అగ్ని మహా పురాణము

Table of Contents

గోనసాది చికిత్సా కథనము

అగ్నిదేవుడు పలికెను:

వశిష్ఠా! ఇప్పుడు గోనసాది సర్పవిషమునకు చికిత్స చెప్పెదను, వినుము. ‘ఓహ్రాం హ్రీం, అమల పక్షిస్వాహా’ అను మంత్రముతో అభిమంత్రించిన తాంబూలమును ఇచ్చుటచే మంత్రవేత్త మండలి సర్ప విషమును తొలగించును. లశునము రామఠ ఫలము కుష్టము, అగ్ని, వ్యోషకము. వీటిని సర్పవిషమునందు త్రాగవలయును. స్నుహీక్షీరము గో ఘృతము పదునైదు దినములు త్రాగవలయును. రాజిల సర్పము కరచినపుడు సైంధవ లవణము ఆజ్యమధు గోమయ రసములు పురీతత్’ భక్షించినచో విషము తొలగును. సర్పము కరచినవాడు కృష్ణ ఖండము దుగ్ధము, ఆజ్యము, తేనె వీటిని త్రాగవలెను. త్రికటువులు మయూర పింఛము, పిల్లి, ఎముక, ముంగిస రోమములు వీటిని సమాన భాగములుగ గ్రహించి చూర్ణముచేసి గొఱ్ఱపాలలో తడిపి దాని ధూపము వేసినచో అన్ని విధములగు విషములు నశించును. రోమ నిర్గుండికా, అంకోల పత్రములను సమభాగముల గ్రహించి, వాటి అన్నిటితో సమముగ లశునముచేర్చి వేసిన ధూపము కూడ విషనాశకము, అగస్త్య పత్రములను, గంజిలో ఉడికించి దానితో పాముకరచిన చోట కాచినచో విషము దిగిపోవును. మూషకములు పదహారు విధములు, కార్పాస రసమును త్రాగినచో వాటి విషము తొలగును. ఫలునీ పుష్పములను నాగర గుడములతో కలిపి భక్షించినచో విషరోగము పోవును. సాలె పురుగులు ఇరువది విధములైనవి. వాటిని విషమునకు చికిత్స చేయుటకు పద్మక పాటలీ కుష్ట ఉశీర, చందన, నత, నిర్గుండి, శారివ, సేలులను ఉపయోగించవలయును. గుంజ నిర్గుండి కంకోల పత్ర శుంఠి, ద్వివిధ హరిద్ర కరంజ వల్కములను ఉడికించి (సాలె పురుగు) లూత విషముతో బాధపడు వానికి పైన చెప్పిన ఓషధులు కలిపిన నీటిని త్రాగించవలయును. ఇప్పుడు వృశ్చిక విషమును తొలగించు చికిత్సను వినుము, మంజిష్టా చందన వ్యోష శిరీష, కుముద పుష్పములను, నాలుగు యోగములను కలిపి లేపాదికము చేసినచో వృశ్చిక విష బాధ నశించును. ‘ఓం నమో భగవతే రుద్రాయ’ మొదలు ‘ఓం హ్రూం ఫట్’ వరకు వున్న మూలోకమంత్రముతో అభిమంత్రించిన ఔషధము మనుష్యునికి ఇచ్చినచో గర్దభాది విషములను తొలగించును. త్రిఫలా ఉశీర, ముస్తా, అంబు మాంసి, పద్మక, చందనములను మేకపాలతో కలిపి త్రాగించినచో గర్దభాది విషము నశించును. శిరీష పంచాంగములు వ్యోషము శతపదీ విషమును నశింపచేయును. కంధరముతో కూడిన శిరీష వృక్షపు బెరడు ఉందూరజ విషమును తొలగించును. వ్యోషమును తగరమూలమును ఘృతముతో ఉపయోగించినచో ‘మత్స్యవిషము నశించును. యవ, క్షార, వ్యోష, వచా, హింగు, విడంగ, సైంధవ-తగర, అంబష్టా, అతిబలా కుష్ఠములు సకల విధకీట విషములను హరించును. యష్టి వ్యోషగుడ క్షీరములతో చేసిన యోగము శూనక విషమును తొలగించును. ‘ఓం సుభద్రాయై నమః’, ‘ఓం సుప్రభాయై నమః’ అనునవి ఓషధులును పైకి తీయునపుడు ఉపయోగించు మంత్రములు. విధానానుసారముగ కాక మానవులు ఏ ఓషధులను గ్రహింతురో వాటి సారమును నీవు తీసుకొనుము అని బ్రహ్మ ‘సుప్రభా’ దేవికి చెప్పెను. అందుచేత ముందుగ సుప్రభాదేవికి నమస్కరించి పిడికిలితో యవలు చల్లి పది పర్యాయములు జపించి ఓషధికి నమస్కరించి ‘ఊర్ధ్వ నేత్రవగు నిన్ను ఉద్దరించుచున్నాను’ అని చెప్పుచు ఆ ఓషధిని పైకి లాగి ‘పురుష సింహుడగు గోపాలునకు నమస్కారము. యుద్ధము నందు తన పరాజయమును గూర్చి శ్రీకృష్ణుడే యెరుగును. ఈ సత్యవాక్య ప్రభావముచే నాకు ఈ ఓషధి సిద్ధిప్రదమగు గాక! యని చెప్పుచు దానిని భక్షించ వలయును. స్థావర విషమునకు ఉపయోగించు ఓషధుల విషయమున ‘సమో వైదూర్య మాత్రే! మొదలు ‘హరిమాయే’ వరకును వున్న మూలోక్త మంత్రమును జపించవలయును. విషమును భక్షించిన వానిచే ముందుగవమనము చేయించి వాని శరీరము చల్లని జలముతో తడుపవలయును. పిదప తేనె నెయ్యి త్రాగించి విరేచనము చేయించవలయును. (298)