అగ్ని మహా పురాణము

Table of Contents

భారతవర్ష వర్ణనము

అగ్నిదేవుడు పలికెను:

సముద్రమునకు ఉత్తరమునను, హిమాలయమునకు దక్షిణమునను, ఉన్న వర్షము ‘భారత వర్షము’. దీని విస్తారము తొమ్మిదివేల యోజనములు. స్వర్గాపవర్గములు పొంద గోరువారికి ఇది కర్మభూమి. మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమత్, హిమాలయ, వింధ్య, పారియాత్రములు. ఈ వర్షమునందు సప్తకుల పర్వతములు, ఇంద్రద్వీప, కసేరు, తామ్ర వర్ణ, గభస్తిమత్, నాగద్వీప, సౌమ్య, గాంధర్వ, వారుణములు ఎనిమిది ద్వీపములు. సముద్రముచే చుట్టబడియున్న భారత వర్షము తొమ్మిదవ ద్వీపము. భారత ద్వీపము ఉత్తరము నుండి దక్షిణమునకు వేలకొలది యోజనములు పొడవైనది. భారతమునందు పైన చెప్పిన తొమ్మిది భాగములున్నవి. భారతము మధ్యమునందున్నది. దానికి తూర్పున కిరాతులు, పశ్చిమమున యవనులు ఉందురు. మధ్యభాగమున బ్రాహ్మణాది వర్ణములవారు ఉందురు. వేద, స్మృత్యాది నదులు పారియాత్రము నుండియు, నర్మదాదులు వింధ్యాచలము నుండియు, తాపీ, పయోష్ణీ, గోదావరీ, భీమరథీ, కృష్ణవేణీ నది మొదలగునవి సహ్యాద్రి నుండియు, కృతమాలాదులు మలయము నుండియు, త్రిసామాదులు మహేంద్ర పర్వతము నుండియు, కుమార్యాది నదులు శుక్తి మత్పర్వతము నుండియు, చంద్ర భాగాదులు హిమాలయము నుండియు ఆవిర్భవించినవి. భారతమునకు పశ్చిమమున కురు, పాంచాల, మధ్య దేశాదులున్నవి. (118)