అగ్ని మహా పురాణము

Table of Contents

పవిత్రాధివాసనము

ఈశ్వరుడు ఇట్లు చెప్పెను: ఇపుడు, క్రియా, యోగ, పూజాదులలోని లోపములను తొలగించు పవిత్రారోహణమును గూర్చి చెప్పెదను. నిత్యమును చేయు ‘పవిత్రారోహణమున’కు నిత్యమనియు, ఏదైన ఒక నిమిత్తమును పురస్కరించుకొని చేయుదానికి నైమిత్తికము అనియు పేర్లు. ఆషాఢమాసములోని మొదటి చతుర్దశియందు, శ్రావణ భాద్రపద మాసములలో రెండు పక్షముల చతుర్దశులందును, అష్టమీ తిథులందును పవిత్రారోహణ కర్మ చేయవలెను. లేదా ఆషాఢ పూర్ణిమ నుండి కార్తికపూర్ణిమ వరకును, ప్రతిపత్తు మొదలగు తిధులందు విభిన్న దేవతలకొరకై పవిత్రారోహణము చేయవలెను. ప్రతిపత్తునందు అగ్నికిని, ద్వితీయయందు బ్రహ్మకును, తృతీయయందు పార్వతికిని, చతుర్ధియందు గణేశునకును, పంచమినాడు నాగరాజైన అనంతునకు, షష్ఠినాడు స్కంధునకు, సప్తమినాడు సూర్యునకును, అష్టమినాడు శివునకు, నవమినాడు దుర్గకును, దశమినాడు యమునకును, ఏకాదశినాడు ఇంద్రునకును, ద్వాదశినాడు గోవిందునకును, త్రయోదశియందు కామధేనువునకును, చతుర్దశినాడు శివునకును, పూర్ణిమనాడు అమృతాశీనులగు దేవతలకును పవిత్రారోపణము చేయవలెను. కృత, త్రేతా, ద్వాపర యుగములందు క్రమముగ బంగారము, వెండి, రాగి పవిత్రకములు అర్పింపబడును. కాని కలియుగమునందు పత్తి, కమలనాభములు మొదలగువాటి దారములతో నిర్మించిన పవిత్రకములు అర్పింపబడును. కాని పవిత్రకము నందలి తొమ్మిది దారములకును వరుసగ ఓంకార, చంద్ర, అగ్ని, బ్రహ్మ, నాగరణ, స్కంద, శ్రీహరి, సర్వేశ్వర సకల దేవతలు అదిష్ఠానదేవతలు. నూట ఎనిమిది దారములతో నిర్మించిన పవిత్రకము ఉత్తమశ్రేణికి చెందినది. ఏబదినాల్గు సూత్రములున్నది మధ్యమము; ఇరువదియేడు సూత్రములున్నది అధమము. లేదా ఎనుబది యొక్క సూత్రములు, ఏబది సూత్రములు, ముప్పది ఎనిమిది సూత్రములు ఉన్న పవిత్రకమును నిర్మించవలెను. గ్రంధుల మధ్యనున్న వ్యవధానము సమముగా ఉండవలెను. పవిత్రముల విస్తారభా పండ్రెండు అంగుళములుగాని, ఎనిమిది అంగుళములుగాని, నాలుగు అంగుళములు గాని ఉండవలెను. శివలింగమునకై నిర్మించు పవిత్రకము ఆ లింగమంత ప్రమాణముకలదై ఉండవలెను.

అన్ని దేవతామూర్తులకును ఉపయోగించు నాల్గవ విధమగు పవిత్రకము ఆ దేవతామూర్తితో కాని, దాని పిండితోగాని సమముగా నుండును. దీనికి ‘గంగావతారకము” అని పేరు. దీనిని సద్యోజాత మంత్రముతో బాగుగా శుభ్రముచేసి, వామదేవ మంత్రముతో గ్రంథి వేసి, అఘోర మంత్రముతో రక్తచందనము, కుంకుమము పూయవలెను. లేదా కస్తూరి, గోరోచనము, కర్పూరము, పసుపు, గైరికము మొదలగునవి కలిపిచేసిన రంగు పూయవలెను. పది గ్రంథులుకాని, ఎన్ని తంతువులు ఉన్నవో అన్ని గ్రంథులు కాని వేయ వలెను. ఒక గ్రంథి నుండి మరొక గ్రంథి దగ్గరకు ఒక అంగుళము గాని, రెండు అంగుళములు గాని, నాలుగు అంగుళములు గాని దూరము ఉండవలెను. అందముగా ఉండు విధమున దూరము ఉంచవలెను. ప్రకృతి, పౌరుషి, వీర, అపరాజిత, జయ, విజయ, సదాశివ, మనోన్మని, సర్వతోముఖి అనువారు పది గ్రంథుల అధిష్ఠాన దేవతలు, పది కంటె ఎక్కువ గ్రంథులు కూడ అందముగా వేయవలెను. పవిత్రకము చంద్రమండల, అగ్నిమండల, సూర్యమండలములతో కూడి ఉన్నట్లు భావన చేయుచు, అది సాక్షాత్తు శివునితో తుల్యమైనదని భావించుచు హృదయమునందు ధరించవలెను. శివ రూపునిగా భావించిన తనకును, పుస్తకమునకును, గురుగణమునకును ఒక్కొక్క పవిత్రకమును సమర్పించవలెను.

ద్వారపాల, దిక్పాల, కలశాదులపై గూడ ఒక్కొక్క పవిత్రకము ఉంచవలెను. శివలింగములకు అర్పించు పవిత్రకము పొడవు ఒక హస్తము మొదలు తొమ్మిది హస్తముల వరకును ఉండును. ఒకహస్తము పొడవైన పవిత్రకమునందు ఇరువది ఎనిమిది గ్రంథులు ఉండును. పిమ్మట క్రమముగ పదేసి గ్రంథులు పెంచవలెను. ఈ విధముగ తొమ్మిది హస్తముల పవిత్రకము నందు నూట ఎనిమిది గ్రంథులుండును. ఈ గ్రంథుల మధ్య వ్యవధానము ఒకటి రెండేసి అంగుళములు ఉండును. వీటి మానము కూడ లింగ విస్తారమును బట్టి ఉండును. ఉపాసకుడు సప్తమీ దివసమున గాని, త్రయోదశీ దివసమునగాని, నిత్య కర్మాదులు ముగించుకొని సాయంకాలమున పుష్ప వస్త్రాదులతో యాగ గృహమును అలంకరించవలెను. నైమిత్తిక సంధ్యోపాసనచేసి, విశేషతర్పణములు చేసి, పిమ్మట పూజార్థమై నిశ్చితమైన పవిత్రభూమి భాగమునందు సూర్యుని పూజించవలెను. ఆచార్యుడు, ఆచమనము, సకలీకరణము పూర్తిచేసి ప్రణవోచ్చారణ పూర్వకముగ అర్ఘ్య పాత్రమును హస్తమున గ్రహించి, అస్త్రమంత్రము (ఫట్) ఉచ్చరించుచు క్రమముగ పూర్వాది దిక్కులందున్న ద్వారములను ప్రోక్షించి పూజించవలెను. ‘హాం శాన్తికళాద్వారాయ నమః, హాం విద్యాకళాద్వారాయ నమః, హాం నివృత్తి కళాద్వారాయ నమః, హాం ప్రతిష్ఠాకళా ద్వారాయ నమః” అను మంత్రములతో పూర్వాది దిగ్ద్వారముల పూజ చేయవలెను. ప్రతి ద్వారమునకును కుడి, ఎడమ ప్రక్కలనున్న ఇద్దరిద్దరు ద్వారపాలకులను పూజించవలెను. తూర్పున “నన్దినే నమః” “మహాకాలాయ నమః” అను మంత్రములతో నంది, మహాకాలులను; దక్షిణమున, “భృఙ్గిణే నమః” గణాయ నమః’ అను మంత్రముతో భృంగి, గణములను; పశ్చిమమున “వృషభాయ నమః, “స్కన్దాయనమః” అను మంత్రములతో వృషభ, స్కందులను; ఉత్తరమున “దేవైనమః” “చణ్డాయనమః” అను మంత్రములతో దేవీ చండులను పూజించవలెను.

ద్వారపాలాది నిత్య పూజానంతరము పశ్చిమ ద్వారము నుండి యాగ గృహము ప్రవేశించి, వాస్తు దేవతా పూజచేసి, భూతశుద్ధి చేయవలెను. విశేషార్ఘ్యము చేత గ్రహించి, తనను శివస్వరూపునిగ భావించుచు, పూజ సామగ్రిని ప్రోక్షణాధికము చేసి యజ్ఞభూమి సంస్కారము చేయవలెను. పిమ్మట కుశలు, దూర్వలు, పుష్పములు మొదలగువాటిని హస్తమునందు గ్రహించి ‘నమః’ మొదలగునవి ఉచ్చరించుచు వాటిని అభిమంత్రించవలెను. ఈ విధముగ శివహస్త నిధానముచేసి, దానిని తన శిరస్సుపై ఉంచుకొని ‘నేనే అన్నింటికిని మూలకారణమైన, సర్వజ్ఞుడైన శివుడను. యజ్ఞమునందు నాకే ప్రాధాన్యము’ అని భావన చేయుచు, శివధ్యానము చేయుచు, ఆచార్యుడు జ్ఞానమనెడు ఖడ్గమును హస్తమునందు గ్రహించి, నైరృతి దిక్కువైపువెళ్లి, ఉత్తరాభిముఖుడై, అర్ఘ్యజలమును ఇచ్చి, యజ్ఞ మండపము నలువైపులందును పంచగవ్యములు చల్లవలెను. చతుష్పదాంత సంస్కారము ఉత్తమ సంస్కారయుక్త దీక్షణము మొదలగునవిచేసి, అచట తెల్ల ఆవాలు మొదలగునవి చల్లి, కుశనిర్మితమగు కూర్చతో వాటిని ఉపసంహరించవలెను. పిమ్మట వాటితో, ఈశాన్యమునందు వర్ధనీ-కలశములను స్థాపించుటకు ఉపయోగించు ఆసనము కల్పింపవలెను.

పిదప నైరృతి దిక్కున వాస్తు దేవతలను, ద్వారమునందు లక్ష్మిని పూజించి, పశ్చిమాభిముఖమగు కలశమును సప్త ధాన్యములపై ఉంచి “శివ స్వరూపమగు ఈ కలశము నందికేశ్వరుని పృష్టముపై ఎక్కినది” అని భావించవలెను. ‘వర్ధని సింహముపై ఎక్కినది’ అని భావన చేయవలెను. కలశముపైన సాంబశివుని పూజించి, వర్ధనిపై అస్త్రమును పూజించి, పూర్వాది దిక్కులందు ఇంద్రాది దిక్పాలకులను, మండప మధ్య భాగమున బ్రహ్మను విష్ణు శివాదులను పూజించవలెను. కలశ పృష్ఠ భాగమును అనుసరించియున్న వర్ధనిని చక్కగ హస్తమునందు గ్రహించి, మంత్రజ్ఞుడగు గురువు, శివుని ఆజ్ఞను వినిపించవలెను. ప్రదక్షిణ క్రమమున తూర్పునుండి ఈశాన్యము వరకును అవిచ్ఛిన్న జలధార విడచుచు మూల మంత్రమును ఉచ్చరించవలెను. యజ్ఞ మండప రక్ష కొరకై శస్త్రరూపమగు వర్ధనిని నాల్గు ప్రక్కల త్రిప్పవలెను. ముందుగ కలశను స్థాపించి, దాని వామభాగమున, వస్త్రము కొరకై వర్ధని స్థాపించవలెను. ఉత్తమము, స్థిరముఅగు ఆసనముపై నున్న కల శముపై శివుని, ప్రణవముపై ఉన్న వర్ధనిపై శివుని ఆయుధములను పూజించవలెను. లింగముద్రచే ఆ రెండింటిని కలిపి భగలింగ సంయోగమును కల్పింపవలెను. కలశముపై జ్ఞానరూప మగు ఖడ్గమును సమర్పించి మూల మంత్రజపము చేయవలెను. ఆ జపములో దశాంశ హోమముచేసి వర్ధనిలో రక్షను ఘోషించవలెను. వాయవ్యమున గణేశ పూజచేసి, పంచామృతాదులతో శివునకు స్నానము చేయించి, సంపాతాహుతి విధానముచే దానిని శోధించి, పిమ్మట శివుడు, అగ్ని, ఆత్మ (తాను)అను ముగ్గురు అధికారులకై చిన్న గరిటెతో ఆ చరువును మూడు భాగములుచేసి, శివ, అగ్ని కుండమునందు సమర్పించి, తన భాగమును సురక్షితముగ ఉంచుకొనవలెను.

తత్పురుష మంత్రమునకు ‘హుం’ చేర్చి ఉచ్చరించుచు తూర్పున ఇష్టదేవతకు దంత ధావనమును సమర్పింపవలెను. అఘోర మంత్రమునకు “వషట్” చేర్చి ఉచ్చరించుచు ఉత్తరమున ఉసిరికకాయ సమర్పించవలెను. వామదేవ మంత్రమునకు “స్వాహా” చేర్చి ఉచ్చరించుచు జలము నివేదించవలెను. ఈశాన మంత్రముతో ఈశాన్యమునందు సుగంధిత జలమును సమర్పింపవలెను. పంచగవ్యములు, పలాశములు మొదలగువాటి దొన్నెలు అన్ని దిక్కులందును ఉంచవలెను. ఈశాన్యమున పుష్పములు, ఆగ్నేయమున గోరోచనము, నైరృతియందు అగురు, వాయవ్యమున చతుఃసమమును (రెండు పాళ్లు కస్తూరి, నాల్గు పాళ్లు చందనము, మూడు పాళ్లు కుంకుమము,మూడు పాళ్లు “కర్పూరము కలిపి చేసిన గంధద్రవ్యము చతుఃసమము) సమర్పించవలెను. లేతాకులతో కూడ సమస్త హోమ ద్రవ్యములను సమర్పింపవలెను. దకము, అక్షసూత్రము, కౌపీనము, భిక్షాపాత్రము కూడ దేవతా విగ్రహమునకు సమర్పించవలెను. కాటుక, కుంకుమము, సుగంధతైలము, కేశములను శుద్ధములను చేయు దువ్వెన, తాంబూలము, అద్దము, గోరోచనము కూడ ఉత్తరము నందు సమర్పింపవలెను. ఆసనము పాదుకలు, పాత్రములు, యోగపట్టము, ఛత్రముకూడ ఈశాన్యమునందు ఈశాన మంత్రము పఠించు శివుని అనుగ్రహము సంపాదించుటకై సమర్పింపవలెను. తూర్పునందు అజ్యసహితమగు చరువును గంధాదులను సమర్పింపవలెను. అర్ఘ్యజలముచే ప్రక్షాళితములై, సంహితా మంత్రముచే శోధింపబడిన పవిత్రకములను తీసికొని అగ్ని సమీపమునకు వెళ్లవలెను. కృష్ణ మృగ చర్మాదులచే వాటిని కప్పి ఉంచవలెను. సమస్త కర్మసాక్షియు, సంరక్షకుడును, సంవత్సర స్వరూపుడును అగు భగవంతుడగు శివుడు దానిలో నున్నట్లు భావన చేయవలెను. ‘స్వా’ ‘హా’ అను అక్షరములను ప్రయోగించుచు, మంత్ర సంహితలు పఠించుచు, ఇరువదియొక్క పర్యాయములు ఆ పవిత్రకములను శోధించవలెను. పిమ్మట గృహాదులను సూత్రములతో చుట్టి, సూర్యునకు గంధ పుష్పాదులు సమర్పించి, ఆచమన పూర్వకముగ అర్ఘ్య ప్రదానము చేయవలెను. న్యాసముచేసి నంది మొదలగు ద్వారపాలకులను, వాస్తు దేవతకును గంధాదులను సమర్పించవలెను. పిమ్మట యజ్ఞ మండపము ప్రవేశించి శివకలశము మీద నాల్గు ప్రక్కలను ఇంద్రాది లోకపాలులను, వారి శస్త్రములను నామమంత్రములతో పూజించవలెను.

పిమ్మట వర్ధనిని, విఘ్నేశ్వరుని, గురువును, తనను పూజించవలెను. సర్వౌషది లిప్తము, ధూపదూషితము, పుష్పదూర్వాది పూజితము అగు పవిత్రకమును అంజలిలో ధరించి, శివుని ఈ విధముగ ప్రార్థించవలెను.” సర్వకారణ భూతుడవును (చేతనాచేతన ప్రభువునగు పరమేశ్వరా) పూజలో జరిగిన లోపములను తొలగించుటకై నిన్ను ప్రార్థించుచున్నాను. సకల మనోరథములను సఫలముచేయు సిద్ధిని ఇమ్మని కోరుచున్నాను. నిన్ను ఆరాధించుచున్న నాకు అట్టి సిద్ధినిమ్ము. శంభో నీకు సర్వదా నమస్కరింతును. ప్రసన్నుడవు కమ్ము. దేవేశ్వరా! పార్వతీదేవితోడను, గణేశ్వరుల తోడను నిన్ను ఆహ్వానించుచున్నాను. మంత్రాధిపతులతోడను, లోకపాలకులతోడను, సేవకులతోడను కలసి ఇచటికి దయ చేయుము. నీ ఆజ్ఞానుసారము రేపు ప్రాతఃకాలమునందు, పవిత్రారోపణమును చేసి దానికి సంబంధించిన నియమములను అనుసరింతును.” ఈ విధముగ శివుని ఆవాహనచేసి, రేచక ప్రాణాయామముతో అమృతీకరణ క్రియ పూర్తిచేసి, మూలమంత్రము జపించి దానిని శివునకు సమర్పించవలెను. జప, స్తోత్ర, ప్రణామాదులుచేసి నా లోపములను అన్నింటిని క్షమింపుమని శివుని ప్రార్థించవలెను. పిమ్మట చరువులోని మూడవభాగమును హోమము చేయవలెను. దానిని శివ స్వరూపుడగు అగ్నికిని, దిక్కులలో నివసించువారికిని, దిక్పాలకులకును, భూత గణములకును మాతృ గణములకును, ఏకాదశ రుద్రులకును, క్షేత్రపాలాదులకును, వారి నామ మంత్రములకు “నమః-స్వాహా చేర్చి ఆహుతి రూపమున సమర్పించవలెను. పిమ్మట ఈ దేవతల చతుర్థ్వంత నామములకు “అయం బలిః” అను పదములు చేర్చి బలి సమర్పింపవలెను, పూర్వాది దిక్కులందు దిగ్గజాదులకును, దిక్పాలకులకును, క్షేత్ర పాలునకును, అగ్నికిని బలి సమర్పించవలెను. పిమ్మట పూర్ణాహుతి, వ్యాహృతి హోమములు చేసి అగ్నిదేవుని అవరుద్ధుని చేయవలెను.

పిమ్మట ‘ఓం అగ్నయే స్వాహా’ ‘ఓం సోమాయ స్వాహా’ ‘ఓం అగ్నేషోమాభ్యాం స్వాహా’ ‘ఓం అగ్నయే స్విష్టకృతే స్వాహా’ అను నాలుగు మంత్రములతో నాలుగు ఆహుతులు ఇచ్చి, తరువాతి పనులను ఏర్పాటు చేసుకొనవలెను. అగ్ని కుండములో పూజింపబడిన ఆరాధ్య దేవతయగు శివుని పూజామండలమునందు పూజింపబడిన కలశస్థ శివునితో నాడీసంధాన విధిచే కలిపివేయవలెను. ‘ఫట్’ ‘నమః’ అని ఉచ్చరించుచు అస్త్ర న్యాస హృదయ న్యాసములుచేసి పవిత్రములు అన్నింటిని వెదురుబుట్ట వంటి పాత్రలో ఉంచవలెను. ‘శాన్తి కళాత్మనే నమః’, ‘విద్యాకళాత్మనే నమః’, ‘నివృత్తి కళాత్మనే నమః’, ‘ప్రతిష్ఠా కళాత్మనే నమః’, ‘శాన్త్యతీత కళాత్మనే నమః’ అను కళా మంత్రములతో వాటిని అభిమంత్రించవలెను. పిదప ప్రణవమంత్రముతోగాని, మూలమంత్రముతో గాని షడంగన్యాసముచేసి, ‘నమః’ ‘హుం’ ‘ఫట్ ఉచ్చరించుచు వాటిపై క్రమముగ హృదయ, కవచ, అస్త్రములను సంబంధింపచేసి, వాటినన్నింటిని సూత్రములతో చుట్టబెట్టవలెను. పిదప ‘నమః’ ‘స్వాహా’ ‘వషట్’ ‘హుం’ ‘వేషట్’ ‘ఫట్’ అను అంగమంత్రములతో వాటినన్నింటిని పూజించి, భక్తినమ్రుడై, వాటి రక్షకొరకై శివునకు సమర్పించవలెను. పుష్ప, ధూప, దీపాదులతో పూజించబడిన సిద్ధాంత గ్రంథముపై పవిత్రకము సమర్పించి, గురుచరణ సమీపము చేరి ఆయనకు భక్తిపూర్వకముగ పవిత్రకము సమర్పింపవలెను. అచటినుండి బైటకు వచ్చి, ఆచమనముచేసి, గోమయముతో అలికిన మండలత్రయముపై, వరుసగ పంచగవ్యమును, చరువును, దంతధావనమును పూజించవలెను. పిమ్మట ఆచమనముచేసి, మంత్రముచే ఆవృతుడై రక్షణము కల్పించుకొన్న సాధకుడు రాత్రి యంతయు సంగీతముతో జాగరము చేయవలెను. భోగములు కోరువాడు, అర్ధరాత్రి దాటిన పిమ్మట శివుని స్మరించుచు, కుశాసనముపై నిద్రించవలెను. మోక్షేచ్ఛ కలవాడు, ఈ విధముగనే జాగారముచేసి, ఉపవాసపూర్వకముగ ఏకాగ్రచిత్తుడై భస్మశయ్యపై నిద్రించవలెను. (78)