అగ్ని మహా పురాణము

Table of Contents

రామాయణ కథ- బాల కాండము

అగ్ని పలికెను: దేనిని పఠించినచో భుక్తియు ముక్తియు లభించునో అట్టి రామాయణమును, నారదుడు వాల్మీకికి చెప్పిన విధమున చెప్పెదను.

నారదుడు పలికెను: విష్ణువు నాభియందలి పద్మము నుండి బ్రహ్మ పుట్టెను. మరీచి బ్రహ్మ కుమారుడు. మరీచికి కశ్యపుడును, ఆతనికి సూర్యుడును, సూర్యునకు వైవస్వత మనువును, ఆతనికి ఇక్ష్వాకువును పుట్టిరి. ఆతని వంశమునందు కకుత్థ్సుడు పుట్టెను. కకుత్థ్సునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడును పుట్టెను.

శ్రీమహావిష్ణువు రావణాదులను వధించుటకై తాను నాలుగు విధములుగా అయి దశరథ మహారాజు వలన కౌసల్య యందు రాముడుగను, కైకేయి యందు భరతుడుగను, సుమిత్ర యందు లక్ష్మణ, శత్రుఘ్నులుగను జనించెను. ఋష్యశృంగుని సాహాయముచే యజ్ఞమునందు లభించిన పాయసమును కౌసల్యాదులకు ఈయగా, వారు దానిని భుజింపగా, రామాదులు జనించిరి.

విశ్వామిత్రుడు కోరగా దశరథుడు యజ్ఞ విఘ్నములను తొలగించుటకై లక్ష్మణ సమేతుడైన రాముని విశ్వామిత్రునితో పంపెను. తాటకను సంహరించిన రాముడు, విశ్వామిత్రుని నుండి అస్త్ర శస్త్రములను పొందెను. మానవాస్త్రముచే మారీచుని మూర్ఛితుని చేసి దూరముగా పడవేసెను. బలవంతుడైన ఆ రాముడు యజ్ఞమును పాడుచేయుచున్న సుబాహుని సేనా సహితముగా సంహరించెను. సిద్ధాశ్రమమునందు నివసించినవాడై, విశ్వామిత్రాదులతో కలిసి, లక్ష్మణ సమేతుడై, జనకుని యజ్ఞమును, ధనస్సును చూచుటకై వెళ్ళెను. శతానందుడు విశ్వామిత్రుని ప్రభావమునుగూర్చి రామునకు చెప్పెను. ఆ యజ్ఞము నందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను.

రాముడు ధనస్సును ఎక్కుపెట్టి దానిని సునాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు, అయోనిజయు అగు తన కన్యయైన సీతను రామునకు ఇచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నులును వివాహమాడిరి. 

ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరింపబడినవాడై, వసిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి అయోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్తు నగరమునకు వెళ్ళెను. (5)