అగ్ని మహా పురాణము
ప్రాసాద లక్షణము
పరమేశ్వరుడు పలికెను: మయూరధ్వజా! ఇప్పుడు ప్రాసాద సామాన్య లక్షణము చెప్పెదను. చతురస్ర క్షేత్రమును నాలుగు భాగములు చేయగా, గోడల విస్తారము ఒక భాగముండవలెను. మధ్య భాగము గర్భము. ఒక భాగమున పిండిక ఉండవలెను. ఐదు భాగముల క్షేత్రము లోపలి భాగమున పిండిక ఉండవలెను. ఒక భాగము విస్తారము ఖాళీగా ఉండవలెను. ఒక భాగము విస్తారము గోడలకొరకు ఉపయోగించవలెను. మధ్యమ గర్భము నందు రెండు భాగములు, జ్యేష్ఠ గర్భము నందుకూడ రెండు భాగములు ఉండ వలెను. కాని మూడు భాగములలో కనిష్ఠ గర్భము, మిగిలిన ఎనిమిదవ భాగము గోడలు అను పద్ధతి కూడ ఉన్నది. క్షేత్రమును ఆరు భాగములుగ విభజించినపుడు ఒక భాగము విస్తారము గర్భము కొరకును, రెండు భాగములు పిండిక కొరకును వినియోగింపబడును. గోడల ఎత్తు వెడల్పుకంటె రెట్టింపుగాని, రెండును పావును అధికముగాని, రెండున్నర రెట్లుగాని, మూడు రెట్లుగాని ఉండు పద్ధతి కూడ కనబడుచున్నది. కొన్ని చోట్ల ప్రాసాదము చుట్టు గోడల సగము లేదా మూడు వంతుల వైశాల్యముగల జగతి నాల్గవవంతు విస్తారము గల నేమి కానవచ్చుచున్నది. మధ్యయందు మూడవవంతు పరిది, ఉండును. అచట రథము నిర్మించి దానిపై చాముండభైరవుని, నాట్యేశుని స్థాపించవలెను. ప్రాసాదము సగము విస్తారములో నాల్గువైపులందును, వెలుపల, దేవతల కొరకై, ఎనిమిది లేదా నాలుగు పరిశ్రమలు ఏర్పరుపవలెను. ప్రాసాదాదులందు వీటి నిర్మాణము ఇచ్ఛాధీనము.
పూర్వదిక్కునందు ఆదిత్యులను, వాయవ్యమున స్కంద-అగ్నులను, యమాది దేవతలను వారివారి దిక్కులందును స్థాపించవలెను. శిఖరమును నాలుగు భాగములు చేయగా క్రింది రెండు భాగములకు ‘శుకనాసిక’ అని పేరు. మూడవ భాగము వేది ప్రతిష్ఠ. దాని ముందు భాగము ‘అమలసారము’ అని ప్రసిద్ధమైన కంఠము. మేరు శిఖరముపై వైరాజము, పుష్పకము, కైలాసము, మణికము, త్రివిష్టపము అను ఐదు ప్రాసాదములు మాత్రమే ఉన్నవి. వీటిలో మొదటిదైన వైరాజము చతురస్రము. పుష్పకము చతురస్రాయుతము. కైలాసము వృత్తాకారము. మణికము వృత్తాయతము. త్రివిష్టపము అష్ట కోణాకారము. వీటిలో ఒక్కొక్కదానికి తొమ్మిదేసి భేదములుండుటచే మొత్తము నలుబదియైదు భేదములగును.
మేరువు, మందరము, విమానము, భద్రము, సర్వతోభద్రము, రుచకము, నందకము, వర్ధమానము, నంది, శ్రీవత్సము అను తొమ్మిది ప్రాసాదములు వైరాజ కులమునకు సంబంధించినవి. వలభి, గృహరాజము, శాలాగృహము, మందిరము, విశాల చమనము, బ్రహ్మమందిరము, భువనము, ప్రభవము, శివికావేశ్మ అను తొమ్మిది ప్రాసాదములు పుష్పక కులమునకు సంబంధించినవి. వలయము, దుందుభి, పద్మము, మహా పద్మము, వర్ధని, ఉష్ణీషము, శంఖము, కలశము, ఖవృక్షము అను తొమ్మిది వృత్తాకార ప్రాసాదములు కైలాసకులమునందు ఉత్పన్నమైనవి. గజము, వృషభము, హంసము, గరుత్మంతము, ఋక్షనాయకము, భూషణము, భూధరము, శ్రీజయము, పృథ్వీధరము అను తొమ్మిది వృత్తాయత ప్రాసాదములు ‘మణిక’ము నుండి ఆవిర్భవించినవి. వజ్రము, చక్రము, స్వస్తికము, వజ్రస్వస్తికము, చిత్రము, స్వస్తిక ఖడ్గము, గద, శ్రీకంఠము, విజయము అను తొమ్మిది ప్రాసాదములు ‘త్రివిష్టప’ము నుండి ఆవిర్భవించినవి. నగరములకు కూడ ఇవే పేర్లు. లాటాదులకు కూడ ఈ సంజ్ఞలే. చూలము శిఖర కంఠ ప్రమాణములో సగము ఉండవలెను. దానిలావు కంఠము లావులో మూడవ వంతు ఉండవలెను. వేదిని పది భాగములుచేసి ఐదు భాగములతో స్కంధ విస్తారమును, మూడు భాగములతో కంఠమును, నాలుగు భాగములతో దాని అండమును నిర్మించవలెను. ద్వారములు పూర్వాది దిక్కులందు ఉంచవలెను గాని విదిశల యందు ఉంచరాదు. పిండికా విస్తారము కోణము వరకును వెళ్ళవలెను. మధ్యభాగము దగ్గర దాని సమాప్తి కావలెను.
కొన్నింట ద్వారముల ఎత్తు గర్భము నాల్గవ భాగముకంటె గాని, ఐదవ భాగము కంటె గాని రెట్టింపు ఉండునట్లు ఉంచవలెను. లేదా మరొక విధముగకూడ చేయవచ్చును. నూట అరవై అంగుళముల ఎత్తునుండి పదేసి అంగుళములు తగ్గించుచు నిర్మించిన నాలుగు ద్వారములు ఉత్తమములని చెప్పబడినవి. నూట ఇరువది, నూటపది, నూరు అంగుళముల ఎత్తు ద్వారములు మధ్యమములు. తొంబది, ఎనుబది, డెబ్బది అంగుళముల ఎత్తు ద్వారములు కనిష్ఠములు. ద్వారము వెడల్పు, పొడవులో సగము ఉండవలెను. ఎత్తు చెప్పిన దానికంటె, మూడు, నాలుగు, ఎనిమిది లేదా పది అంగుళములు కూడ ఉన్నను శుభప్రదమే. విస్తారము ఎత్తులో నాల్గవ వంతు ఉండవలెను. ద్వారశాఖల (ప్రక్కకమ్ముల) వెడల్పు లేదా మొత్తము అన్ని కమ్ముల వెడల్పు ద్వారము వెడల్పులో నాల్గవవంతు ఉండవలెను. మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది శాఖలతో నిర్మించిన ద్వారము అభీష్ట ఫలముల నిచ్చును. క్రింది శాఖ నాల్గవ భాగముపై ద్వారపాలులను స్థాపించవలెను. మిగిలిన శాఖలను స్త్రీ పురుష మిథునముల ఆకారములతో అలంకరించవలెను. ద్వారమునకు ఎదురుగా స్తంభము వచ్చినచో స్తంభవేధ దోషము. దానివలన గృహస్వామి దాసుడగును. వృక్షముచే వేధయైనచో ఐశ్వర్యనాశనము. కూపవేధ వలన భయప్రాప్తి. క్షేత్రవేధచే ధన హాని కలుగును. ప్రాసాద, గృహ, శాలాదుల మార్గముచే ద్వారవేధ కలిగినచో బంధనము, సభచే వేధ ఏర్పడినచో దారిద్ర్యము, వర్ణవేధచే తిరస్కారము, ఉలూఖలవేధచే దారిద్ర్యము, శిలావేధచే శత్రుత్వము, ఛాయావేధచే నిర్ధనత ప్రాప్తించును. వీటినన్నింటిని ఖండించి వేసినను, పెకలించినను వేదదోష ముండదు. వీటిమధ్య ప్రాకారము కట్టించినను దోషముండదు. ఈ వస్తువులు సరిహద్దు నుండి రెట్టింపు దూరము నందు ఉన్నను వేధదోషము ఉండదు. (104)
