అగ్ని మహా పురాణము

Table of Contents

పురువంశవర్ణనము

అగ్నిదేవుడు పలికెను:

పురువునకు జనమేజయుడు, వానికి ప్రాచీవంతుడు, వానికి మనుష్యుడు వానికి వీతమయుడు, వానికి శంధుడు, వానికి బహువిధుడు, వానికి సంయాతి, వానికి రహోవాది, వానికి భద్రాశ్వుడు పుట్టెను. భద్రాశ్వునకు ఋచేయు, కృషేయు, సన్నతేయు, ఘృతేయు, చితేయు, స్థండిలేయు, ధర్మేయు, సంసతేయు, కృతేయు మతినారులను పదిమంది పుత్రులు పుట్టిరి. మతినారునకు తంసురోధ, ప్రతిరథ, పురస్తులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. ప్రతిరథునకు, దుష్యంత, ప్రవీరక, సుమంత, వీరవరులను నలుగురు పుత్రులు పుట్టిరి. దుష్యంతునకు భరతుడు పుట్టెను. భరతుడు శకుంతలా పుత్రుడు; మహాబలశాలి. ఇతని వంశమున పుట్టిన వారికి భారతులను పేరు వచ్చినది. భరతుని పుత్రులు మాతృ క్రోధముచే నశించగా, రాజు యజ్ఞము చేసెను. అపుడు మరుద్గణములు బృహస్పతి పుత్రుడగు భరద్వాజుని తీసుకొని వచ్చి ఆతనిని ఆ రాజునకు పుత్రునిగా ఇచ్చిరి. ఇతడు వితధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యెను వితథునకు సుహోత్రుడు, సుహోత్రునకు గయ, గర్భ, కపిలులు అను ఐదుగురు పుత్రులు పుట్టిరి. వీరుకాక మహాత్ముడు, సుకేతువు అను ఇరువురు  పుత్రులు పుట్టిరి. పిదప కౌశికుడు, గృత్సపతి అను పుత్రులు కూడ పుట్టిరి. గృత్సపతికి పుట్టిన అనేక మంది కుమారులలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరును ఉండిరి. కాశ-దీర్ఘతములు గృత్సపతి కుమారులే, దీర్ఘతమునకు ధన్వంతరి, వానికి కేతుమంతుడు, వానికి దివోదాసుడను ప్రసిద్ధిగల హిమరథుడు, వానికి ప్రతర్దనుడు వానికి భర్గ, వత్సులు, వత్సునకు అనర్కుడు, వానికి క్షేమకుడు, వానికి వర్షకేతువు, వానికి విభుడు, వానికి అనర్త, సుకుమారులు, సుకుమారునకు సత్యకేతువు పుట్టెను. వత్సరాజునకు వత్సభూమి యను పుత్రుడు పుట్టెను. వితథుని కుమారుడగు సుహోత్రునకు బృహత్ అనుపుత్రుడు పుట్టెను. బృహత్తునకు అజమీడ, ద్విమీఢ పురుమీఢులను ముగ్గురు పుత్రులు పుట్టిరి. అజమీడునకు కేశిని అను భార్యయందు జహ్నువు పుట్టెను. ఆతనికి అజకాశ్వుడు అతనికి బలాకాశ్వుడు అతనికి కుశికుడు, అతనికి ఇంద్రత్వమును సంపాదించిన గాధి. అతనికి సత్యవతి యను కుమార్తెయు, విశ్వామిత్రుడను కుమారుడును పుట్టెను. దేవరాతకతి ముఖాదులు విశ్వామిత్రుడి పుత్రులు. అజమీఢునకు శునశ్శేపుడు, అష్టకులను పేరుగల ఇతర పుత్రులును పుట్టిరి. ఆతనికి నీలినియను భార్యయందు శాంతియను మరొక పుత్రుడు కూడ పుట్టెను. శాంతికి పురుజాతి, వానికి బాహ్యశ్వుడు, వానికి ముకుల, సృంజయ, బృహదిషు, యవీనర, కృమిలులను ఐదుగురు కుమారులును పుట్టిరి. వీరికి పాంచాలులని ప్రసిద్ధి. ముకుల వంశీయులకు మౌకుల్యులని పేరు. వీరు క్షాత్రధర్మమును అనుసరించు బ్రాహ్మణులు. ముకులునకు చంచాశ్వుడు-వానికి ఒకపుత్రుడు పుత్రి కవలలు పుట్టిరి. పుత్రుని పేరు దివోదాసుడు, పుత్రికపేరు అహల్య, అహల్యకు శరద్వంతుని (గౌతముని) వలన శతానందుడు పుట్టెను. శతానందునకు సత్యధృక్ అను పుత్రుడు పుట్టెను. వానికి కృపుడు అనుపుత్రుడు, కృపియను పుత్రిక కవలలుగా పుట్టిరి. దివోదాసునకు మైత్రీయుడు వానికి సోమకుడు పుట్టెను. సుబుంజయునకు పంచహనుష్కుడు ఆతనికి సోమదత్తుడు, ఆతనికి సహదేవుడు, ఆతనికి సోమకుడు, ఆతనికి జంతువు, ఆతనికి ప్పషత్, వానికి ద్రుపదుడు, వానికి ధృష్టద్యుమ్నుడు, వానికి దృష్టకేతువు పుట్టెను. అజమీఢునునకు ధూమినియను భార్యయందు ఋక్షుడను పుత్రుడు పుట్టెను. ఆతనికి సంవరణుడు, ఆతనికి కురువు పుట్టెను. అతడు ప్రయాగనుంచి కురుక్షేత్ర తీర్థమును స్థాపించెను.

కురువునకు సుధన్వుడు, సుధనుడు, పరీక్షిత్తు, రిపుంజయుడు అను నలుగురు పుత్రులు పుట్టిరి. సుధన్వునకు సుహోత్రుడు వానికి చ్యవనుడు పుట్టెను. చ్యవనుని భార్యయైన గిరికయందు ఉపరిచర వసువు అంశచే, బృహద్రథ, కుశ, వీర, యదు, ప్రతిగ్రహ, బల, మత్స్యకాశి అను ఏడుగురు పుత్రులు పుట్టిరి. బృహద్రథునకు కుశాగ్రుడు, వానికి వృషభుడు, వానికి సుధన్వుడు, వానికి ఊర్ణుడు, వానికి సంభవుడు, వానికి జరాసంధుడు, వానికి సహదేవుడు, వానికి ఉదాపి, వానికి శ్రుతకర్మ పుట్టెను. కురునందనుడైన పరీక్షిత్తునకు జనమేజయుడను పుత్రుడు పుట్టెను. ఇతడు పరమ ధార్మికుడు. ఇతనికి త్రసద్దస్యువు అను పుత్రుడు పుట్టెను. అజమీఢుని కుమారుడగు జుహ్నునకు సురథ-శ్రుతసేన-ఉగ్రసేన-భీమసేనులను నలుగురు పుత్రులు పుట్టిరి. పరీక్షిత్ కుమారుడగు జనమేజయునకు సురథుడు మహిమంతుడు అను పుత్రులు పుట్టిరి, సురథునకు విదూరథుడు, వానికి ఋక్షుడు పుట్టెను. ఈ వంశములో ఇతడు ఋక్షుడను పేరుతో ప్రసిద్ధుడగు రెండవ రాజు.  ఇతనికి భీమసేనుడు, వీనికి ప్రతీపుడు వీనికి శంతనుడు, వీనికి దేవాది, బాహ్లిక, సోమదత్తులను ముగ్గురు కుమారులు జన్మించెను. బాహ్లికునకు సోమదత్తుడు, వానికి భూరి, భూరిశ్రవస్, శలులు పుట్టిరి. శంతనునకు గంగయందు భీష్ముడు పుట్టెను. కాల్య (సత్యవతి) అను భార్యయందు విచిత్ర వీర్యుడు పుట్టెను. విచిత్ర వీర్యుని భార్యయందు శ్రీకృష్ణ ద్వైపాయనునకు-ధృతరాష్ట్ర పాండు విదురులు పుట్టిరి. ఈ ఐదుగురు పాండవులును దైవాంశ సంభూతులు. అర్జునుని పుత్రుని పేరు అభిమన్యుడు. సుభద్రకు పుట్టినవాడు అభిమన్యునకు పరీక్షిత్తు అను పుత్రుడు పుట్టెను. ద్రౌపది పంచ పాండవుల భార్య, ఆమె యందు యుధిష్ఠిరునకు ప్రతివింద్యుడు, భీమసేనునకు హిడింబయందు పుట్టిన ఘటోత్కచుడను మరియొక పుత్రుడు ఉండెను. వీరందరును భూత కాలమునకు చెందిన రాజులు-భవిష్యత్తులో రాబోవు రాజుల సంఖ్యను ఎవరు చెప్పజాలరు, వీరందరును కాలగ్రస్తులై గడచిపోయిరి. ఓ వశిష్ఠా! కాలము విష్ణు స్వరూపము. అందుచేత ఆ విష్ణువునే పూజించ వలెను. ఆ విష్ణువునే ఉద్దేశించి అగ్నిలో హోమము చేయుము. ఆతడే సర్వమును ఇచ్చువాడు. (278)