అగ్ని మహా పురాణము
అద్వైత బ్రహ్మ విజ్ఞానము
అగ్నిదేవుడు పలికెనుః
భరతుడు చెప్పిన అద్వైత బ్రహ్మ విజ్ఞానమును గూర్చి చెప్పెదను. పూర్వము భరతుడను రాజు సాలగ్రామ క్షేత్రమున వాసుదేవాది పూజచేయుచు తపస్సు చేసెను. ఒక మృగము నందు ప్రేమచే మరణ సమయమున ఆ మృగమునే స్మరించుచు మరు జన్మమున మృగముగా పుట్టెను. కాని ఆ జన్మలో పూర్వజన్మ స్మృతి వుండెను. అందుచే స్వయముగనే ఆ దేహమును విడిచి మరియొక జన్మ ఎత్తెను. అద్వైత బ్రహ్మ జ్ఞానము కలవాడు మూఢునివలె లోకమున సంచరించెను. సౌవీర దేశరాజు అతనిని విష్టిగా నియమించెను. అతని ఆజ్ఞ ప్రకారము భరతుడు ఆతని పల్లకిని మోసెను. ఆతడు జ్ఞానియైనను ప్రారబ్ధ క్షయము కొరకై విష్టిగా గ్రహింపబడి పల్లకి మోసెను. ఇతరులు శీఘ్రముగ నడచుచుండిరి. వారు శీఘ్రముగ నడచుటను, ఇతడు మందముగా నడచుటను చూసి రాజు పలికెను.
రాజు ఇట్లు అనెనుః
ఓయీ! నీవు నా పల్లకి కొంచెము దూరమే మోసితివి. ఇంతలోనే అలసిపోతివా! నీవు చూచుటకు బలిసివున్నావు. శ్రమకు ఓర్చజాలవా! బ్రాహ్మణుడు పలికెను. నేను బలిసిలేను, నేను నీ పల్లకి మోయుట లేదు. నేను అలసిపోలేదు. నాపై న భారమేమియు లేదు. నేలపై రెండు పాదములున్నవి. వాటిపై పిక్కలున్నవి. వాటిపై రెండు తొడలున్నవి. వాటిపై ఉదరము, దానిపై వక్షస్థలము, దానిపై భుజములు వున్నవి. ఆ భుజములపై ఈ పల్లకి వుంచబడినది. అట్టి పరిస్థితులలో నాకేమి సంబంధ మున్నది. నీది అను చెప్పబడు ఈ శరీరము పల్లకిలో ఉన్నది. నీవు అక్కడ ఉన్నావని, నేను ఇచట నున్నానని చెప్పుట ఇదంతయు మిథ్య. నిన్ను, నన్ను, అందరిని కూడ పంచభూతములు మోయుచున్నవి. పంచభూతములు గుణ ప్రవాహములో పడి కొట్టుకొనిపోవుచున్నవి. సత్త్వాది గుణములు కర్మాధీనములు. కర్మ అవిద్యాసంచితము. ఇది అన్ని జీవులందు వున్నది. ఆత్మ శుద్దము, అక్షరము, శాంతము, నిర్గుణము, ప్రకృతి, అతీతము, అన్ని ప్రాణులయందు ఒకే ఆత్మవున్నది. దానికి వృద్ధికాని హోసముకాని లేవు. అట్టి పరిస్థితులలో నీవు బలిసివున్నావు అని ఏయుక్తిని బట్టి నీవు పలికినావు. పృథివీ, పాదములు, కాళ్లు, కటి ఊరువులు, ఉదరము, మొదలగు వాటి పైనను స్కంధమునందును ఉన్న పల్లకి నాకు భారమైనచో అది నీకు కూడ భారమే. ఇది ఇతర ప్రాణుల విషయమున కూడ సమానమే. కేవలము, పల్లకిని మాత్రమేకాక జీవులు పర్వతములను, వృక్షము లను, గృహములను, పృధ్వ్యాదులను, వాటి భారమును కూడ తన నెత్తిపై వేసికొనినాడు. రాజా! ప్రకృతి జన్యములగు సాధనముల కంటే పురుషుడు సర్వధాభిన్నుడు అయినపుడు నేను భరించవలసిన భారమేమున్నది. ఏ పదార్థముతో ఈ పల్లకి తయారుచేయబడినదో ఆ పదార్థము తోటే నీ యొక్క నాయొక్క సకల ప్రాణులయొక్క శరీరములు నిర్మింపబడినవి. ఆ ద్రవ్యములచేతనే అందరికిని వృద్ధి ఏర్పడినది.
ఆ మాటవిని రాజు ఆతని పాదములు స్పృశించి క్షమాపణను కోరి ఇట్లు పలికెను. నన్ను అనుగ్రహించుము. ఈ పల్లకిని విడిచి నీవు ఎవ్వరవో-ఇట్లు ఎందుకు వచ్చినావో చెప్పుము అని ప్రార్థించెను. బ్రాహ్మణుడు పలికెను. రాజా! వినుము. నేను ఫలానావాడను అని చెప్పుట అశక్యము. కర్మ ఫలమును అనుభవించుటకే అందరును వచ్చుచుందురు. సుఖ దుఃఖోప భోగము కొరకై విభిన్న దేశకాలాదులను పొందుచుందురు. ధర్మాధర్మఫలములను అనుభవించుటకై జీవుడు ఆయా దేహములను పొందుచుండును. రాజు అతనితో ఏది ఉన్నదో అది నేను అని చెప్పుటలో దోషమే మున్నది. అహం అను శబ్దమును తన విషయమున ప్రయోగించుట దోషము కాదు కదా! అని బ్రాహ్మణుడు పలికెను. అందుకు తన విషయమున ‘అహమ్’ అను శబ్దమును ప్రయోగించుటలో దోషములేదు అని నీవు చెప్పినది సత్యమే. కానీ అనాత్మ విషయమున ‘అహం’ శబ్దమును ప్రయోగించి దానిని ఆత్మగా భావించుట భ్రాంతియే. సమస్త దేహమునందును ఉన్న ఆత్మ ఒక్కటియే యైన పుడు నీవు ఎవ్వరు, నేను ఎవ్వరు మొదలగు వచనములకు అర్థము లేదు. నీవు రాజువు. ఇది పల్లకి, మేము దీనిని మోయువారము. ఎదుట నడచువారు నీ పరివారము. ఈ లోకము నీది. ఈ విధముగ చెప్పుట సత్యము కాదు. చెట్టునుండి వచ్చిన కర్రతో చేసిన యీ పల్లకిని నీవు ఎక్కియున్నావు రాజా. ఈ పల్లకికి వుండవలసిన వృక్షమను పేరు కర్ర అను పేరు ఏమైపోయినది అది చెప్పుము. ఇక్కడున్న వారెవరును మహారాజు చెట్టుపై ఎక్కినాడు అని కాని కట్టెపై ఎక్కినాడు అని కాని అనుట లేదు. పల్లకి ఎక్కినట్లు చెప్పుచున్నారు. ఒక విధముగ కూర్చిన కర్రల సముదాయమునకే ‘శిబిక’ (పల్లకి) అని పేరు రాజా! కర్రల కంటే వేరుగా పల్లకి ఎక్కడ ఉన్నదో వెతికి చూడుము.
ఇతడు పురుషుడు, ఈమె స్త్రీ, ఇది యెద్దు. ఇది గుర్రము, ఇది ఏనుగు, ఇది వృక్షము, ఇది పక్షి అని ఈ విధములుగ కర్మ జనితములగు భిన్న భిన్న శరీరములకు వేర్వేరు నామములు ఆరోపింపబడుచున్నవి. ఇవన్ని లోకము కల్పించిన పేర్లు. జిహ్వ అహం అని అనుచున్నది. దంతములు ఓష్ఠములు తాలువు కంఠము మొదలగునవి కూడ ఉచ్చరించుచున్నవి. కాని ఇవి యేవియు ‘అహం’ కాదు. ఇవి కేవలము శబ్లోచ్చారణ సాధన మాత్రములు. ఈ జిహ్వ ‘అహం’ అని యే కారణముచే చెప్పుచున్నది? జిహ్వ ‘అహం’ అని చెప్పుచు పలుకుచు నేను ‘అహం’ కాదు అని అనను. మిథ్య కాదు. శిరస్సు పాయ్వాదులు మొదలగు అవయవముల రూపములలో నున్న శరీరము పురుషుని కంటే సర్వదా భిన్నము. అందుచే ఏ అవయవమును నిర్దేశించుటకు నేను ‘అహం’ శబ్దమును ప్రయోగింతును? నా కంటే భిన్నమైన మరొక తత్త్వమున్నచో ఇది నేను, అది భిన్నము అని చెప్పుటకు వీలు ఉండును. కాని వాస్తవమున పర్వత, పశు, పాదపాది భేదము, సత్యము కాదు. శరీర దృష్టిచే కనబడు భేదములు అన్నియు కర్మ జన్యములు. లోకములో ఇతడు రాజు, ఇతడు భటుడు మొదలగు విధమున చెప్పు భేదములు ఏవీ నిర్వికారసత్యములు కావు. నీవు సకల లోకమునకు రాజువు. నీ తండ్రికి కుమారుడవు. నీ శత్రువునకు శత్రువు. నీ భార్యకు భర్తవు. నీ కుమారునకు తండ్రివి. ఇన్ని పేర్లుండగా నిన్ను ఏ పేరుతో పిలువవలెను. ఈ శిరస్సు నువ్వా! ఈ శిరస్సు నీదైనట్లే ఈ ఉదరము కూడ నీదే. అందుచే ఉదరము నువ్వా. ఈ పాదాద్యవయవములలో ఏదైన ఒకటి నువ్వా! కానిచో ఇవన్నియు నీవెట్లు అయినవి మహారాజా! నీవు ఈ అవయవముల కంటే భిన్నుడవు. కావున వీటి నుండి వేరుబడి వాస్తవమున నేను ఎవరిని అని చక్కగా ఆలోచించుము” అని పలికెను.
ఆమాటలు విని ఆ రాజు భగవత్స్వరూపుడు అగు ఆ అవధూత బ్రాహ్మణునితో ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా! నేను శ్రేయస్సును కోరి కపిల మహర్షి వద్ద ఉపదేశము పొందుటకై వెళ్లుచున్నాను. నీవు కూడ కపిల మహర్షి యొక్క అంశమే. నాకు జ్ఞానమును ఇమ్ము, జ్ఞానరూపమగు మనో సాగరమును చేరుటచే శ్రేయస్సును కలుగు ఉపాయము చెప్పుము. బ్రాహ్మణుడు పలికెను. ఇంకను శ్రేయస్సే కావలెనని అడుగుచున్నావు కాని పరమార్థ తత్త్వమేమని అడుగుట లేదు. రాజా! నీవను కొనని శ్రేయస్సులు అన్నియు ఆ పరమార్గములే. మానవుడు దేవతారాధన చేసి ధన సంపత్తిని, పుత్రులను, రాజ్యమును పొంద కోరుచున్నాడు. రాజా నీవే చెప్పుము. అదియే అతనికి శ్రేయస్సు, వివేకవంతునకు పరమాత్మ ప్రాప్తియే శ్రేయస్సు. యజ్ఞాది క్రియగాని ద్రవ్యసిద్ధికాని అతనికి శ్రేయస్సు కాదు. పరమాత్మ జీవాత్మల ఏకత్వమే పరమార్థము. ఏకము వ్యాపి, సమము, శుద్ధము, నిర్గుణము, ప్రకృతి అతీతము, జన్మ వృధ్యాది రహితము సర్వగతము, వికార రహితము జ్ఞానమయము అసం గము గుణ జాత్యాది రహితము సర్వశక్తముయైన ఆత్మయొక్క జ్ఞానమే పరమార్థము. ఇపుడు నిదాఘునకును ఋతువునకును జరిగిన సంవాదమును చెప్పెదను వినుము.
బ్రహ్మ సుతుడగు ఋతువు మహాజ్ఞాని. పులస్త్యనందనుడగు నిదాఘుడు ఆతనికి శిష్యుడై విద్యలను నేర్చి పిదప ‘దేవికా’ నదీ తటమున ఒక నగరములో నివసించుచుండెను. ఋతువు తన శిష్యుని నివాస స్థానమును తెలుసుకొనెను. వెయ్యి దివ్య వర్షములు దాటిన పిమ్మట ఋతువు నిదాఘుని చూచుటకు వెళ్లెను. ఆ సమయమున నిదాఘుడు వైశ్వదేవానంతరము భుజించి తన శిష్యులతో ఇట్లు పలుకుచుండెను. ‘భోజనానంతరము నాకు తృప్తి కలిగినది. అక్షయ తృప్తి నిచ్చునది భోజనమే. ఋతువు పలికెను. ఓ బ్రాహ్మణా! ఆకలిగొన్న వానికే భోజనానంతరము తృప్తి కలుగును. నాకెన్నడును ఆకలియే కలుగలేదు. నన్ను తృప్తినిగూర్చి ఎందుకు అడుగుచున్నావు. ఆకలి దప్పికలు దేహ ధర్మములుకాని నాకు సంబంధించినవి కావు. నీవు అడిగినావుకాన చెప్పుచున్నాను. నాకు సర్వదా తృప్తియున్నది. ఆత్మ ఆకాశమువలె సర్వవ్యాప్తము. ఆత్మయే నేను. అందుచే నీవు ఎక్కడి నుండి వచ్చుచున్నావు? అను ప్రశ్నకు అవకాశము లేదు. నేను వెళ్లు వాడను కాను. వచ్చువాడను కాను. ఒక ప్రదేశములో ఉన్నవాడను కాను. మట్టితో కట్టిన ఇల్లు మట్టి పూయుటచే గట్టిపడినట్లు ఈ పార్థివ దేహము పార్థివ పరమాణువులచే గట్టిపడుచుండును. నీవు నాకంటే భిన్నుడవుకాదు. నేను నీకంటే భిన్నుడను కాను. ఓ బ్రాహ్మణా! నేను ఆచార్యుడనైన ఋతువును, నీకు జ్ఞానోపదేశము చేయుటకై వచ్చితిని. ఇపుడు వెళ్లేదను, నీకు పరమార్థ తత్త్వమును ఉపదేశించితిని. ఈ ప్రపంచ మంతయు ఏకైక వాసుదేవ నామక పరమాత్ముని స్వరూపమని తెలిసికొనుము. దీనిలో భేదము ఏ మాత్రము లేదు.
పిదప వెయ్యి సంవత్సరముల తరువాత ఆ నగరమునకు వెళ్లిన ఋతువు నగర ప్రాంతమున ఏకాంత ప్రదేశమునందు ఉన్న నిదాఘుని చూచి ఇట్లనెను. నీవు ఏకాంత స్థానమున వున్నా వెందులకు నిదాఘుడు! పలికెను, ఓ బ్రాహ్మణా మార్గమున ఎక్కువ జనసమ్మర్దము వున్నది. ఇపుడు రాజు సుందరమైన తన నగరములోనికి ప్రవేశించుచున్నాడు. అందుచే నేనిచ్చట ఆగియున్నాను. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవ్వరు? సామాన్యులెవ్వరు? నీకు తెలియును. కాన చెప్పుము. నిదాఘుడు పలికెను. మదించి యున్న పర్వతశిఖర సదృశమగు గజేంద్రమును అధిష్టించి ఉన్నవాడు నరేంద్రుడు. ఆతనిని చుట్టి ఉన్నవారు ఇతర పరివారము. క్రిందనున్నది గజము. దానిపైన ఉన్న వాడు రాజు. ఋతువు పలికెను. వీరిలో రాజు ఎవరు? గజము ఏది? నిదాఘుడు చెప్పెను. సరే చెప్పెదను అని పలుకుచు నిదాఘుడు ఋతువు పైకి ఎక్కి ఈ దృష్టాంతము ద్వారా తెలుసుకొనుము. పైనున్న నేను రాజు వంటివాడను. నాక్రింద నీవు ఏనుగువలె నిలచి యున్నావు, ఋతువు పలికెను. నేనెవ్వరు? నీవు ఎవ్వరవని అందును.
ఈ విధముగ పలుకగనే నిధాఘుడు నమస్కరించి సత్యముగ నీవు నా గురువువు. ఏలననగా! ఈ విధముగా అద్వైత సంస్కార సంస్కృతమగు మనస్సు కలవారు ఎవ్వరును లేరు. ఋతువు నీకు బ్రహ్మ జ్ఞానము ఉపదేశించుటకై వచ్చితిని. పరమార్గము, సారము 60న అద్వైతమును బోధించితిని. బ్రాహ్మణుడు పలికెను. ఆ ఉపదేశము పొంది నిదాఘుడు కూడ అద్వైతజ్ఞాని అయ్యెను. సమస్త ప్రాణులను, తనకంటే అభిన్నములుగా చూచెను. ఆ జ్ఞానమువలన ముక్తిని పొందెను. నీవు కూడ అట్లే ముక్తిని పొందెదవు. నీవు నేను ఈ సర్వజగత్తు అంతయు ఏకమాత్రము వ్యాపకము అగు విష్ణు స్వరూపము. ఒకే ఆకాశము పీతనీలాది భేదములతో వేర్వేరుగా కనబడునట్లు భ్రాంత దృష్టి కలవారికి ఒకే ఆత్మ వేరు వేరుగ కన్పట్టును. అగ్నిదేవుడు పలికెను. ఆరాజు ఈ జ్ఞానసారమును పొంది సంసారము నుండి ముక్తి పొందెను. అజ్ఞానమయమగు సంసార వృక్షమునకు బ్రహ్మ జ్ఞానమే ఖడ్గము అని నిరంతరము చింతనము చేయుము. (380)
