అగ్ని మహా పురాణము

Table of Contents

చతుష్షష్టి యోగిన్యాది లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు అరువది నాలుగు యోగినులను గూర్చి చెప్పెదను. వీరి స్థానము క్రమముగ తూర్పునుండి ఈశాన్య పర్యంతము ఉండును. యోగినుల పేర్లు: అక్షోభ్య, రూక్షకర్ణి, రాక్షసి, కృపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, క్షేమ, ఇళ, నీలాలయ, లోల, అలక్త, బలాకేశి, లాలస, విమల, హుతాశ, విశాలాక్షీ, హుంకార, బడబాముఖి, మహాక్రూర, క్రోధన, భయంకరి, మహానన, సర్వజ్ఞ, తరల, తార, ఋగ్వేద, హయానన, సార, రుద్ర సంగ్రాహి, శబర, తాలజంఘిక, రక్తాక్షి, సుప్రసిద్ధ, విద్యుజ్జిహ్వ, కరంకిణి, మేఘనాద, ప్రచండ, ఉగ్ర, కాలకర్ణి, వరప్రద, చంద్ర, చంద్రావళి, ప్రపంచ, ప్రళయాంతిక, శిశువక్త్ర, పిశాచి, పిశితాశ, లోలుప, ధమని, తవని, రాగిణి, వికృతానన, వాయువేగ, బృహత్కుక్షి, వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, జయంతిక, బిడాలి, రేవతి, పూతన, విజయాంతిక. ఈ యోగినులకు ఎనిమిది లేదా నాలుగు చేతులు ఉండును. ఇచ్ఛానుసారముగ ఆయుధములను ధరించుచుందురు, ఉపాసకులకు సంపూర్ణ సిద్ధులను ప్రసాదింతురు. భైరవునకు పండ్రెండు చేతులుండును. దంతములు ఎత్తుగా ఉండును. శిరస్సుపై జటా, చంద్రులుండును. ఒక వైపున నున్న ఐదు చేతులతో ఖడ్గ, అంకుశ, కుఠార, బాణ, జగదభయప్రదాన ముద్రలును; రెండవ ప్రక్కనున్న ఐదు చేతులతో ధనుష్, త్రిశూల, ఖట్వాంగ (మంచము కోడు); పాశకార్ధ, వరముద్రలను ధరించి ఉండును. మిగిలిన రెండు చేతులలో గజచర్మ ఉండును. గజచర్మమే వస్త్రము. సర్పాలంకారములచే అలంకృతుడై ఉండును. మాతృకల మధ్య ప్రేతముపై కూర్చుండును. భైరవుని ప్రతిమ ఈ రూపమున నిర్మించి పూజించవలెను. భైరవునకు ఒక ముఖముండ వచ్చును. లేదా ఐదు ముఖములుండవచ్చును.

తూర్పు దిక్కు నుండి ఆగ్నేయము వరకు, విలోమ క్రమమున, అన్ని దిక్కులందును భైరవుని స్థాపించి క్రమముగ పూజింపవలెను. బీజమంత్రమును ఎనిమిది దీర్ఘస్వరములలో ఒక్కొక్కదానిచేత విడగొట్టి, అనుస్వార యుక్తముచేసి, ఆయా దిక్కునందున్న భైరవునితో కలిపి అన్నింటికి చివర ‘నమః’ చేర్చవలెను.

ఉదా: “ఓం హ్రాం భైరవాయ నమః- ప్రాచ్యామ్, ఓం హ్రీం భైరవాయ నమః- ఐశాన్యామ్; ఓం హ్రూం భైరవాయ నమః- ఉదీచ్యామ్; ఓం హ్రేం భైరవాయ నమః- వాయవ్యేమ్; ఓం హ్రైం భైరవాయ నమః- ప్రతీచ్యామ్, ఓం హ్రోం భైరవాయ నమః- నైరృత్యామ్; ఓం హ్రౌం భైరవాయ నమః- అవాచ్యామ్; ఓం హః భైరవాయ నమః- ఆగ్నేయ్యామ్” ఈ విధముగ మంత్రోచ్చారణ చేయుచు ఆయా దిక్కులలో భైరవ పూజ చేయవలెను. వీటిలో ఆరు బీజమంత్రములతో షడంగన్యాసము చేసి ఆ అంగముల పూజచేయవలెను. ధ్యానము ఈ విధముగ చేయవలెను. “భైరవుడు ఆగ్నేయ దళమునందు విరాజిల్లుచు, బంగారు నాలుకతోడను, నాద-బిందు, చంద్రులతోడను, మాతృకాధి పత్యంగముతోడను ప్రకాశించుచున్నాడు. (అట్టి భైరవునకు నమస్కారము). వీరభద్రుడు వృషభారూఢుడు. మాతృకామండల మధ్యమున ఉండును. నాలుగు హస్తములు. గౌరికి రెండు హస్తములు మూడు నేత్రములు. ఒక హస్తమునందు శూలము, రెండవ దానిలో దర్పణము ఉండును. లలితాదేవి కమలముపై కూర్చుండును. నాలుగు భుజములలో త్రిశూలము, కమండలువు, కుండి, వరదాన ముద్ర ధరించి ఉండును. స్కందుని అనుసరించి ఉండు మాతృకాగణము చేతులలో దర్పణము, శలాక ఉండును. చండికకు పది భుజములు ఉండును. కుడి చేతులలో బాణ, ఖడ్గ, శూల, చక్ర, శక్తులను ధరించి ఉండును. వామ హస్తములలో నాగపాశ, చర్మ, అంకుశ, కుఠార, ధనుస్సులను ధరించును. సింహాధిరూఢయైన ఆ దేవి ఎదుట శూలముచే చంపబడిన మహిషాసురుని శవము పడియుండును. (52)