అగ్ని మహా పురాణము

Table of Contents

సర్వతోభద్రమండల విధి

సాధకుడు దేవాలయాదులలో మంత్రసాధన చేయవలెను. తూర్పు గృహమునందు శుద్ధమైన భూమిపై, మండలమునందు ప్రభువైన హరిని స్థాపింపవలెను. చతురస్రముగ చేసిన క్షేత్రముమీద మండలాదులను వ్రాయవలెను. రెండు వందల ఏబదియారు (256) కోష్ఠములలో సర్వతోభద్ర మండలమును గీయవలెను. ముప్పదియారు కోణములతో పద్మము గీయవలెను. పీఠము పంక్తికి వెలుపల ఉండవలెను. దాని నుండి రెండింటిచేత వీధియు, రెండింటిచే దిక్కులలో ద్వారములును నిర్మించవలెను. వెనుక చెప్పిన పద్మ క్షేత్రమును వర్తులముగా త్రిప్పి, పద్మార్ధమునందు ద్వాదశ భాగము బైట త్రిప్పి, మిగిలిన క్షేత్రమును నాలుగుగా విభజించి, వర్తులముగా చేయవలెను. మొదటిది కర్ణిక యొక్క క్షేత్రము, రెండవది కేసరముల క్షేత్రము. మూడవది దళ సంధుల క్షేత్రము. నాల్గవది దళాగ్రముల క్షేత్రము. కోణస్థానముల నుండి, కోణములకు ఎదురుగా ఉన్న మధ్యభాగము వరకును దారము లాగి, కేసరముల అగ్రములందు ఉంచి దళముల సంధులను గుర్తింప వలెను. పిమ్మట దారమును క్రిందికి జార్చి, ఎనిమిది దళముల పద్మమును గీయవలెను. దళముల సంధుల మధ్యమునందు ఎంత ఎడము ఉండునో అంత ఎడమునందు అగ్ర భాగమున, దళాగ్రములను గీయవలెను. వాటి మధ్యమానమును వాటి పార్శ్వమునందు ఉంచి బాహ్య క్రమమున ఒక్కొక్క దళముపై రెండేసి కేసరములు గీయవలెను. ఇది పద్మముయొక్క సామాన్య లక్షణము. ఇపుడు ద్వాదశ కమల లక్షణము చెప్పబడుచున్నది. కర్ణిక యొక్క అర్ధమానమున తూర్పుదిక్కువైపు దారము ఉంచి క్రమముగా అన్ని వైపుల త్రిప్పవలెను. దాని పార్శ్వమునందు చేసిన భ్రమణముచే ఆరు కుండలుల చిహ్నములు, పండ్రెండు మత్స్యముల చిహ్నములు ఏర్పడును. వీటిచే ద్వాదశదళ కమలము ఏర్పడును.

పంచదళాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్య చిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశరేఖకు బైటనున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచి వేయవలెను. పీఠభాగము యొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠము యొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను. నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను తుడిచివేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పంక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను. విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభా స్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను ఏర్పరుపవలెను. శోభలు  ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును. ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణములని పేరు. పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్య పంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వార నిర్మాణమునకై ఉపయోగించవలెను. వాటిని అన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారములు ఏర్పడును. ద్వారము యొక్క రెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తి యందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తి యందలి మూడు మూడు కోష్ఠములను శోభా నిర్మాణార్థమై తుడిచి వేయవలెను. శోభాపార్శ్వ భాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడుమూడు కోష్ఠములను, లోపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింప బడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠముల భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.

ఇంతవరకును పదునారేసి కోష్ఠములతో ఏర్పడు రెండు వందల ఏబది ఆరు కోష్ఠములుగల మండలము వర్ణింపబడినది. ఇతర మండల నిర్మాణము కూడ ఈ విధముగనే చేయవచ్చును. పండ్రెండేసి కోష్ఠములచే నూటనలభై నాలుగు కోష్ఠకముల మండలము ఏర్పడును. దానిలో కూడ మధ్యనున్న ముప్పదియారు పదముల (కోష్ఠముల)చే కమలము ఏర్పడును. దీనిలో వీథి ఉండదు. ఒకపంక్తి పీఠమునకై ఏర్పరుపబడును. మిగిలిన రెండు పంక్తులచే, వెనుక పండ్రెండు అంగుళముల ప్రమాణముతో నుండును. రెండు హస్తముల ప్రమాణముగల మండలమునందు కమల స్థానము ఒక హస్తము వెడల్పు-పొడవులతో నుండును. ఈ విధముగా ప్రమాణమును పెంచుచు ద్వారాదులతో మండల నిర్మాణము చేయవలెను. రెండు హస్తముల ప్రమాణముగల పీఠరహితమగు చతురస్ర మండలమునందు చక్రాకార కమలమును నిర్మించవలెను. పద్మార్థము తొమ్మిది అంగుళములు ఉండును. నాభి మూడు అంగుళములు. ఎనిమిది అంగుళముల ఆకులు, నాలుగు అంగుళముల నేమి ఏర్పరుపవలెను. క్షేత్రమును మూడు భాగములుగ విభజించి, మరల లోపలినుండి ఒక్కొక్క దానిని రెండేసి భాగములు చేయవలెను. లోపల నున్న ఐదు కోష్ఠములను తుడిచివేసి వాటిపై ఆకులు నిర్మింపవలెను. ఈ ఆకులు ఇందీవర దళాకారములో గాని, మాతులుంగ ఫలాకారములో గాని, కమలదళ ఆకారములో గాని ఉండవచ్చును. లేదా వాటి ఆకారమును తమ ఇచ్ఛ ప్రకారము చేయవచ్చును. ఆకుల సంధుల మధ్య దారముంచి, దానిని వెలుపల ఉన్న నేమి (చక్రాంతము) వరకు లాగి, నాలుగు వైపుల త్రిప్పవలెను. ఆకు యొక్క సంధియందు దారమును ఉంచి దాని మూల భాగమును త్రిప్పవలెను. ఆకు మధ్య స్థానమునందు దారముంచి ఆ మధ్య భాగము నలు వైపులకును సమముగా దారము త్రిప్పవలెను. ఈ విధముగా త్రిప్పగా మాతులుంగ ఆకారముగల ఆకులు ఏర్పడును.

పదునాలుగు హస్తముల క్షేత్రమును ఏడు భాగములుగ విభజించి, మరల రెండేసి భాగములుగ విభజింపవలెను. లేదా తూర్పు నుండి పశ్చిమము వరకును, ఉత్తరము నుండి దక్షిణము వరకును పదునైదేసి సమాన రేఖలు గీయవలెను. ఇట్లు చేయుటచే నూట తొంబది యారు కోష్ఠములు ఏర్పడును. వీటిలో మధ్యనున్న నాలుగు కోష్ఠములచే భద్రమండలము ఏర్పరుపవలెను. దాని  నాలుగు వైపుల వీధి కొరకై స్థానము విడువవలెను. మరల అన్ని దిక్కులందును కమలములు గీయవలెను. ఆ కమలముల నాల్గు వైపులందును వీథికొరకై ఒక్కొక్క కోష్ఠమును తుడిచివేయవలెను. పిమ్మట, మధ్యనున్న రెండేసి కోష్ఠములను కంఠభాగముకొరకై తుడిచి వేయవలెను. పిమ్మట వెలుపల నున్న నాలుగేసి కోష్ఠములలో మూడు మూడు కోష్ఠములను తుడిచివేయవలెను. వెలుపలనున్న ఒక్కొక్క కోష్ఠమును కంఠస్థాన పార్శ్వమునందు మిగల్చవలెను. దానికి ద్వార శోభయని పేరు.

వెలుపల నున్న కోణములలో ఏడింటిని మినహాయించి లోపల నున్న మూడేసి కోష్ఠములను తుడిచి వేయవలెను. దానికి ‘నవనాళము’ లేదా “నవనాభ మండలము” అని పేరు. దాని తొమ్మిది నాభులయందు, నవవ్యూహ రూపుడైన శ్రీహరిని పూజింపవలెను. ఇరువదియైదు వ్యూహముల మండలము విశ్వవ్యాపియైనది. ముప్పదిరెండు హస్తముల క్షేత్రమును, ముప్పది రెండుచేతనే సమముగా విభజింపవలెను. అనగా పైనుంచి క్రిందికి ముప్పదిమూడు రేఖలు గీసి, అడ్డముగా కూడ ముప్పది మూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఇరువది నాలుగు కోష్ఠములు ఏర్పడును. వాటిలో మధ్య నున్న పదునారు కోష్ఠకములతో “భద్రమండలము”ను నిర్మింపవలెను. మరల నాలుగు ప్రక్కలనున్న ఒక్కొక్క పంక్తిని విడువవలెను. పిమ్మట ఎనిమిది దిక్కులందును పదునారు కోష్ఠకములచే ఎనిమిది భద్ర మండలములు ఏర్పరుపవలెను. దీనికి “భద్రాష్టకము” అని పేరు.

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపివేసి మరల వెనుకటివలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల ఉన్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్య భాగముయొక్క పార్వభాగములందలి నాలుగింటిని తుడిచివేయవలెను. మరల, శోభా నిర్మాణమునకై లోపల ఉన్న నాలుగు కోష్ఠములను, వెలుపల ఉన్న రెండు కోష్ఠములను తుడిచి వేయవలెను. పిమ్మట ఉప ద్వారములు ఏర్పడుటకై లోపల ఉన్న మూడు కోష్ఠములను, వెలుపల నున్న ఐదు కోష్ఠములను తుడిచి వేయ వలెను. పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల ఉన్న ఏడు కోష్ఠములను, లోపల ఉన్న మూడు కోష్ఠములను తుడిచి వేయ వలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహమండలము లోపలనున్న కమల కర్ణికపై పరమాత్మను పూజింపవలెను. మరల తూర్పు మొదలైన దిక్కులలో ఉన్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున ఉన్న కమలముపై భగవంతుడగు వరాహమూర్తిని పూజించి క్రమముగా ఇరువది ఐదు వ్యూహముల పూజ చేయవలెను. ఇరువది యారవతత్త్వమైన పరమాత్ముని పూజ సంపన్నమగు వరకును ఈ క్రమము జరుగవలెను. ఒకే మండలముపై అన్ని వ్యూహముల పూజను క్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తి భేదమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వమునందు భేదమేర్పడును గాన విభిన్నమూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను.

నలుబది హస్తముల మండలమును అడ్డగీతలు గీసి క్రమముగా విభజింపవలెను. మొదట ఒక్కొక్క దానికి ఏడేసి భాగములు చేయవలెను. మరల ఒక్కొక్క దానిని మూడేసి భాగములుచేసి, వాటిని గూడ రెండేసి భాగములు చేయవలెను. ఈ విధముగ ఒక వెయ్యి ఏడువందల అరువది నాలుగు(1764) కోష్ఠకములు ఏర్పడును. మధ్య నున్న పదునారు కోష్ఠకములతో కమలమును నిర్మింపవలెను. పార్శ్వభాగమున వీధి నిర్మించవలెను. పిమ్మట ఎనిమిది భద్రములు, వీథులు నిర్మింపవలెను. పిమ్మట పదునారు దళముల కమలమును వీధిని నిర్మింపవలెను. పిమ్మట క్రమముగ ఇరువది నాలుగు దళముల కమలము, వీథి, ముప్పది రెండు దళముల కమలము, వీథి, నలుబది దళముల కమలము, వీథి నిర్మింపవలెను. పిమ్మట మిగిలిన మూడు పంక్తులచే ద్వారములు, శోభలు, ఉపశోభలు నిర్మింపవలెను. సర్వదిశల మధ్య భాగమునందు ద్వార సిద్ధి కొరకై రెండు నాలుగు, ఆరు కోష్ఠకములు తుడిచివేయవలెను. దాని బాహ్య భాగము నందు శోభా-ఉపద్వారములు ఏర్పడుటకై ఐదు కోష్ఠములు, మూడు కోష్ఠములు తుడిచి వేయవలెను. ద్వారముల పార్శ్వములందు, లోపలి వైపున, క్రమముగ ఆరు కోష్ఠములు, నాలుగు కోష్ఠములు తుడిచివేయవలెను. మధ్యనున్న రెండు కోష్ఠములు కూడ తుడిచి వేయవలెను. ఈ విధముగ ఆరు ఉపశోభలు ఏర్పడును. ఒక్కొక్క దిక్కునందు నాలుగేసి శోభలు, మూడేసి ద్వారములును ఉండును. కోణములలో ఒక్కొక్కపంక్తిలోని ఐదేసి కోష్ఠములు విడువవలెను, అవి కోణములగును. ఈ విధముగ చేయగా కావలసిన సుందరమైన మండలము ఏర్పడును. (29)