అగ్ని మహా పురాణము

Table of Contents

వాసుదేవాది ప్రతిమాలక్షణము

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు వాసుదేవాది ప్రతిమల లక్షణము చెప్పెదను వినుము. ఆలయమున పూర్వాభిముఖముగగాని, ఉత్తరాభి ముఖముగగాని, శిలనుంచి, దానికి పూజచేసి, శిల్పి, ఆ శిలకు మధ్య సూత్రముంచి దానిని తొమ్మిది భాగములు చేయవలెను. తొమ్మిదవ భాగమును గూఢ పండ్రెండు భాగములుగ విభజించిన పిమ్మట ఒక్కొక్క భాగము ఆతని అంగుళముతో ఒక్క అంగుళము ఉండును. రెండు అంగుళములు “గోలకము” దీనికి “కాలనేత్ర” మని కూడ పేరు. పైన చెప్పిన తొమ్మిది భాగములలో ఒక భాగమును మూడు భాగములుగా విభజించి దానితో సీల మండలుగా చేయవలెను. ఒక భాగము మోకాలు కొరకు, మరొక భాగము కంఠము కొరకు నిశ్చయించి ఉంచుకొనవలెను. ముకుటమునకు ఒక జానెడు, ముఖమునకు ఒక జానెడు, కంఠమునకు ఒక జానెడు, హృదయమునకై ఒకజానెడు ఉంచవలెను. నాభికిని, లింగమునకు మధ్య ఒక జానెడు దూరముండవలెను. తొడలు రెండుజానలు కాళ్ళు రెండు జానలు ఉండవలెను. ఇపుడు సూత్రముల కొలతలను వినుము- పాదములపై రెండు సూత్రములు, కాళ్ళపై రెండు సూత్రములు, మోకాళ్ళపై రెండు సూత్రములు రెండు తొడలపై రెండేసి సూత్రములు ఉపయోగింపవలెను. లింగముపై మరి రెండు సూత్రములు కటి ప్రదేశముపై నడుము నిర్మించుటకు మరి రెండు సూత్రములను ఉపయోగింపవలెను. నాభియందు కూడ రెండు సూత్రములు ఉపయోగింపవలెను. అట్లే హృదయమునందును, కంఠమునందును రెండు సూత్రములుంచవలెను. లలాటముపై మరి రెండు సూత్రములు, శిరస్సుపై మరి రెండు సూత్రములు ఉపయోగించవలెను. శిల్పి ముకుటముపై ఒక సూత్రముంచవలెను. పైన ఏడు సూత్రములు మాత్రమే ఉంచవలెను.

ఆరు సూత్రములను మూడు కక్షల అంతరముచే ఉంచవలెను. మరల మధ్య సూత్రమును విడిచివేసి కేవల సూత్రములను మాత్రమే ఉపయోగింపవలెను. లలాట, నాసికా, ముఖముల  విస్తారము నాలుగు అంగుళములు ఉండవలెను. కంఠవిస్తారము చెవుల విస్తారము కూడ నాలుగు అంగుళములే ఉండవలెను. రెండు ప్రక్కల చెక్కిళ్లు రెండేసి అంగుళముల వెడల్పు ఉండవలెను. బుగ్గకూడ రెండు అంగుళములు ఉండవలెను. పూర్తి విస్తారము ఆరు అంగుళములు ఉండవలెను. లలాట విస్తారము ఎనిమిది అంగుళములు ఉండవలెను. రెండు ప్రక్కల శంఖ ప్రదేశములు రెండేసి అంగుళముల విస్తారము కలిగి యుండి వాటిపై వెండ్రుకలు కూడ ఉండవలెను. చెవులకు నేత్రములకు మధ్య నాలుగు అంగుళముల వ్యవధానముండవలెను. చెవులు పృథుకములు రెండేసి అంగుళములు నిర్మింపవలెను. కనుబొమ్మలకు సమాన సూత్రముననున్న భాగమునకు “కర్ణ స్రోతస్సు” అని పేరు. గుచ్చిన (కుట్టిన) చెవులు ఆరు అంగుళములు, కుట్టనివి నాలుగు అంగుళములు ఉండవలెను. లేదా కుట్టిన చెవులైనను కుట్టని చెవులైనను, బుగ్గతో సమానముగ ఆరు అంగుళములు ఉండవలెను. గంధపాత్రము, ఆవర్తము, శష్కులి(చెవి రంధ్రము) కూడ నిర్మింపవలెను. క్రింది పెదవి ఒక అంగుళము, పై పెదవి అర అంగుళము ఉండవలెను. నేత్ర విస్తారము అరఅంగుళము, ముఖ విస్తారము నాలుగు అంగుళములు, ముఖము వెడల్పు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. ముక్కు ఎత్తు ఒక అంగుళము, పొడవు రెండు అంగుళములు ఉండవలెను. దాని ఆకారము కరవీర కుసుమమువలె ఉండవలెను. రెండు నేత్రముల మధ్య నాలుగు అంగుళముల అవకాశము ఉండవలెను. రెండు అంగుళములు నేత్రముల పరిధిలోనికి రాగా ఇంకను రెండు అంగుళముల వ్యవధానము ఉండును. నేత్రములోని మూడవవంతు నల్లగ్రుడ్లు, ఐదవవంతు చిన్న నల్లగ్రుడ్డు ఉండవలెను. నేత్ర విస్తారము రెండు అంగుళములు, ద్రోణి అరఅంగుళము ఉండవలెను. కనుబొమ్మల రేఖల ప్రమాణము కూడ అంతే ఉండవలెను. రెండు కనుబొమ్మలును ఒకే ప్రమాణములో ఉండవలెను. కనుబొమ్మల మధ్య రెండు అంగుళములు విస్తారము నాలుగు అంగుళములు ఉండవలెను.

కేశవాది మూర్తుల శిరస్సు మొత్తము తిరుగుడు ఇరువది ఆరు లేదా ముప్పది రెండు అంగుళములు ఉండవలెను. క్రింద కంఠము పది అంగుళములు, దాని తిరుగుడు ముప్పది అంగుళములు, క్రింది నుండి పైకి కంఠ విస్తారము ఎనిమిది అంగుళములు. కంఠమునకును, వక్షస్థలమునకును మధ్యనున్న అవకాశము కంఠముకంటె మూడు రెట్లు విస్తారముతో ఉండవలెను. స్కంభములు ఎనిమిదేసి అంగుళములు, అంసములు మూడేసి అంగుళములు ఉంచవలెను. బాహువులు మోచేయి వరకు పదునాలుగేసి అంగుళములు, ప్రబాహువులు (మోచేతి క్రింద) పదునారేసి అంగుళములు, బాహువుల వెడల్పు ఆరు అంగుళములు, ప్రబాహువుల వెడల్పు కూడ దీనితో సమానముగా ఉండవలెను. బాహుదండము తిరుగుడుపై నుండి తొమ్మిది కలలు లేదా పదునేడు అంగుళములు ఉండవలెను. బాహు మధ్యమున కూర్పరము (మోచేయి) ఉండును. కూర్పరము తిరుగుడు పదునాలుగు అంగుళములు, ప్రబాహుమధ్యమున దాని విస్తారము పదునారు అంగుళములు, చేతి అగ్రభాగము విస్తారము పండ్రెండు అంగుళములు, దాని మధ్య అరచేతి విస్తారము ఆరు అంగుళములు అరచేయి వెడల్పు ఏడు అంగుళములు, మధ్యవేలు పొడవు ఐదు అంగుళములు, తర్జనీ-అనామికల పొడవు దానికంటె అర అంగుళము తక్కువగా ఉండవలెను. కనిష్ఠికా-అంగుష్ఠముల పొడవు నాలుగు అంగుళములు, బొటన వ్రేలికి రెండు కణుపులు, మిగిలిన వాటికి మూడేసి కణుపులు ఏర్పరింపవలెను. గోళ్ళ పొడవు ఒక కణుపు పొడవులో సగముండవలెను. వక్షస్థలమెంత ఉన్నదో పొట్ట అంతే ఉండవలెను. నాభి రంధ్రము ఒక అంగుళము ఉండవలెను. నాభి నుండి లింగము వరకు జానెడు దూరము ఉండవలెను.

ఉదరము తిరుగుడు నలుబది రెండు అంగుళములు. స్తనముల మధ్య భాగము జానెడు. స్తనాగ్రములు యవ ప్రమాణముతో ఉండవలెను. స్తనముల తిరుగుడు రెండు పదములు ఉండవలెను. వక్షస్థలము తిరుగుడు అరువది నాలుగు అంగుళములు, దాని క్రింద నాల్గువైపుల తిరుగుడు “కువేష్టనము” అని పేరు. నడుము తిరుగుడు ఏబది నాలుగు అంగుళములు. ఊరు మూలముల విస్తారము పండ్రెండేసి అంగుళములు దానిపైన మధ్యభాగ విస్తారము అధికముగా ఉండవలెను, మధ్యభాగము నుండి క్రిందికి విస్తారము క్రమముగ తగ్గవలెను. మోకాళ్ళ విస్తారము ఎనిమిది అంగుళములు. వాటికి క్రింది పిక్కవిస్తారము మూడు రెట్లు ఉండవలెను. పిక్క మధ్య భాగము విస్తారము ఏడు అంగుళములు ఉండవలెను. దాని తిరుగుడు మూడు రెట్లుండవలెను. పిక్క అగ్రభాగమున విస్తారము ఐదు అంగుళములు, దాని తిరుగుడు మూడు రెట్లు, పాదములు జానెడేసి పొడుగు ఉండవలెను. పాదముల ఎత్తు నాలుగు అంగుళములు మడమల ముందు భాగము కూడ నాలుగు అంగుళములు ఉండవలెను.

పాదముల విస్తారము ఆరు అంగుళములు, గుహ్యకము మూడు అంగుళములు, పంజా ఐదు అంగుళములు ఉండవలెను. పాదముల బొటనవ్రేలు వెడల్పుగా ఉండవలెను. మిగిలిన వ్రేళ్ళ మధ్య భాగవిస్తారము క్రమముగా మొదటి వ్రేలు ఎనిమిదవ భాగము తక్కువగా ఉండవలెను. బొటన వ్రేలు ఎత్తు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. దీని గోరు ప్రమాణమును మిగిలిన వ్రేళ్ళు ప్రమాణము కంటె రెట్టింపు ఉంచవలెను. రెండవ వ్రేలిగోరు విస్తారము అర అంగుళము, ఇతరమైన వ్రేళ్ళ గోరు విస్తారము క్రమముగా కొంచెము కొంచెము తగ్గించవలెను. అండకోశములు రెండును మూడేసి అంగుళముల పొడవు, లింగము నాలుగు అంగుళములు ఉండవలెను. దానిపై భాగము నాలుగు అంగుళములు ఉండవలెను. అండకోశముల పూర్తి తిరుగుడు ఆరేసి అంగుళములు. ఇంతమాత్రమే కాక దేవతా ప్రతిమను సకల భూషణములతో అలంకరించవలెను. ఈ విధముగా సంక్షిప్తముగ లక్షణము చెప్పబడినది. ఇదేవిధముగ లోకములో కనబడు ఇతర లక్షణములను కూడ దృష్టిలో ఉంచుకొని, ప్రతిమపై ఆ లక్షణములను నిర్మింపవలెను. పై కుడి చేతిలో చక్రము, క్రింది దానిలో పద్మము, పై ఎడమచేతిలో శంఖము క్రింది దానిలో గద ఉంచవలెను. ఇవి వాసుదేవ శ్రీకృష్ణుని చిహ్నములుగాన ఆ ప్రతిమయందు మాత్రమే ఉంచవలెను. భగవంతుని సమీపమున, హస్తమునందు కమలము ధరించిన లక్ష్మిని, వీణను ధరించియున్న పుష్టిదేవిని నిర్మించవలెను. ఈ ప్రతిమలఎత్తు భగవత్ర్పతిమ తొడల ఎత్తు ఉండవలెను. ప్రభామండలములో ఉన్న మాలాధర-విద్యాధరుల విగ్రహము కూడ స్థాపింపవలెను. ప్రభను ఏనుగు మొదలైన వాటితో అలంకరింపవలెను. భగవచ్చరణముల క్రింది భాగమును (పాద పీఠమును) పద్మాకారమున నిర్మింపవలెను. ఈ విధముగ దేవ ప్రతిమలకు పై చెప్పిన లక్షణములు ఉండునట్లు కూర్చవలెను. (14)