అగ్ని మహా పురాణము

Table of Contents

యజుర్విధాన కథనము

పుష్కరుడు పలికెను:

పరశురామ! ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు యజుర్విధానమును చెప్పెదను వినుము. ఓంకార యుక్తములగు మహావ్యాహృతులు సకల పాప నాశకములు, సర్వకామ ప్రదములు. బుద్ధిమంతుడు వీటితో నూరు హోమములుచేసి దేవతలను ఆరాధించవలెను. దీనివలన మనో వాంఛితములగు కోరికలు తీరును. శాంతికాముడు యవలతోను, పాప వినాశనమును కోరువాడు తిలలతోను హోమము చేయవలెను. ధాన్యములతోను తెల్ల ఆవాలతోను హోమము చేసినచో సర్వకామములు సిద్ధించును. పశుకాముడు ఉదుంబర సమిధలతో హోమము చేయవలెను. అన్నకాముడు పెరుగు తోను, శాంతి కాముడు పాలతోను, అధిక సువర్ణకాముడు అపామార్గ సమిధలతోను హోమము చేయవలెను. కన్యకను కోరువాడు రెండేసిచొప్పున కట్టిన, నేతితో తడిపిన జాతి పుష్పములను హోమము చేయవలెను. కామము కోరువాడు తిలలను తండులములను హోమము చేయవలెను. వశీకరణ కర్మయందు శాకోట-వస-అపామార్గ-సమిధలను హోమము చేయవలెను. ఓ భార్గవా! రోగ నాశ నిమిత్తము విషరక్తములతో తడిపిన సమిధలు హోమము చేయవలెను. శత్రువధ కోరువాడు క్రోధ పూర్వకముగ పై సమిధలను హోమము చేయవలెను. ద్విజుడు అన్ని ధాన్యములతో ఒక రాజప్రతిమను నిర్మించి దానిని వేయిసార్లు హోమముచేసినచో రాజు వశమగును. వస్తకాముడు పుష్పములను హోమమును చేయవలెను. ‘దూర్వా’ హోమము వ్యాధి వినాశకము. బ్రహ్మతేజము కోరువాడు ఉత్తమ వస్త్రమును అర్పించవలెను. విద్వేషణ కర్మయందు ప్రత్యంగిరోక్త విధానాను సారముగ స్థాపించిన అగ్నియందు పొల్లుముల్లు, భస్మము, కాకి ఈకలు, గుడ్లగూబ ఈకలు హోమము చేయవలెను. చంద్రగ్రహణ సమయమున కపిలధేను ఘృతమును హోమముచేసి ఆ ఘృతమునందు వసా చూర్ణమును కలిపి ‘సంపాతము’ అనే ఆహుతినిచ్చి, మిగిలిన వసను తీసుకొని వెయ్యిసార్లు గాయత్రిచే అభిమంత్రించి, ఆ వసను తిన్నచో మేధావియగును. పదకొండు అంగుళముల లోహ శంకువు కాని ఖదిర వృక్షపు శంకువు కాని ‘ద్విషతోవధోఽసి’ (1.28) అను మంత్రమును జపిం చుచు శత్రువు ఇంటిలో పాతవలెను. ఈ విధముగా శత్రు వినాశకమగు కర్మను నీకు చెప్పితిని.. ‘చక్షుష్యా’ (2. 16) ఇత్యాది మంత్రమును జపించుటచే పోయిన చూపు వచ్చును. ‘ఉపయుంజతే’ ఇత్యాది అనువాకము అన్నమును ఇచ్చును. ‘తనూన పాగ్నేఽసి’ (3-17) ఇత్యాది మంత్రముతో దూర్వాహోమము చేసినచో సంకటములు దూరమగును. ‘భేషజమసి’ (3-59) ఇత్యాది మంత్రముతో పెరుగు, నెయ్యి హోమము చేసినచో పశువునకు వచ్చు మహామారి రోగములు తొలగిపోవును. ‘త్రియంబకం యజామహే’ (3–60) అను మంత్రము చేత చేసిన హోమము సౌభాగ్య వృద్ధికరము. కన్య యొక్క పేరు చెప్పికాని కన్యనుద్దేశించిగాని ఈ మంత్రముతో జపహోమములు చేసినచో ఇది కన్యా లాభమునకు ఉత్తమసాధనము. భయములు వచ్చినపుడు నిత్యము ఈ మంత్రమును జపించు వాడు భయ విముక్తుడగును, ఈ మంత్రముతో ఘృతమిశ్రతత్తూర పుష్పములను హోమము చేసిన వాడు సర్వకామములను పొందును. ఈ మంత్రముతో ‘గుగ్గులు’ హోమము చేసినవాడు స్వప్నము నందు శంకరుని చూచును. ‘యుంజతేమనః’ (5-14) అను అను వాకమును జపించినవాడు దీర్ఘాయుర్దాయమును పొందును. ‘విష్ణోరగటమసి’ అను మంత్రము సకల బాధలను నివారించును. రాక్షసులను నశింప చేయును. ఇది కీర్తివర్ధకము విజయప్రదము. ‘ఆయంనో అగ్నిః’ (5-37) ఇత్యాది మంత్రము యుద్ధమునందు జయప్రదము. ‘ఇదమాపః ప్రవహత’ (6-17) అను మంత్రము జపించుచు స్నానము చేసినచో పాపనాశకము. పది అంగుళముల పొడవైన ఇనుప ఊచను ‘విశ్వకర్మన్ హవిషా’ (7-22) అను మంత్రముచే అభిమంత్రించియే కన్యక యొక్క ద్వారమువద్ద పాతెదరో ఆ కన్యను మరెవరికి ఇవ్వజాలరు. ‘దేవసవితః’ (11-7) అను మంత్రముతో హోమము చేసినవాడు అన్నవంతుడగును.

బల కాముడగు ద్విజుడు ‘అగ్నౌస్వాహా’ అను మంత్రముతో తిలలు, యవలు, అపామార్గ సమిధలు తండులములు హోమము చేయవలెను. ఈ మంత్రముతో వెయ్యి పర్యాయములు అబిమంత్రించిన గోరోచనమును తిలకముగా ధరించినచో లోకప్రియుడగును. రుద్ర మంత్రముల జపము సర్వ పాప వినాశకము. వానితో చేసిన హోమము సర్వ కర్మ సాధకము. అంతటను శాంతి ప్రదాయకము. మేకలు, గొఱ్ఱెలు, గుర్రములు, ఏనుగులు, గోవులు, మనుష్యులు, రాజులు, బాలురు, స్త్రీలు, గ్రామములు, నగరములు, దేశములు, వివిధోపద్రవ పీడితములై రోగగ్రస్తులైనను మహామారీ భయము కాని శత్రుభయము కాని వచ్చినను ఘృత మిశ్రితమగు పాయసముతో రుద్రదేవతను ఉద్దేశించి హోమము చేసినచో గొప్పశాంతి లభించును. ఓ నరశ్రేష్టా! రాత్రియందు మాత్రమే సక్తువులు యవల గంజి భిక్షాన్నము భుజించుచు ఒక మాసముపాటు బయట స్నానము చేయు వాడు బ్రహహత్యా పాప విముక్తుడగును. ‘మధువాతా’ (13-17) ఇత్యాది మంత్రముతో హోమాదులు చేసినచో సర్వము లభించును. ‘దధిక్రావ్ ణో, (23-32) అను మంత్రముచే హోమముచేయు గృహస్తుడు నిస్సంశయముగా పుత్రులను పొందును. ‘ఘృత వతీ భువనా నామభి’ (34-45) అను మంత్రముతో ఘృతహోమము చేసినచో ఆయుర్వృద్ధి కలుగును. ‘స్వస్తినః ఇంద్రః’ (25-19) అను మంత్రము సమస్త బాధలను నశింపచేయును. ‘ఇహగావః ప్రజాయధ్వం’అను పుష్టివర్ధక మంత్రముతో వెయ్యి ఘృతహోమములు చేసినచో దారిద్ర్యము నశించును. ‘దేవస్యత్వా’ అను మంత్రముతో సృవముతో అపామార్గ సమిధలను, తండులములను హోమము చేసినవాడు శీఘ్రముగా అభిచార విముక్తుడగును. సంశయము లేదు. ‘రుద్రయత్తే’ (10-20) అను మంత్రముతో పలాశసమిధలను హోమము చేసినచో సువర్ణము లభించును. అగ్ని ప్రమాదము కల్గినపుడు ‘శివోభవ’ (11-45) అను మంత్రముతో వ్రీహిహోమము చేయవలయును. ‘యాః సేనాః’ అను మంత్రము చోరభయము తొలగించును. ‘యో అస్మభ్య మరాతీ యాత్’ (11-80) అను మంత్రముతో వెయ్యి తిలహోమములు చేయువాడు భయంకరమగు అభిచారము నుండి విముక్తుడగును. “అన్నవతే” (11-83) అను మంత్రముతో అన్న హోమమును చేసిన వానికి అన్నము లభించును. నీటిలో నిలచి ‘హంసః శుచిషత్’ (11-24) అను మంత్రమును జపించినచో సర్వపాపములు నశించును. నీటిలో నిలచి ‘చత్వారి శృంగా’ (17-91) అను మంత్రమును జపించినచో సర్వపాపములు నశించును. ‘దేవా యజ్ఞ మతన్వత’ (19-12) అను మంత్రమును జపించువాడు బ్రహ్మలోకమున పూజితుడగును. ‘వసంతోఽస్యాసీత్’ (31-14) అను మంత్రముతో ఆజ్యహోమము చేయువానికి సూర్యుడు వరముల నిచ్చును. ‘సువర్ణోఽసి’ (17-22) అను మంత్రముతో వ్యాహృతి మంత్రములతో చేసినట్లే కర్మ చేయవలెను. ‘నమఃస్వాహా’ ఇత్యాది మంత్రమును మూడు పర్యాయములు జపించినవాడు బంధ విముక్తుడగును నీటిలో నిలచి ‘ద్భుపదాదివ’ (20-20) అనుమంత్రమును మూడు పర్యాయములు చెప్పువాడు సర్వపాప విముక్తుడు అగును.

‘ఇహగావః ప్రజాయధ్వం’ అను మంత్రముతో నెయ్యి, పెరుగు, పాలు లేదా పాయసము హోమము చేసినచో బుద్ధి వృద్ధిచెందును. ‘శంన్నో దేవీః’ అను మంత్రముతో పలాశఫలములను హోమము చేసినవానికి ఆరోగ్యము, లక్ష్మి చిరజీవనము లభించును. ‘ఓషధీః ప్రతిమోదధ్వం’ (12-17) అను మంత్రముతో విత్తనములు చల్లునపుడు, పంట కోయునపుడు హోమము చేసినచో అర్థప్రాప్తి కలుగును. ‘అశ్వావతీః’ (34-40) అను మంత్రముతో పాయస హోమము చేసిన శాంతి లభించును. ‘తస్మా అరం’ (36-16) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో బందీయైనవాడు విడువబడును. ‘యువాసు వాసా (తై!!బా!! 3-6-13) అను మంత్రముతో హోమము చేసిన వస్తము లభించును. ‘ముంచన్తు మాశపథ్యాత్’ (12-90) ఇత్యాది మంత్రముతో హోమము చేసినచో శాపాదులు నశించును. ‘మామాహింసీజనితాః’ (12-102) అను మంత్రముతో ఘృతమిశ్ర తిలలు హోమము చేయగ శత్రువులు నశింతురు. ‘నమోఽస్తు సర్వేభ్యః’ (13-6) అను మంత్రముతో ఘృత హోమము ‘కృణుధ్వం రాజు’ అను మంత్రముతో పాయసమును హోమము చేసినచో అభిచారము నశించును. ‘కాండాత్కాండాత్’ (13-20) అను మంత్రముతో దూర్వాకాండములను వెయ్యిపర్యాయములు హోమముచేసినచో గ్రామములో గాని జనపదములోగాని వ్యాపించిన మహామారి శాంతించును. రోగ పీడితుడు రోగ విముక్తుడగును. దుఃఖితుడు దుఃఖ విముక్తుడగును. ‘మధుమాన్నోవనస్పతిః’ (13-29) అను మంత్రముతో వెయ్యి ఉదుంబర సమిధలు హోమము చేయుటచే ధనము గొప్ప సౌభాగ్యము, వ్యవహారములో విజయము లభించును. ‘అపాంగర్భంసీద’ (వా॥ 13-30) అను మంత్రముతో హోమము చేయువాడు తప్పక పర్జన్య దేవునిచే వర్షము కురింపచేయును. ‘అపఃపిబన్’ (14-8) ఇత్యాది మంత్రముతో దధిఘృత మధువులను హోమము చేసినచో వెంటనే గొప్ప వర్షము కురియును. ‘నమస్తేరుద్ర’ (16-1) అను మంత్రము సర్వోపద్రవ నాశకము, సర్వశాంతికరము, మహాపాతకములను నశింప చేయును. ‘అధ్యవోచ దధివక్తా’ (16-5) అను మంత్రముతో హోమము చేసినచో వ్యాధిగ్రస్తుడు రక్షింపబడును, రాక్షసులు నశింతురు, యశస్సులు లభించును. చిరాయువు పుష్టివృద్ధి కలుగును. ఈ మంత్రము చదువుతూ మార్గమునందు తెల్ల ఆవాలను చల్లు బాటసారి సుఖవంతుడగును ‘అసౌయ స్తామ్రః’ (16-6) అను మంత్రమును చదువుచూ, నిత్యము సాయం ప్రాతఃకాలములందు, ఆలస్యరహితుడు సూర్యోపస్థానము చేయుడు, అక్షయమైన అన్నమును, దీర్ఘాయువును పొందును. ‘ప్రముంచధన్వన్’ (16-9-14) ఇత్యాది మంత్ర షట్కముతో ఆయుధములను అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులకు భయము కలుగును. ఈ విషయమున మరియొక విధముగా ఆలోచింప పనిలేదు. ‘మానోమహాంతం’ (16-15) అను మంత్రము బాలలకు శాంతికారకము. ‘నమో హిరణ్య వాహవే’ అను అను వాకములతో తైలము కలిపిన రాజికలను హోమము చేసినచో శత్రువులు నశింతురు. ‘నమోవః కిరికేభ్యః’ (16-46) అను మంత్రముతో ఒక లక్ష కమలములను హోమము చేసినవాడు రాజ్యలక్ష్మిని, ఒక లక్ష బిల్వ ఫలముల హోమము చేసినవాడు, సువర్ణ రాశిని పొందును. ‘ఇమారుద్రాయ’ (16-48) అను మంత్రముతో తిలహోమము చేసినచో ధనము లభించును. ఈ మంత్రము తోనే దూర్వా హోమము చేసినచో సర్వవ్యాధులు నశించును. ‘అశుఃశిశానః’ (17-33) అను మంత్రముతో ఆయుధములకు రక్ష, యుద్ధములందు సర్వ శత్రువినాశము కలుగును. ‘వాజశ్చమే’ (18-15-19) ఇత్యాది మంత్ర పంచకముతో ఆజ్యాహుతులు వెయ్యి చేసినచో నేత్ర రోగముల నుండి విముక్తుడగును.

‘శంనో వనస్పతే’ (19-38) అను మంత్రముతో గృహము నందు హోమము చేసినచో వాస్తు దోషములు నశించును. ‘అగ్న ఆయానాంసి’ (19-38) అను మంత్రముతో ఆజ్య హోమము చేయువానికి ఎవ్వనితోను వైరముండదు. ‘అంపాంఫేనేన’ (19-71) అను మంత్రముతో లాజహోమము చేసినవాడు విజయము పొందును. ‘భద్రాహుత’ (14-39) అను మంత్రమును జపించిన ఇంద్రియహీనుడు, లేదా దుర్బలేంద్రియుడుగా ఉన్నవాడు ఇంద్రియశక్తి సంపన్నుడగును. ‘అశిశ్చపృథివీచ’ (26-1) అను మంత్రము గొప్ప వశీకరణ మంత్రము. ‘అధ్వనా’ (5-33) అను మంత్రమును జపించువాడు వ్యవహారమున జయమును పొందును. కార్యప్రారంభమున బ్రహ్మ క్షత్రం పవతే’ (19-5) అను మంత్రము జపించినచో కార్యసిద్ధి కలుగును. “సంవత్నరోఽసి” అను మంత్రముతో లక్ష ఆజ్య హోమములు చేసినవాడు రోగ విముక్తుడగును. “కేతుంకృణ్వన్” (20-37) అను మంత్రము యుద్ధమునందు జయవర్ధకము. “ఇంద్రోఽగ్ని ధర్మః” అను మంత్రమును యుద్ధమునందు ధర్మ సమ్మతమైన విజయమునిచ్చును. ధనుస్సును ధరించునపుడు ‘ధన్వ నాగా’ (29-39) అను మంత్రమును జపించుట ఉత్తమము. ‘యజీత అను మంత్రముచే ధనుస్సు నభిమంత్రించవలెను. ‘అహిరివ’ (29-51) అను మంత్రముచే బాణములను అభిమంత్రించవలెను. ‘వహ్నీనాం పితః (29-42) అను మంత్రముతో తూనీరమును అభిమంత్రించవలెను. ‘యుంజన్త్యస్యా’ (23-6) అను మంత్రమును చదువుచు గుర్రములను రథములకు కట్టవలెను. యాత్రారంభ సమయమున ‘ఆశువు శిశానః’ (17-35) అను మంత్రమును చదువవలెను. రథారోహణ సమయమున ‘విష్ణోః క్రమోసి’ (12-5) అను మంత్రమును గుర్రములను తొలిసారిగా తోలునపుడు ‘ఆజంఘన్తి’ (29-50) అను మంత్రమును, శత్రుసేన ఎదుట ‘యాస్సేనా అభిత్వరీః (11-77) అను మంత్రమును, దుందుభి వాయించునపుడు ‘దుందుభ్యః’ అను మంత్రమును పఠించవలెను. ముందుగా ఈమంత్రములతో హోమముచేసి, తరువాత ఈ విధముగ చేసినచో విజయము లభించును. ‘యమేనదత్తమ్’ (29-13) అను మంత్రముతో కోటి హోమములు చేసినచో యుద్ధము నందు వెంటనే విజయమునిచ్చు రథము ఆవిర్భవించును, ‘అకృష్ణేన’ అను మంత్రము వ్యాహృతులతో చేసిన కర్మల వంటి కర్మలను చేయవలయును. ‘యజ్ఞాగ్రతః’ (34-1) ఇత్యాది శివసంకల మంత్రములను జపించుటచే మనస్సుకు ఏకాగ్రత లభించును. ‘పంచ నద్యః’ (34-11) అను మంత్రముతో ఐదు లక్షల హోమము చేసినవాడు లక్ష్మిని పొందును. ‘యదా బధ్నన్ దాక్షాయణాః’ (34-52) అను మంత్రముతో వెయ్యి పర్యాయములు అభిమంత్రించిన సువర్ణమును ధరించినచో అది శత్రు నివారణము. ‘ఇమంజీవేభ్యః’ (35-15) అను మంత్రమును చదువుచు రాళ్లుకాని మట్టిపెద్దలుకాని అభిమంత్రించి ఇంటి నలువైపుల విసిరినచో రాత్రిచోర భయము వుండదు. ‘వశమేగామ వేషత్’ (35-18) ఇది ఉత్తమమైన వశీకరణ మంత్రము. చంపుటకు వచ్చినవాడు కూడ లొంగిపోవును. ఓ ధర్మజ్ఞుడా! ఈ మంత్రముతో అభిమంత్రించిన భక్ష్యములు తాంబూలములు పుష్పములు మొదలగునవి ఎవనికైన ఇచ్చినచో అతడు శీఘ్రముగా వశమైపోవును. ‘శం నోమిత్రః’ (36-9) అను మంత్రము అంతటను ఎల్ల వేళలను శాంతిప్రదము ‘గణానా త్వాగణపతిం’ (23-19) అను మంత్రముతో చతుష్పథమునందు సర్వధాన్యములను హోమము చేసినవాడు జగత్తునంతను వశము చేసుకొనును. సందేహము లేదు. అభిషేక సమయమున ‘హిరణ్య వర్ణాః శుచయః’ అను మంత్రమును పఠించవలెను. ‘శంనోదేవీరభీష్టయే’ అను మంత్రము పరమ శాంతి కారకము. ఏకచక్ర ఇత్యాది మంత్రముతో ఆజ్యభాగ పూర్వకముగ గృహమునకు ఆజ్య హోమము చేసినచో గ్రహముల అనుగ్రహము శాంతి లభించును. సందేహము లేదు. ‘గావ ఉపావతావం’ (33-29) ‘భగపణేతః’ (34-36-37) అను మంత్రత్రయముచే ఆజ్యహోమము చేసినవానికి గోవులు లభించును. ‘ప్రవాదాంశః సోతత్’ అను మంత్రమును గృహ యజ్ఞమున ఉపయోగించవలెను. ‘దేవేభ్యో వనస్పతే’ ఇత్యాది మంత్రములను వృక్ష యజ్ఞములందు వినియోగించవలెను. గాయత్రి విష్ణురూపమైనదని తెలుసుకొనవలెను. సమస్త పాపములను శమింపచేయునది, సమస్త కామములను తీర్చునదియగు విష్ణు పరమపదము కూడ గాయత్రియే. (260)