అగ్ని మహా పురాణము

Table of Contents

సామవిధానము

పుష్కరుడు చెప్పెను:

యజుర్విధానము చెప్పితిని. ఇపుడు సామ విధానమును చెప్పెదను. వైష్ణవీ సంహిత జపించి దశాంశహోమము చేసినవాడు సమస్త కామములను పొందును. చాంధసీ సంహితను యథావిధిగా జపించిన వానిని శంకరుడు అనుగ్రహించును. స్కంద సహితను జపించుటచే ప్రసన్నత లభించును. ‘యత ఇంద్ర భజామహే’ (13-21) ఈ మంత్రమును జపించుటచే హింసా దోషము నశించును. ‘అగ్నిస్తిగ్మేన’ (22) అను మంత్రమును జపించు అవకీర్ణి పాపవిముక్తుడగును. ‘పరితోసించ తాసుతం’ (512) అను సామ మంత్రము సమస్త పాప వినాశకము. పొరపాటుచే నిషిద్ధ వస్తువులను విక్రయించినవాడు ‘కృతవతీ భువనా’ ఇత్యాది మంత్రములను జపించవలెను. ‘అద్యానో దేవ సవితః’ (141) అను మంత్రము దుఃస్వప్న నాశకము. పరశురామా! ‘అబోద్యగ్నిః’ (1746) అను మంత్రముచే ఘృత హోమముచేసి మిగిలిన ఘృతముతో మేఖల బంధమును తడిపి దానిని గర్భస్రావముతో బాధపడుతున్న స్త్రీలకు కట్టవలెను. పుట్టిన పిల్ల వానికి పై మంత్రము అభిమంత్రించి మణి కట్టవలెను. సోమంరాజానం (91) అను మంత్రమును జపించుటచే రోగి వ్యాధి విముక్తుడగును. సర్పసామ ప్రయోగము చేయువానికి సర్ప భయముండదు. ‘మా పాపత్వా యనో” (918) అను మంత్రము నూరు హోమములుచేసి శతావరీయుక్త మగు మణిని కట్టినచో శతృభయముండదు. ‘దీర్ఘతమసోఽర్క’ అను మంత్రముతో హోమము చేసినచో అధిక అన్నము లభించును. ‘సమన్వాయంతః’ (607) అను మంత్రమును జపించువాడు దప్పికతో మరణించడు. ‘త్వమిమాఓషధీః (604) అను మంత్రమును జపించువాడు ఎన్నడును వ్యాధిగ్రస్తుడు కాడు. దేవ వ్రతసామను మార్గమునందు జపించు వాడు భయ విముక్తుడగును. ‘యదిందోఽనునయత్’ (148) అను మంత్రముతో హోమము చేసిన సౌభాగ్య వృత్తి కలుగును. ఓ పరశురామా! ‘భగోనచితో (449) అను మంత్రమును జపించి కండ్లకు కాటుక పెట్టినచో అది హితకరము సౌభాగ్య వర్ధకము అగును. సందేహము లేదు. ఇంద్ర శబ్దముతో ప్రారంభమగు మంత్ర వర్గమును జపించిన సౌభాగ్య వృద్ధి కలుగును. ‘పరి ప్రియాదివః కవిః’ అను మంత్రమును తాను పొందగోరిన స్త్రీకి వినిపించినచో ఆమె ఆతనిపై అనురక్తురాలగును. సందేహము లేదు, రథంతర సామ వామ దేవ్య సామములు బ్రహ్మ వర్చస్సును వృద్ధి పొందించును.

‘ఇంద్రమిద్గాథినో (198) అను మంత్రము జపించి ఘృతమిశ్రితమగు వచా చూర్ణమును ప్రతిదినము బాలునికి తినిపించినచో అతడు శృతిధరుడు (ఒక్కమాటు వినగనే జ్ఞాపకముంచు కొనువాడు) అగును. రథంతరసామను జపించి దానితో హోమము చేసినచో నిస్సంశయముగ పుత్రుడు లభించును. “మయిశ్రీః’ (602) అను లక్ష్మీవర్ధకమగు మంత్రమును జపించవలెను. వైరూప్యాష్టకమును ప్రతిదినము పఠించువానికి లక్ష్మి లభించును. సప్తాష్టకమును ప్రయోగించువానికి సమస్త కాలములు లభించును. ప్రతి దినము ప్రాతః సాయంకాలములందు ఆలస్యము లేనివాడై “గవ్యేషునోయధా” (186) అను మంత్రముతో గోవు ఉపస్థానము చేయువాని ఇంటిలో సర్వదా గోవులుండును. ‘వాత ఆవాతు భేషజం’ (184) అను మంత్రముతో నేతితో కలిపిన ఒక ద్రోణము యవలను యథావిధిగా హోమము చేసినవాడు సమస్త మాయను తొలగించును. ‘పదైవో దాసో’ (51) అను మంత్రముతో తిలహోమము చేయుటచే అభిచారకర్మ తొలగును. ‘అభిత్వా శూరనో నమో’ (232) అను సామకు అంతమున వషట్ కారముచేర్చి ఆవనూనెతో తడిపిన సమిధలను కోపముతో హోమముచేసినచో యుద్ధమునందు జయము లభించును. గారుడ మంత్రము వామదేవ్య మంత్రము రథంతర బృహద్రస మంత్రములు నిస్సంశయముగ సర్వపాప వినాశకములు. విద్వాంసుడు సుందరమైన పిష్టమయములగు గజములను అశ్వములను మనుష్యులను నిర్మించి శత్రు పక్షము నందలి ప్రధాన వీరులను లక్ష్యముగ నిలిపి తడిసిన ఆ పిష్టమయ పురుషులను ముక్కముక్కలుగా చేసి వాటిని ఆవనూనెలో తడిపి క్రోధ పూర్వకముగ ‘అభిత్వా శూరనో నమో’ (233) అను మంత్రముతో హోమము చేసిన యెడల యుద్ధము నందు విజయము లభించును. (261)