అగ్ని మహా పురాణము
శ్రాద్ధకల్ప వర్ణనము
కాత్యాయన మహర్షి మునులకు చెప్పిన శ్రాద్ధ కల్పమును చెప్పెదను వినుడు. గయాది తీర్థములలో విశేషించి సంక్రాంత్యాది సమయములందు శ్రాద్ధము చేయవలెను, అపరాహ్ణ కాలమునందు, కృష్ణ పక్షమున, చతుర్థీ తిథియందుగాని శ్రాద్ధమునకు కావలసిన సామగ్రి సంపాదించుకొని ఉత్తమ నక్షత్రమునందు శ్రాద్ధము చేయవలెను. శ్రాద్ధ దివసమునకు ఒక దివసము ముందుగనే బ్రాహ్మణుల నిమంత్రణము చేయవలెను. అనింద్యులును స్వ స్వకర్మ నిరతులును, శిష్టులును, సదాచారవంతులును అగు సన్యాసులను గృహస్థులను సాధువులను వేదస్నాతకులను, లేదా శ్రోత్రియులను నిమంత్రించవలెను. బొల్లికల వారిని, కుష్ఠాదులు కలవారిని నియంత్రించరాదు. నియంత్రి తులగు బ్రాహ్మణులను స్నానాచమనాద్యనంతరము దేవకర్మకై పూర్వాభిముఖముగ కూర్చుండ బెట్టవలెను. దేవశ్రాద్ధ, పితృ శ్రాద్ధములందు ముగ్గురేసికాని, ఒక్కొక్కరు గాని బ్రాహ్మణులు ఉండ వలెను. మాతా మహాది శ్రాద్ధమునందు గూడ ఇట్లే. శ్రాద్ధకర్మ శాకాదులతో జరుపవలెను. శ్రాద్ధ దివసమున బ్రహ్మచర్య మవలంబించి క్రోధరహితుడుగా ఉండవలెను. ఆ రోజున చాల దూరము ప్రయాణము చేయకూడదు. స్వాధ్యాయాధ్యయనము చేయరాదు. ప్రతి ఒక్క కర్మ విషయమునను, పంక్తి పావనులగు బ్రాహ్మణులను అడుగుచుండవలెను. ఆసనములపై కుశలు పరచవలెను. పితృ కర్మలందు కుశలు రెండుగా మడచి వేయవలెను. మొదట దేవకర్మ చేసి పిదప పితృకర్మ చేయవలెను. దేవకర్మయందున్న బ్రాహ్మణులను ‘నేను విశ్వేదేవులను ఆవాహన చేసెదను’ అని అడుగగా వారు ‘ఆవాహన చేయుము’ అని అనుజ్ఞ ఇవ్వవలెను. పిదప ‘విశ్వేదేవాసః ఇత్యాది మంత్రముచే విశ్వేదేవతల ఆవాహన చేసి ఆసనముపై యవలు చల్లవలెను. ‘విశ్వేదేవాః శృణుతేమం’ ఇత్యాది మంత్రము జపించవలెను. పిదప ‘నేనిపుడు పితృ దేవతలను ఆవాహన చేసెదను’ అని కర్మనియుక్తులగు బ్రాహ్మణులను అడగవలెను. ‘ఆవాహన చేయుము’ అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిదప ‘ఉశన్తస్త్వా’ ఇత్యాది మంత్రము చదువుచు ఆవాహన చేయవలెను. తిలలు చల్లి ‘అయన్తః’ ఇత్యాది మంత్రము జపించుచు, పవిత్రకసహితమగు అర్ఘ్య పాత్రమునందు ‘శం నో దేవీ’ ఇత్యాది మంత్రముతో ఉదకము పోయవలెను. పిదప ‘యవోసి’ ఇత్యాది మంత్రముచే యవలు ఇవ్వవలెను. పితరుల విషయమున సర్వత్ర తిలలు ఉపయోగించవలెను. పితృదేవతల అర్ఘ్యపాత్రము నందు ‘శం నోదేవీ’ ఇత్యాది మంత్రముచే ఉదకము పోసి ‘తిలోసి సోమదేవత్యో గోసవే దేవ నిర్మితః ప్రత్నవద్భిః ప్రత్తః స్వధయా పితౄన్ లోకాన్ ప్రీణాహి స్వధానమః’ అను మంత్రము చదువుచు తిలలు వేయవలెను. పిదప ‘శ్రీశ్చ తే’ ఇత్యాది మంత్రముచే అర్ఘ్య పాత్రమునందు పుష్పములు ఉంచవలెను. అర్ఘ్యపాత్రము సువర్ణమయముగాని, రజతమయముగాని, ఉదుంబరమయము గాని, పత్ర నిర్మితము గాని కావలెను, దేవతలకు సవ్యముగను పితృదేవతలకు అపసవ్యముగను ఈ వస్తువులను ఉంచవలెను. ఒక్కొక్కరికి ఒక్కొక అర్ఘ్య పాత్రము వినియోగించుట మంచిది. పితృదేవతలకు చేతిలో ముందుగా పవిత్రము నుంచిన పిమ్మటనే అర్ఘ్యమీయవలెను.
పిదప ‘ఓం యా దివ్యా ఆపః ......... సుహనా భవన్తు’ అను మంత్రము చదువుచు ‘విశ్వేదేవా ఏవ నో హస్తార్ఘ్యః స్వాహా’ అని చెప్పి, విశ్వ దేవతలకు అర్ఘ్యమిచ్చి పాత్రలను దక్షిణ (కుడి) భాగమున ఉంచవలెను. పిత్రాదులకు కూడ స్వధా అని చివర చెప్పుచూ ఇదే విధముగ అర్ఘ్యము ఇవ్వవలెను. పితామహాదులకు కూడ ఇదే విధముగ ఇవ్వవలెను. అర్ఘ్యావశేషమును అంతను మొదటి పాత్రలో ఉంచవలెను. పాత్రలను మూడింటిని పిత్రాసన వామభాగమునందు ‘పితృభ్యః స్థానమసి’ అని చెప్పుచు బోర్లించవలెను. పిదప దేవతలను పితరులను గంధ, పుష్ప, ధూప, దీప, వస్త్రాదులతో పూజించవలెను. పిదప పాత్ర నుండి ఘృతయుక్తమగు అన్నము తీసి, ‘నే నీ అన్నమును అగ్నిలో హోమము చేసెదను’ అని బ్రాహ్మణులను అడిగి, ‘చేయుము’. అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట అగ్నిలో హోమము చేయవలెను. సాగ్నియైనవాడు పవిత్రయుక్తమగు పితృహస్తమునందు మంత్రముతో హోమము చేయవలెను. ‘అగ్నయే హవ్యవాహనాయ స్వాహా అని మొదటి ఆహుతి చేయవలెను’ రెండవది ‘సోమాయ పితృమతే స్వాహా’ అని చేయవలెను. యముని, అంగిరసుని ఉద్దేశించి ఆహుతి ఇవ్వవలెనని కొందరి మతము. హోమము చేయగా మిగిలిన అన్నము వరుసగ దేవతా-పితృపాత్రములందు వడ్డించి, పాత్రను హస్తముతో కప్పి ఓం పృథివీ తే పాత్రమ్ .......... జుహోమి స్వాహా’ అను మంత్రము జపించుచు, ‘ఇదం పిషుర్విచక్రమే’ ఇత్యాది మంత్రముతో బ్రాహ్మణుని అంగుష్ఠముతో ఆ అన్నమును స్పృశింపచేయవలెను. “అపహతా అసురా” ఇత్యాది మంత్రముతో పితృపాత్రమున తిలలు చల్లి సంకల్ప పూర్వకముగ అన్నము అర్పించవలెను. పిదప ‘జుషధ్వమ్’ (భుజింపుడు) అని చెప్పి, గాయత్ర్యాది మంత్రములను జపించవలెను. ‘దేవతాభ్యః .......... నమో నమః’. అను మంత్రమును గూడా జపించవలెను. పితృదేవతలు తృప్తిచెందిన విషయము తెలిసికొని, పాత్రము నందలి అన్నము చల్లవలెను. ఒక్కొక్కసారి అందరికిని జలము ఈయవలెను. సవ్యముగా నుండి గాయత్రీ మంత్రజపము చేసి, ‘మధువాతా’ ఇత్యాది ఋక్కును జపించి, మీరు తృప్తి చెందినారా?’ అని బ్రాహ్మణులను అడుగవలెను. మేము తృప్తులమైతిమి’ అని వారు సమాధానము చెప్పవలెను. బ్రాహ్మణుల అనుమతిచే శేషాన్నము కలిపి పిండము చేయుటకై పాత్రనుండి బైటకు తీసి, పితృచ్ఛిష్టాన్న సమీపమున అవనేజనము చేసి, కుశలపై సంకల్ప పూర్వకముగ పిండదానము చేయవలెను. బ్రాహ్మణులు చేతులు కడిగికొని ఆచమనము చేసిన పిమ్మట పిండ ప్రదానము చేయవలెనని కొందరి మతము.
ఆచమనానంతరము ఉదకము పుష్పములు, అక్షతలు సమర్పించవలెను. పిదప అక్షయ్యోదకము ఇచ్చి ఆశీర్వాదమును కోరుచు, ‘నా పితృదేవతలు సౌమ్యులుగా ఉందురు గాక’ అని పలికి ఉదకము వదలవలెను. ‘మా గోత్రము సర్వదా వృద్ధి పొందుగాక, వేదముల పఠన-పాఠన క్రమము అవిచ్ఛిన్నముగ కొనసాగుగాక! సంతానవృద్ధి అగు గాక. మాకు శ్రద్ధ లోపించకుండుగాక. దానము చేయుటకై మా వద్ద వివిధ వస్తు సామగ్రి ఉండుగాక, మావద్ద అన్నము కూడ అధికముగా నుండుగాక. మా ఇంటికి అతిథులు వచ్చుచుందురుగాక. యాచకులు యాచించుదురుగాక. మేము మాత్రము ఎవ్వరిని యాచించకుందుముగాక’ అని ప్రార్థించవలెను. స్వధావాచనము నిమిత్తము పిండములపై పవిత్రక సహితమగు కుశములు కప్పి నేను స్వధావాచనము చేయించెదను’ అని బ్రాహ్మణులను అడిగి, ‘స్వధావాచనము చేయుము’ అని వారి అనుజ్ఞపొంది ఈ విధముగా: “బ్రాహ్మణులారా! మీరు మా పితృ పితామహ ప్రపితామహుల కొరకై స్వధావాచనము చేయుడు’ అని చెప్పవలెను. అపుడు బ్రాహ్మణులు ‘అస్తు స్వధా’ అని అందురు. పిమ్మట కుశలపై దుగ్ధమిశ్ర జలమును దక్షిణాగ్ర ధారగా పోసి, అర్ఘ్యపాత్రను ఉత్తానము చేసి, దేవశ్రాద్ధ పితృ శ్రాద్ధ ప్రతిష్ఠార్థమై యథాశక్తిగ సువర్ణ రజత దక్షిణ ఈయవలెను. ‘విశ్వేదేవాః ప్రియనామ్’ అని చెప్పి దేవతావిసర్జన చేసి ‘వాజే వాజే’ ఇత్యాది మంత్రముచే పిత్రాదులను విసర్జించవలెను. ‘అమావాజస్య’ అను మంత్రము పఠించుచు బ్రాహ్మణులను అనుసరించి నడచి ప్రదక్షిణముచేసి ఇంటిలోనికి వెళ్ళవలెను. ప్రతి అమావాస్యయందును ఈ విధముగనే పార్వణ శ్రాద్ధము చేయవలెను.
ఇపుడు ఏకోద్దిష్ట శ్రాద్ధమును గూర్చి చెప్పెదను. ఈ శ్రాద్ధము కూడ వెనుకటివలెనే చేయవలెను. భేద మేమనగా దీనిలో ఒకే పవిత్రము, ఒకే అర్ఘము, ఒకే పిండము ఇవ్వవలెను. దీనిలో ఆవాహనము అగ్నౌకరణము, విశ్వేదేవపూజనము ఉండవు. తృప్తిని ప్రశ్నించినపుడు ‘స్వదితమ్’ అని ప్రశ్నించవలెను. బ్రాహ్మణుడు ‘సుస్వదితమ్’ అని ప్రత్యుత్తర మీయవలెను. ‘ఉపతిష్ఠతామ్’ అని చెప్పి అర్పణము చేయవలెను-అక్షయ్యోదకము కూడ ఇవ్వవలెను. విసర్జన సమయమున ‘అభిరమ్యతామ్’ అని పలుకవలెను. బ్రాహ్మణులు ‘అభిరతాః స్మః’ అని ప్రత్యుత్తర మీయవలెను. మిగిలినదంతయు వెనుకటివలెనే చేయవలెను. ఇపుడు సపిండీకరణమును గూర్చి చెప్పెదను. ఇది సంవత్సరాంతము నందును మధ్య యందును కూడ చేయవచ్చును. దీనిలో పితరులకొరకు మూడు పాత్రలను, ప్రేతకు వేరుగా ఒక పాత్రయు ఉంచవలెను, నాలుగు అర్ఘ్యపాత్రములందును పవిత్రము, తిలలు, పుష్పములు, చందనము, జలముతో నింపవలెను. వాటి నుండియే అర్ఘ్యము నిచ్చు చుండవలెను. ‘తే సమానాః’ ఇత్యాది మంత్రద్వయముతో ప్రేతార్ఘ్యపాత్రను క్రమముగా పితృపితామహ ప్రపితామహ పాత్రలతో కలపవలెను. ఈ విధముగనే పిండదానము, దానము మొదలగునవి గూడ చేసి, ప్రేత పిండమును పితరుల పిండములతో కలపవలెను. ఇట్లు చేయుటచే ప్రేతకు పితృత్వము ప్రాప్తించును.
ఇప్పుడు అభ్యుదయిక శ్రాద్ధమును గూర్చి చెప్పుచున్నాను. దీని విధి యంతయు వెనుకటి వలెనే. దీనియందు పితృ దేవతా మంత్రమును తప్ప ఇతర మంత్రముల జపము చేయవలెను. కోమల కుశలను ఉపయోగించవలెను. తిలలకు బదులు యవలు ఉపయోగించవలెను. పితరుల తృప్తిని గూర్చి బ్రాహ్మణులను ప్రశ్నించునపుడు ‘సంపన్నమ్’ అని ప్రశ్నించవలెను. వారు ‘సుసంపన్నమ్’ అని సమాధానము చెప్పవలెను దీనిలో పెరుగు, అక్షతలు, బదరీ ఫలములు మొదలగు వాటితో చేసిన పిండముల ప్రదానము చేయవలెను. ఆవాహన సమయమున ‘నేను నాందీముఖులను పేరుగల పితృదేవతలను ఆవాహన చేసెదను’ అని ప్రశ్నించవలెను. అక్షయ్యతృప్తి విషయమున ‘ప్రీయతామ్’ అనవలెను. ‘నేను నాందీముఖ పితృదేవతల తృప్తి వాచనము జేయించెదను’అని అడిగి, బ్రాహ్మణుల అనుజ్ఞగొని, నాన్దీముఖాః పితరః ప్రియన్తామ్’ అని చెప్పవలెను. పితృ, పితామహ, ప్రపితామహులు, మాతామహ, ప్రమాతామహ, వృద్ధ ప్రమాతామహులను నాందీముఖ పితృదేవతల అభ్యుదయిక శ్రాద్ధమునందు ‘స్వధా’ ఉపయోగింపరాదు. బ్రాహ్మణ ద్వయమునకు భోజనము పెట్టవలెను. ఇపుడు నేను పితృదేవతల తృప్తిని గూర్చి చెప్పెదను. గ్రామ్యాన్నము చేతను అరణ్యకందమూల, ఫలాదులచేతను ఒక మాసము తృప్తి కలుగును. మత్స్యములచే రెండు మాసములు, మృగ మాంసముచే ఆరు మాసములు, పక్షిమాంసముచే నాలుగు మాసములు, రురు మృగ మాంసముచే అయిదు మాసములు, మేక మాంసముచే ఆరు మాసములు, కూర్మమాంసముచే ఏడు మాసములు, వరాహ మాంసముచే ఎనిమిది మాసములు మేష మాంసముచే తొమ్మిది మాసములు, మహిష పర్వత మృగాల మాంసములచే పదిమాసములు, గోక్షీర-పాయసములచే సంవత్సరము తృప్తి కలుగును. వర్ద్రీనస మాంసముచే పండ్రెండు సంవత్సరముల పాటు తృప్తి కలుగును. ఖడ్గమృగ మాంసము, కాలశాకము, లోహితచ్ఛాగలము, మధువు మహాశల్కము వర్ష కాలమున మఘాశ్రాద్ధము ఇవి అక్షయ తృప్తిని ఇచ్చును.
మంత్రపాఠము చేయువాడు అగ్నిహోత్రి, శాఖాధ్యయనము చేయువాడు, షడంగ వేత్త, త్రిణాచికేతుడు, త్రిమధువు ధర్మ ద్రోణము పఠించునాడు, త్రిసువర్ణ బృహత్సామములు తెలిసినవాడు-ఇట్టి బ్రాహ్మణులు పంక్తిపావనులు. ఇప్పుడు కామ్య శ్రాద్ధకల్పమును గూర్చి చెప్పెదను. ప్రతిపత్తునందు శ్రాద్ధము చేయుటచే అధికముగ ధనము లభించును. ద్వితీయయందు శ్రేష్ఠ స్త్రీ, చతుర్థియందు ధర్మ కామములు, పంచమినాడు పుత్రుడు, షష్ఠియందు శ్రేష్ఠత్వము, సప్తమినాడు వ్యవసాయములో లాభము, అష్టమినాడు ధనము, నవమినాడు గుఱ్ఱములు మొదలగు ఒక డెక్కగల మృగములు, దశమినాడు గోసముదాయము, ఏకాదశినాడు పరివారము, ద్వాదశినాడు ధనధాన్యవృద్ధి, త్రయోదశినాడు స్వీయజాతి శ్రేష్ఠత్వము లభించును. చతుర్దశియందు శస్త్రహతులకు మాత్రమే శ్రాద్ధము పెట్టవచ్చును. దశార్ణ దేశము నందుండెడు ఏడుగురు వ్యాధులు, కాలంజరగిరిపై మృగములుగాను, శరద్వీపమునందు చక్రవాకములుగాను, మానస సరోవరమునందు, హంసలుగాను అయిరి. వారే ఇపుడు కురుక్షేత్రమునందు వేదపారంగతులైన బ్రాహ్మణులైరి. వారు చాలా దూరము దాటివేసినారు. మీరు వారికంటె చాల వెనుకబడి కష్టపడుచున్నారు. శ్రాద్ధసమయమున దీనిని చదువుటచే శ్రాద్ధము పరిపూర్ణమై బ్రహ్మలోకము నిచ్చును. పితామహుడు జీవించి యున్నచో పుత్రాదులు తమ తండ్రికిని, పితామహుని తండ్రికిని, ఆతని తండ్రికిని శ్రాద్ధము పెట్టవలెను. ప్రపితామహుడు జీవించియున్నచో పితృ, పితా మహ, వృద్ధ ప్రపితామహులకు శ్రాద్ధము పెట్టవలెను. మాతృ, మాతామహాది శ్రాద్ధము విషయమునందు గూడ ఇట్లే చేయవలెను. ఈ శ్రాద్ధ కల్పమును పఠించువానికి, శ్రాద్ధ ఫలము లభించును. ఉత్తమ తీర్థములందును, యుగాది, మన్వాది తిథులందును చేసిన శ్రాద్ధము అక్షయము. అశ్విన శుక్ల నవమి, కార్తిక ద్వాదశి, మాఘ, భాద్రపద తృతీయలు, ఫాల్గున అమావాస్య, పౌషశుక్లైకాదశి, ఆషాఢ దశమి, మాఘ సప్తమి, శ్రావణ కృష్ణ అష్టమి, ఆషాఢ, కార్తిక, ఫాల్గున, జ్యేష్ఠ పూర్ణిమలు ఈ తిథులు స్వాయంభువాది మనువులకు సంబంధించినవి. వీటి ఆది భాగమునందు చేసిన శ్రాద్ధము అక్షయమగును. గయా, ప్రయాగ, గంగా, కురుక్షేత్ర, నర్మదా, శ్రీపర్వత, ప్రభాస, శాలగ్రామ తీర్థ, కాశీ, గోదావరీ, శ్రీపురుషోత్తమ క్షేత్రాదులలో చేసిన శ్రాద్ధము ఉత్తమము. (117)
