అగ్ని మహా పురాణము
యదువంశ వర్ణనము
అగ్నిదేవుడు పలికెను:
యదువునకు నీలాంజికుడు, రఘువు, క్రోష్టు, శతజిత్, సహస్రజిత్ అను ఐదుగురు పుత్రులు జన్మించిరి. వారిలో సహస్రజిత్ జేష్ఠుడు. శతజిత్తునకు హైహయుడు, రేణు హయుడు, హయుడు అని ముగ్గురు పుత్రులు పుట్టిరి. హైహయునకు ధర్మనేత్రుడు వానికి సంసాతుడు, వానికి మహిముడు, వానికి భద్రసేనుడు, వానికి దుర్గముడు, వానికి కడు జన్మించిరి. కనకునకు కృతవీర్య, కృతాగ్ని, కరవీర, కృతౌజులను పుత్రులు జన్మించిరి. కృతవీర్యుని కుమారుడు అర్జునుడు. ఆతని తపస్సుకు ప్రసన్నుడైన దత్తాత్రేయుడు ఆతనికి సప్తద్వీప పరివృతమగు పృథ్విపై ఆధిపత్యమును, వెయ్యి భుజములను యుద్ధమునందు అజేయత్వమును వరముగ ఇచ్చి ‘నీవు ఎప్పుడు అధర్మము చేయుదువో అపుడు శ్రీమహా విష్ణువు నిన్ను సంహరించును’ అని చెప్పెను. అర్జునుడు పదివేల యజ్ఞములు చేసెను. అతనిని స్మరించగనే రాష్ట్రములో ఎవరికిని ధన నాశనము కలుగకుండెను. యజ్ఞదాన, తపఃపరాక్రమ, శాస్త్రజ్ఞానములందు కృతవీర్య కుమారుడగు అర్జునునకు సాటి ఎవ్వరును లేరు. ఆతనికి ఐదువందల పుత్రులు జనించిరి. వారిలో శూరసేన, శూర, ధృష్టోక్త, కృష్ణ, జయధ్వజులు అను ఐదుగురు ప్రధానులు. జయధ్వజుడు అవంతీ దేశరాజాయెను. అతనికి తాలజంఘుడు పుత్రుడు. తాలజంఘునకు అదే పేరుతో ప్రసిద్ధులగు చాలమంది పుత్రులు జనించిరి. హైహయవంశ క్షత్రియు లలో భోజ, అవంతీ, వీతిహోత్ర, స్వయం సంజాత, శౌండికేయులను ఐదు కులములు ఉండెను. వీతిహోత్రునకు అనంతుడు అతనికి దుర్జయుడు జన్మించెను.
ఇప్పుడు క్రోష్టు వంశమును గూర్చి చెప్పెదను, ఈ వంశమున శ్రీమహావిష్ణువు స్వయముగ జన్మించెను. క్రోష్టునకు వృజినీ వంతుడు అతనికి స్వాహా, వానికి రుషద్గుడు, అతనికి చిత్రరథుడు ఆతనికి చక్రవర్తియైన శశిబిందువు జనించిరి. శశిబిందువు సర్వదా విష్ణుభజనసక్తుడై యుండెను. ఆతనికి పదివేలమంది పుత్రులు పుట్టిరి. వారందరును అధిక ధనవంతులు తేజశ్శాలులు అయి వుండిరి. వారిలో పృథుశ్రవుడు జ్యేష్టుడు. అతని కుమారుడు సుయజ్ఞుడు. అతనికి ఉశనుడు ఆతనికి తితిక్షువు, ఆతనికి మరుత్తుడు, ఆతనికి ఋక్మ కవచుడను కంబలబర్హిశుడు పుట్టెను. ఋక్మ కవచునకు ఋక్మేశువు, పృథు రుక్మకుడు, హవి, జ్యామగుడు, పాపఘ్నుడు మొదలగు ఏబదిమంది పుత్రులు జన్మించిరి. వీరిలో జ్యామగుడు స్త్రీలకు లొంగినవాడై యుండెను. వానికి శైబ్యయందు విదర్భుడు అను కుమారుడు పుట్టెను. ఆతనికి కౌశికుడు లోమపాదుడు క్రథుడు అను పుత్రులు పుట్టిరి. వీరిలో లోమపాదుడు జ్యేష్ఠుడు. అతనికి కృతి అను పుత్రుడు పుట్టెను. కౌశికుని పుత్రుడు చిది. ఈ వంశమువారు వైద్యులు అను పేరుతో ప్రసిద్ధులు, విదర్భ పుత్రుడగు పృథునకు కుంతి, కుంతికి ధృష్టకుడు పుట్టిరి. వానికి ధృతి, వానికి విదూరథుడు, పుట్టిరి. విదూరథునకు దశార్హుడనికూడ పేరు. దశార్హునకు వ్యోముడు, వానికి జీమూతుడు వానికి వికలుడు వానికి భీమరథుడు, వానికి నవరథుడు, వానికి ధ్రుఢరథుడు, వానికి శకుంతి, వానికి కరంభుడు, వానికి దేవరాతుడు, వానికి దేవక్షేత్రుడు, వానికి మధువు, వానికి ధ్రవరసుడు, వానికి పురుహూతుడు, వానికి జంతువు, వానికి సాత్వతుడు పుట్టెను. సాత్వతుడు యదువంశీయులలో ఉత్తమ గుణవంతుడగు రాజు. ఆతనికి భజమానుడు, వృష్టి, అంధకుడు, దేవావృథుడు అను నలుగురు పుత్రులు పుట్టిరి. ఈ నలుగురి వంశములును ప్రసిద్ధములైనవి. భజమానునకు బాహ్యుడు, వృష్టి-కృమి, నిమి, అను పుత్రులు పుట్టిరి. దేవావృధునకు బభ్రువు పుట్టెను. ఆతని విషయమున ఈ శ్లోకము చెప్పబడుచున్నది. ‘మనము దూరము నుండి సద్గుణములను ఎట్లు వినుచున్నామో, దగ్గరనుండి కూడ అట్లే చూచుచున్నాము. బభ్రువు మనుష్యులలో శ్రేష్ఠుడు. దేవావృధుడు దేవతా సమానుడు’. బభ్రువునకు కుమారుడు భజమానుడు శిని, కంబలబర్హిషుడు అను వాసుదేవ భక్తులగు నలుగురు కుమారులు పుట్టిరి.
కుమారునకు ధృష్ణువు వానికి ధృతి వానికి కపోతరోముడు వానికి తిత్తిరి వానికి నరుడు వానికి ఆనక దుందుభి పుట్టిరి. ఆనక దుందుభికి పునర్వసువు ఆతనికి ఆ హుకీ పుత్రుడగు ఆ హుకుడు పుట్టెను. ఆహుకునకు దేవక ఉగ్రసేనులు పుత్రులు. దేవకునకు దేవవంతుడు ఉపదేవుడు సహదేవుడు దేవరక్షితుడు అను నలుగురు పుత్రులు పుట్టిరి. వీరికి ఏడుగురు సోదరీలు ఉండిరి. వారిని వసుదేవుడు వివాహమాడెను. దేవకి, శ్రుతదేవి, మిత్రదేవి, యశోధర, శ్రీదేవి, సత్యదేవి, సురాపి అని వీరి పేర్లు. ఉగ్రసేనునకు కంస, న్యగ్రోధ, సునామ, కంక, శంకు, సుతను, రాష్ట్రపాల, యుద్ధముష్టి, సుముష్టికులను అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. వీరిలో కంసుడు జ్యేష్ఠుడు. భజమానునకు ఉత్తమ రథికుడైన విదూరథుడు అతనికి రాజాధి దేవశూరులు పుట్టిరి. రాజాధి దేవునకు శోణాశ్వుడు, శ్వేతవాహనుడు అను ఇరువురు పుత్రులు జన్మించిరి. శోణాశ్వునకు శని శత్రుజిత్, మొదలగు ఐదుగురు పుత్రులు జన్మించిరి. శమికి ప్రతిక్షేత్రుడు, వానికి భోజుడు, వానికి హృదికుడు జన్మించిరి. హృదికుని పదిమంది పుత్రులలో కృతవర్మ, శతధన్వుడు, దేవార్హుడు, భీషణుడు మొదలగువారు ప్రధానులు. దేవార్హునకు కంబలబర్హి ఆతనికి అస మౌజుడు, ఆతనికి సుదౌష్ట్ర, సువాస, ధృష్టులు జన్మించిరి. ధృష్టునకు గాంధారి, మాద్రియను ఇద్దరు భార్యలుండిరి. గాంధారియందు సుమిత్రుడు, మాద్రియందు యుధాజిత్తు పుట్టిరి. ధృష్టునకు అనమిత్రుడు శిని పుట్టిరి. శనికి దేవమీఢుషుడు జనించెను. అనమిత్రునకు నిఘ్నుడు ఆతనికి ప్రసేన-సత్రాజిత్తులు పుట్టిరి. సోదరుడగు సత్రాజిత్తుకు సూర్యుని నుండి లభించిన శ్యమంతక మణిని ధరించి ప్రసేనుడు వేటకై వెళ్లగా ఒక సింహము అతనిని చంపి మాణిక్యమును గ్రహించెను. ఆ సింహమును చంపి జాంబవంతుడు ఆ మణిని తీసుకొనెను. పిదప శ్రీ కృష్ణుడు యుద్ధమునందు జాంబవంతుని ఓడించి జాంబవతిని ఆ మణిని స్వీకరించి ద్వారకాపురికి తిరిగివచ్చి మణిని సత్రాజిత్తుకు ఇచ్చివేసెను. శతధన్వుడు సత్రాజిత్తును చంపివేసెను. శ్రీకృష్ణుడు శతధన్వుని చంపి ఆ మాణిక్యమును లాగుకొని యశశ్శాలి అయ్యెను. ఆతడు బలరామాది యదువంశీయుల సమక్షమున ఆ మణిని అక్రూరునకు ఇచ్చెను. దీనితో శ్రీకృష్ణునిపై వచ్చిన మిథ్యారోపము తొలగి పోయెను. ఈ కథను చదువువానికి స్వర్గము లభించును. సత్రాజిత్తునకు బంకకారుడను పుత్రుడు శ్రీకృష్ణుని భార్యయగు సత్యభామయు జనించిరి. అపమిత్రునకు శని వానికి సత్యకుడు వానికి యుయుధానుడు అను నామాంతరముగల సాత్యకి, వానికి ధుని, వానికి యుగంధరుడు పుట్టిరి. యుధాజిత్తునకు స్వాహ్యుడు వానికి ఋషభ, క్షేత్రకులు పుట్టిరి. ఋషభునకు స్వఫల్కుడు, వానికి అక్రూరుడు, వానికి సుధన్వకుడు పుట్టిరి. శూరునకు వసుదేవుడు మొదలగు పుత్రులు పృథయను కన్యయు పుట్టిరి. ఆమె పాండురాజునకు భార్య. కుంతియను నామాంతరముగల ఆమెకు (పృథ) యముని అంశముచే యుధిష్ఠిరుడు, వాయు అంశముచే భీమసేనుడు, ఇంద్రాంశముచే అర్జునుడు జన్మించిరి. మాద్రికి నకుల సహదేవులు జన్మించిరి. వసుదేవునకు రోహిణియందు బలరామ సారణ దుర్గములు అను ముగ్గురు పుత్రులు, దేవకియందు సుషేణ, కీర్తిమత్, భద్రసేన, జారుఖ్య, విష్ణుదాస, భద్ర దేహులు జన్మించిరి. ఈ ఆరుగురు శిశువులను కంసుడు చంపివేసెను. పిదప బలరామ కృష్ణులు ఆవిర్భవించిరి. చివర కల్యాణ వచనముగల సుభద్ర జన్మించెను. శ్రీకృష్ణునకు చారుధేష్ణుడు సాంబుడు మొదలగు పుత్రులు పుట్టిరి. సాంబాదులు జాంబవతి పుత్రులు. (275)
