అగ్ని మహా పురాణము

Table of Contents

నగరాదిక వాస్తు కథనము

పరమేశ్వరుడు చెప్పెను-

కార్తికేయా! రాజ్యాదుల అభివృద్ధి కొరకై ఇపుడు నగరవాస్తువును వర్ణించి చెప్పెదను. నగర నిర్మాణము కొరకు, ఒక యోజనము లేదా అర్ధయోజనము విస్తారముగల భూమిని గ్రహించవలెను. ఈశాదిపదములు ముప్పదింట సూర్య సంముఖముగ పూర్వ ద్వారము, గంధర్వ సమీపమున దక్షిణ ద్వారము, వరుణిని దగ్గర పశ్చిమ ద్వారము సోముని దగ్గర ఉత్తర ద్వారము నిర్మించవలెను. నగరమున వీథులు వెడల్పుగా ఉంచవలెను. నగరద్వారము ఆరు హస్తముల వెడల్పు ఉండి ఏనుగులు మొదలగునవి సుఖముగా ప్రవేశించుటకు నిర్గమించుటకు వీలుగా ఉండవలెను. నగరము ఛిన్నకర్ణముగాని, భగ్నముగాని, అర్ధ చంద్రాకారముగాని కాకూడదు. వజ్రసూచీ ముఖ నగరము కూడ హితకరముకాదు. ఒకటి రెండు లేదా మూడు ద్వారములుగల, ధనుస్సు ఆకారములో ఉన్న వజ్ర నాగాభ నగరము నిర్మించినచో అది శాంతి ప్రదము. నగరమునకు ఆగ్నేయమున స్వర్ణకారులును, దక్షిణమున నృత్యోపజీవులగు వారాంగనలును, నైరృతి యందు నట, కుంభకార, కైవర్తాదులును, పశ్చిమమున రథకార, ఆయుధకార, ఖడ్గకారులను, వాయువ్యమున మద్యవిక్రేతలు కర్మకారులు, భృత్యులును, ఉత్తరమున బ్రాహ్మణ, యతి, సిద్ధాది పుణ్య పురుషులును, ఈశాన్యమున ఫలాదులను విక్రయించువారును నివసించవలెను. సేనాధ్యక్షుడు తూర్పున ఉండవలెను. వివిధ సైన్యములు ఆగ్నేయము నందును, స్త్రీలకు వివిధ కళలను బోధించు ఆచార్యులు దక్షిణమునందును, ధనుర్ధర సైనికులు నైరృతి యందును, పశ్చిమమున మహామాత్యుడు, కోశపాలకులు, కార్మికులును, ఉత్తరమున దండాధికారులు నాయక ద్విజులును నివసించవలెను.

తూర్పున క్షత్రియులను, దక్షిణమున వైశ్యులను, పశ్చిమమున శూద్రాదులను, విభిన్న దిశల యందు వైద్యులను, అశ్వములను, సైన్యమును నాల్గు దిక్కులందును ఉంచవలెను. తూర్పునందు గూఢచారులను, దక్షిణమున శ్మశానమును, పశ్చిమమున గోధనమును, ఉత్తరమున కర్షకులను ఉంచవలెను. మ్లేచ్ఛులకు విదిక్కులందు స్థానము ఏర్పరుపవలెను, లేదా గ్రామములలో నివసింప జేయవలెను. పూర్వద్వారమునందు లక్ష్మీ కుబేరుల స్థాపనచేయవలెను. ఆ ఇరువురిని చూచువారికి లక్ష్మీ సంపత్తి కలుగును. పశ్చిమమున నిర్మించిన దేవాలయము పూర్వాభిముఖముగాను, తూర్పున నిర్మించినది పశ్చిమాభి ముఖముగాను, దక్షిణమున నిర్మించినది ఉత్తరాభిముఖముగాను ఉండవలెను. నగర రక్షణ కొరకు ఇంద్ర విష్ణ్వాది దేవతా మందిరములను నిర్మించవలెను. దేవతలు లేని నగర, గ్రామ, దుర్గ, గృహాదులను పిశాచములు అనుభవించును. అవి అనేక రోగములచే పీడింపబడును. పైన చెప్పిన విధమున నిర్మించిన నగరాదికము సదా జయప్రదమై భోగ-మోక్షముల నిచ్చును. వాస్తుభూమికి తూర్పున శృంగార గృహము, ఆగ్నేయమున పాకగృహము, దక్షిణమున శయన గృహము, నైరృతియందు శస్త్ర గృహమును, పశ్చిమము నందు భోజనగృహము, వాయవ్యము నందు ధాన్య సంగ్రహము, ఉత్తరమునందు ధనా గారము, ఈశాన్యము నందు దేవతా గృహము నిర్మింపవలెను. నగరమునందు ఏకశాలా, ద్విశాలా, త్రిశాలా, చతుః శాలా గృహములను నిర్మించవలెను. శాలాభేదమును, అలింద (ముంగిలి) భేదమును బట్టి చతుఃశాలా గృహమున రెండు వందల ఏబదియైదు భేదములుండును. త్రిశాలా గృహమునకు నాలుగు, ద్విశాలకు ఐదు, ఏకశాలకు నాలుగు భేదము లుండును. ఇపుడు అలిందయుక్త గృహమును గూర్చి చెప్పెదను వినుము. గృహ వాస్తువు నందును, నగరవాస్తువు నందును, ఇరువది యెనిమిది అలిందములు ఉండును. నాలుగు అలిందములతోడను, ఏడు అలిందముల తోడను ఏబది యైదు భేదములును, ఆరు అలిందములతో ఇరువది భేదములును, ఎనిమిది అలిందములతో గూడ ఇరువది భేదములును ఏర్పడును. ఈవిధముగ నగరాదులలో ఎనిమిది అలిందములుగల వాస్తువు కూడ ఉండవచ్చును. (106)