అగ్ని మహా పురాణము
ఆత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి
అగ్నిదేవుడు పలికెను:
ఆత్యంతిక ప్రళయమును గూర్చి చెప్పెదను. ఇది జ్ఞానము వలన కలుగును, ఆధ్యాత్మి కాది సంతాపమును తెలుసుకొని మానవుడు తన విషయముననే కొంత వైరాగ్యమును పొందవలయును. అపుడు జ్ఞానము కలుగును. ఆధ్యాత్మిక సంతాపము ‘శారీరము’, మానసము అని రెండు విధములు. శారీరక సంతాపము అనేక విధములైనది. వాటిని గూర్చి వినుము. జీవుడు భోగదేహమును త్యజించి కర్మానుసారముగ గర్భమును చేరును. ఆతివాహికమను ఒకే దేహముండును. మనుష్యులకు మృత్యుకాలము వచ్చినపుడే ఆదేహము లభించును. యమదూతలు ఆ శరీరమును యమలోక మార్గమున యమ లోకమునకు తీసుకొని పోవుదురు. ఇతర ప్రాణులకు ఈ అతివాహిక శరీరము ఉండదు. యమలోకమునకు వెళ్ళిన జీవుడు కొంతకాలము స్వర్గము, కొంతకాలము నరకము పొందుచు ఘటయంత్రమువలె తిరుగుచుండును. ఇది కర్మ భూమి. పరలోకము ఫలభూమి. యముడు ఆయా జీవుల కర్మానుసారముగా వివిధ యోనులను నరకములను వారికి ఇచ్చును. ఆతడే నరకములను నింపుచుండును. యముడే వీరికి నియామకుడు. జీవుడు వాయురూపమున గర్భములో ప్రవేశించుచుండును. యమదూతలచే తీసుకొని వెళ్ళబడిన జీవుని యముడు చూచును, ఆ జీవుడు ధర్మాత్ముడైనచో యముడు ఆతనిని పూజించును. పాపాత్ముడైనచో తన లోకమున ఆతనిని దండించును. వాని శుభాశుభ కర్మలను గూర్చి చిత్రగుప్తుడు వివరించి చెప్పును, బంధువులకు అశౌచము తీరువరకును జీవుడు ఆతివాహిక శరీరములోనే వుండి వారిచ్చిన పిండములను భుజించును. పిదప ప్రేతలోకము చేరి ప్రేతదేహమును విడచి మరియొక భోగ దేహమును పొంది ఆకలి దప్పికలతో బాధపడుచు అచట నివసించును. శ్రాద్ధ రూపమున ఇవ్వబడు ఆమద్రవ్యమును అతడు భుజించును. ప్రేతకు పిండదానము లేకుండగ చేసినిచో వానికి అతివాహిక దేహము నుండి విడుదల ఉండదు. సపిండీకరణ శ్రాద్ధము జరిగిన సంవత్సరము తరువాత వాడు ప్రేతదేహము విడచి భోగదేహమును పొందును. శుభదేహము, అశుభ దేహము అని అది రెండు విధములు. ఆ దేహముతో కర్మ బంధములను అనుభవించిన పిమ్మట, మర్త్య లోకమునకు గెంటివేయబడును. అప్పుడు అతను విడిచిన దేహమును రాక్షసులు భక్షింతురు. మొదట పుణ్య ఫలమగు స్వర్గమును అనుభవించినచో పాప భోగము మిగిలి ఉన్నచో మరొక భోగశరీరమును ధరించును. కాని పాప ఫలమును అనుభవించినవాడు పిదప స్వర్గ సుఖమును అనుభవించి దాని పిమ్మట స్వర్గ భ్రష్టుడై పవిత్రులగు శ్రీమంతుల గృహములందు జనించును. పుణ్యము వుండగా ముందు పాపఫలము అనుభవించినవాడు ఫల భోగము పూర్తియైన పిమ్మట ఉత్తమ దేహమును ధరించును. కర్మ భోగము కొంచెము మాత్రమే మిగిలియుండగా జీవునకు నరకము నుండి విముక్తి లభించును. నరక విముక్తుడు తిర్యగ్యోనిలో పుట్టును. సందేహము లేదు.
గర్భములో ప్రవేశించిన జీవుడు కలలము నందుండును. రెండవ మాసమున గట్టిపడును. మూడవ మాసమున అవయవములు ప్రకటమగును. నాల్గవ మాసమున అస్థి మాంసత్వక్ లు ఏర్పడును. ఐదవ మాసమున రోమములు పుట్టును. ఆరవ మాసమున చైతన్యము ఏర్పడును. ఏడవ మాసము నుండి దుఃఖమును అనుభవింప ప్రారంభించును. మావితో చుట్టబడిన దేహమునందు శిరస్సుపై దోసిలి కట్టి యుండును. గర్భమధ్యమున ఉన్నచో నపుంసకుడు, వామభాగములో ఉన్నచో స్త్రీ, కుడి ప్రక్కవున్నచో పురుషుడు, ఉదరము నందుండి పృష్ఠ భాగమునకు అభిముఖుడుగా వుండును. తాను ఏ యోని యందున్నాడో వానికి తెలియును. సందేహములేదు. నరజన్మ మొదలు సకల వృత్తాంతమును స్మరించును. ఆ అంధకారమున మానవుడు గొప్ప పీడను పొందును. ఏడవ మాసమున తల్లి భుజించిన ఆహారమును ఆ శిశువు పొందును. అష్టమ, నవమమాసము లందు మిక్కిలి ఉద్విగ్నుడగును, మైథునము నందు ఇంకను పీడను పొందును. తల్లి అధిక వ్యాయామము చేసినను శిశువునకు పీడ కలుగును. ఆమెకు వ్యాధి ఉన్నచో శిశువు కూడా ఆరోగము యొక్క కష్టమును అనుభవించును. ఒక ముహూర్తము నూరు సంవత్సరములవలె కనబడును.
కర్మలతో బాధపడుచు ఎన్నియో మనోరథములు కలిగి యుండును. గర్భము నుంచి బయట పడగనే మోక్ష జ్ఞానమునకు ప్రయత్నము చేయునట్లు ఉండును. ప్రసూతి వాయు ప్రేరణచే అధోముఖుడై యోనియంత్ర పీడితుడై బయటపడును. ఒక మాసము వరకు చేతితో ముట్టుకొనినను వానికి పీడ కలుగును. ఆకాశము వలన వాని శరీరమున చిన్న చిన్న రంధ్రములు, చెవి మొదలగునవి ఏర్పడును. వాయువు వలన శ్వాసోచ్ఛ్వాసములు గతి, అవయవములను ఇటు అటు తిప్పుతూ స్పృశించుట ఏర్పడును. అగ్ని వలన రూపము నేత్రములు వేడి జీర్ణశక్తి పిత్తము, మేధ, వర్ణము, బలము, ఛాయ తేజస్సు శౌర్యము - ఇవి శరీరమునందు ఏర్పడును. జలము వలన చెమట, ఆస్వాదము, వస, రస, గ్రహణశక్తి రక్తము, శుక్ర మూత్ర కఫాదికము ఏర్పడును. భూమి వలన ఘ్రాణ కేశ, నఖములు బరువు ఏర్పడును. శరీరమునందలి త్వఙ్మాంస హృదయ, నాభి, మజ్జా, మఖ మేదస్, క్లేదనములు, ఆమాశయములు తల్లివలన పుట్టినవి. శిరస్ స్నాయు శుక్రములు తండ్రివల్ల పుట్టును. కామ క్రోధ భయ హర్ష, ధర్మ, ఆకృతి, స్వర, వర్ణ మేహనము మొదలైనవి జీవుని శరీరమున స్వతః ప్రకటనమగును. అజ్ఞాన, ప్రమాద, ఆలస్య, క్షుధా, తృషా, మోహ, మాత్సర్య, వైగుణ్య, శోక, ఆభాస భయాదులు తమ గుణమువలన బుట్టును. కామ, క్రోధ, శౌర్య, యజ్ఞాభిలాష బహు భాషిత అహంకార అనాదరములు రజోగుణము వలన పుట్టును. ధర్మాభిలాష, మోక్షకామిత్వము విష్ణువుపై ఉత్తమ భక్తి, దాక్షిణ్యము, ఉద్యోగ శీలత్వము. ఇవి సత్త్వగుణము వలన పుట్టును.
చపలుడు క్రోధి భీరువు బహుభాషి కలహప్రియుడు స్వప్నము నందు ఆకాశములో సంచరించువాడు అగు మనుష్యునిలో వాతము ప్రధానముగా ఉండును. అకాలమున జుట్టు నెరసినవాడు, కోపశీలుడు, మహాబుద్ధిమంతుడు, యుద్ధ ప్రియుడు, స్వప్నమునందు ప్రకాశించుచున్న వస్తువులను చూచువాడు అగు మనుష్యునియందు పిత్తము అధికముగా ఉండును. స్థిరమైన మైత్రి కలవాడు స్థిరోత్సాహుడు స్థిరాంగుడు ధనవంతుడు స్వప్నమున శ్వేత వస్త్రమును చూచువాడగు మనుష్యునిలో కఫము అధికముగా నుండును. ప్రాణుల దేహమున రసము జీవనమును, రక్తము లేపనమును, మాంసము, మోహన స్నేహనము లను కలిగించును. అస్థులు-మజ్జ శరీరమును నిలుపును. వీర్యవృద్ధి శరీరమును పూర్ణము చేయును. ఓజస్సు శుక్ర వీర్యవృద్ధికరము. జీవుని స్థితికి ప్రాణమునకు అవష్టంభకము. ఓజము శుక్రము కంటే ఎక్కువ సారము కలది. అది హృదయ సమీపము నందుండును. కొంచెము పసుపు పచ్చగ వుండును. కాళ్ళు బాహువులు, శిరస్సు, ఉదరము-ఇవి షడంగములు. చర్మములో ఆరు పొరలుండును. బయటకు కనబడునది బాహ్యము. రక్తము ధరించునది రెండవది. మూడవది కిలాసమును, నాల్గవది కుండమును ధరించును. ఐదవది ఇంద్రియముల స్థానము. ఆరవది ప్రాణధారణము చేయునది. కల కూడ ఏడు విధములు. మొదటిది మాంసములు ధరించును. రెండవది రక్తమును, మూడవది యకృత్ ప్లీహలను, నాల్గవది మేధస్సును అస్థులను, ఐదవది మజ్జా శ్లేష్మ పురీషములను, ఆరవది పిత్తమును, ఏడవది శుక్రమును ధరించును, ఐదవది పక్వాశయము నందును, ఏడవది శుక్రాశయము నందును ఉండును. (369)
