అగ్ని మహా పురాణము

Table of Contents

సభా గృహ స్థాపనము

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు సభాసదులను స్థాపించు విధానము చెప్పెదను. భూమి పరీక్షచేసి అచట వాస్తుపరీక్ష చేయవలెను. ఇచ్ఛానుసారముగ దేవసభా నిర్మాణము చేసి, ఇచ్ఛానుసారముగ దేవతా స్థాపన చేయవలెను. సభా నిర్మాణము నగర చతుష్పథము నందుగాని, గ్రామాదులలోగాని చేయవలెను. జనశూన్య ప్రదేశములందు చేయరాదు. దేవసభా నిర్మాణము చేసినవాడు పాపరహితుడై తన వంశము నంతను ఉద్ధరించి స్వర్గమునందు ఆనందము అనుభవించును. రాజ సౌధము నిర్మించిన విధముగా శ్రీహరికి ఏడు అంతస్తుల దేవాలయమును నిర్మింపవలెను. ఇతర దేవతలకు కూడ అట్లే పూర్వాది దిక్కులందు ఏర్పడు ధ్వజాధ్యాయములలో వాటిలో విదిక్కుల ఆయమును విడువవలెను. నాలుగు, మూడు, రెండు లేదా ఒకటి శాలలుండు గృహము నిర్మింపవలెను. వ్యయము అధికముగనుండు పదముపై గృహము నిర్మింపరాదు. అచట నిర్మించిన గృహము నందు వ్యయము అధికముగ ఉండును. ఆయమధికముగ ఉన్న పీడకలుగదు. అందుచే ఆయ వ్యయములు సమభావములో ఉండునట్లు చూచుకొనవలెను. ఇంటి పొడవు వెడల్పులు ఎన్ని హస్తములుండునో వాటిని ఒకదానితో ఒకటి గుణింపగా వచ్చిన సంఖ్యకు “కరరాశి” అని పేరు. గర్గాచార్యుని జ్యోతిశ్శాస్త్రమునందు నిపుణుడగు ఆచార్యుడు దానిని ఎనిమిది రెట్లు చేయవలెను. దానిని ఏడుచేత భాగించగా వచ్చిన శేషము “వ్యయము”. లేదా కర రాశిని ఏడుచేత గుణించి దానిని మరల ఎనిమిదిచేత భాగింపగా వచ్చిన శేషమును బట్టి ధ్వజాది ఆయములను కల్పించవలెను. ధ్వజము, ధూమ్రము, సింహము, శ్వానము, వృషభము, ఖరము, గజము, ధ్వాంక్షము అను ఎనిమిది ఆయములు పూర్వాది దిక్కులందు ఏర్పడును.

త్రిశాలాగృహమున కున్న అనేక భేదములలో మొదటి మూడును ఉత్తమమైనవి. వీటిని ఈశాన్యమునందు నిర్మింపరాదు. దక్షిణమున అన్యగృహములతో గూడిన ద్విశాలా గృహము సర్వదా శ్రేష్ఠము. దక్షిణమున అనేక శాలాగృహము, ఏకశాలాగృహము గూడ ఉత్తమము. నైరృతి దిక్కునందు ఏకశాలా గృహము శ్రేష్ఠము. ఏకశాలా గృహములో మొదటి రెండు భేదములును (ధ్రువము, ధాన్యము అనునవి) ఉత్తమములు. మిగిలినవి, అనగా పంచమ, నవమ, దశమ, ఏకాదశ, త్రయోదశ, చతుర్దశ భేదములు భయ హేతువులు, చతుఃశాలా గృహము సర్వదా ఉత్తమము; సర్వ దోషరహితము. దేవతలకు ఒక అంతస్తు మొదలు, ఏడు అంతస్తులు ఉండునట్లు ఏర్పరుపవలెను. దానికి ద్వారవేధాది దోషములుగాని, ప్రాచీన వస్తువులుగాని ఉండకూడదు. దానిని మానవులకు చెప్పిన కర్మలు, ప్రతిష్ఠావిధానము అనుసరించి స్థాపించవలెను. గృహ ప్రవేశము చేయనున్న గృహస్థుడు, సోమరితనము లేనివాడై, ఉదయముననే లేచి, సర్వౌషధులు కలిపిన జలముతో స్నానముచేసి, పవిత్రుడై, దైవజ్ఞులైన బ్రాహ్మణులకు నమస్కరించి, వారికి మధుర పదార్థములు భుజింప చేసి, వారిచే స్వస్తి వాచనాదికము చేయించి, నడ్డిపై చేతులు పెట్టుకొని, పూర్ణ కలశాదులతో సుశోభితమగు తోరణములుగల గృహము ప్రవేశించవలెను. పిమ్మట ఏకాగ్రచిత్తుడై గోవు ఎదుట చేతులు జోడించి, ఈ పుష్టికారక మంత్రములు పఠింపవలెను. “ఓం వసిష్ఠునిచే పాలింపబడిన ఓ నందా! ధనసంతానాదుల నొసగి నా ఆనందమును వృద్ధిపొందింపుము. ప్రజలకు విజయమును ఇచ్చు భార్గవ నందినియైన జయా! నన్ను ధనసంపదలతో ఆనందింప చేయుము. అంగిరసుని పుత్రియైన ఓ పూర్ణా! నా మనోరథములను ఈడేర్పుము. నన్ను పరిపూర్ణకాముని చేయుము. కాశ్యపకుమారియైన భద్రా! నా బుద్ధిని కల్యాణమయము చేయుము. అందరికిని ఆనందమునిచ్చు వసిష్ఠనందినియైన నందా! నీవు సమస్త బీజములతో, ఓషధులతో కూడి, సకల రత్నౌషది పూర్ణురాలవై ఈ సుందర భవనమునందు ఆనందపూర్వకముగ నివసింపుము. కశ్యప ప్రజాపతిపుత్రివైన ఓ భద్రా! నీవు సర్వవిధముల సుందరమైనదానవు, మహత్త్వము కలదానవు. సౌభాగ్య శాలినివి. ఉత్తమ వ్రతమును పాలించుదానవు. నా ఇంటిలో ఆనందపూర్వకముగ నివసింపుము. దేవీ! భార్గవీ! జయా! సర్వశ్రేష్ఠులైన ఆచార్యులు నిన్ను పూజించిరి. చందన పుష్ప మాలాలం కృతురాలవైన నీవు ప్రపంచమునందలి సకలైశ్వర్యములను ఇచ్చుదానవు. నా గృహమునందు ఆనంద పూర్వకముగ విహరింపుము. అంగిరసుని పుత్రివైన పూర్ణా! నీవు అవ్యక్త రూపిణివి. ఓ ఇష్టకాదేవీ! నీవు నాకు అభీష్ట వస్తువులను ఇమ్ము. నా ఇంటిలో ఉండుమని కోరుచున్నాను. నీవు దేశ ప్రభువును, గ్రామనగర ప్రభువులను, గృహ ప్రభువును అనుగ్రహించుదానవు. నా గృహమునందు జన, ధన, గజ, అశ్వ, గో, మహిష్యాది వృద్ధి కలుగునట్లు చేయుము. (65)