అగ్ని మహా పురాణము

Table of Contents

ధనుర్వేద వర్ణనము -3

అగ్నిదేవుడు పలికెను:

వశిష్ఠా! హస్తమును, మనస్సును, దృష్టిని జయించిన లక్ష్య సాధకుడు తప్పక సిద్ధిని పొంది యుద్ధము కొరకై వాహనారూఢుడు కావలెను. పాశము పది హస్తముల పొడవై, గోలాకారమై చేతికి సుఖప్రదముగ నుండవలెను. దీనికొరకై మంచి ముంజగడ్డి గాని, హరిణముల ప్రేగులు గాని, అర్కవల్కల రజ్జువుగాని ఏర్పరచుకొనవలెను. ఇతర దృఢ సూత్రములతో గూడ సుందరమగు పాశము ఏర్పరుపవచ్చును. ఆ సూత్రములను చాల ఆవృత్తులు చుట్టి బాగుగా పేనవలెను. ముప్పది ఆవృత్తులు చేసి పేనిన త్రాడుతో పాశము నిర్మింపవలెను. పాశమును ఎడమ చేతిలో ఉంచుకొని కుడి చేతితో విప్పవలెను. దానిని కుండలాకారముచేసి అన్నివైపుల త్రిప్పి, శత్రువు శిరస్సుపై విసరవలెను. ముందుగ తృణచర్మాది నిర్మితమగు పురుషమూర్తిపై ప్రయోగించి పిదప గంతులు వేయుచున్న మనుష్యులపై ప్రయోగించి, సాఫల్యము లభించిన పిమ్మటనే పాశప్రయోగము చేయవలెను. సుశిక్షితుడగు యోధుడు పాశముతో యథోచితముగ జయించిన పిమ్మటనే శత్రువు విషయమున పాశబంధన క్రియ చేయవలెను.

ఒరతో కూడిన ఖడ్గమును నడుమునందు కట్టి దానిని ఎడమవైపు వ్రేలాడదీయ వలెను. దాని ఒరను ఎడమచేతితో గట్టిగ పట్టుకొని కుడిచేతితో ఖడ్గమును వెలుపలకు తీయవలెను. ఆ ఖడ్గము వెడల్పు ఆరుఅంగుళములు, పొడవు ఏడు హస్తములు ఉండవలెను. అనేకములైన లోహమయ శలాకలను కవచములను తన సగము హస్తమునందుగాని ధరించవలెను. ప్రక్కలందును, పైనను, క్రిందను, శరీరరక్షకొరకై ఈ వస్తువుల నన్నింటిని యథాశాస్త్రముగ ధరించవలెను. యుద్ధము నందు విజయము సంపాదించుటకై ఎట్టి ఏర్పాట్లు చేయవలెనో చెప్పెదను; వినుము. తూణీరము యొక్క చర్మము చుట్టిన ఒక క్రొత్త దృఢమైన కఱ్ఱను తన దగ్గర ఉంచుకొనవలెను. దానిని కుడిచేతి వ్రేళ్ళతో పైకి ఎత్తి ఎవని నెత్తిపై గట్టిగా కొట్టునో ఆ శత్రువు తప్పక మరణించును. ఈ పనిలో సిద్ధి లభించిన పిమ్మట రెండు హస్తములతో ఆ కర్రతో శత్రువు తలపై కొట్టవలెను. దీనితో అనాయాసముగ వానిని చంపగల్గును. ఈ విధముగ యుద్ధమునందు సిద్ధి ఎట్లుకలుగునో చెప్పబడినది. యుద్ధభూమియందు చక్కగా సంచరించుటకై తనవాహనములచే శ్రమ చేయించు చుండ వలెనను విషయము ముందుగనే చెప్పియున్నాను. (251)