అగ్ని మహా పురాణము

Table of Contents

లక్ష్మీ ప్రతిష్ఠా విధి

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు సామూహిక రూపమున దేవతాది ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. మొదట లక్ష్మీ స్థాపనగూర్చియు, పిదప ఇతర దేవతా స్థాపన గూర్చియు చెప్పెదను. మండప, అభిషేకాదులు అన్నియు వెనుకటి అధ్యాయములలో చెప్పినట్లే చేయవలెను. పిమ్మట భద్రపీఠమును లక్ష్మిని స్థాపించి ఎనిమిది దిక్కులందును ఎనిమిది కలశములు స్థాపించవలెను. దేవీ ప్రతిమకు ఆజ్యము పూసి, మూలమంత్రము చదువుచు, పంచ గవ్యములతో స్నానము చేయించవలెను. “హిరణ్యవర్ణాం హరిణీమ్” ఇత్యాది మంత్రము చదువుచు నేత్రములను తెరువవలెను. “తాం మ ఆవహ” అను మంత్రము చదివి దేవికి తేనె, నెయ్యి, పంచదార సమర్పింపవలెను. ‘అశ్వపూర్వామ్’ ఇత్యాది మంత్రముతో తూర్పుననున్న కలశతో స్నానము చేయించవలెను.

“కాంసోస్మితామ్” ఇత్యాది మంత్రముతో దక్షిణ కలశజలముతోను, “చన్ద్రాం ప్రభాసామ్” ఇత్యాది మంత్రముతో పశ్చిమ కలశజలముతోను, “ఆదిత్యవర్ణే’ ఇత్యాది మంత్రముతో ఉత్తర కలశజలముతోను “ఉపైతు మాం” ఉత్యాది మంత్రముతో ఆగ్నేయ కలశజలముతోను, “క్షుత్పిపా సామలామ్” ఇత్యాది మంత్రముతో నైరృతి కలశజలముతోను, “గన్ధద్వారాం” ఇత్యాది మంత్రముతో వాయవ్య కోణ కలశజలముతోను, “మనసః కామమాకూతిమ్’ ఇత్యాది మంత్రముతో ఈశాన్య కలశముల జలముతోను, లక్ష్మీదేవికి అభిషేకము చేయవలెను. “ఆపః సృజన్తు” ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క కలశములతో శ్రీదేవి ప్రతిమకు స్నానము చేయించవలెను.

పిమ్మట “ఆర్ద్రాం పుష్కరిణీమ్” ఇత్యాది మంత్రముతో గంధమర్పించి, “ఆర్ద్రాం యః కరిణీమ్ ఇత్యాది మంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. పిమ్మట “తాం మ ఆవహ జాతవేదః” ఇత్యాది మంత్రముతోను, “ఆనన్దః” ఇత్యాది శ్లోకములతోను మిగిలిన ఉపచారములు అన్నియు సమర్పింపవలెను. “శ్రాయన్తీ” ఇత్యాది మంత్రము చదువుచు శయ్యపై పరుండపెట్టవలెను. శ్రీసూక్తము పఠించుచు సన్నిధీకరణముచేసి, లక్ష్మీబీజముతో (శ్రీం) చిచ్ఛక్తి విన్యాసముచేసి మరల పూజింప వలెను. పిదప శ్రీసూక్తముతో మండపముపై ఉన్న కుండములలో కమలములతో గాని, కరవీర పుష్పములతోగాని వెయ్యి లేదా వందహోమములు చేయవలెను.

గృహోపకరణాది సమస్త పూజా సామగ్రి మొదటి నుండియు శ్రీసూక్త మంత్రముతోడనే సమర్పింపవలెను. వెనుకటివలె ప్రాసాదమునకు సంస్కారము చేసి, లక్ష్మికి పిండికా నిర్మాణము చేయవలెను. పిమ్మట పిండికపై లక్ష్మిని ప్రతిష్ఠచేసి, శ్రీసూక్తముతో సన్నిధీకరణము చేయుచు వెనుకటివలె శ్రీసూక్తము నందలి ఒక్కొక్క ఋక్కును జపించవలెను. మూల మంత్రముచే చిచ్ఛక్తిని జాగృత మొనర్చి మరల సన్నిధీకరణము చేయవలెను.

పిమ్మట ఆచార్యునకు, బ్రహ్మకు, ఇతర ఋత్విక్కులకు, బ్రాహ్మణులకు భూ, సువర్ణ, వస్త్ర, గోదానాదులు చేయవలెను. ఈ విధముగ అందరి దేవులను స్థాపించినవాడు, రాజ్య స్వర్గాదులను పొందును. (62)