అగ్ని మహా పురాణము

Table of Contents

వాస్తు లక్షణ కథనము

అగ్నిదేవుడు పలికెను: ఇప్పుడు వాస్తు లక్షణములు చెప్పెదను. వాస్తుశాస్త్రము ప్రకారము, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు, వరుసగా శ్వేత, రక్త, పీత, కృష్ణ వర్ణములు గల భూమి నివాసయోగ్యము. ఘృతగందముగల భూమి విప్రులకును, రక్త గంధముకలది క్షత్రియులకును, అన్నగంధము గలది వైశ్యులకును, మద్యగంధము గలది శూద్రులకును నివాసయోగ్యము. ఇట్లే బ్రాహ్మణాదులకు వరుసగా మధుర, కషాయ, ఆమ్లాది రసములుగల భూమి మంచిది. నాలుగు వర్ణముల వారికిని వరుసగా కుశ, సర్పట, కాశ, దూర్వాయుక్త మగు భూమి మంచిది. ముందుగా బ్రాహ్మణ పూజచేసి శల్యరహితమగు భూమిపై కుండము ఏర్పరుపవలెను. పిదప అరువది పదములుగల వాస్తు మండపము నిర్మించి దాని మధ్య నున్న నాలుగుపదములపై బ్రహ్మను స్థాపించవలెను. ఈ నాలుగు పదములకు తూర్పున నున్న గృహస్వామి ఆర్యమ. దక్షిణమున వివస్వంతుని, పశ్చిమమున మిత్రుని, ఉత్తరమున మహీధరుని చిహ్నితము చేయవలెను. ఈశాన్యము ఆప-ఆపవత్సులను, ఆగ్నేయమున సావిత్ర, సవితలను, పశ్చిమమునకు దగ్గరగా ఉన్న నైరృతియందు జయ, ఇంద్రులను, వాయవ్యమున రుద్ర వ్యాధులను వ్రాయవలెను. పూర్వాది దిశలందు, విదిక్కు లందున్న దేవతలు కాక, ఈ క్రింది దేవతలను వ్రాయవలెను. పూర్వమున మహేంద్ర, రవి, సత్య, భృశాదులను, దక్షిణమున గృహక్షత, యమ, భృంగ, గంధర్వాదులను పశ్చిమమున పుష్పదంత, అసుర, వరుణ, పాపయక్ష్మాదులను, ఉత్తరమున భల్లాట, సోమ, అదితి, ధనదులను, ఈ శాన్యమున నాగ, కరగ్రహములను చిత్రించవలెను. ఒక్కొక్క దిక్కునకు ఎనమండుగురు దేవతలుందురు. వారిలో ప్రథమ, అష్టమ దేవతలు వాస్తు మండల గృహస్వాములు. పూర్వ దిక్కునకు ప్రథమదేవత పర్జన్యుడు, రెండవ వాడు కరగ్రహుడు మహేంద్ర, రవి, సత్య, భృశ, గగన, పవనులు ఇతర దేవతలు. కొందరు ఆగ్నేయమునందు గగన, పవనులకు బదులు అంతరిక్ష, అగ్నులను చెప్పుదురు. నైరృతియందు మృగ, సుగ్రీవులను, వాయవ్యమున రోగ, ముఖ్యులను, దక్షణమున పూషణ్, వితథ, గృహక్షత, యమ, భృంగ, గంధర్వ, మృగ, పితరులను స్థాపించవలెను. వాస్తుమండలము పశ్చిమమున దౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, అసుర, వరుణ, పాపయక్ష్మన్, శేషులు ఉందురు. ఉత్తరమున నాగరాజు, ముఖ్య, భల్లాట, సోమ, అదితి, కుబేర, నాగ, అగ్నులు ఉందురు. తూర్పున సూర్య, ఇంద్రులు శ్రేష్ఠులు. దక్షిణమున గృహక్షత, పుష్పమయులు ఉత్తములు. పశ్చిమమున సుగ్రీవుడు ఉత్తముడు. ఉత్తరద్వారమున పుష్పదంతుడు కల్యాణ ప్రదుడు. భల్లాటకునే పుష్పదంతుడందురు.

ఈ వాస్తు దేవతలనందరిని మంత్రములతో పూజించి పునాది రాయి వేయవలెను. పిదప ఈ క్రింది మంత్రములతో నందాది దేవులను పూజించవలెను. ‘వసిష్ఠనందినియైన ఓ నందా! నన్ను ధన, పుత్ర, పౌత్రాది మంతునిచేసి ఆనందింపచేయుము. భార్గవపుత్రియైన జయా! నీ సంతానమైన మాకు విజయము నిమ్ము. అంగిరస తనయయైన ఓ పూర్ణా! నీ కోరికలను పూర్ణము చేయుము. కశ్యపాత్మజయైన ఓ భద్రా! నాకు మంగళప్రదమగు బుద్ది నిమ్ము. వశిష్ఠ పుత్రియైన నందా! వివిధ బీజయుక్తము, సకలరత్న సంపన్నము అగు ఈ మనోహర నందనవనమున విహరింపుము. ప్రజాపతి పుత్రీ! భద్రా! నీవు ఉత్తమమైన లక్షణములు, శ్రీకృష్ణవ్రతము కలదానవు. ఓ కశ్యపనందినీ! నీవీ భూరూపమగు చతుష్కోణము నందు నివసింపుము. భార్గవతనయా! దేవీ! నీవు సకల ప్రపంచమునకును ఐశ్వర్యమిచ్చు దానవు. శ్రేష్ఠులైన ఆచార్యులచే పూజితురాలవై, గంధ మాల్యాలంకృతురాలవై నా గృహమునందు నివసింపుము. అంగిరః పుత్రియైన ఓ పూర్ణా! నీవు కూడ సర్వాంగ సంపన్నురాలవై, క్షతిరహితవైనా ఇంట విహరింపుము. ఓ ఇష్టకా! నేను గృహప్రతిష్ఠ చేయుచున్నాను. నాకు అభిలషిత భోగములను ఇమ్ము. దేవస్వామి, నగరస్వామి, గృహస్వాములకు మనుష్య, ధన, గజ, అశ్వ, పశ్వాదులను వృద్ధి పొందింపుము’. గృహప్రవేశ సమయమునందుగూడ ఈ విధముగనే శిలాన్యాసము చేయవలెను. ఇంటికి ఉత్తరమున రావిచెట్టు, దక్షిణమున ఉదుంబరము, పశ్చిమమున మఱ్ఱిచెట్టు మంచిది. ఇంటికి ఎడమప్రక్కన ఉద్యానము నిర్మింపవలెను. ఇట్టి ఇంటిలో నివాసము శుభకరము. పాతిన చెట్లకు, గ్రీష్మమునందు ప్రాతః సాయంకాలములందును, శీతాకాలమున మధ్యాహ్నమునందును, వర్షా కాలమున నేల ఎండిపోయినపుడును నీళ్లు పోయవలెను. చెట్లకు వాయువిడంగము, నెయ్యి కలిపిన చల్లని నీళ్లు పోయవలెను. కాయుట మానివేసిన చెట్లకు ఉలవలు, మినుములు, పెసలు, తిలలు, యవలు, కలిపిన నీళ్లు పోయవలెను, ఘృతము కలిపిన శీతలజలము పోసినచో వృక్షము సర్వదా పుష్పఫలములతో నిండియుండును. మత్స్యములు కలిపిన నీళ్లుపోసిన చెట్లు బాగుగా పెరుగును. మేకల, గొర్రెల, లద్దెల చూర్ణము, యవలపిండి, తిలలు, ఇతరమైన గోమయము మొదలగు ఎరువులు, నీరు వీటినన్నింటిని కలిపి ఐదురోజులు కప్పి ఉంచవలెను. ఇది పోసినచో అన్ని వృక్షములకును ఫలపుష్పములు అధికముగా వృద్ధి చెందును. మామిడిచెట్లకు శీతజల సేచనము చాల మంచిది. అశోకవృక్షములు వికసించుటకు కామినీ పాదప్రహారము మంచిది. ఖర్జూరము, కొబ్బరి మొదలగునవి ఉప్పుకలిపిన నీటిలో బాగుగా పెరుగును, వాయువిడంగము కలిపిన నీళ్లు అన్ని చెట్లకును మంచి దోహదము. (247)