అగ్ని మహా పురాణము

Table of Contents

నిర్వాణ దీక్షా విధానము

శివుడు పలికెను: పిమ్మట నిర్వాణ దీక్షయందు, పాశ బంధనశక్తి కొరకును, తాడనాదుల కొరకును మూలమంత్రాదుల దీపనము చేయవలెను. ఒక్కొక్కదానికి, ఒక్కొక్క హోమము, లేదా మూడేసి హోమములు చేసి మంత్రదీపనము చేయవలెను. మొదట ప్రణవమును, మధ్య బీజ, గర్భ, శిఖాబంధ స్వరూపములగు మూడు ‘హూం’లను ఉచ్చరించవలెను. దీనివలన మూలమంత్ర దీపనమగును. ‘ఓం హూం హూం హూం ఫట్’ అని దీపనము. దీనిచేతనే ‘ఓం హూం హూం హూం ఫట్ హృదయాయ నమః’ అని హృదయ దీపన మగును. పిమ్మట ‘ఓం హూం హూం హూం ఫట్ శిరసే స్వాహా’ ఇత్యాదులచే శిరస్సు మొదలగు అంగములు దీపనము చేయవలెను. క్రూరకర్మలన్నింటి యందును మూలాది దీపనము ఈ విధముగనే చేయవలెను. శాంతి, పుష్టి, వశీకరణ కర్మలయందు మొదట ఉన్న ప్రణవము చివర ‘వషట్’ చేర్చి ఒక్కొక్క దానిని ఆ మంత్రము చేతనే దీపనము చేయవలెను. ఆప్యాయానాది కర్మలన్నింటియందును ‘వషట్’ ‘వౌషట్’లతో కూడిన, సంపూర్ణ కామ్యకర్మలపై ఉన్న శంబర మంత్రములతో హోమము చేయవలెను. తన ఎడమ ప్రక్క నున్న మండలముపై ప్రకాశించుచున్న పరిశుద్ధ శరీరవంతుడగు శిష్యుని పూజించి, ఒక ఉత్తమ సూత్రమును సుషుమ్నా నాడిగా భావనచేసి, మూల మంత్రముతో దానిని శిఖాబంధము వరకును తీసికొని పోయి, అచటి నుండి కాళ్ళబొటన వ్రేళ్ళ వరకును తీసికొనిరావలెను. పిదప, సంహార క్రమముచే దానిని మరల ముముక్షువగు శిష్యుని శిఖవద్దకు తీసికొనిపోయి అచటనే కట్టవలెను. పురుషునకు కుడి ప్రక్కను, స్త్రీకి ఎడమ ప్రక్కను కట్టవలెను. శిష్యుని శిరస్సుపై శక్తిని శక్తి మంత్రముచే పూజించి, ఆ శక్తిని సంహారముద్రచే తీసికొనివచ్చి ఆ సూత్రమునందు, ఆ మంత్రముతోడనే, కలపవలెను. సుషుమ్నా నాడిని గ్రహించి, దానిని మూలమంత్రముతో ఆ సూత్రముపై న్యాసము చేసి, హృదయ మంత్రముతో దానిని పూజించవలెను. కవచ మంత్రముచే ఆచ్ఛాదించి, హృదయ మంత్రముతో మూడు హోమములు చేయవలెను. ఈ హోమములు నాడీ సంవిధానము కొరకు చేయబడినవి. శక్తి సంవిధానము కొరకుగూడ ఈ విధముగనే హోమమును చేయవలెను.

‘ఓం హాం తత్త్వాధ్వనీ నమః’ ‘ఓం హాం పదాధ్వనే నమః’ ‘ఓం హాం వర్ణానాధ్వనే నమః’ ‘ఓం హాం మన్త్రాధ్వనే నమః’, ‘ఓం హాం కళాధ్వనే నమః’ ‘ఓం హాం భువనాధ్వనే నమః’ అను వర్ణమంత్రము లచే, సూత్రముపై ఆరు అధ్వల న్యాసముచేసి అస్త్రమంత్రముచే అభిమంత్రించిన ఉదకముతో శిష్యుని ప్రోక్షించవలెను. అస్త్రమంత్రము జపించుచు పుష్పము గ్రహించి శిష్యుని హృదయమును కొట్టవలెను. పిమ్మట హుంకారయుక్త రేచక ప్రాణా యామముతో శిష్యుని శరీరమునందు ప్రవేశించి, దాని లోపల హంసబీజములో జీవ చైతన్యమును, అస్త్రమంత్రమును జపించుచు, అచటి నుండి తొలగించవలెను. పిమ్మట ‘ఓం హః హూం ఫట్’ అను శక్తి సూత్రముచేతను, ‘హాం హాం స్వాహా’ అను మంత్రము చేతను సంహారముద్రతో, వాడియైన ఆ సూత్రమునందు విడదీసిన జీవ చైతన్యమును నియమించవలెను. ‘ఓం హాం హాం హోమాత్మనే నమః’ అను మంత్రము జపించుచు జీవాత్మ వ్యాపకమని భావన చేయవలెను. పిదప కవచ మంత్రముచే దానిని ఆచ్ఛాదించి దాని సాన్నిధ్యమును కోరుచు హృదయ మంత్రముచే మూడు హోమములు చేయవలెను. పిమ్మట విద్యాదేహ న్యాసముచేసి దానిలో శాంత్యతీత కళను చూడవలెను. ఇతర తత్త్వములతో కూడిన ఆత్మ ఆ కళయందు అంతర్గతమై ఉన్నట్లు భావన చేయవలెను. ‘ఓం హూం శానత్యతీత కలాపాశాయ నమః’ అను మంత్రముచే ఆ కళను చూడవలెను. రెండు తత్త్వములు, ఒక మంత్రము, ఒక పదము, పదునారు వర్ణములు, ఎనిమిది భువ నములు, క, ఖ మొదలైన బీజములు, నాడులు, రెండు కళలు, విషయములు, గుణములు, ఏకమాత్ర కారణభూతుడైన సదాశివుడు, వీటి అన్నింటిని శ్వేతవర్ణమగు శాంత్యతీతకళీలో అంతర్భూతముచేసి ‘ఓంహూం శాన్త్యతీత కలాపాశాయ హూం ఫట్’ అను మంత్రముచే ప్రతాడనము చేయవలెను. కలాపాశమును సంహారముద్రతో తీసికొని, సూత్రము శిరస్సుపై నుంచి దానిని పూజించవలెను. దాని సాన్నిధ్యము కొరకై వెనుకటివలెనే మూడు హోమములు చేయవలెను. ‘హూం’ అనునది శాంత్యతీత కళాబీజము, రెండు తత్త్వములు, రెండు అక్షరములు, బీజములు, నాడి, క, ఖ అను అక్షరములు, రెండు గుణములు, రెండు మంత్రములు, కమలములో ఉన్న ఏక మాత్ర కారణభూతుడైన ఈశ్వరుడు, పండ్రెండు పదములు, ఏడు లోకములు, ఒక విషయము వీటిని అన్నింటిని కృష్ణ వర్ణయగు శాంతికళ లోపల భావన చేయవలెను.

పిమ్మట వెనుకటి వలెనే తాడనముచేసి సూత్రముఖ భాగమున వీటిని అన్నింటిని కూర్చవలెను. సాన్నిధ్యము కొరకే శాంతికళా బీజ మంత్రముతో (హూం హూం) మూడు హోమములు చేయవలెను. ఏడు తత్త్వములు, ఇరువదియొక్క పదములు, ఆరు వర్ణములు, ఒక శంబరము, ఇరువదియైదు లోకములు, మూడు గుణములు, ఒక్క విషయము, రుద్రరూప కారణతత్త్వము, బీజము, నాడులు, క, ఖ అనుకళలు-వీటినన్నింటిని మిక్కిలి ఎఱ్ఱని రంగుగల విద్యాకళలో అంతర్భూతములుచేసి, ఆవాహన సంయోజన పూర్వకముగా వెనుక చెప్పిన సూత్రము హృదయ భాగమున స్థాపించి, తన మంత్రముచే పూజించి, వీటి అన్నింటి సన్నిధి కొరకై వెనుకటివలెనే మూడు ఆహుతులు ఈయవలెను. ఆహుతి చేయు బీజమంత్రము (హూంహూంహూమ్’, ఇరువదినాలుగు తత్త్వములు, ఇరువది యైదు వర్ణములు, బీజములు, నాడులు, క, ఖ అను కళలు, ఇరువది రెండు పదములు, అరువది లోకములు, అరువది కళలు, నాలుగు గుణములు, మూడు మంత్రములు, ఒక విషయము, కారణరూప శ్రీహరి-వీటిని అన్నింటిని శుక్ల వర్ణమగు ప్రతిష్ఠా కళలో అంతర్భూతములు చేసి, తాడనాదికము చేయవలెను. మరల వీటినన్నింటిని సూత్రనాభి భాగమున సంయోజనముచేసి, సన్నిధాన కరణమునకై, ‘హూం హూం హూం హూం’ అను మంత్రముచే మూడు హోమములు చేయవలెను. నూట ఎనిమిది భువనములు, ఇరువది యెనిమిది పదములు, బీజములు రెండు నాడులు, రెండు సమీరములు, రెండు ఇంద్రియములు, ఒక వర్ణము, ఒక తత్త్వము, ఒక విషయము, ఐదు గుణములు, కారణ రూపకమలాసన బ్రహ్మ, నాలుగు శంబరములు-వీటిని అన్నింటిని పీతవర్ణమగు నివృత్తి కళలో అంతర్భూతములుచేసి తాడనము చేయవలెను. వీటిని గ్రహించి, సూత్ర చరమభాగమునందు స్థాపించి, పూజించి, వీటి సాన్నిధ్యము కొరకై ‘హూం హూంహూం హూం హూం’ అను బీజ మంత్రముతో మూడు హోమములు చేయవలెను.

ఈ విధముగ, సూత్రమునందు ఉన్న ఐదు కళలను తీసి శిష్యుని శరీరమునందు ఉంచవలెను. సబీజ దీక్షయందు, సమయాచార పాశముకంటెను, దాహారంభక ధర్మము కంటెను, మంత్రసిద్ధి ఫలము కంటెను, ఇష్టాపూర్తాది ధర్మముకంటెను భిన్నమైన చైతన్య రోధక సూక్ష్మ ప్రబంధకములను కళలలో భావన చేయవలెను. వాటివాటి మంత్రములతో మూడేసి హోమములుచేసి తర్పణ-దీపనములు చేయవలెను. ‘ఓమ్ హూం శాన్త్యతీత కలాపాశాయ స్వాహా’ ఇత్యాది మంత్రములచే తర్పణములు, ‘ఓం హూం హూం శాన్త్యతీత కలాపాశాయ హూం హూం ఫట్’ ఇత్యాది మంత్రములచే దీపనము చేయవలెను. వ్యాప్తి బోధకొరకై, సూత్రమును, సురక్షా పూర్వకముగ ఐదు కళాస్థానములపై నుంచి, దానిపై కుంకుమాదులచే అంగదేవతా సమేతుడైన శివుని పూజించవలెను. కళా మంత్రముల చివర ‘హుం ఫట్’ అను పదములు చేర్చి ఉచ్చరించుచు పాశభేదనముచేసి, నమస్కారాంత కలా మంత్రములతో వాటిలోపల ప్రవేశముచేయవలెను. కళాగ్రహణ బంధనములు కూడ చేయవలెను. ‘ఓం హూం హూం హూం శాన్త్యతీతకలాం గృహ్ణామి బధ్నామి’ ఇత్యాది మంత్రములు గ్రహణ బంధనములందు వినియోగింపబడును. ఒక్కొక్క కళ విషయమునను తప్పక పాశాది వశీకరణమును, గ్రహణమును, బంధనమును, పురుషుని విషయమున సకలవ్యాపార నిషేధమును చేయవలెను. శిష్యుని కూర్చుండ బెట్టి, సూత్రమును వాని భుజము నుండి చేతిలోంచి జ్ఞాతాజ్ఞాత పాపపరిహారార్థమై నూరు పర్యాయములు మూల మంత్రముతో హోమము చేయవలెను. పురుషుని సూత్రము అస్త్ర మంత్ర సంపుటమునందును, స్త్రీ సూత్రమును ప్రణవసంపుటము నందును ఉంచి, హృదయ మంత్రముతో సంపుటితమొనర్చి, ఆమంత్రముతోనే దానిని పూజచేయవలెను. సూత్రమునకు సాంగములతో శివునిచే సంపాత శోధనముచేసి, దానిని కలశము క్రింద ఉంచి, దాని రక్షకొరకై ఇష్టదేవతా ప్రార్థన చేయవలెను. శిష్యుని చేతిలో పూవులు ఇచ్చి, కలమునకు పూజా ప్రణామాదులు చేసిన పిమ్మట యాగశాలనుండి బైటకు రావలెను.

అచట మూడు మండలములుచేసి ముక్తి కాములగు శిష్యులను ఉత్తరాభిముఖముగను, భోగకములను పూర్వాభిముఖముగను కూర్చుండబెట్టవలెను. ముందుగా, కుశయుక్తమగు చేతిలో మూడు చుళుకములు (పుడిసెళ్ళు) పంచగవ్యము త్రాగించవలెను. మధ్య ఆచమనము చేయరాదు. పిమ్మట ఒక్కొక్క శిష్యునికిని మూడు లేదా ఎనిమిది గ్రాసములు చరువు ఇవ్వవలెను. ముక్తికామునకు పలాశ పత్రముల దొన్నెయందును, భుక్తి కామునకు రావియాకుల దొన్నె యందును చరువు ఇవ్వవలెను. ఆతడు దంత స్పర్శ కలుగకుండ దానిని భక్షించవలెను. గురువు చేతులు కడిగికొని పవిత్ర జలముతో ఆ శిష్యులచే ఆచమనము చేయించవలెను. హృదయ మంత్రముచే దంతధావనము చేసి ఆ కాష్ఠమును పారవేయవలెను. దాని ముఖముము శుభదిశ వైపున పడినచో శుభఫలము కలుగును. న్యూనతాదోష పరిహారార్థమై మూల మంత్రముతో నూట ఎనిమిది పర్యాయములు హోమము చేయవలెను. కర్మనంతను స్థండిలేశ్వరునకు సమర్పించవలెను. పిమ్మట ఆ శివుని పూజించి, విసర్జించి చండేశుని పూజించవలెను. నిర్మాల్యమును తొలగించి మిగిలిన చరువును అగ్నిలో హోమము చేయవలెను. కలశమునకును, లోకపాలకులకును పూజా విసర్జనములుచేసి, గణములును, అగ్నియు బాహ్య దిక్కున ఉంచబడినచో వాటిని కూడ విసర్జించవలెను. మండలము వెలుపల లోకపాలకులకు కూడ సంక్షిప్తముగ బలి సమర్పించి, భస్మ, శుద్ధ జలములతో స్నానముచేసి యాగమండలమును ప్రవేశించవలెను. గృహస్థులైన శిష్యులను అస్త్రమంత్రముచే రక్షించి కుశ శయ్యపై నిద్రింపచేయవలెను. వీరి తల తూర్పువైపు ఉండవలెను. విరక్తులైన శిష్యులను హృదయ మంత్రముచే భస్మ శయ్యపై దక్షిణ శిరస్కులనుగా పరుండబెట్ట వలెను. ఆ శిష్యులందరును అస్త్ర మంత్రముచే రక్షితులై, శిఖామంత్రముచే తమ తమ శిఖలను బంధించుకొనవలెను. పిమ్మట గురువు వారికి స్వప్న మానవుని గూర్చిచెప్పి మండలము నుండి బైటకు రావలెను. పిమ్మట “ఓం హిలి హిలి శూలపాణయే నమః స్వాహా” అను మంత్రముచే పంచగవ్య-చరువుల ప్రాశనముచేసి, దంతధావన అనంతరము ఆచమనము చేయవలెను. శివుని ధ్యానించుచు దీక్షకు సంబంధించిన కర్మకాండను స్మరించుచు పవిత్ర శయనముపై శయనించవలెను. ఈ విధముగ దీక్షాధివాసన విధి సంక్షిప్తముగ చెప్పబడినది. (83)