అగ్ని మహా పురాణము

Table of Contents

ఏకాక్షర కోశము - నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

ఏకాక్షర కోశమును, మాతృకా నామములు, మంత్రములు చెప్పెదను. అ=విష్ణువు, నిషము. ఆ=బ్రహ్మ, సీమా అర్థమున ఇది అవ్యయము. వాక్యమునందు కూడ ఉపయోగించబడును. క్రోధము పీడ అనికూడ అర్థము. ఇ=మన్మథుడు, ఈ=రతి, లక్ష్మీ, ఉ=శివుడు, ఊ=రక్షకాదులు, ఋ=శబ్దము, ౠ=అదితి, ఌ ౡ=దితి, కుమారస్వామి, ఏ=దేవి, ఐ=యోగినీ, ఓ=బ్రహ్మ, ఔ=మహేశ్వరుడు, అం=మన్మథుడు, అః=ప్రశస్తము, క=బ్రహ్మాదులు, కు=కుత్సితము, ఖ=శూన్యము, ఇంద్రియము, గ=గంధర్వుడు, వినాయకుడు (న.పు. గీతము), ఘ=ఘంట, కింకిణీ మొదలగునవి, తాడనముకూడ దీని అర్థము; జు=విషయము, స్పృహ, భైరవుడు, చ=దుర్జనుడు, నిర్మలము; ఛ=ఛేదనము, జి=వివేకము, జ=గీతము, ఝ=ప్రశస్తము, ఞ=బలము, ట=గానము; ఠ=చంద్రమండలము, శూన్యము, శివుడు, ఉరిపోసుకొనుట; డ=రుద్రుడు, ధ్వని, త్రాసము, ఢ=ఢక్కా, ఢక్కాధ్వని, ణ=నిష్కర్షము, నిశ్చయము, త=తస్కరుడు, వరాహ వుచ్ఛము, థ=భక్షణము, ద=భేదనము, ధారణము, శోభనము, ధ=బ్రహ్మ, తుత్తూరము, న=సమూహము బుద్ధుడు, ప=ఉపవనము, ఫ=ఝంఝావాతము, పు=పుత్కారము, నిష్ఫలము, బి=పక్షి, భ=నక్షత్రము, మా=లక్ష్మి, మానము, మాత, య=యాగము, యాత, ఈరిణ, వృక్షము, ర=అగ్ని, బలము, ఇంద్రుడు, ల=విధాతా, వ-విశ్లేషణము, వరుణుడు, శ=శయనము, సుఖము, ష=శ్రేష్ఠము, స=పరోక్షము, సా=లక్ష్మి, స=(నపు) కేశము, హ=ధారణము, రుద్రుడు, క్ష=క్షేత్రము, అక్షరము, నృసింహుడు, హరి, క్షత్రజాతి, పాలకుడు. ఏకాక్షర మంత్రము. దేవతా రూపము, భుక్తి ముక్తిప్రదము. ‘క్షౌం హయ శిరసే నమః’, ఇది అన్ని విద్యలను ఇచ్చు మంత్రము; అకారాది అక్షర నవకము మంత్రములే. వీటికి ఉత్తమ మాతృకా మంత్రములని పేరు. వీటిని ఒక కమలదళమున స్థాపించి పూజించవలెను. వీటిపై భగవతి, కాత్యాయని, కౌశికి, చండక, ప్రచండ, సురనాయిక, ఉగ్రపార్వతి, దుర్గలు అను నవదుర్గలను పూజించవలెను. ఓం చండికాయై విద్మహే, భగవత్మై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. ఇది దుర్గామంత్రము. షడంగాది క్రమమున పూజించవలెను. అజిత, అపరాజిత, జయ, విజయ, కాత్యాయనీ, భద్రకాళి, మంగళసిద్ధి, రేవతి, సిద్ధాదివటుక, ఏకపాద, భీమరూప, హేతుక, కపాలికలను పూజించవలెను. మధ్య భాగమున తొమ్మండుగురు దిక్పాలకులను పూజించవలెను. మంత్రసిద్ధి కొరకై ‘హ్రీం దుర్గే రక్షణి స్వాహా’ అను మంత్రము జపించవలెను. గౌరీ పూజచేసి ధర్మాదులను స్కందాదులను, శక్తులను పూజించవలెను. ప్రజ్ఞా, జ్ఞానా, క్రియ, వాచా, వాగీశి, జ్వాలినీ, వామ, జ్యేష్ఠా, రౌద్ర, గౌరి, హ్రి దేవతలను పూజించి పురస్సరా దేవిని ‘హ్రీం సహ మహాగౌరి రుద్ర దైతే స్వాహా’ అను మంత్రముతో పూజించి మహాగౌరి జ్ఞాన శక్తి, క్రియా శక్తి, సుభగా, లలిత, కామినీ, కామమాలా ఇంద్రాది శక్తుల పూజ కూడ ఏకాక్షర మంత్రముతో చేయవలెను. ఓం, గం, స్వాహా, ఇది గణపతి మూల మంత్రము లేదా గం గణపతయే నమః అను మంత్రముతో కూడ పూజ చేయవచ్చును. రక్త శుక్ల దంత, నేత, పరుశు ఉత్కట, మోద ఇవి షడంగములు. ‘గంధోల్కాయ’ ఇత్యాది క్రమమున గంధాదులు సమర్పించవలెను. గజ మహాగణపతి మహోల్క పూజ కూడ చేయవలెను. ‘కూష్మాండాయ’ మొదలు గణాధిపతయే స్వాహా వరకు ఉన్న మూలోక్త మంత్రములకు కకార ఏకాక్షర బీజములుముందు చేర్చి అంతమున ‘నమః, స్వాహా’ శబ్దములు ప్రయోగించి వినియోగించవలెను. తిలహోమముచేసి దేవతా పూజ చేయవలెను. ద్విరేఫ ద్విర్ముఖ, ద్వక్షాది మంత్రములు వేర్వేరుగా వుండవచ్చును. ఇపుడు స్కందుడు కాత్యాయనునకు చెప్పిన వ్యాకరణము చెప్పెదను. (348)