అగ్ని మహా పురాణము
ద్వారప్రతిష్ఠా ధ్వజారోహణాది విధి
హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఇప్పుడు నేను అవభృథ స్నానమును గూర్చి చెప్పెదను. “విష్ణోర్నుకం వీర్యా” ఇత్యాది మంత్రముతో హోమము చేయవలెను. ఎనుబది ఒక్క పదముల వాస్తు మండపమునందు కలశస్థాపన చేసి వాటి ఉదకముతో శ్రీహరికి స్నానము చేయించవలెను. స్నానానంతరము గంధపుష్పాదులతో పూజించి, సమర్పించి, గురువును పూజించవలెను. ఇపుడు ద్వారప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. గురువు ద్వారము క్రింద బంగారమును ఉంచవలెను. ఎనిమిది కలశములతో అచట రెండు ఉదుంబరశాఖలు ఉంచవలెను. వైదికమంత్రములు చదువుచు, గంధాద్యుపచారములతో పూజించి కుండము లందు స్థాపింపబడిన అగ్నిలో సమిధలు, ఆజ్యము, తిలలు మొదలగునవి హోమము చేయవలెను. పిమ్మట శయ్యాది దానముచేసి క్రింద ఆధారశక్తిని స్థాపింపవలెను. ఆ రెండు శాఖల క్రింద చండ-ప్రచండులను దేవతలను స్థాపించవలెను. ఉదుంబర శాఖల పైభాగమున దేవవృంద పూజితురాలగు లక్ష్మిని స్థాపించి శ్రీ సూక్తముతో యథోచితముగ పూజింపవలెను. పిమ్మట బ్రహ్మను పూజించి, ఆచార్యునకు శ్రీఫలము (నారికేళ ఫలము) మొదలగు దక్షిణలు ఈయవలెను. ప్రతిష్ఠితమగు ద్వారముపై ఆచార్యుడు శ్రీహరిని స్థాపింపవలెను. దేవాలయ ప్రతిష్ఠను “హృత్ప్రతిష్ఠా” ఇత్యాది మంత్రముతో చేయవలెను. దానిని గూర్చి వినుము. వేదికంటె ముందు, (లేదా వేదికి తూర్పుగా) శుకనాస ఎచట సమాప్తమగునో అచట, గర్భగృహ శిరోభాగము నందు బంగారు కలశను గాని, వెండి కలశనుగాని స్థాపింపవలెను. దానిలో ఎనిమిది విధములైన రత్నములు, ఓషధులు, ధాతువులు, బీజములు, సువర్ణము ఉంచవలెను. ఆ కలశము కంఠమునకు వస్త్రము చుట్టి దానిని నీటితో నింపి, దానిని మండలముపై అధివాసితము చేయవలెను. దానిలో చిగుళ్లు వేయవలెను. పిమ్మట నృసింహమంత్రముతో అగ్నియందు ఆజ్యధార పోయుచు హోమముచేసి నారాయణ తత్త్వముతో ప్రాణ న్యాసము చేయవలెను.
సురేశ్వరా! ఆ ప్రాసాద కలశమును విరాడ్రూపముగ భావింపవలెను. మొత్తము ప్రాసాదమును పురుషునిగా భావన చేయవలెను. క్రింద సువర్ణముంచి, సువర్ణకలశను స్థాపింపవలెను. గురువు మొదలైనవారికి దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణులకు భోజనములు పెట్టవలెను. దానిపైన కంఠభాగము నందు దారముగాని మాలగాని చుట్టవలెను. దానిపైన కూడ ‘విమలామలసార’ అను పుష్పమాలను దేవాలయము నాల్గువైపుల కట్టవలెను. దానిపైన వృకలము, దానిపైన సుదర్శన చక్రము నిర్మింపవలెను. అచటనే వాసు దేవతా మూర్తి గ్రహగుప్తయని తెలుపవలెను. లేదా మొదట కలశమును, దానిపైన సుదర్శన చక్రమును ఏర్పాటు చేయవలెను. బ్రహ్మదేవా! వేదికి నలువైపుల ఎనమండ్రు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. లేదా నాలుగు దిక్కులందు నలుగురు విఘ్నేశ్వరులను స్థాపించవలెను. ఇపుడు భూతాదినినాశ గరుడధ్వజారోపణ విధానము చెప్పెదను.
దేవాలయమును నిర్మించినవారు, ప్రాసాదబింబ ద్రవ్యములలో ఎన్ని పరమాణువులున్నవో అన్నివేల సంవత్సరములు విష్ణు లోకములో నుందురు. పాపరహితుడవైన బ్రహ్మ దేవా! వాయువుచే కదల్చబడిన ధ్వజపటము కలశమును, వేదిని, ప్రాసాద బింబ కంఠమును ఎప్పుడు చుట్టుకొనునో అపుడు ప్రాసాదకర్తకు ధ్వజారోపణముకంటె కోటిరెట్లు అధికమగు ఫలము లభించునని తెలిసికొనవలెను. పతాక ప్రకృతి; దండము పురుషుడు; ప్రాసాదము వాసుదేవస్వరూపము. ప్రాసాదము భగవంతుని ధరించుచున్నదిగాన అదియే దానిలోని ధరణీతత్త్వము, దేవాలయమునందు ఏ శూన్యావకాశమున్నదో అదియే ఆకాశ తత్త్వము. దానిలోని ప్రకాశమే అగ్నితత్త్వము. దానిలో కలుగు వాయుస్పర్శయే వాయుతత్త్వము.
పాషాణాదులలో నున్న జలము పార్థివజలము. దానిలో పృథివీగుణమగు గంధముండును. ప్రతిధ్వనిరూప శబ్దమే అచటి శబ్దము. స్పృశింపగా కనబడు కఠిరత్వాదికమే స్పర్శ. శుక్లాది వర్ణములు రూపము. ఆహ్లాదమును కలిగించు రసమే రసము. ధూపాది గంధమే గంధము. భేరి మొదలగు వాయిద్యములలో ప్రకటమగు నాదమే వాక్కు. అది వాగింద్రియము వంటిది. అందుచే వాగింద్రియము అచటనే ఉన్నదని భావించవలెను. నాసిక శుకనాస యందు ఉండును. దాని రథకములు భుజములు. శిఖరముపై అండా కారమున ఉన్నది శిరస్సు. కలశము కేశపాశము. ప్రాసాదకంఠ భాగము కంఠము. వేది భుజము. రెండు నాళికలు గుదోపస్థలు. సున్నము త్వక్కు, ద్వారము ముఖము. ప్రతిమయే దేవాలయ జీవాత్మ. పిండిక జీవశక్తి. దాని ఆకారము ప్రకృతి, నిశ్చలత దాని గర్భము. నారాయణుడు దాని అధిష్ఠాత, ఈ విధముగ మహావిష్ణువే దేవాలయ రూపమున నిలచియున్నాడు. శివుడు కాళ్లు, బ్రహ్మ స్కంధముపై ఉన్నాడు. ఊర్థ్వ భాగమున సాక్షాత్తు విష్ణువే ఉండును. ఈ విధముగ ఉన్న ప్రాసాదమున ప్రతిష్ఠింపబడు ధ్వజమును గూర్చి వినుము. శస్త్రాది చిహ్నములతో కూడిన ధ్వజమును నిలబెట్టి దేవతలు దైత్యులను జయించిరి. అండముపై కలశము నుంచి, దానిపైన ధ్వజమును స్థాపింపవలెను. ధ్వజ మానము బింబమానములో సగముండవలెను. ధ్వజదండము పొడవులో మూడవ వంతుతో చక్రము నిర్మింపవలెను. ఆ చక్రమునందు ఎనిమిదికాని పండ్రెండు కాని ఆకులు ఉండవలెను. దాని మధ్య నృసింహుని మూర్తిగాని, గరుడుని మూర్తి గాని ఉండవలెను. ధ్వజదండము విరిగినదిగాని, రంధ్రాదులున్నది గాని కాకూడదు. దండము పొడవు ప్రాసాదము వెడల్పుతో సమముగా నుండవలెను. లేదా దాని పొడవు శిఖరము యొక్క సగము భాగము లేదా మూడవ వంతు ఎంతఉండునో అంత ఉండవలెను. లేదా ద్వారము పొడవుకంటె రెట్టింపు పొడవు ఉండవలెను. ఆ ధ్వజ దండమును దేవాలయముపై ఈశాన్యమున గాని, వాయవ్యమున గాని స్థాపింపవలెను.
ధ్వజ వస్త్రము (పతాక) పట్టుగుడ్డ మొదలైన వాటితో విచిత్రవర్ణముగ నుండునట్లు చేయవలెను. లేదా ఒకే రంగు ఉండునట్లు చేయవలెను. దానికి ఘంట, చామరములు, చిరుగంటలు కట్టినచో అది సర్వపాప వినాశకమగును. దండాగ్రము నుండి నేలవరకు వ్రేలాడు వస్త్రమునకు “మహా ధ్వజము” అని పేరు. అది సంపూర్ణ మనోరథములను ఇచ్చును. దానికంటె నాల్గవవంతు చిన్నదైన దానిని పూజించినచో సర్వమనోరథము సిద్ధించును. ధ్వజములో సగము ప్రమాణముగల వస్త్రముతో నిర్మించినదానికి ‘పతాక’ అని పేరు. లేదా పతాకకు కొలత ఏదియు అవసరములేదు. ధ్వజవిస్తారము ఇరువది అంగుళములు ఉండవలెను. చక్ర, దండ, ధ్వజముల అధివాసనమును దేవతా మూర్తులకువలె చేసి, స్రకలీకరణముగూడ కావించి, మండప స్నానాది కార్యములుకూడ చేయవలెను. నేత్రోన్మీలనము తప్ప వెనుక చెప్పిన కార్యములన్నియు చేయవలెను. ఆచార్యుడు వీటినన్నింటిని శయ్యపై ఉంచి అధివాసము చేయవలెను.
పిమ్మట విద్వాంసుడు “సహస్రశీర్షా” ఇత్యాది సూక్తమును ధ్వజాంకిత చక్రముపై న్యాసముచేసి, సుదర్శన మంత్రమును, మనస్తత్త్వమును గూడ న్యాసము చేయవలెను. అది మనోరూపమున ఆ చక్రమున సజీవీకరణము. సురశ్రేష్ఠా! పండ్రెండు ఆకులపై (అదములపై) క్రమముగ కేశవాది మూర్తుల న్యాసము చేయవలెను. కమలముపై నృసింహుని గాని, విశ్వరూపుని గాని ఉంచవలెను, దండముపై జీవ సహితుడగు సూత్రాత్మను న్యాసము చేయవలెను. ధ్వజముపై, శ్రీహరి ధ్యానము చేయుచు, నిష్కల పరమాత్ముని స్థాపించవలెను. ఆతని బలాబలరూప వ్యాపకశక్తిని ధ్వజరూపమున ధ్యానింపవలెను. మండపముపై దానిని స్థాపించి, పూజించి, కుండములలో హోమము చేయవలెను. కలశములో బంగారు ఖండము, పంచరత్నములు ఉంచి, అస్త్రమంత్రముతో చక్రమును స్థాపింపవలెను. పిమ్మట సువర్ణ చక్రమును, క్రిందనున్న పాదరసములో ముంచి నేత్ర పటముతో కప్పవలెను. పిమ్మట చక్రము నుంచి, దాని మధ్యమున శ్రీహరిని స్మరింపవలెను.
“ఓం క్షౌం నృసింహాయ నమః” అను మంత్రముతో హరిని స్థాపించి పూజించవలెను. పిమ్మట యజమానుడు, బంధుసమేతుడై ధ్వజము తీసికొని దాని అగ్రభాగమును పెరుగుపాత్రలో ముంచవలెను. “ఓం ఫట్” అను మంత్రముతో ధ్వజపూజ చేయవలెను. పిమ్మట ఆ పాత్రను తలపై పెట్టుకొని నారాయణ స్మరణ చేయుచు వాద్యధ్వనులతో, మంగళ పాఠములతో, పరిక్రమణము చేయవలెను. పిమ్మట అష్టాక్షర మంత్రముతో ధ్వజ దండమును స్థాపించవలెను. “ముఞ్చామి త్వా” ఇత్యాది సూక్తము చదువుచు ధ్వజములు విడువ (ఎగురవేయ) వలెను. ఆచార్యునకు పాత్ర, ధ్వజ, గజాదులు దానము చేయవలెను. ఇది ధ్వజారోపణ సాధారణ విధి. ఏ దేవతకు ఏ చిహ్నమో ఆ చిహ్నమే ఉన్న ధ్వజమును, ఆ దేవతా మంత్రముతో స్థిరముగ స్థాపింపవలెను. ధ్వజదానము చేసినవాడు స్వర్గమునకు వెళ్ళును; ఈ లోకమునందు బలవంతుడగు రాజగును. (61)
