అగ్ని మహా పురాణము

Table of Contents

సామాది ఉపాయ కథనము

శ్రీరాముడు చెప్పెను:

ప్రభుశక్త్యుత్సాహశక్తుల కంటె మంత్రశక్తి గొప్పది. ప్రభుశక్తి-ఉత్సాహశక్తులున్న శుక్రాచార్యుని దేవపురోహితుడైన బృహస్పతి మంత్రశక్తిచే ఓడించెను. విశ్వాసపాత్రుడే కాక నీతిశాస్త్ర కోవిదుడు కూడ అయిన వానితో రాజు మంత్రణము చేయవలెను. అశక్యమైన కార్యము నారంభించు వారికి క్లేశములను అనుభవించుట తప్ప ఫలమేదియు లభింపదు. తెలియని విషయములు తెలిసికొనుట, తెలిసిన దానిని నిశ్చయించుట, కర్తవ్యము నందు సందేహము ఏర్పడినపుడు దానిని తొలగించుకొనుట, శేషము లభించుట-ఇవి మంత్రులపై ఆధారపడియున్నది. సహాయకులు, కార్యసాధనోపాయములు, దేశకాల ప్రవిభాగము, విపత్తి నివారణము, కర్తవ్యసిద్ధి-ఇవి మంత్రాలోచనలకు సంబంధించిన ఐదు అంగములు. మనస్సు యొక్క ప్రసన్నత్వము, శ్రద్ధ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు తమతమ పనులు చేయుటయందు సమర్ధములుగా నుండుట, సహాయసంపత్తి, ఉత్థాన సంపత్తి (వెంటనే లేచి పనులు చేయుట) ఇవి మంత్రము ద్వారా నిశ్చయించి ప్రారంభింపబడు కర్మల సిద్ధికి లక్షణములు. మదము, ప్రమాదము (పొరబడుట) కామము, స్వప్నములో పలవరించుట, స్తంభాదుల వెనుక పొంచియుండు జనులు, స్త్రీ సానిధ్యము, ఉపేక్షిత ప్రాణులు (చిలకలు, బధిరులు మొ!!) భేదము కలుగుటకు (ఇతరులకు వెల్లడియగుట) కారణములు, సభలో నిర్భయముగా మాటలాడుట, మంచి జ్ఞాపకశక్తి, ప్రవచనకౌశలము, వస్త్ర శాస్త్రముల పరినిష్ఠిత జ్ఞానము, దూతలకు తగిన కార్యములందు నేర్చుకలవాడు రాజదూత అగుటకు యోగ్యుడు, నిసృష్టార్థుడు (బాధ్యతలన్నీ తీసికొన్నవాడు), పరిమితార్థుడు (కొన్ని బాధ్యతలు మాత్రమే ఉన్నవాడు), శాసనహారకుడు (వార్తలు మాత్రము తీసికొను పోవువాడు) అని దూతలు మూడు విధములు.

తన రాకను గూర్చి ముందుగ సూచించకుండ దూత శత్రుదుర్గమును గాని, సభను గాని ప్రవేశించరాదు. కార్య సిద్ధికై సమయమును నిరీక్షించవలెను. శత్రువు అనుమతిపొంది తిరిగి వెళ్లవలెను. శత్రువున లోపమును తెలిసికొనవలెను. వారి కోశము, మిత్రులు మొదలగువాటిని తెలుసుకొని, శత్రువుల యొక్క చూపులు, చేష్టలు మొదలగువాటిచే తన విషయమున అతనికి ఎట్టి అభిప్రాయమున్నదో తెలిసికొనవలెను. అతడు రెండు పక్షములవారి కుల, నామ, ద్రవ్య, శ్రేష్ఠకర్మలను ప్రశంసించవలెను. తపస్వి వేషములో నున్న తమ పక్షీయులగు గూఢచారులతో సంప్రదించవలెను. ప్రకటులు, అప్రకటులు అని చారులు రెండు విధములు. ప్రకటముగా నున్నవారు దూతలు, అప్రకాశముగా నున్నవారు గూఢచారులు. చారుల స్థితికి, వర్తకులు, వ్యవసాయదారులు, సన్యాసులు, భిక్షువులు, అధ్యాపకులు-వీరు ఉపయోగింతురు. అందుచే వీరి వృత్తికై (సుఖజీవనమునకై) ఏర్పాట్లు చేయవలెను. దూత ప్రయత్నములు విఫలమైనపుడు, శత్రువు దుర్బలుడుగా నున్నపుడు అతనిపై దండెత్తవలెను. విజిగీషువు తన ప్రకృతులలో నున్న వ్యసనములన్నియు తొలగించుకొని పిమ్మట శత్రువుపై దాడిచేయవలెను. మానుషము, దైవము అని వ్యసనములు రెండు విధములు. అనయము (నీతిని అనుసరించకుండుట) అపనయము (చెడు నీతిని అవలంబించుట) అనువాటిచే ప్రకృతి వ్యసనము ఏర్పడును. కేవలము దైవవశము చేతగూడ అది రావచ్చును. శ్రేయస్సును వ్యస్తము చేయునుగాన ‘వ్యసనము’. అగ్ని, జలము, రోగములు, దుర్భిక్షము, మహామారి ఇవి ఐదు దైవవ్యసనములు, మిగిలినవి మానుష వ్యసనములు, పురుషప్రయత్నము చేతగాని, అథర్వోక్త శాంతికర్మలచేగాని దైవ వ్యసనమును తొలగించవలెను. ఉత్థానశీలత్వము (పనులలో జాప్యము లేకుండుట). నీతి, సంధి, సామము మొదలగువాటిచే మనుష వ్యసనమును శాంతింపచేయవలెను. మంత్రము, మంత్రఫలప్రాప్తి, కార్యానుష్ఠానము భవిష్యదున్నతి సంపాదనము, ఆయవ్యయములు, దండనీతి, శత్రునివారణము, వ్యసనములను తొలగించు ఉపాయము, రాజును రాజ్యమును రక్షించుట-ఇవి అమాత్యుల కర్తవ్యములు.

అమాత్యుడు వ్యసనగ్రస్తుడైనచో ఈ పనులన్నింటిని పాడుచేయును. సువర్ణ, ధాన్య, వస్త్ర, వాహనాది సంగ్రహము జనపద వాసులగు ప్రజల కర్తవ్యము. ప్రజలు వ్యసనగ్రస్తులైనచో ఇవన్నియు నష్టమగును. ఆపత్సమయమున జనులను రక్షించుట, కోశ-సేనా రక్షణము, రహస్యముగా గాని, ఆకస్మికముగా గాని వచ్చిన యుద్ధము నుండి కాపాడుకొనుట, కష్టాలలో చిక్కుకొనియున్న మిత్ర-అపమిత్రులను సంగ్రహించుట, సామంతుల నుండియు, వనవాసులనుండియు వచ్చు ఉపద్రవములను తొలగించుకొనుట-ఇవన్నియు దుర్గాశ్రయణ ప్రయోజనములు, నగరమునందలి నాగరికులు గూడ అవసరమైనపుడు రక్షణ పొందుట కొరకై, కోశాదుల నిచ్చుచు దుర్గపతికి ఉపకరింతురు. భృత్యులభరణ పోషణము, దానము, హస్తి, ఆశ్వ, ఆభరణాదులనుకొనుట, స్థిరత్వము, శత్రుపక్షము నందున్న లుబ్ధులగు ప్రకృతులలో ధనాదులు ఇచ్చి, విరోధము ఉత్పన్నము చేయుట, దుర్గ సంస్కారము, సేతుబంధము, వాణిజ్యము, ప్రజా-మిత్ర సంగ్రహము, ధర్మార్ధకామసిద్ధి-ఇవన్నీ కోశమువలన సిద్దించును. రాజునకు మూలము కోశముగాన కోశవ్యసనము రాజునకు సంబంధించిన సర్వమును నశింపచేయును.

మిత్ర, అమిత్ర, సువర్ణ, భూములను తన వశములో నుంచుకొనుట, శత్రువులను అణచివేయుట, ఇతర కార్యములను శీఘ్రముగ సాధించుట, ఇవన్నియు సేనా బలముచే సాధించదగినవి. దానికి కష్టము వచ్చినచో ఈ పనులన్నియు పాడగును. మిత్రుడు విజి గీషువు యొక్క మిత్రులు స్థిరముగా ఉండునట్లు చేయును. శత్రువులను నశింపచేయును. మిత్రుడు వ్యసనగ్రస్తుడైనచో ఈ కార్యములన్నియు చెడిపోవును. రాజు వ్యసనియైనచో సమస్త కార్యములు చెడిపోవును. కఠినముగా మాటలాడి ఇతరుల మనస్సునొప్పించుట, కఠినముగా శిక్షించుట, అర్థదూషణము, మద్యపానము స్త్రీలంపటత్వము, వేట, జూదము ఇవి రాజవ్యసనములు. సోమరితనము, మొండి తనము, దర్పము, ఏమరుపాటు, అకారణ వైరము, పైన చెప్పిన రాజ వ్యసనములును, సచివునకు దుర్వ్యసనములు, అనావృష్టి, రోగాది పీడలు రాష్ట్ర వ్యసనములు. యంత్ర, ప్రాకార, పరిఖాదులు పాడగుట, అస్త్రశస్తముల కొరత, గడ్డి, కట్టెలు, అన్నము క్షీణించుట-ఇవి దుర్గ వ్యసనములు. చెడ్డవ్యయము మండలము నందు అనేక స్థాపనములందు కొంచెము కొంచెము ఉంచుట, రక్షకులు మొదలగువారు భక్షించివేయుట, ప్రోగు చేయకుండుట, చోరులచే అపహరింపబడుట, దూర ప్రదేశము నందు ఉంచబడుట-ఇవి కోశవ్యసనములు. నాలుగు మూలల నుండి ముట్టడించబడుట, సరియైన సంమానము లభింపకపోవుట, భరణపోషణములు సరిగా లేకుండుట, చాలమంది రోగగ్రస్తులు గాని, అలసిపోయినవారు గాని, క్రొత్తగా వచ్చినవారు గాని ఉండుట, పూర్తిగా ఓడిపోవుట, ముందుకు వెళ్లు వేగము కుంఠిత మగుట, చాలమంది నిరాశా పీడితులగుట, అయోగ్య ప్రదేశములలో ఉండుట, దుష్టుడగు పార్ణ్షగ్రాహుని సైన్యము వెన్నంటి వచ్చుట, ఇట్టి దురవస్థ బల (సేనా) వ్యసనము.

దైవపీడితుడును, శత్రుసేనాక్రాంతుడును, కామ-క్రోధాదియుక్తుడును అగు వ్యసన గ్రస్తుడైన మిత్రునకు, తగు ఉత్సాహము, సాహాయ్యము ఇచ్చినచో అతడు యుద్ధోద్యతుడై, శత్రువులపై విజయము సాధింపగలడు. అర్థదూషణము, వాక్పారుష్యము, కఠిన దండము, ఈ మూడును క్రోధజ వ్యసనము. వేట, జూదము, మద్యపానము, స్త్రీ సంగము-ఈ నాల్గును కామజవ్యసనములు, వాక్పారుష్యము ఇతరులకు ఉద్వేగము కలిగించి అనర్థహేతువగును. ధనహరణము, తాడనము, వధ అని మూడు విధములగు దండము సిద్ధించని కార్యమును సిద్ధింప జేయునుగాన, సత్పురుషులచే ‘శాసన’మని చెప్పబడుచున్నది. దానిని యుక్తి పూర్వకముగ ప్రయోగించవలెను. యుక్తమగు దండమును విధించు రాజును ప్రశంసింతురు. క్రోధవశుడై కఠినశిక్ష ఇచ్చువానిపై ప్రజలలో ఉద్వేగము కలుగును. ఆ విధముగ ఉద్విగ్నులైనవారు శత్రువును శరణువేడుదురు. దానిచే వృద్ధిపొందిన శత్రువు రాజును నశింపచేయును. దూషణీయుడగు ఒక వ్యక్తికి అపకారము చేయుటకై అతనివలన లభింపవలసిన గొప్ప ప్రయోజనమునకు విఘాతము కలిగించుటకు ‘అర్థదూషణము’ అని పేరు. వేటవలన, పరుగెత్తుచున్న వాహనమునుండి పడుట, ఆకలిదప్పులవలన శ్రమపడుట మొదలగు దోషములు కలుగును. దాగి ఉన్న శత్రువెవ్వడైనను చంపివేయుటకు కూడ అవకాశము ఏర్పడును. అలసటను జయించుటకై రాజు ఏదైన సురక్షితమగు అరణ్యమునందే వేటాడవలెను. జూదముతో ధర్మార్థముల నాశము. ప్రాణములు పోవుట మొదలగు దోషములు కలుగును. కలహము వచ్చును. స్త్రీ వ్యసనము కలవారి పనులన్నియు చాల విలంబమున జరుగును. ధర్మార్థములకు గూడ హాని కలుగును. మద్యపాన వ్యసనము వలన ప్రాణాపాయముకూడ కలుగవచ్చును. మత్తులోనున్నవాడు కర్తవ్యాకర్తములను తెలిసికొనజాలడు సేనానివేశము ఎచట నెలకొల్పవలెనో తెలిసిన వాడును, శుభాశుభ శకునముల జ్ఞానము కలవాడును శత్రువుపై విజయము సాధించగలడు. సేనానివేశము మధ్యయందు రాజు కోశముతో ఉండవలెను. రాజ భవనమునకు నలువైపుల చుట్టి మౌల (పితృ పితాది మహాది క్రమమున వచ్చుచున్న) సైన్యము, భృత (జీతమిచ్చి ఏర్పరచుకొన్న) సైన్యము, శ్రేణి (జానపదుల లేదా సాలెవారు మొదలగు శిల్పుల) సేన, మిత్రసేన, శత్రుసేన (రాజుకు లొంగిన శత్రువులసేన), ఆటవికులు-వీరి నివేశములు ఏర్పరుపవలెను. నాల్గవవంతు సేన యుద్ధసన్నద్ధులై, సేనాపతిని ఎదుట ఉంచుకొని, నివేశమునకు బైట, రాత్రి యంతయు తిరగవలెను. వాయుతుల్యవేగముగల అశ్వములను అధిరోహించి ఆశ్వికులు సరిహద్దుల వరకును వెళ్ళి, శత్రువుల పరిస్థితులను కనిపెట్టవలెను. రాజాజ్ఞాను సారమే ఎవ్వరైనను నివేశములోనికి వచ్చుట, బైటకువెళ్ళుట జరుగవలెను.

సామ, దాన, దండ, భేద, ఉపేక్షా, ఇంద్రజాల మాయలను ఏడు ఉపాయముల ప్రయోగముచే శత్రువు వశమగును. ఎదుటివాని ఉపకారమును వర్ణించుట, తమ పరస్పర సంబంధ బాంధవ్యాదులను ప్రకటించుట, గుణములు కీర్తించుచు మధురముగా మాటలాడుట, భవిష్యల్లాభమును ఉద్ఘాటించుట, నేను నీ వాడను అని చెప్పుచు ఆత్మ సమర్పణము చేయుట అని సామము ఐదు విధములు. ఎవని వద్దనుండియైన లభించిన, అసారము, సారాసారము అగు పదార్థమును ఆతనికి ఆ విధముగనే తిరిగి ఇచ్చివేయుట దానములోని మొదటి భేదము. తానివ్వకుండగనే ఎదుటివాడు ఏదైన ధనమును తీసికొన్నచో దానిని అనుమోదించుట రెండవ భేదము, అపూర్వ ద్రవ్యదానము మూడవ భేదము. ఒకనిని మరొకని నుండి ధనము తీసికొనుమని ప్రేరేపించుట (స్నయం గ్రాహ ప్రవర్తనము) నాల్గవ భేదము. ఇవ్వవలసిన ధనమును తీసికొనకుండుట ఐదవ భేదము. స్నేహమును నశింపచేయుట, పరస్పర కలహము సృజించుట, బెదరించుట-ఇవి భేదములోని మూడు విధముల దురు, చంపుట, ధనములను అపహరించుట, బంధనతాడ నాధుల ద్వారా పీడించుట అని దండ భేదములు మూడు. ప్రకాశవధ, అప్రకాశవధ అని వధ రెండు విధములు. అందరికిని ద్వేషపాత్రుడైన వానిని ప్రకాశముగ వధించవలెను. ఎవనిని చంపుటచే ప్రజలు ఉద్వేగము చెందుదురో, ఎవడు రాజప్రియుడో, అధిక బల శాలియో, ఎవడు రాజ హితమునకు భంగము కలిగించునో వానిని రహస్యముగ చంపవలెను. విషప్రయోగము చేతగాని, అగ్ని ప్రయోగము చేతగాని, రహస్యముగ ఇతరులచే అస్త్ర ప్రయోగము చేయించిగాని, స్ఫోటలను పుట్టించు పదార్థములను శరీరమునకు లేపము చేయించుటచే గాని రాజ్యశత్రువులను రహస్యముగ నశింపచేయవలెను. జాతి మాత్రముచే బ్రాహ్మణుడైన వానిని కూడ, ప్రాణదండమీయక, సామముచే వశము చేసికొన ప్రయత్నించవలెను.

ప్రియముగా మాటలాడుట సామము చిత్తమునందు అమృతసేకము చేసినట్లు సామ ప్రయోగము చేయవలెను. ఎదుటనున్న వానిని ప్రేమతో త్రాగివేయుచున్నట్లు చూచుచు, అమృతము వర్షించుచున్నట్లు మాటలాడవలెను. అసత్యమైన దోషారోపణకు గురియైన వారును, ధనలుబ్ధులును పిలిచి అవమానింపబడినవారును, రాజద్వేషులును, ఎక్కువ పన్ను వేయబడినవారును, విద్యాకులాదులచే అందరికంటె గొప్పవారమని భావించువారును, ఛిన్నభిన్నమైన ధర్మార్థకామములు కలవారును, కుపితులు, దురభిమానము కలవారును, అనాదరపాత్రులును, అకారణముగ రాజ్యము నుండి బహిష్కరింపబడినవారును, పూజా సత్కారయోగ్యులైనను అవి పొందనివారును, హరింపబడిన ధనము స్త్రీలు కలవారును, మనస్సులో వైరమున్నను సామనీతి ప్రయోగముచే పైకి శాంతముగ నుండువారును, నిత్యశంకితులును ఇట్టివారు శత్రుపక్షమునకు చెందినవారైనచో వారిలో వారికి వైరము కలిగించవలెను. తనపక్షము వారైనచో ప్రయత్నపూర్వకముగ వారిని శాంతులను చేయవలెను. ఇట్టివారు శత్రుపక్షమునుండి విడిపోయి తన పక్షమునకు వచ్చినచో వారిని సత్కరించవలెను. రెండు పక్షములవారికిని సమానమగు లాభమును చూపుట, ఉగ్ర భయమును చూపుట, అత్యధిక దానమానములు-ఇవి భేదోపాయాంతర్గతములు.

భేదోపాయ ప్రయోగముచే శత్రుసేనలో వైషమ్యము జనించినపుడు అది పురుగుతొలచిన కట్టవలె విరిగిపోవును. ప్రభు-మంత్రోత్సాహ సంపన్నుడు, దేశకాలాభిజ్ఞుడును అగు రాజు దండముచే శత్రువులను అంతమొందించవలెను. మైత్రీగుణ సంపన్నుడు, ఉత్తమ విచారశీలుడు అగు వానిని సామప్రయోగముచే వశము చేసుకొనవలెను. ఆర్థికముగా క్షీణించిన లుబ్ధుని దానముచే వశము చేసుకొనవలెను. ఒకరినొకరు శంకించుకొను దుష్టులను దండముచే వశము నందు ఉంచుకొనవలెను. పుత్ర-సోదరాదులను, బంధువులను, జానపదులను దానభేదములచే వశము చేసుకొనవలెను. సామంతులను, ఆట వికులను, ఇతరులను గూడ ఆవశ్యకతానుసారముగ భేదదండముల ప్రయోగించుచు వశము నందు ఉంచుకొన వలెను.

దేవతా ప్రతిమలు చెక్కిన స్తంభములు పెద్ద పెద్ద రంధ్రములందు దాగియున్నవారు, స్త్రీ వేషము ధరించినవారు, రాత్రియందు అద్భుత రూపములు ప్రదర్శించువారు, భేతాళులవలెను, ముఖము నుండి అగ్నిని కక్కుచున్న పిశాచములవలెను, దేవతలవలెను, రూపములు ధరించు వారును చేయునది ‘మానుషమాయ’. ఇచ్ఛానుసారముగ రూపము ధరించుట. శస్త్ర, అగ్ని, శిలా, జలములు వర్ణించుట, అంధకారము, ఝంఝామారుతము, పర్వతములు, మేఘములు స్పజించుట ఇది అమానుషమాయ. గడచిన ద్వాపరమునందు పాండవ వంశీయుడగు భీమసేనుడు స్త్రీ వేషము ధరించి శత్రువైన కీచకుని చంపెను. అన్యాయమునందును, వ్యసనములందును, అధిక బలవంతునితో యుద్ధమునందును ప్రవర్తించిన తన వారిని మరల్చకుండుట ‘ఉపేక్ష, భీమసేనునితో యుద్ధమునకు ఉప్రకమించిన సోదరుడైన హిడింబుని హిడింబ నిషేధింపలేదు. స్వలాభమునకై ఉపేక్షించినది. మేఘములను, అంధకారమును, వర్షమును, అగ్నిని, పర్వతములను, ఇట్టి ఇతరాద్భుతములను, దూరముగా నిలచియున్న ధ్వజశాలులగు మహాసైన్యములను చూపుట, భిన్నములైన శత్రుసైనికుల అవయవములనుండి రక్తధారలు ప్రవహించుచున్నట్లు చూపుట-ఇది అంతయు ‘ఇంద్రజాలము’. ఈ ఇంద్రజాలమును ప్రయోగించి శత్రువులను భయపెట్టవలెను. (241)