పృథ్వీదానములు

అగ్నిదేవుడు చెప్పెను:

ఇప్పుడు పృథివీ దానమును గూర్చి చెప్పెదను. పృథివి మూడు విధములైనది. నూరు కోట్ల యోజనముల వైశాల్యముతో, సప్త ద్వీపములతో, సముద్రములతో జంబూద్వీప పర్యంతము ఉన్న పృథివి ఉత్తమమైనది. ఐదు భారాల సువర్ణముతో ఉత్తమపృథ్విని నిర్మించవలెను. దానిలో సగముతో కూర్మమును, కమలమును నిర్మించవలెను. ఇది ఉత్తమ పృథివీ’. దీనిలో సగము ‘మధ్యమ పృథివి’. దీనిలో మూడవ వంతుతో నిర్మించినది ‘కనిష్ఠ పృథివి. దీనితో పృథివిలోని మూడవ భాగమునందు కూర్మమును, వరాహమును నిర్మించవలెను. వెయ్యి పలముల సువర్ణముతో మూలము, దండము, ఆకులు, ఫలములు, పుష్పములు, ఐదు శాఖలుగల కల్పవృక్షము నిర్మించవలెను. పండితుడైన బ్రాహ్మణుడు యజమానునిచే సంకల్పము చేయించి దీనిని ఐదుగురు బ్రాహ్మణులకు దానము చేయించవలెను. దీనిని దానము చేసినవాడు బ్రహ్మ లోకమునందు పితృ గణములతో కలిసి చాలా కాలము ఆనందము అనుభవించును. ఐదువందల పలముల సువర్ణముతో కామధేనువును నిర్మించి విష్ణుసముఖమున దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరును గోవు శరీరమును ఆశ్రయించి యుందురు. గోదానము చేయుటచే సకల దానములు చేసినట్లే అగును. దీనివలన సకలాభీష్టములు సిద్ధించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగును. శ్రీమహావిష్ణు సాన్నిధ్యమున కపిల గోదానము చేసినవాడు తన కులమునకు అంతకును ఉద్ధారకుడగును. అలంకృత కన్యాదానము చేసిన వానికి అశ్వమేధయాగ ఫలము లభించును. సకల సస్యములు పండించుటకు తగిన భూమిని దానము చేసినవాడు సర్వమును పొందగలడు. గ్రామము, నగరము, పల్లె దానము చేసిన వాడు సుఖవంతుడు అగును. కార్తిక పూర్ణిమాదులందు వృషోత్సర్గము చేయువాడు తన కులమును ఉద్ధరించును. (213)