అగ్ని మహా పురాణము
దండప్రణయనముల
పుష్కరుడు పలికెను:
రామా! రాజుకు ఉత్తమగతినిచ్చు దండనీతి ప్రయోగమును గూర్చి చెప్పెదను. మూడు యవలు ఒక కృష్ణలము. ఐదు కృష్ణలములు ఒక మాషము. అరువది కృష్ణలములు అర్ధకర్షము. పదునారు మాషములు ఒక సువర్ణము. నాలుగు సువర్ణములు ఒక నిష్కము. పది నిష్కములు ఒక ధరణము. ఇవి రాగి, వెండి, బంగారము తూచు మానములు.
పరశురామా! ఒక త్రామ కరము (ఒక విధమైన రాగి నాణెము) నకు విద్వాంసులు ‘కార్షికము కార్షాపణము అని పేరు పెట్టినారు. రెండు వందల ఏబది పణముల దండమునకు ప్రథమ సాహస దండమని పేరు. ఐదు వందల పణముల దండము మధ్యమ సాహసము. వెయ్యి పణముల దండము ఉత్తమ సాహసము, చోరుడు తన ధనమును అపహరించకపోయినను అపహరించినట్లు అసత్యముగా రాజుతో చెప్పినవాని నుండి అంత ధనమును దండముగా గ్రహించవలెను. దొంగ తనమునందు పోయిన ధనమునకు బదులు ఎక్కువగా ఎవడైన చెప్పినచో అతని నుండియు, ఎంత అసత్యముగా చెప్పునో వానినుండియు రాజు రెట్టింపు ధనము దండ రూపమున వసూలు చేయవలెను; ఎందుచేతననగా వారు ఇరువురును ధర్మమును పాటించలేదు. కపటసాక్ష్యము చెప్పు క్షత్రియ, వైశ్య, శూద్రులను కఠినముగా శిక్షించవలెను. బ్రాహ్మణుని మాత్రము రాజ్యమునుండి వెడలగొట్టవలెను. అతనికి మరొకదండ మేదియు విధింపబడలేదు. ఓ ధర్మజ్ఞా! కుదువబెట్టిన దానిని అపహరించినవాని నుండి కుదువబెట్టిన వస్త్రాదుల మూల్యమెంత యుండునో అంత దండరూపమున అపహరించినచో ధర్మహాని కలుగదు. కుదువబెట్టిన దానిని పోగొట్టినవానిని, కుదువబెట్టకుండగనే వస్తువు నిమ్మని అడుగు వానినికూడ దొంగనువలె శిక్షించవలెను లేదా రెట్టింపు ధనమును దండముగా వసూలు చేయవలెను. ఎవ్వడైన ఇతరుల వస్తువును తెలియక అమ్మివేసినను, ఆతడు నిర్దోషిగ పరిగణింపబడును. కాని తెలిసి ఇతరుల వస్తువులను తన వస్తువులని చెప్పి అమ్మినవానిని దొంగనువలె శిక్షించవలెను. ఇచ్చెదనని చెప్పి ఇవ్వని వానిని, రాజు ఒక సువర్ణముచే దండించవలెను. కూలి తీసుకొని పనిచేయనివానిపై ఎనిమిది కృష్ణలములు దండుగ (జుర్మానా) వేయవలెను. ఆ సమయమునందు భృత్యుని విడచివేయు వానిపై కూడ అంత దండమే వేయవలెను. ఏదైన ఒక వస్తువును కొన్న తరువాతగాని, అమ్మిన తరువాతగాని పశ్చాత్తాపము కలిగినచో అమ్మినవాడు పదిరోజులలోగా ఆ మూల్యము తిరిగి ఇచ్చివేసి వస్తువును మరల తీసికొనవచ్చును. కొన్నవాడు వస్తువును తిరిగి ఇచ్చివేసి తన ధనమును పొందవచ్చును. పది దినములు దాటినచో ఆ ఆదాన ప్రదానములు కుదరవు. అనుచితములగు ఆదానప్రదానములు చేయువారికి రాజు ఆరు వందలు దండము వేయవచ్చును.
వరునిలో ఉన్న దోషములను చెప్పక కన్యావరణము చేసినవానికి, కన్యకను ఇచ్చెదమని మాట ఇచ్చినను ఇవ్వనట్లే అగును. రాజు అట్టివానిపై రెండు వందల దండము విధించవలెను. కన్యను ఒకనికి ఇచ్చెదనని మాట ఇచ్చి, మరొకనికి ఇచ్చిన వానిపై ఉత్తమ సాహస దండము విధించవలెను. నోటితో చెప్పిన దానిని కార్య రూపమున చేసినచో తప్పక పుణ్యము లభించును. ఏదైన ఒక వస్తువును ఒకచోట ఇచ్చెదనని చెప్పి లోభముచే మరొకరికి అమ్మిన వానికి ఆరువందల దండము. యజమాని నుండి భోజన వ్యయము, జీతము తీసికొనికూడ ఆతని ఆవును అతనికి అప్పగించని లేదా ఆవును పోషించని గొల్లవానిని నూరు సువర్ణములచే దండించవలెను. గ్రామమునకు నలువైపుల నూరు ధనుస్సుల పరిధియందును, నగరమునకు రెండువందల ధనుస్సుల పరిధి యందును వ్యవసాయము చేయవలెను. అది నిలచి ఉన్న ఒంటెకు కనబడనంత దూరమున ఉండవలెను. కంచెలేని చేనులోని సస్యమునకు ఎవరినుండియైన హానికల్గినను ఆతనిని దండించ రాదు. ఇతరులను భయపెట్టి, వాని ఇళ్లు, చెరువులు, తోటలు, పొలములు కాజేయ ప్రయత్నించువారికి ఐదువందల దండము. ఆతడు తెలియక చేసినచో రెండు వందలు మాత్రమే దండము. సరిహద్దులు మార్చివేయు వారికి ప్రథమ సాహసదండము.
పరశురామా! బ్రాహ్మణుని అవమానించు క్షత్రియునకు నూరు, వైశ్యునకు రెండు వందల దండుగను (జుర్మానా) విధించవలెను; శూద్రుని కారాగారములో ఉంచవలెను. బ్రాహ్మణుడు, క్షత్రియునిపై దోషారోపణము చేసినచో ఏబది, వైశ్యునిపై చేసినచో ఇరువదియైదు, శూద్రునిపై చేసినచో పండ్రెండు దండము. వైశ్యుడు క్షత్రియుని అవమానించినచో ప్రథమ సాహస దండము. శూద్రుడు క్షత్రియుని తిట్టినచో ఆతని నాలుకకు శిక్ష ఇవ్వవలెను. బ్రాహ్మణునకు ఉపదేశముచేయు శూద్రుడుకూడ దండార్హుడు. అసత్యముగా తన దేశమును గూర్చి, శాస్త్రజ్ఞానమును గూర్చి అసత్యము చెప్పువానికి రెట్టింపు సాహస దండము. శ్రేష్ఠ పురుషులనుగూర్చి వారు పాపాచారవంతులని చెప్పి నిందించువానికి ఉత్తమ సాహసదండము. ‘నేను పొరబాటున ఇట్లు చెప్పినాను’ అని అనుచు అతడు ప్రేమను ప్రకటించినచో సగము దండము. తలిదండ్రులు, అన్న, మామ, గురువు వీరిపై నిందారోపము చేయువానికిని పెద్ద వారికి దారి ఇవ్వనివానికిని, నూరు దండము. ఒకడు తన ఏ అవయవముచే, పెద్దవారి విషయమున అపరాధము చేయునో ఆతని ఆ అవయవమును నిస్సందేహముగ వెంటనే ఖండించి వేయవలెను. గర్వాంధుడై ఉత్తమ పురుషుని వైపు ఉమ్మివేసిన వాని పెదవులు ఖండించి వేయవలెను. అట్లే ఉత్తమ పురుషుని వైపు తిరిగి మూత్రము పోయువాని లింగమును, ఆతని వైపు పృష్ఠముపెట్టి, అపాన శబ్దము చేయువాని గుదమును ఛేదించవలెను. ఉన్నతాసనముపై కూర్చున్న నీచుని శరీరము క్రింది భాగము నందు దండము ఇవ్వవలెను. ఒకడు ఇతరుల ఏ అవయవమును గాయపరచునో అతని ఆ అవయవమును ఖండించి వేయవలెను. గోవు, ఏనుగు, అశ్వము, ఒంటె వీటికి హాని కలిగించువాని సగము చేతులు సగము కాళ్ళు ఖండించి వేయవలెను. ఇతరుల వృక్షముల పండ్లు కోసినవానికి ఒక సువర్ణము దండము. మార్గమును, పొలము సరిహద్దును, జలాశయాదికమును ఖండించి నష్టము కలుగచేసిన వానికి ఎంతనష్టము కలిగినదో దానికి రెట్టింపు దండము. తెలిసికాని, తెలియకకాని ఇతరుల ధనము అపహరించిన వాడు ముందు ఆతనికి ఆ ధనము తిరిగి ఇచ్చివేసి, ఆతనిని సంతోష పెట్టవలెను. పిమ్మట రాజుకుకూడ జుర్మానా చెల్లించవలెను. నూతి నుండి ఇతరుల త్రాడు, పాత్ర అపహరించిన వానికిని, చలివెందలి పాడుచేసిన వానికిని ఒక మాసము కైదు శిక్ష. ప్రాణులను చంపిన వానికి గూడ ఇదియే శిక్ష. పది ఘటముల ధాన్యమునకు మించిన ధాన్యమును అపహరించిన వానికి ప్రాణదండము, పది ఘటములలోపు ధాన్యము అపహరించిన వానికి ఎన్ని ఘటములు అపహరించబడినవో వాటికి పండ్రెండు రెట్లు దండము. బంగారమును, వెండిని, స్త్రీలను, పురుషులను అపహరించిన వానికి మరణ దండము. చరుడు ఏ ఏ అవయవములతో మనుషులకు ప్రతికూలముగ ప్రవర్తించునో ఆయా అవయవములను నిర్దాక్షిణ్యముగ ఖండించవలెను. ఇట్లు చేయుటచే చోరులకు బుద్ధి వచ్చును. బ్రాహ్మణుడు చాలకొంచెము శాకమును, ధాన్యమును గ్రహించినచో అతడు దోషికాడు. గోసేవ కొరకును, దేవపూజ కొరకును ఏదైన వస్తువును తీసికొనిన బ్రాహ్మణుడు కూడ దండ్యుడు కాడు. ఎవరినైన చంపుటకు ఉద్యమించు దుష్టుని వధించవలెను. ఇతరుల గృహ, క్షేత్రములను అపహరించిన వానికిని, పరభార్యాసంగము చేసినవానికిని, ఇంటికి నిప్పు అంటించిన వానికిని, విషము పెట్టిన వానికిని, ఆయుధముతో చంపుటకై వచ్చిన వానికిని మరణ దండము తగినది.
గోవులను చంపినవానిని, తీవ్రప్రవృత్తిగలవారిని రాజు వధించవలెను. పరస్త్రీతో సంభాషణము చేయరాదు. వలదన్న ఇతరుల ఇండ్లలోనికి పోరాదు. స్వేచ్ఛానుసారము పతిని వరించు స్త్రీ రాజుచే దండ్యురాలు కాదు. కాని నీచవర్ణ పురుషుడు ఉచ్చవర్ణ స్త్రీ సమాగమము చేసినచో ఆతడు వధ్యుడు. తన భర్తను కాదని వ్యభిచరించిన స్త్రీని కుక్కలచే కరిపించవలెను. సజాతీయుడగు పరపురుషునిచే దూషితురాలగు స్త్రీకి బ్రతుకుటకు మాత్రము అన్నము పెట్టవలెను. భర్త అన్నగారితో వ్యభిచరించిన స్త్రీ తలగొరిగించవలెను. బ్రాహ్మణుడు వైశ్య స్త్రీ తోడను, క్షత్రియుడు నీచజాతి స్త్రీ తోడను సమాగమము చేసినచో వారికి కూడ ఇదియే దండము. శూద్ర స్త్రీతో వ్యభిచరించిన క్షత్రియ, వైశ్యులకు ప్రథమ సాహస దండము. వేశ్యా స్త్రీ ఒకని నుండి వేతనము తీసికొని, లోభముచే మరొకనితో వెళ్ళినచో ఆమె రెట్టింపు వేతనము తిరిగి ఇచ్చివేసి, రెట్టింపు దండముగా చెల్లించవలెను. స్త్రీ, పుత్రుడు, దాసుడు, శిష్యుడు, సహోదరుడు మొదలగువారు అపరాధము చేసినచో వారిని త్రాటితో గాని, వెదురు బెత్తముతోగాని కొట్టవలెను. వీపు మీదనే కొట్టవలెను కాని తలపై కొట్టకూడదు. తలపై కొట్టువానిని చోరుని దండించినట్లు దండించవలెను.
రక్షాకార్య నియుక్తుడై ప్రజల సొమ్ము దోచుకొనువాని సర్వస్వము లాగికొని రాజ్యము నుండి వెడలగొట్టవలెను. ఎవరిచేతనైన ఒక పనిచేయుటకై నియుక్తుడై ఆ కార్యము పాడుచేసిన క్రూరుని సర్వస్వమును లాగివేయవలెను. మంత్రిగాని, న్యాయాధీశుడు గాని, స్వకర్తవ్యమునకు భిన్నముగ చేసినచో వాని సర్వస్వమును లాగికొని రాజ్యము నుండి వెడలగొట్టవలెను. గురుపత్నీ గమనముచేసిన వాని శరీరము మీద భగచిహ్నము వేయవలెను. సురాపానము చేసిన మహాపాపాత్ముని శరీరము మీద కల్లు దుకాణం జండా గుర్తు వేయవలెను. దొంగతనముచేసిన వాని శరీరముపై కుక్క గోళ్ళ గుర్తు వేయవలెను. బ్రహ్మహత్య చేసినవాని లలాటముమీద కపాల చిహ్నము వేయవలెను. రాజు పాపాత్ములను వధించి వేయవలెను. బ్రాహ్మణులైనచో దేశము నుండి వెడలగొట్ట వలెను. మహాపాతకుల ధనమును వరుణునకు సమర్పించవలెను. (నీటి లో పారవేయవలెను). గ్రామాలలో చోరులకు భోజనము పెట్టి, దొంగిలించిన సొమ్మును దాచుకొనుటకు ఇల్లు ఇచ్చినవారిని అందరిని రాజు వధించవలెను. తన రాజ్యమునందు ఏదైన అధికారమునందు నియుక్తులైన సామంత రాజులు ఏమైనా పాపములు చేసినచో, రాజు వారిని అధికారము నుండి తొలగించవలెను. కన్నము త్రవ్వి దొంగతనము చేయువాని చేతులు నరికి, తీక్ష్ణమగు శూలముపై ఎక్కించవలెను. సరస్సులు, దేవ మందిరములు పాడుచేసినవారికి గూడ ఇట్లే మరణదండము ఇవ్వవలెను. ఆపత్సమయము కాక పోయినను, మార్గమునందు మల మూత్రాద్య పవిత్ర వస్తువులను పోయువానికి కార్షాపణ దండము విధించి, వానిచేతనే ఆ మలమూత్రాదులు ఎత్తించి శుభ్రము చేయించవలెను. ప్రతిమలను, మెట్లను విరగ గొట్టిన వానికి ఐదువందల కర్షముల దండము. తనతో సమముగా ప్రవర్తించువారి విషయమున విషమముగా ప్రవర్తించు వానికిని, వస్తువుల మూల్యమును చాల ఎక్కువగా పెంచివేయువానికి మధ్యమ సాహస దండము. వర్తకుని నుండి బహు మూల్యములగు వస్తువుల తీసికొని మూల్యమును చెల్లించని వారికి అందరికిని ఒక్కొక్కరికి ఉత్తమ సాహసదండము. మంచి వస్తువులలో చెడ్డ వస్తువులు కలిపి ఇష్టము వచ్చిన ధరకు అమ్ము వర్తకునకు మధ్యమ సాహసగండము, మోసము చేయువానికి ఉత్తమసాహస దండము. కలహపూర్వకముగ అపకారము చేయు వానికి దానికి రెట్టింపు దండము. అభక్ష్య భక్షణము చేయు బ్రాహ్మణునకును, శూద్రునకును ఒక కృష్ణలము దండము. తప్పుడు తూకము తూచు వానికిని, మోసగానికిని, గ్రాహకులకు నష్టము కలిగించువానికిని, అట్టివారితో వ్యవహారము చేయువానికిని ఉత్తమసాహస దండము. విషము పెట్టు వానిని, ఇంటికి నిప్పు అంటించువానిని, పతి, గురు, బ్రాహ్మణ, సంతానముల హత్యచేసిన వానిని చేతులు, ముక్కు, చెవులు, పెదవులు ఖండించి, ఎద్దుపై కూర్చుండబెట్టి రాజ్యము నుండి వెడలగొట్టవలెను. పొలము, ఇల్లు, గ్రామము, అడవి-వీటిని నశింపచేసిన వారిని, గడ్డితుక్కు నిప్పులో పడవేయవలెను. రాజాజ్ఞను పెంచిగాని తగ్గించిగాని వ్రాయువానికిని, పరస్త్రీగమనము చేసినవారిని, చోరులను శిక్షించక విడుచు వానికిని ఉత్తమ సాహస దండము.
రాజ వాహనముపైనను, రాజాసనముపైనను కూర్చున్న వానికి గూడ ఉత్తమ సాహస దండము. పరాజితుడైనను అపరాజితుడనని చెప్పుకొనువాడు ఎదుటకు వచ్చినపుడు వానిని మరల జయించి, రెట్టింపు దండము విధించవలెను. ఆమంత్రితుడు కాని వానిని పిలచుకొనివచ్చువాడు వధ్యుడు. దండించు పురుషుని నుండి తప్పించుకొని పారి పోవు అపరాధి పురుషార్థ విహీనుడు. అట్టి పిరికివారికి శారీరక దండమునకు బదులు ధనదండమును వీధించవలెను. (227)
