అగ్ని మహా పురాణము
ప్రతిష్ఠాకాల సామాగ్ర్యాది విధి వర్ణన
పరమేశ్వరుడు చెప్పెను: ఇపుడు భుక్తిముక్తి ప్రదాయకమగు దేవాలయ లింగస్థాపన విధానమును చెప్పెదను. ముక్తి కొరకు చేయు లింగప్రతిష్ఠ ఎపుడైనను చేయవచ్చును. కాని భోగసిద్ధికై చేయు లింగ ప్రతిష్ఠమాత్రము ఉత్తరాయణము నందు చేయవలెను. మాఘాది మాసపంచకములో, చైత్రమును విడచి, దేవతాప్రతిష్ఠ చేయవలెను. గురు, శుక్రులు ఉదయించినపుడు మొదటి మూడు కరణములందును చేయవలెను. రెండు పక్షములందును పంచమి వరకును ఉన్న తిథులు ప్రతిష్ఠకు శుభమైనవి. చతుర్థి, నవమి, షష్ఠి, చతుర్దశి విడిచి మిగిలిన తిథులు క్రూరమైన వారములు, కానిచో ఉత్తమమైనవి. శతభిషం, ధనిష్ఠా, ఆర్ద్రా, అనురాధా ఉత్తరాత్రయ, రోహిణి, శ్రవణ నక్షత్రములు స్థిర ప్రతిష్ఠా ప్రారంభమునకు ఉత్తమములు. కుంభ, సింహ, వృశ్చిక, కన్యా, వృషభ లగ్నములు శ్రేష్ఠములు. గురుడు నవమ-సప్తమ స్థానములలో ఉన్నచో శుభము. షష్ఠ-అష్టమ దశమ-చతుర్థ స్థానములందు బుధుడున్నచో శుభము. షష్ఠము తప్ప పై స్థానములో శుక్రుడున్న శుభము. తృతీయ, సప్తమ, షష్ఠ, దశమ స్థానములందు చంద్రుడు సర్వదా బలదాయకుడు. సూర్యుడు దశమ, తృతీయ, షష్ఠములందు ఉన్నచో శుభఫలమును ఇచ్చును. తృతీయ, షష్ఠ, సప్తమములందు రాహువు శుభకారకుడు. శని, కుజ, కేతువులు, షష్ఠ, తృతీయ స్థానములందు శుభము.
శుభ, క్రూర పాపగ్రహములు ఏకాదశములోనున్నచో శుభకరములు. సమస్త గ్రహముల దృష్టి సప్తమమున పూర్ణముగా ఉండును. పంచమ, నవమ స్థానములందు అర్ధదృష్టి. తృతీయ, దశమ దృష్టి పారదృష్టి, అష్టమ స్థానమునందు దృష్టి త్రిపాదదృష్టి, మీన, మేష, వృషభ, కుంభరాశుల భోగము మూడు ముప్పావు ఘడియలు, మకర, మిథునముల భోగము ఐదు ఘడియలు, ధనుస్సు, వృశ్చికము, సింహము, కర్కటకము వీటి భోగము ఆరునాడులు, తులా కన్యారాశుల భోగము ఐదున్నర నాడులు. స్థిర లగ్నముకైన సింహ, వృషభ, కుంభములు సిద్ధి దాయకములు. ధనుస్తులా మేషములు చరరాశులు, మూడవ సంఖ్యగల రాశులు (మిథున-కన్యాదులు) ఉభయ స్వభావములు, కర్కట, మకర, వృశ్చికములు సన్యాసమునకు అనర్హములు. శుభ గ్రహదృష్టిగల లగ్నము శుభము, శుభగ్రహమున్న లగ్నము శ్రేష్ఠము. లగ్నమునందు గురు, శుక్ర, బుధులున్నచో ధన, ఆయు, రాజ్య, శౌర్య, బల, పుత్ర, యశో, ధర్మాదులను అధికముగా ఇచ్చును. ప్రథమ, చతుర్ధ, సప్తమ, దశమములకు పేరు కేంద్ర స్థానములందున్న గురు, శుక్ర, బుధులు సంపూర్ణ శుభఫలములను ఇత్తురు, తృతీయ, ఏకాదశ, చతుర్థ స్థానములందు పాపగ్రహములు ఉన్నచో శుభ ఫలమును ఇత్తురు.
అందువలన వీటిని, ఇతర శుభగ్రహములను, ఇతర శుభతిథులను ప్రతిష్ఠాకర్మ విషయమున విద్వాంసుడు నిర్ణయించుకొనవలెను. ఆలయము ఎదుట దానికంటె పదిరెట్లు లేదా దానితో సమానమైన లేదా మెట్టునుండి పది హస్తముల దూరము భూమి విడచి మండప నిర్మాణము చేయవలెను. ఆ మండపము చతురస్రమై నాలుగు ద్వారములు కలదై ఉండవలెను. దానిలో సగము భూమి గ్రహించి స్నానార్థమై మండపము నిర్మింప వలెను. దానికి ఒకటి లేదా నాలుగు ద్వారములు ఉండవలెను. ఈ స్నాన మండపము ఈశాన్యము నందుగాని, తూర్పున గాని, ఉత్తరము నందు గాని ఉండవలెను. మొదటి మండపము ప్రమాణము ఎనిమిది హస్తములు, పది హస్తములు, లేదా పండ్రెండు హస్తములు ఉండవలెను. మిగిలిన ఎనిమిది మండపములు రెండేసి హస్తములు పెంచి నిర్మించవలెను. మధ్య మండలము నందు నాలుగు హస్తముల వేది నిర్మించవలెను. దాని నాలుగు కోణములందును, నాలుగు స్తంభములు ఉండవలెను. వేది, పాదముల మధ్యస్థమును విడచి కుండలమును నిర్మించవలెను. ఇవి తొమ్మిది లేదా పది ఉండవలెను. ఈశాన్యము నందుగాని, తూర్పు నందుగాని ఒకే కుండమును నిర్మించవలెను. అది గురుస్థానము. ఏబది హోమములు చేయు కుండము ప్రమాణము పిడికిలి ఉండవలెను. నూరు హోమములైనచో జానెడు, వెయ్యి హోమములు చేయవలసియున్నచో ఒక హస్తము, పది వేల హోమములైనచో రెట్టింపు ఉండవలెను. లక్ష హోమములకు నాలుగు హస్తములు, ఒక కోటి హోమములకు ఎనిమిది హస్తములు ఉండవలెను. కుండమును ఆగ్నేయమునందు భగాకారముగను, దక్షిణమున అర్ధచంద్రాకారమునను, నైరృతియందు త్రికోణాకారముగను, వాయవ్యమున షట్కోణముగను, ఉత్తరమున కమలాకారముగను, ఈశాన్యము నందు అష్టకోణముగను నిర్మించవలెను. కుండము అన్ని వైపుల సమముగను పల్లముగను ఉండవలెను. పైన మేఖలలు నిర్మించవలెను. బైట వరుసగ నాలుగు, మూడు, రెండు, అంగుళముల వెడల్పుగల మేఖల నిర్మించవలెను. మేఖలలు కుండాకారముతో సమానాకారములై ఉండవలెను. వాటిపై మధ్య భాగమున రావి ఆకు ఆకారముగల యోని ఉండవలెను. దాని ఎత్తు ఒక అంగుళము, వెడల్పు ఎనిమిది అంగుళములు ఉండవలెను. పొడవు కుండార్థముతో సమానముగా ఉండవలెను. యోని మధ్యభాగము కుండ కంఠమువలె నుండవలెను. పూర్వ, ఆగ్నేయ, దక్షిణములందు కుండముల యోని ఉత్తరాభి ముఖముగ నుండవలెను. ఇతర దిక్కులందున్న కుండముల యోని పూర్వాభిముఖముగ నుండవలెను. ఈశాన్యకుండ యోని ఉత్తరాభిముఖముగాగాని, పూర్వాభిముఖముగా గాని ఉండవలెను. కుండములో ఇరువది నాల్గవ భాగము అంగుళము. తదనుసారము విభజించి మేఖలా, కంఠ, నాభులను నిశ్చయించవలెను. మండపము పూర్వాది దిక్కులందు ద్వారములు వరుసగ ప్లక్ష ఉదుంబర అశ్వత్థ వటదారువులతో నిర్మింపబడవలెను. పూర్వాది దిక్కులనుండి వరుసగ వాటి పేర్లు శాంతిభూతి బల ఆరోగ్యములు ద్వారములు ఎత్తు ఐదు, ఆరు, లేదా ఏడు హస్తములు ఉండవలెను. వాటిని చేతిలోతు త్రవ్విన గోతులలో నిలుపవలెను. వాటి విస్తారము ఎత్తులో సగము ఉండవలెను. వాటిపై మామిడాకులు మొదలగునవి కట్టవలెను.
మండప పూర్వాది దిక్కులందు వరుసగ ఇంద్రాయుధమువలె అనేక వర్షములు గల పతాకను, రక్త, కృష్ణ, ధూసర, శ్వేత, హరిత, సువర్ణ వర్ణ, స్పటిక వర్ణ పతాకలను ఎగురవేయవలెను. ఈశాన్యమునందును, పూర్వ మధ్యమునందును బ్రహ్మ కొరకు రక్త వర్ణ పతాకను, నైరృతి, పశ్చిమ మధ్య భాగములందు అనంతునికొరకు నీల వర్ణ పతాకను ఎగురవేయవలెను. ధ్వజముల పతాకలు ఐదుహస్తముల పొడవు, అందులో సగము వెడల్పు ఉండవలెను. ధ్వజ దండము ఎత్తు ఐదు హస్తములు ఉండవలెను. ధ్వజము లావు రెండు చేతులతో పట్టుకొనుటకు వీలగునట్లు ఉండవలెను. పర్వత శిఖర, రాజద్వార, నదీతట, అశ్వశాలా, హస్తిశాలా, వల్మీకముల మట్టిని, ఏనుగు దంతములతో పెకలించిన మట్టిని, ఎద్దు కొమ్ములతో పెకలించిన మట్టిని, వరాహము పెకలించిన మట్టిని, గోష్ఠ చతుష్పథముల మట్టిని ఈ పండ్రెండు విధముల మట్టిని గ్రహించవలెను. విష్ణు స్థాపనము నకు పండ్రెండు విధముల మట్టిని, శివస్థాపనమునకు ఎనిమిది విధముల మట్టిని ఉపయోగించవలెను. న్యగ్రోధ, ఉదుంబర, అశ్వత్థ, చూత, జంబూ వృక్షముల బెరడునుండి తీసిన ఐదు కషాయములు, ఎనిమిది విధములైన ఋతుఫలములు సంగ్రహించవలెను. తీర్థజల, సుగంధిత జలములు, సర్వౌషది మిశ్ర జలము, సస్య పుష్ప మిశ్రిత జలము, స్వర్ణ మిశ్రిత జలము, రత్న మిశ్రిత జలము, గోశృంగ స్పర్శయుక్త జలము, పంచగవ్య, పంచామృతములు, వీటిని అన్నిటిని దేవతా స్నానముకొరకై సిద్ధము చేసికొనవలెను. విఘ్నము కలిగించువారిని భయపెట్టుటకై పిండితో చేసిన వజ్రాధ్యాయుధములనుగూడ సిద్ధము చేసికొనవలెను. సహస్ర ఛిద్రములున్న కలశమును, మంగళార్థమై గోరోచనమును సిద్ధము చేసికొనవలెను. స్నానార్థమై వంద విధములైన ఓషధుల మూలములు, విజయా, లక్ష్మణా, బలా, గుడూచీ, అతిబలా, పాఠా, సహదేవా, శతావరీ, బుద్ధి, సువర్చలా, వృద్ధులను వేరు వేరుగా సిద్ధము చేసికొనవలెను. రక్షకొరకు తిలకుశాదులు, భస్మస్నానము కొరకు భస్మము, స్నానార్థము యవగోధుమలపిండి, బిల్వ చూర్ణము, విలేపనము, కర్పూరము, కలశము, చెంబు సిద్ధము చేసికొనవలెను. మంచము, రెండు పరుపులు, తలగడ, దుప్పటి మొదలైన ఇతర వస్త్రములు గూడి తన శక్తిని అనుసరించి సిద్ధము చేసికొని, వివిధ చిహ్నములతో సిద్ధము చేయబడిన శయనాగారమునందు ఉంచవలెను. ఘృత, మధు పూర్ణ పాత్రములు, బంగారు సూది, వర్ధని శివ కుంభము లోకపాల ఘటములను కూడ సిద్ధము చేసికొనవలెను. నిద్ర కొరకు ఒక కలశ, కుండము లెన్ని ఉన్నవో అన్ని శాంతి కలశములు. ద్వారపాలాది, ధర్మాది, ప్రశాంతాదుల కొరకై కలశలు, వాస్తుదేవ, లక్ష్మీ, గణేశులకై వేరువేరు కలశలు సమకూర్చుకొనవలెను. ఈ కలశల క్రింద ఆధారముగానుండునట్లు పోయుటకు ధాన్యము ఉంచుకొనవలెను. అన్ని కలశలను వస్త్ర పుష్పాదులతో అలంకరించవలెను. వీటి లోపల సువర్ణముంచి స్పృశించి సుగంధ జలముతో నింపవలెను. అన్ని కలశలమీదను పూర్ణపాత్రలు, ఫలములు ఉంచవలెను. వాటి ముఖ భాగము నందు పంచ పల్లవములుంచవలెను. ఆ కలశలు ఉత్తమ లక్షణ సంపన్నములై ఉండవలెను. కలశములను వస్త్రములచే ఆచ్ఛాదించవలెను. నలుమూలల చల్లుటకై తెల్ల ఆవాలు, పేలాలు సిద్ధము చేసికొనవలెను. పూర్వమునందు చెప్పినట్లు జ్ఞాన ఖడ్గము ఉంచుకొనవలెను. సమిధలు, చరుపాత్ర, రాగి గరిటి, పాదాభ్యంగము కొరకై ఘృత మధువులున్న పాత్రను, ముప్పది కుశ దక్షములతో నిర్మించిన నాలుగు ఆసనములను, పలాశ- నిర్మితములగు నాలుగు పరిధులను సమకూర్చుకొనవలెను.
తిలపాత్ర, హవిష్య పాత్ర, అర్ఘ్య పాత్ర, పవిత్రకములను కూడ సిద్ధము చేసికొన వలెను. వీటి ప్రమాణము ఇరువదేసి ఫలములు ఘంట, ధూపపాత్ర, స్రుక్కు, స్రువము, పిటకము, పీఠము, వ్యజనము, ఎండిన సమిధలు, పుష్పములు, సత్రములు గుగ్గులు, ఘృత దీపములు, ధూపము, అక్షతలు, మూడు పోచల ద్వారము, గౌఘృతము, యవలు, తిలలు, కుశలు, శాంతికర్మపై త్రివిధ మధుర పదార్థములు, పది పర్వముల సమిధలు, ఒక హస్తము ప్రమాణముగల స్రువము, సూర్యాది గ్రహశాంతికై అర్క, పలాశ, ఖాదిర, అపామార్గ, అశ్వత్థ, ఉదుంబక, శమీవృక్ష సమిధలు, ధూర్వలు, కుశలు, సిద్ధము చేసికొనవలెను. అర్కాదిసమిధలు నూటఎనిమిది చొప్పున ఉండవలెను. ఇవి లభించనిచో వాటి స్థానమున యవలు, తిలలు హోమము చేయవలెను. ఇంకను గృహోపకరణములు కూడ సిద్ధము చేసికొనవలెను. గిన్నెలు, గరిటె, మూతలు మొదలగునవి. దేవాదుల కొరకు వస్త్ర ద్వయము, ఆచార్య పూజ నిమిత్తము ముద్రా, ముకుట, వస్త్ర, హార, కుండల, కంకణాదులును సిద్ధము చేయవలెను. ధన వ్యయము విషయమున లుబ్ధత్వము చూపరాదు. మూర్తిధారణము, అస్త్ర మంత్రాది జపము చేయు బ్రాహ్మణులకు ఆచార్యునకు ఇచ్చిన దానిలో నాల్గవవంతు తగ్గించి దక్షిణ ఈయవలెను. సామాన్య బ్రాహ్మణులకును, జ్యోతిష్కులకును, శిల్పులకును, జపకర్తలకు ఇచ్చినట్లుగనే ఇవ్వవలెను. వజ్రము, సూర్యకాంతమణి, నీలమణి, అతినీలమణి, ముత్యము, పుష్పరాగము, పద్మరాగము, వైడూర్యము వీటిని సంగ్రహించుకొనవలెను. వట్టివేరు, విష్ణుకాంత, రక్తచందనము, అగురువు, శ్రీ ఖండము, శాంబ, కుష్ఠము, శంఖిని ఈ ఓషదులను సంగ్రహించవలెను. బంగారము, రాగి, ఇనుము, రక్తము, రజతము, కంచు, సీసములము, మనఃశిల గైరికము, హేమ మాక్షీకము, పాదరసము, వహ్నిగైదికము, గంధకము, అభ్రకము అను ఎనిమిది ధాతువులను కూర్చుకొనవలెను. ఈ విధముగనే ఎనిమిది విధములగు ధాన్యములు వరి, గోధుమలు, తిలలు, పెసలు, మినుములు, యవలు, నీవారములు, శ్యావాకములు సమకూర్చుకొనవలెను. (95)
