అగ్ని మహా పురాణము

Table of Contents

అభినయాది నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

విషయమును అభిముఖములు చేయునది అభినయము. సాత్వికము, వాచికము, ఆంగికము, ఆహార్యము-అని ఇది నాలుగు విధములు. స్తంభాదికము సాత్త్వికము. వాకవృత్తి వాచికము. శరీర చేష్ట ఆంగికము. బుద్ధిని ఉపయోగించి చేయునది ఆహార్యము. అభిమాన స్థితిచే రసాది వినియోగము చెప్పబడుచున్నది. రసము లేకుండగా మిగిలినవి స్వతంత్రములుగా ఉండుట వ్యర్ధము. సంభోగము విప్రలంభము అని శృంగారము రెండు విధములు. ప్రచ్ఛన్నము ప్రకాశము అని అవి రెండేసి విధములు. పూర్వాను రాగము మానము ప్రవాసము కరుణ యని విప్రలంబము నాలుగు విధములు. వీనిలో ఒకదానివలన సంభోగశృంగారము ఉత్పన్నమగును. ఇది కూడ నాలుగు విధ ములు. స్త్రీ, పురుషులను ఆశ్రయించి వుండును. శృంగార జనకము రతి. వైవర్గ్య ప్రళయములు తప్ప అన్ని సాత్విక భావములు దీనియందు ఉండును. ధర్మార్థ కామ మోక్షముల చేతను ఆలంబన విశేషముల చేతను వాటి అవాంతర విశేషముచేతను శృంగారము నిరంతరము పుష్టి పొందును. శృంగారము వాక్ క్రియ, నేపథ్యక్రియ అని రెండు విధములు.

హాసము నాలుగు విధములు. దంతములు కనబడనిది స్మితము. కొంచెము దంతాగ్రములు కనబడి నేత్రములు వికసించినచో అది హసితము. ధ్వనితో కూడినది విహసితము. కుటిలత్వముతో కూడినది ఉపహసితము. సశబ్దముగ వున్నది అపహసితము. ఎక్కువ శబ్దము కలది అతి హసితము. కరుణరసము ధర్మోప ఘాతజము, చిత్తవిలాసజనితము, శోకజనితము అని మూడు విధములు. దీనికి శోకము స్థాయి భావము. రౌద్ర రసముకూడ అంగనేపథ్య వాక్యములచే మూడు విధములు. దీని స్థాయీ భావము క్రోధము. స్వేద రోమాంచ వేపథువులు ఉండును.

దానవీరము, ధర్మవీరము, యుద్ధవీరము అని వీరము మూడు విధములు. ఉత్సాహము స్థాయీ భావము. ప్రారంభమున వీరముండి చివరమునకు భయమును కలిగించునది భయానకము. దాని స్థాయి భావము భయము. ఉద్వేజనము క్షోభణముయని బీభత్సము రెండు విధములు. పూతి వస్తువులచే కలిగినది ఉద్వేజనము. రుదిరాదులచే కలిగినది క్షోభణము. దీని స్థాయీ భావము జుగుప్స. దీనియందు సాత్త్విక భావములు ఉండవు.

కావ్య శోభాకరములగు ధర్మములను అలంకారములందురు. ఇవి శబ్దమును, అర్థమును, ఉభయమును అలంకరించును. వ్యుత్పత్యాదులచే శబ్దమును అలంకరించునవి శబ్దాలంకారములు. ఛాయ, ముద్ర, ఉక్తి, యుక్తి, గుంఫన, వాకోవాక్యము అనుప్రాసము, చిత్తము, దుష్కరము. ఇవి తొమ్మిది శబ్దాలంకారములు. ఇతరుల ఉక్తిని అనుకరించుటకు ఛాయ అని పేరు. లోక ఛేక, అర్భక మత్తుల ఉక్తుల అనుకరణములను బట్టి ఇది నాలుగు విధములు. ఆభాణములోకోక్తి. ఇది సర్వ సామాన్యము. లోకోక్తిని అనుసరించు రచనమును లోకోక్తి ఛాయ అని అందురు. చతురులకు ఛేకులు అని పేరు. కలా కౌశల్యమే చాతుర్యము. దానిని ప్రదర్శించునది ఛేకోక్తి ఛాయ. అర్భకోక్తి అవ్యుత్పన్నుల ఉక్తి, దానిని అనుకరించునది అర్భకోక్తి అని పేరు. మత్తుల వాక్యము అశ్లీలముగాను లుప్తాక్షర ముగాను ఉండును. దాని ఛాయకలది మత్తోక్తి ఛాయ. ఇది సమయాను సారముగా ఉపయోగించినచో శోభాకరముగా నుండును. అభిప్రాయ విశేషముచే కవి శక్తిని స్పష్టీకరించుచు ఆనందమును కలిగించునది ముద్ర. అదియే మా మతమున శయ్య. యుక్తి యుక్తమగు అర్థమును బోధించునది లోక యాత్రానుసారముగా ఉండి సహృదయుల హృదయమును ఆనందింపచేయునది ఉక్తి. విధి, నిషేధము అని నియమము, అనియ మము అని వికల్పము, పరిసంఖ్య అని ఉక్తులు ఆరువిధములు. వేర్వేరుగా నున్న వాచ్య వాచకములను కలుపుటకు సమర్థమైన దానిని యుక్తి యందురు. పదము పదార్థము, వాక్యము వాక్యార్ధము, ప్రకరణము ప్రపంచము అని యుక్తి ఆరు విధములు. రచనా చర్యకు గుంఫన అని పేరు. శబ్దార్థ క్రమగోచర, శబ్దానుకార, అర్థాను పూర్వారా అని అది మూడు విధములు. ఉక్తి ప్రత్యుక్తులుగల వాక్యము వాకో వాక్యము. ఋజు వుక్తి వక్రోక్తి అని అది రెండు విధములు. మొదటిది స్వాభావిక వచనరూపము. అది పూర్వ ప్రశ్నిక, అప్రశ్న పూర్వికా అని రెండువిధములు. భంగవ క్రోక్తికాకు వక్రోక్తి యని వక్రోక్తి కూడ రెండు విధములు. (342)