అగ్ని మహా పురాణము
మాలినీమంత్ర న్యాసము
పరమేశ్వరుడు పలికెను:
ఇప్పుడు షడ్విధ న్యాస పూర్వకములగు నానావిధ మంత్రములను గూర్చి చెప్పెదను. ఈ షడ్విధ న్యాసములు శాంభవ, శాక్త, యామలములు అని మూడేసి విధములు. శాంభవ న్యాసము నందు షట్ షోడశ గ్రంథి రూపమగు శబ్దరాశి ప్రధానము. మూడు విద్యలు-వాటి గ్రహములు ద్వితీయ న్యాసము. త్రితత్త్వాత్మక న్యాసము మూడవది. వనమాలా న్యాసము నాల్గవది. ఇది పండ్రెండు శ్లోకములలో నున్నది. రత్నపంచక న్యాసము ఐదవది. నవాక్షర మంత్ర న్యాసము ఆరవది. శాక్తపక్షమున మాలినీ న్యాసము మొదటిది. త్రివిద్యా న్యాసము రెండవది. అఘోర్యష్టక న్యాసము మూడవది. ద్వాదశాంగ న్యాసము నాల్గవది. షడంగ న్యాసము ఐదవది. అస్త్రచండిక అను శక్తిన్యాసము ఆరవది. ‘క్లీం (క్రీం) హ్రీం క్లీం శ్రీం క్రూం ఫట్’ అను ఆరు బీజమంత్రముల షడ్విధ న్యాసమే ‘యామల’ న్యాసము. ఈ ఆరింటిలో ‘శ్రీం’ బీజ న్యాసము సకల మనోరథ సిద్ధి ప్రదము. ‘న’ మొదలు ‘ఫ’ వరకు చేయు న్యాసము మాలినీన్యాసము. ‘న’తో ప్రారంభించు లేదా నాదమును చేయు శక్తిని శిఖపై న్యాసము చేయవలెను. ‘అ’ గ్రసనీశక్తి, ‘శ’ శిరోమాలానివృత్తి శక్తి; ఈ రెండింటి స్థానము శిరస్సు. శాంతిప్రతీకమగు ‘ట’ న్యాసము కూడ శిరస్సుపై చేయవలెను. చాముండా ప్రతీకయైన ‘చ’ న్యాసము నేత్రత్రయముపై చేయవలెను. ప్రియ దృష్టి స్వరూపమగు ‘ఢ’ను నేత్రద్వయమందును, గుహ్యశక్తి ప్రతీకయైన ‘నీ’ని నాసికా ద్వయమందును, నారాయణీ రూపమగు ‘న’ను కర్ణ ద్వయమునందును, మోహినీరూపమగు ‘త’ను కుడి చెవియందును, ప్రజ్ఞాప్రతీకమగు ‘జ’ను ఎడమ చెవియందును, వజ్రిణీదేవిని ముఖము నందును, కరాళీ శక్తి ప్రతీకమైన ‘క’ను కుడి కోరయందును, కపాలినీ రూపమగు ‘ఖ’ను ఎడమ భుజముపైనను, శివప్రతీకమైన ‘గ’ను ఎడమ కోరయందును, ఘోరాశక్తి ప్రతీకమగు ‘ఘ’ను ఎడమకోరయందును, శిఖాశక్తి సూచకమగు ‘ఉ’ను దంతములందును, మాయాప్రతీకమగు ‘ఈ’ని జిహ్వపైనను, నాగేశ్వరీరూపమగు ‘ఆ’ను వాగింద్రియము పైనను, శిఖివాహినీ రూపముగల ‘వ’ను కంఠము నందును న్యాసము చేయవలెను.
‘భ’తో భీషణీ శక్తిని కుడి స్కంధమునందు, ‘మ’తో వాయువేగను ఎడమ స్కంధము నందు, ‘డ’తో వామాశక్తిని కుడి భుజమునందు, ‘ఢ’తో వినాయకాదేవిని ఎడమ భుజమునందు, ‘ప’ పూర్ణిమశక్తులను రెండుహస్తములందు; ప్రణవసహిత ఓంకారశక్తిని కుడిచేతి వ్రేళ్ళయందు, ‘అం’ సహిత దర్శనీ శక్తిని ఎడమ చేతివ్రేళ్లయందు, ‘అః’ సంజీవనీ శక్తులను హస్తమునందు, ‘ట’ కపాలినీ శక్తులను కపాలమునందు, ‘త’ సహిత దీపనీ శక్తిని శూలదండము నందు, జయన్తీ శక్తిని త్రిశూలమునందు, ‘య’ సహిత సాధనీదేవిని వృద్ధి యందును న్యాసము చేయవలెను. ‘శ’ పరమాఖ్యా దేవులను జీవునియందు, ‘హ’ అంబికా దేవులను ప్రాణమునందు, ‘ఛ’ సహిత శరీరాదేవిని దక్షిణస్తనమునందు, ‘నీ’ సహిత పూతనను వామస్తనమునందు, ‘ఆ’ సహిత ఆమోటిని స్తనదుగ్ధమునందు, ‘థ’ సహితలంబోదరిని ఉదరమునందు, ‘క్ష’ సహిత సంహారికను నాభియందు, ‘మ’ సహిత మహాకాళిని నితంబము నందు, ‘స’ సహిత కుసుమమాలాదేవిని గుహ్య దేశమునందు, ‘ష’ సహిత శుక్రదేవికను శుక్రమునందు, ‘త’ సహిత తారాదేవిని ఊరు ద్వయమునందు, ‘ద’ సహిత ‘జ్ఞానా’ శక్తిని కుడి మోకాలునందు, ‘జౌ’ సహిత క్రియాశక్తిని ఎడమ మోకాలియందు, ‘ఓ’ సహిత గాయత్రీదేవిని కుడి పిక్కయందు, ‘ఓం’ సహిత సావిత్రిని ఎడమ పిక్కయందు, ‘ద’ సహిత దోహినిని కుడి పాదమునందు, ‘ఫ’ సహిత ఫేత్కారిని ఎడమ పాదమునందు న్యాసము చేయవలెను. మాలినీ మంత్రములో తొమ్మిది అక్షరము లుండును. ‘అ’ సహిత శ్రీకంఠుని శిఖయందు, ‘ఆ’ సహిత అనంతుని ముఖమునందు ‘హ’ సహిత సూక్ష్మమును కుడి కంటియందును, ‘ఈ’ సహిత త్రిమూర్తులను ఎడమ కంటియందును, ‘ఉ’ సహిత అమరీశుని దక్షిణ కర్ణమునందును, ‘ఊ’ సహిత అర్ధాం శకమును వామకర్ణమునందును, ‘ఋ’ సహిత భావభూతిని దక్షిణ నాసాగ్రము సందును, ‘ఋ’ సహిత తిథీశుని వామ నాసాగ్రము నందును, ‘ ఌ’ సహిత స్థాణువును దక్షిణ కపోలము నందును, ౡ సహిత హరుని వామకపోలమునందును న్యాసము చేయవలెను.
‘ఏ’ సహిత కటేశుని క్రింది దంతపంక్తి యందును, ‘ఐ’ భూతీశులను పై దంత పంక్తియందును, ‘ఓ’ సద్యో జాతులను క్రింది ఓష్ఠమునందును, ‘ఔ’ అనుగ్రహీశులను పై ఓష్ఠమునందును, ‘అం’ క్రూరులను కంఠబిలమునందును, ‘అః’ మహాసేనులను జిహ్వయందును, ‘క’ క్రోధీశులను దక్షిణ స్కంధమునందును, ‘ఖ’ చండీశులను బాహువులందును, ‘గ’ పంచాతకులను మోచేతియందును, ‘ఘ’ శిఖులను దక్షిణ కంకణము నందును, ‘ఙ’ ఏకపాదులను వామాంగుళుల యందును, ‘చ’ కూర్మకులను వామ స్కంధము నందును న్యాసము చేయవలెను
‘ఛ’ ఏకనేత్రులను బాహువులందు, ‘జ’ చతుర్ముఖులను మోచేతి యందును, ఝ’ రాజసులను వామకంకణమునందును, ‘ఞ’ సర్వకామాదులను వామాంగుళులందును, ‘ట’ సోమేశ్వరులను నితంబమునందును, ‘ఠ’లాంగలులను కుడి తొడయందును, ‘డ దారుకులను, ఎడమ మోకాలు నందును, ‘ఢ’ అర్ధజనేశ్వరులను కుడి పిక్క యందును ‘ణ’ ఉమాకాంతులను, దక్షిణ పాదాంగుళు లందును, ‘త’ ఆషాఢులను నితంబమునందును ‘థ’ దండులను ఎడమ తొడయందును, ‘ద’ భిదులను ఎడమ మోకాలియందును, ‘ధ’ మీనములను ఎడమ పిక్కలయందును, ‘న’ మేషములను వామ పాదాంగుళులందును, ‘ప’ లోహితులను దక్షిణ కుక్షియందును, ‘ఫ’ శిఖులను వామ కుక్షియందును, ‘బ’ గలండులను పృష్ఠవంశమునందును, ‘భ’ ద్విరండులను నాభి అందును, ‘మ’ మహా కాలులను, హృదయమునందును, ‘య’ వాణీశులను, త్వక్కునందును, ‘ర’ భుజంగేశులను రక్తమునందును, ‘ల’ పినాకులను మాంసమునందును, ‘వ’ ఖడ్గీశులను శరీరము నందును, ‘శ’ బకులను ఎముకలందును, ‘ష’ శ్వేతులను మజ్జ యందును, ‘స’ సహిత భృగువును, శుక్ర-ధాతువునందును, ‘హ’ నకులీశులను ప్రాణమునందును, ‘క్ష’ సంవర్తకులను పంచకోశములందును న్యాసము చేయవలెను. ‘హ్రీం’ బీజముతో రుద్ర శక్తులను పూజించిన వాడు సకల మనోరథములను పొందును. (145)
