అగ్ని మహా పురాణము

Table of Contents

దీపదాన వ్రతం

అగ్ని దేవుడు పలికెను:

ఇపుడు భుక్తి ముక్తి ప్రదమగు ‘దీపదాన వ్రతమును’ గూర్చి చెప్పెదను. దేవాలయమునందుగాని, బ్రాహ్మణ గృహమునందుగాని ఒక సంవత్సరము దీపదానము చేయువాడు సకల కామములను పొందును. చాతుర్మాస్యము నందు దీపదానము చేయువాడు విష్ణు లోకమునకును, కార్తికమున దీపదానము చేయువాడు స్వర్గమునకు పోవును. దీపదానమును మించిన వ్రత మేదియు పూర్వము లేకుండెను. ఇప్పుడు లేదు, ఉండబోదు. దీపదానముచే ఆయుర్దాయము, నేత్రజ్యోతియు లభించును. ధనపుత్రాది ప్రాప్తి కలుగును. దీపదానము చేయువాడు సౌభాగ్యవంతుడై స్వర్గమున దేవతలచే పూజింపబడును. విదర్భరాజకుమారి యగు లలిత దీపదాన పుణ్యముచేతనే చారుధర్మమహారాజుకు భార్యయై ఆతని నూర్గురు రాణులలో ప్రముఖురాలైనది. ఆ పతివ్రత ఒక పర్యాయము విష్ణ్వాలయమున సహస్రదీపముల దానము చేసెను. ఆమె సవతులు దీపదాన మాహాత్మ్యమును గూర్చి ప్రశ్నించగా లలిత ఇట్లు చెప్పెను. పూర్వము సౌవీరరాజువద్ద మైత్రేయుడను పురోహితుడు ఉండెను. ఆతడు దేవికా నదీతీరమున శ్రీమహావిష్ణువునకు ఆలయము కట్టించెను. కార్తిక మాసమున ఆతడు దీపదానము చేసెను. పిల్లికి భయపడి పారిపోవుచున్న ఒక ఆడుఎలుక అకస్మాత్తుగ, తన ముఖాగ్రముతో ఆ దీపపు వత్తిని పైకి లైసెను. అట్లు చేయుటచే ఆరిపోవుటకు సిద్ధముగానున్న దీపము ప్రజ్వలించెను. మరణానంతరము ఆ ఆడు ఎలుకయే రాజకుమారిగ జన్మించి రాజధర్ముని సూర్గురు రాణులలో ప్రధానురాలైనది. ఈ విధముగ అనుకొనకుండగనే నేను విష్ణ్వాలయమునందలి దీపపు వత్తిని ఎగసన త్రోయుటచే కలిగిన పుణ్యమునకు ఫలమును అనుభవించుచున్నాను. దీని వలననే నాకు పూర్వ జన్మ స్మృతికూడ లభించినది. అందుచే నేను సదా దీపదానము చేయుచున్నాను. ఏకాదశినాడు దీపదానము చేసినవాడు స్వర్గమున విమానారూఢుడై ఆనందించుచుండును.

దీపమును హరించినవాడు మూగవాడు, బుద్ధివిహీనుడు అగును. చీకటితో నిండిన దాట శక్యముగాని నరకములో పడును. అక్కడ విలపించుచున్న వారిని చూచి యమకింకరుడు ఇట్లు అనును-“ఇక్కడ ఏడిచి ఏమి ప్రయోజనము? మీరు ఏమరచి మీ ధర్మమును ఉపేక్షించినారు. కొన్ని వేలజన్మలలో ప్రాణి మనుష్యుడుగా పుట్టును. అపుడు కూడ మూఢ బుద్ధియై భోగాలకొరకు పరుగెత్తును. పూర్వము మీరు అనుభవించిన విషభోగాల ఫలితంగా ఇక్కడ ఏడ్వవలసి వచ్చినది. చేసిన పాపముల ఫలము అనుభవించ వలసి ఉండునని మీరు ముందుగానే ఎందుకు ఆలోచించలేదు? పరభార్యల కుచమర్దనము మీకు సుఖకరముగ కనబడినది. అదే ఇప్పుడు మీకు దుఃఖహేతువైనది. పరస్త్రీలను అపహరించి మీరు చేసిన కర్మలను గూర్చి నేను చెప్పి ఉన్నాను. ఇప్పుడు అయ్యో! అమ్మా! అనుచు ఎందుకు ఏడ్చెదరు? శ్రీమహావిష్ణువు నామము నాలుకకు ఏమి భారము? తైలము, పత్తి చాల స్వల్ప మూల్యము కలవి. అగ్నియైతే అంతటను లభించునదే. ఐనను మీరు దీపదానము చేయక విష్ణ్వాలయము నుండి దీపమును హరించితిరి. అదియే మీకు ఇప్పుడు దుఃఖమును ఇచ్చుచున్నది. విలపించి ఏమి ప్రయోజనము? వచ్చిన యాతనను అనుభవింపుడు’ అని పలుకుదురు అని తెలిపి ఇంకను

అగ్ని దేవుడు ఇట్లు చెప్పెను: లలిత సవతులందరు ఆమె చెప్పిన ఉపాఖ్యానము విని దీపదాన ప్రభావముచే స్వర్గము పొందిరి. అందుచే దీపదానము అన్ని వ్రతముల కంటెను విశేష ఫలదాయకము. (200)