అగ్ని మహా పురాణము

Table of Contents

పుష్పాధ్యాయ కథనము

అగ్ని దేవుడు పలికెను:

శ్రీమహావిష్ణువు పుష్ప, గంధ, ధూప, దీప, నైవేద్యముల సమర్పణచే ప్రసన్నుడగును. శ్రీమహా విష్ణువునకు సమర్పింప యోగ్యములు, అయోగ్యములు అయిన పుష్పములను గూర్చి చెప్పెదను. మాలతీపుష్పము పూజకు అత్యుత్తమము. తమాల పుష్పము భోగ మోక్ష ప్రదము. మల్లికాపుష్పము సమస్త పాపనాశకము. యూథిక విష్ణులోకమును ఇచ్చును. అతిముక్త కలోద్ర పుష్పములు విష్ణులోక ప్రాప్తి హేతువులు. కరవీర పుష్పములతో పూజించు వాడు విష్ణు లోకమును చేరును. జపాపుష్పములు పుణ్యప్రదములు. పావన్తీ, కుబ్జక, తగర పుష్పములు విష్ణు లోకమును ఇచ్చును. కర్ణికార పుష్పపూజ చేయువాడు వైకుంఠము చేరును. కురంట పుష్పపూజ పాప వినాశకము. కమల, కుంద, కేతకీ పుష్పములు పరమగతిని ఇచ్చును. బాణపుష్ప, కృష్ణ తులసీ పత్రములతో పూజచేయువాడు విష్ణు లోకమును పొందును. అశోక, తిలక, అటరూప పుష్పములచే పూజించువాడు మోక్షాధికారియగును. బిల్వ శమీ పత్రములచే పరమగతి సులభము. తమాల దలములతోను, భృంగ రాజము తోను పూజచేయువాడు విష్ణులోక నివాసి అగును. కృష్ణ తులసీ, శుక్ల తులసి, కల్హార, ఉత్పల, పద్మ, కోకనద పుష్పములు పుణ్యప్రదములు. నూరు కమలముల మాల సమర్పించినచో శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. నీప, అర్జున, కదంబ, కింశుక, అగస్త్య, గోకర్ణ, నాగకర్ణ, సంధ్యాపుష్పీ, బిల్వాతక, రంజనీ, కేతకీ, కూష్మాండ, గ్రామకర్కటీ, కుశ, కాశ, ద్యూత, విభీతక, మరువరాది పత్రములతోను, ఇతరమైన సుగంధి పత్రములతోను పూజచేసినచో శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. వీటితో పూజించినవాడు పాప విముక్తుడై భుక్తిముక్తులను పొందును. లక్ష స్వర్ణములకంటె గూడ కోట్ల రెట్లు పుష్పములు ఉత్తమములు. తన ఉద్యానవనమునుండియు, ఇతరుల ఉద్యానముల నుండియు తెచ్చిన పుష్పముల కంటె వన్య పుష్పములకు మూడు రెట్లు ఫలము అధికమని చెప్పబడినది.

రాలిన పూవులతోను, అధికమైన అవయవములు గలవాటితోను, నలిగిపోయిన వాటితోను శ్రీమహావిష్ణువును పూజించరాదు. కాంచనార, ఉన్మత్త (ఉమ్మెత్త), గిరికర్ణికా (కొండగన్నేరు), కుటజ, శాల్మలి, శిరీష (దిరిసెన) పుష్పములతో విష్ణువును పూజించరాదు. వీటితో శ్రీమహావిష్ణువును పూజించువాడు నరకము చెందును. సుగంధముగల రక్త కమలముతోను, నీల కమలములతోను శ్రీమహావిష్ణువును పూజించవలెను. అర్క, మందార, ధుస్తూర కుసుమములతో శివుని పూజించవలెను. కాని కుటజ, కర్కటీ, కేతకీ (మొదలి) పుష్పములతో శివుని పూజింపగూడదు. కూష్మాండ (గుమ్మడి), నింబ (వేప) పుష్పములును, గంధ హీనములగు ఇతర పుష్పములును పైశాచములని చెప్పబడుచున్నవి. అహింస, ఇంద్రియ జయము, ఓర్పు, జ్ఞానము, దయ, స్వాధ్యాయము మొదలగు ఎనిమిది భావ పుష్పములచే దేవతలను పూజించు మానవుడు భుక్తి ముక్తి పాత్రుడగును. వీటిలో అహింస మొదటి పుష్పము. ఇంద్రియ నిగ్రహము రెండవది. సకల ప్రాణులపై దయ మూడవ పుష్పము. ఓర్పు నాల్గవదగు శ్రేష్ట పుష్పము. ఈ విధముగ శమ, తపో, ధ్యానములు పంచమ, షష్ఠ, సప్తమ పుష్పములు. సత్యము ఎనిమిదవ పుష్పము. వీటితో పూజించినచో భగవంతుడు ప్రసన్నుడగును. నరశ్రేష్ఠా! ఇతర పుష్పములు పూజకు బాహ్యాపకరణములు మాత్రమే. శ్రీమహావిష్ణువు భక్తి దయా సమన్వితములగు భావ పుష్పములతో పూజించినచో సంతుష్టుడగును. జలము వారుణ పుష్పము. ఘృత, దుగ్ధ, దధులు సౌమ్య పుష్పములు. అన్నాదులు ప్రాజాపత్య పుష్పములు. ధూప దీపములు ఆగ్నేయ పుష్పములు. ఫల పుష్పాదులు వానస్పత్య పుష్పములు. శ్రద్ధాది భావములు వైష్ణవ కుసుమములు. ఈ అష్టవిధ కుసుమములు సర్వ కామప్రదములు. ఆసనము (యోగ పీఠము) పంచాంగన్యాసము, అష్ట పుష్పములు ఇవి విష్ణు రూపములు. ఈ అష్ఠ పుష్పములచే పూజితుడై శ్రీమహావిష్ణువు ప్రసన్నుడగును. ఇవికాక వాసుదేవాది నామములతో శ్రీమహావిష్ణువును, ఈశానాది నామ పుష్పములతో శివుని పూజించవలెను. (202)