అగ్ని మహా పురాణము

Table of Contents

జీర్ణోద్ధార విధానము

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! జీర్ణాది లింగముల శాస్త్రీయోద్ధార క్రమమును గూర్చి చెప్పెదను: చిహ్నములు అరిగిపోవుట, బ్రద్ధలగుట, మాలిన్యాదులచే స్థూలమగుట, వజ్రాహతమగుట, సంపుటితమగుట, విరిగిపోవుట, అంగభంగము ఏర్పడుట-ఇట్టి దోషములు ఏర్పడిన లింగముల పిండులను, వృషభమును వెంటనే త్యజించవలెను. శివ లింగమును ఎవరైన చలింపచేసినను, స్వయముగా అది చలించినను, చాల క్రిందికి దిగిపోయినను, విషమ స్థానస్థితమైనను, దిఙ్మోహమున్నను, ఏ కారణముచేతనైన క్రింద పడినను, లేదా మధ్యనే ఉన్నను జారిపోయినను దానిని మరల స్థాపించవలెను. అది వ్రణరహితమైననే అట్లు స్థాపించవలెను. నదీజలముచే కొట్టుకొనిపోయిన శివలింగమును గూడ మరల స్థాపన చేయవచ్చును. సుదృఢముగా ఉన్న శివలింగమును దాని స్థానము నుండి కదల్చగూడదు. అస్థిరమైన శివలింగమును చలింపచేసినచో, శాంతినిమిత్తమై వెయ్యి హోమములను, పునః స్థాపనార్థమై నూరు హోమములను చేయవలెను.

శివ లింగమును జీర్ణతాది దోషయుక్తమైనను, దానికి నిత్య పూజాదికము జరుగుచున్నచో దానిని కదల్చకూడదు. జీర్ణోద్ధారార్థమై దక్షిణమునగాని, ఈశాన్యమునగాని ఒక మండపము ఏర్పరచి, పశ్చిమమున ఒక ద్వారమేర్పరుపవలెను. ద్వార పూజాద్యనంతరము, వేదికపై శివపూజ చేయవలెను. మంత్ర పూజా-తర్పణానంతరము వెనుకటివలె వాస్తుపూజ చేయవలెను. పిదప గురువు, బైటకు వెళ్లి, భూతబలి ఇచ్చి, ఆచమనముచేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. పిదప శివునితో ఈ విధముగ నివేదించవలెను ‘శంభూ! ఈ లింగము దోషయుక్తమై పోయినది. దీనిని ఉద్ధరించినచో శాంతి కలుగునని నీవే చెప్పి ఉన్నావు. అందుచే యథావిధిగా ఈ కార్యము చేయబడుచున్నది. శివా! నీవు నాలో ఉండి, ఈ కార్యమును సుసంపన్నము చేయుము.’ శివునితో ఈ విధముగా విజ్ఞాపన చేసి, మధుఘృత మిశ్రమగు పాయసముతోను, దూర్వలతోను, మూల మంత్రముతో నూట ఎనిమిది హోమములుచేసి, శాంతి హోమము కూడ పూర్తి చేయవలెను. పిదప లింగమునకు స్నానము చేయించి వేదికపై దానికి పూజ చేయవలెను.

పూజ ‘వ్యావకేశ్వరాయ శివాయ నమః’ అను మంత్రము ఉచ్చరించుచు చేయవలెను. ‘ఓం వ్యావకేశ్వరాయ హృదయాయ నమః’ ‘ఓం వ్యావకేశ్వరాయ శిరసే నమః’ ఇత్యాదులు అంగమంత్రములు. పిదప అస్త్రమంత్రము ఉచ్చరించుచు శివలింగమును ఆశ్రయించియున్న భూతముతో ‘ఏదైన భూతము ఈ శివలింగమును ఆశ్రయించి ఉన్నచో, అది శివాజ్ఞ ప్రకారము, ఈ లింగమును విడచి, తనకు ఇష్టము వచ్చిన చోటునకు పోవలెను. విద్యా విద్యేశ్వరులతో భగవంతుడైన శివుడు ఇచట నివసింపనున్నాడు’ అని చెప్పవలెను. పాశుపత మంత్రముతో ఒక్కొక్క భాగమునకు వేయి చొప్పున హోమములుచేసి, శాంతి జలముతో ప్రోక్షణము చేయవలెను. కుశలతో స్పృశించి పై మంత్రమును జపించవలెను. పిదప గురువు విలోమశ్రమముతో అర్ఘ్యమిచ్చి లింగము పైనను, పిండికయందును ఉన్న తత్త్వములను, తత్తాధిపతులను, ఎనమండుగురు మూర్తీశ్వరులను స్వర్ణపాశమునుండి విసర్జింపచేసి, వృషభము భుజముపై నున్న రజ్జువుచే పట్టి తీసికొనిపోయి, జన సముదాయముతో కూడ శివనామ సంకీర్తనము చేయుచు, ఆ వృషభమును నీటిలో పడవేయవలెను. మంత్రజ్ఞుడైన ఆచార్యుడు పుష్టికొరకై నూరు హోమములు చేయవలెను. దిక్పాలకుల తృప్తి కొరకు, వాస్తు శుద్ధి కొరకునుగూడ నూరేసి హోమములు చేయవలెను.

పిదప మహాపాశుపత మంత్రముతో ఆ దేవాలయము నందు రక్షణము ఏర్పాటు చేసి, అచట విధి పూర్వకముగ మరియొక లింగమును స్థాపించవలెను. అసురులు, మునులు, దేవతలు, తత్త్వవేత్తలు స్థాపించిన లింగము జీర్ణమైనను, భగ్నమైనను, దానిని యథావిధిగాకూడ కదల్చరాదు. జీర్ణదేవాలయోద్ధార విషయమునందు గూడ ఈ విధినే అవలంబించవలెను. మంత్ర గణములను ఖడ్గమునందు న్యాసముచేసి, మరొక ఆలయము నిర్మించవలెను. దానిని మొదటి దానికంటె చిన్నది చేసినచో కర్త మరణించును. పెద్దది చేసినచో ధనహాని కలుగును. అందుచే వెనుకటి ఆలయము నందలి వస్తువులతోగాని, మంచివైన ఇతర వస్తువులతోగాని, ఆస్థానమునందు, మొదటి ఆలయము ఎంత ఉండెడిదో అంత ఆలయమే నిర్మించవలెను. (103)