అగ్ని మహా పురాణము

Table of Contents

మండల విధి

నారదుడు చెప్పెను:

భద్ర మండలము మధ్యనున్న కమలమున అంగదేవతాసహిత బ్రహ్మను పూజింప వలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నున్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణ భాగమున అగ్నిదేవతను, నైరృతి దిక్కున నిరృతిని, పశ్చిమ దిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్య దిక్కు నందున్న కమలమున వాయువును, ఉత్తర దిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్య దిక్కునందున్న కమలమున ఋగ్వేద యజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, పోడశదళ కమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను. పిమ్మట తృతీయావరణము నందలి, ఇరు వది నాలుగుదళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమష్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటి యొక్క స్వరూపము శబ్ద మాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింప అవసరము లేదు. ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాది మూర్తులను తొమ్మిదింటిని, దశవిధ ప్రాణములను, మనో, బుద్ధి, అహంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్, పాణి, పాదములను-ఈ ముప్పది రెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున అర్చన చేయవలెను. ఇవి నాల్గవ ఆవరణమునందలి దేవతలు. ఈ ఆవరణమున సాంగస పరివార దేవతా పూజ చేయవలెను.

పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజచేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువదియారు తత్త్వములను పూజింపవలెను. మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులుగల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల చూర్ణము చల్లవలెనో చెప్పెదను వినుము. కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్త రేఖలును సమప్రమాణము గలవై తెల్ల రంగులో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటన వేలంత లావుగా ఉండవలెను. ఒక హస్తము మండలము నందలి రేఖలు బొటన వ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములందున్న కోష్ఠములను ఎల్లని రంగుగల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగ యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. పీఠ ద్వారమును తెల్లని రంగుగల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను. ఉపశోభలపై నీలిరంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగులు ఉంచు విధానము. ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేక విధములగు వర్ణములుగల చూర్ణములు చల్లవలెను. త్రికోణ మండలము తెలుపు-ఎరుపు-నలుపు రంగులతో అలంకరింపవలెను. ద్వి కోణమును ఎరుపు-పసుపు రంగులతో అలంకరింపవలెను. చక్రకమలము నందలి నాభి స్థానమును నలుపు రంగు చూర్ణముతో అలంకరింపవలెను.

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులువేసి అలంకరింప వలెను. బైటనున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. వరిపిండి మొదలగు వాటిని తెలుపు రంగునకు ఉపయోగించవచ్చును. కుసుంభ చూర్ణాదులు ఎరుపు రంగునకును, పసుపు పసుపు రంగునకును, మాడ్చిన బియ్యపు పిండి నల్లరంగునకును ఉపయోగించవచ్చు. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజ మంత్రములను ఒక లక్షజపించుట చేతను, ఇతర మంత్రములను అక్షర లక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్ష జపించుట చేతను, బుద్ధ విద్యలను పదివేలసార్లు జపము చేయుటచేతను స్తోత్రములనువేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుట చేతను, మంత్రశుద్దియు, ఆత్మశుద్ధియుకూడ కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృతమగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్ర జపము మొదట ఎంతసంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతర మంత్రముల విషయమున హోమము జప సంఖ్యలో పదవవంతు చేయవలెను. మంత్ర పురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము అవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలుంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడు రెట్లు జపము చేసిననే మధ్యమ, ఉత్తమ శ్రేణికి చెందిన ఫలములు లభించును.

ఇప్పుడు మంత్రము వలన ఫలము సిద్ధించుటకై ఉపయోగించు మంత్ర ధ్యానమును చెప్పెదను. మంత్రము యొక్క స్థూల రూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రము యొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయమైనది. ఇదే దాని ఆంతర రూపము. ఇది కేవలము చింతనమునకు కూడ అతీతమైనది, మంత్రముయొక్క పరరూపము. వరాహ, నరసింహ, శక్తి మంత్రముల స్థూల రూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చింతనరహితమని చెప్పబడినది.

ఇతర దేవతల చింతామయమగు ఆంతరిక రూపమే సర్వదా ముఖ్యమైనదిగ పరిగణింప బడుచున్నది. విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయ స్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతా రహితము. బీజ మంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతి స్వరూపము, జీవాత్మకము, దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము, ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపము యొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహత రూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించు చుండును. అనేక రంధ్రములున్న కుంభములో ఉంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రములున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయ బీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మక దేహముతో ప్రకాశించును. నాడులు హృదయము నుండి బయల్వెడలి నేత్రేంద్రియము వరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని-సోమాత్మకములగు రెండు నాడులు నాసికాగ్ర భాగమునందుండును, మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీర వ్యాపియైయున్న ప్రాణ వాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై ఉన్నచో ఆతనికి మంత్ర ఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో, అణిమాది సిద్ధులను పొందును. వైరాగ్యవంతుడైనచో, ఆ సిద్ధులనుదాటి, చిన్మయ స్వరూపముతో ఉండి, భూత మాత్రల నుండియు, ఇంద్రియములు అనెడు గ్రహములనుండియు సర్వదా విముక్తుడగును. (30)