అగ్ని మహా పురాణము

Table of Contents

అయోధ్యా కాండ

భరతుడు మేనమామ గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తండ్రి మొదలగువారిని భక్తితో సేవించెను. దశరథ మహారాజు రామునితో ఇట్లు అనెను-‘రామా! వినుము’ ...

‘నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకుపూర్వమే; మనసా రాజ్యాభిషిక్తుని చేసినారు. నేను రేపు ప్రాతఃకాలమున నీకు యౌవరాజ్యము ఇచ్చుచున్నాను, సీతా సహితుడవై ఈ రాత్రి నీవు వ్రతమును అవలంబింపుము’. వసిష్ఠుడు, సృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు అను ఎనమండుగురు మంత్రులును రామునితో ఆ విధముగనే పలికిరి.

రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని, అట్లే చేసెదను అని చెప్పి, కౌసల్యకు కూడ తెలిపి, దేవతలను పూజించి, వ్రతము నవలంబించెను.

దశరథుడు-“రాముని పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు అన్నియు సమకూర్చుడు’ అని వసిష్ఠాదులతో చెప్పి కైకేయి వద్దకు వెళ్ళెను.

కైకేయికి సఖురాలగు మంథర అయోధ్యానగరమును అలంకరించుటను చూచి, రామునకు పట్టాభిషేకము జరుగనున్నదను విషయమును తెలిసికొని, దానిని కైకేయికి చెప్పెను.

ఒకప్పుడు ఆమె ఏదియో అపరాధము చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఈడ్పించెను. ఆ వైరమును పురస్కరించుకొని ఆమె రాముని వనమునకు పంపవలెనని అనుకొనెను.

ఓ! కైకేయీ! లెమ్ము. రామునకు రాజ్యాభిషేకము అనగా నీకును, నాకును, నీ కుమారునకును మరణమే. ఇందులో సందేహము లేదు అని మంధర కైకను హెచ్చరించెను.

కైకేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణమును బహూకరించి “నాకు భరతుడు ఎంతయో రాముడు కూడ అంతయే. కాని భరతునికి రాజ్యము లభించు ఉపాయమేదియు కాన రాకున్నది అని పలికెను. మంథర ఆ మాటలకు కోపించి ఆమె ఇచ్చిన హారమును గ్రహింపక కైకేయితో ఇట్లు అనెను.

“ఓ తెలివితక్కువదానా! భరతుని, నిన్ను, నన్ను కూడా రాముని నుండి రక్షించుము. రాముడు రాజు కాగలడు. అతని పిమ్మట అతని కుమారుడు రాజు కాగలడు. ఈ విధముగా భరతుడు రాజ వంశమును కోల్పోవును. పూర్వము దేవాసుర యుద్ధమునందు శంబరుడు దేవతలను సంహరించెను. ఆ రాత్రి అచట నున్న నీ భర్తను నీవు విద్యా ప్రభావముచే రక్షించితివి. అపుడు అతడు రెండు వరములను ఇచ్చెను. ఇపుడు ఆ రెండు వరములను కోరుము. ఒక వరముచే, పదునాలుగు సంవత్సరములు రాముడు వనములో నివసింపవలెను అనియు, రెండవ వరముచే భరతునికి యౌవరాజ్య మీయవలెను అనియు కోరుము. అతడు దానిని ఈయగలడు” అని మంధర కైకేయికి దుర్బోధ చేసెను.

ఈ విధముగ ఆ కుబ్జచే ప్రోత్సహింపబడిన కైకేయి, అనర్థమును కూడా లాభకర మని భావించినదై “ఈ మంచి ఉపాయము దశరథునిచేత ఆ పని చేయించునా?” అని పలికి కోపగృహమును ప్రవేశించి, మూర్ఛితురాలువలె భూమిపై పడియుండెను.

రాజు బ్రాహ్మణులను పూజించి, కోపించి ఉన్న కైకేయిని చూచి ‘ఇట్లున్నావేమి? రోగముతో బాధపడుచున్నావా? భయపడినావా? నీకు ఏమి కావలెనో, చెప్పుము. అది చేసెదను. ఏరాముడు లేకున్నచో ముహూర్త కాలమైనను జీవింపజాలనో ఆ రామునిపై ఒట్టు పెట్టుచున్నాను. ఓ సుందరీ! నీ కోరికను నెరవేర్చెదను.’ అని పలికెను.

ఆమె ‘ఓ రాజా! సత్యము పలుకుము. నీవు ఇచ్చుటకు అంగీకరించెద వేని సత్యమును పాలించుచు పూర్వము నాకు ఇచ్చిన రెండు వరములను నాకు ఇమ్ము. రాముడు పదునాలుగు సంవత్సరములు నియమవంతుడై వనము నందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంభారములతో భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను. ఈ వరముల నీయకున్నచో విషము త్రాగి మరణించెదను అని పలికెను.

ఆ మాటవిని, మూర్ఛితుడై, వజ్రముచే కొట్టబడినవానివలె దశరథుడు భూమిపై పడెను. అతడు ముహూర్త కాలమున స్మృతి చెంది కైకేయితో .......

“ఓ పాపాత్మురాలా! నీకు రాముడు ఏమి అపకారము చేసినాడు? నేనేమి చేసినాను? సకల ప్రపంచమునకును అప్రియమును ఆచరించుచు నీవు ఇట్లేల పలుకుచున్నావు? కాలరాత్రి వంటి భార్యవైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడను అగుదును, భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యమునకు వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవవై రాజ్యమును ఏలికొనుము అని పలికి,

సత్యపాశముచే బద్ధుడైన ఆతడు రాముని పిలచి “రామా! నేను కైకేయిచే వంచింప బడితిని. నన్ను బంధించి రాజ్యమేలుము. లేనిచో నీవు వనములో నివసింపవలెను. కైకేయీ కుమారుడైన భరతుడు రాజు అగును” అని పలికెను.

ఆ విధముగా దశరథుని మాటలు వినిన రాముడు తండ్రికిని, కైకేయికిని ప్రదక్షిణ నమస్కారములు చేసి, కౌసల్యకు నమస్కరించి, ఓదార్చి, సీతాలక్ష్మణ సమేతుడై, బ్రాహ్మణులకును, దీనులకును, అనాధులకును దానములు చేసి, సుమంత్రునితో కూడినవాడై, రథమును ఎక్కి శోకారులైన తల్లులతోను, బ్రాహ్మణాదులతోను కూడి పట్టణము నుండి బయలువెడలెను. ఆ రాత్రి తమసాతీరమున నివసించి, పౌరులను విడచి వెళ్ళిపోయెను. ఆ పౌరులు ప్రాతఃకాలమున రామునిగానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి. మిక్కిలి దుఃఖితుడైన దశరథ మహారాజు ఏడ్చుచు కౌసల్యా గృహమునకు వెళ్ళెను. పౌరులును, స్త్రీలును, రాజస్త్రీలును ఏడ్చిరి.

నారచీరలను ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడు ఆతనిని పూజించెను. అచట రాముడు ఇంగుదీ వృక్షమూలమున నివసించెను.

లక్ష్మణుడును, గుహుడును ఆ రాత్రి అంతయు మేల్కొనియే ఉండిరి. పిదప, సీతారామ లక్ష్మణులు ప్రాతః కాలమున నావపై ప్రయాణించి జాహ్నవిని దాటి ప్రయాగ చేరిరి. అచ్చట భరద్వాజునికి నమస్కరించి చిత్రకూట పర్వతము చేరిరి. పిమ్మట వాస్తుపూజ చేసి, మన్దాకినీ నదీ తీరమున నివసించిరి. రాముడు సీతకు చిత్రకూట పర్వతమును చూపెను. అచ్చట ఒకనాడు ఒక కాకి గోళ్ళచే సీతను గీరగా కాకి నేత్రమును, రాముడు ఐషీకాస్త్రము ప్రయోగించి పోగొట్టెను. ఆ కాకి దేవతలను విడచి మరల రామునే శరణు జొచ్చినది.

రాముడు అరణ్యమునకు వెళ్ళిన ఆరవ దినమున దశరథుడు పూర్వము జరిగిన కథను చెప్పెను. “నేను కౌమార వయస్సులో ఉన్నప్పుడు సరయూనదీ, తీరమునందు కుంభమును నీటిలో ముంచి శబ్దము చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవానిని శబ్దవేధిని ఉపయోగించి చంపితిని. ఆతని తల్లిదండ్రులు చాల విలపించిరి. ఆతని తండ్రి ‘మేము ఇరువురము పుత్ర శోకముతో మరణించుచున్నాము. నీవు కూడ పుత్రశోకముతో పుత్రుని స్మరించుచు మరణించెదవు” అని నన్ను శపించెను. కౌసల్యా! నాకు ఈ విధముగ మరణము రానున్నది.” అని ఈ విధముగ కథనుచెప్పి “హా రామా!” అని అనుచు రాజు స్వర్గము పొందెను. ఆతడు శోకపీడితుడై నిద్రించినాడని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతఃకాలమున సూతమాగధ వందులు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న ఆతనిని మేల్కొలిపిరి. మరణించిన ఆతడు లేవలేదు. ఆతడు మరణించినాడని గ్రహించి కౌసల్య ‘అయ్యో! చచ్చితిని అనుచు ఏడ్చెను. పురుషులును స్త్రీలును ఏడ్వ మొదలిడిరి. వసిష్ఠాదులు మేనమామ ఇంటిలోనున్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రముగా అయోధ్యకు రప్పించిరి.

శోకముతో నిండిన ఆ నగరినిచూచి, దుఃఖితుడై, భరతుడు “అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా!” అని కైకేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి, నూనె తొట్టెలో పెట్టిన తండ్రికి సరయూ నదీతీరమున సంస్కారము చేసెను. “రాజ్యము చేయుము” అని వశిష్ఠాదులు పలుకగా ఇట్లు అనెను.

రాముని తీసికొని వచ్చుటకు వెళ్లేదను. బలశాలియైన రాముడే అందరిచేత రాజుగా అంగీకరింపబడినవాడు, అని చెప్పి శృంగిబేరము వెళ్ళి, అచ్చటినుండి ప్రయాగ వెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి, భరద్వాజునికి నమస్కరించి, రామలక్ష్మణుల వద్దకు చేరెను. ‘రామా! మన తండ్రిగారు స్వర్గస్థులైనారు. నీవు అయోధ్యలో రాజువగుము. నేను నీ ఆదేశమునకై ఎదురుచూచుచు వనమునకు వెళ్లేదను’ అని పలికెను. రాముడు ఆ మాటలువిని తండ్రికి తర్పణములు చేసి, భరతునితో ‘నీవు పాదుకలు తీసికొని వెళ్ళుము. సత్యపాలనమునకై జటలను నారచీరలను ధరించిన నేను రాజ్యము చేయుటకై రాను.” అని రాముడు పలుకగా భరతుడు తిరిగి వెళ్ళి, అయోధ్యను విడచి, నంది గ్రామములో నివసించుచు, ఆ పాదుకలను పూజించుచు రాజ్యమును పాలించెను. (6)