అగ్ని మహా పురాణము
వ్యవహార కథనము-2
అగ్నిదేవుడు పలికెను:
వసిష్ఠా! చాలమంది ధనికులనుండి ఋణము తీసికొనిన అధమర్ణునిచే, ముందుగా బ్రాహ్మణునకు, తరువాత క్షత్రియునకు ఈ విధముగ క్రమమున ఋణము తీర్పించవలెను. నిర్ణయించిన దానిలో నూటికి పదిచొప్పున వడ్డీతో ఇప్పించవలెను. ధనము లభించిన ఉత్తమర్ణుడు నూటికి ఐదు చొప్పున రాజుకు ఇవ్వవలెను. క్షీణదశలో ఉన్న నీచజాతి వానిచే, ఋణమునకు బదులు పనిచేయించవలెను. బ్రాహ్మణునిచేత మాత్రము మెల్లమెల్లగా, ఆతనికి అభివృద్ధి కలుగుటను బట్టి తీసికొన్న ధనమును ఇప్పించవలెను. తిరిగి ఇచ్చిన ధనమును ఋణదాత తీసికొనకున్నచో దానిని ఒక మధ్యస్థుని వద్ద ఉంచవలెను. ఆనాటి నుండి దానిపై వృద్ధి ఉండదు. కాని దానిని ఋణదాత అడిగినపుడు ఇచ్చి వేయవలెను. అట్లు ఇవ్వకున్నచో వృద్ధి ఇవ్వవలసియుండును. ఋక్థమును (ఒకరు మరణించగా సంక్రమించిన ఆస్తిని) ఎవడు గ్రహించునో ఆతడై ఋషదాత (తండ్రి మొ.) యొక్క ఋణము కూడ చెల్లించవలెను. ఋక్షము తీసికొనినవాడు పుత్ర హీనుడైనచో, ఆ ఋషమును మాత్రమే అనుభవించు కృత్రిమ పుత్రుడు చెల్లించవలెను. ఒకని స్త్రీని గ్రహించినవాడు ఆతని ఋణము కూడ తీర్చవలెను. అవిభక్త కుటుంబములోని ఒక వ్యక్తి ఋణము చేసినచో ఆ కుటుంబాధిపతి ఆ ఋణమును తీర్చవలెను. కుటుంబ యజమాని మరణించినను పరదేశమునకు వెళ్ళినను, ఆ కుటుంబ సభ్యులందరును కలసి ఋణము తీర్చవలెను. భర్త చేసిన ఋణము భార్య తీర్చనవసరము లేదు. పుత్రుడు చేసిన ఋణము తల్లిగాని, తండ్రి గాని తీర్చనవసరము లేదు. స్త్రీ చేసిన ఋణము భర్త తీర్చనవసరము లేదు. కాని మొత్తము కుటుంబమునంతను పోషించుటకై చేసిన ఋణము విషయమున ఈ నియమము వర్తించదు. గొల్లలు, మద్యవిక్రేతలు, నటులు, చాకళ్ళు, వేటగాళ్ళు-వీరి స్త్రీలు చేసిన ఋణమును తప్పక వారి భర్తలు తీర్చవలెను. ఏలనన వారి వృత్తి ఆ స్త్రీలపై ఆధారపడి యున్నది. మరణించుటకు సిద్ధముగానున్న లేదా పరదేశమునకు పోవనున్న ప్రేరేపింపగా స్త్రీ చేసిన ఋణము, పతి చేసినదేయైనను, భార్య తీర్చవలెను. భర్తతో కలిసియున్న స్త్రీ చేసిన ఋణము కూడ, పతిపుత్రులు లేనిచో స్త్రీయే చెల్లించవలెను. స్త్రీ తానేచేసిన ఋణమును ఆమెయే తీర్చవలెను. మిగిలిన ఋణములు ఏవియు స్త్రీ తీర్చ పనిలేదు. తండ్రి విదేశమునకు వెళ్ళిపోయినపుడు, మరణించినను, చాల కష్టములలో చిక్కుకొని యున్నపుడును, ఆతని ఋణమును పుత్రపౌత్రులు చెల్లించవలెను. వారు అంగీకరించనిచో సాక్ష్యాదుల ద్వారా నిరూపించి అర్థి వసూలు చేసికొనవలెను. మద్యపానము, స్త్రీ లంపటత్వము, ద్యూతము, దండము శుల్కము చెల్లించగా మిగిలినది, వృథా దానము, వీటి కొరకై తండ్రి చేసిన ఋణమును పుత్రుడు తీర్చపనిలేదు. సోదరుల యొక్క, పితృపుత్రుల యొక్క అవిభక్త ధనములో ప్రతిభావ్య ఋణము గ్రహింపదగినదికాదు.
దర్శనము, ప్రత్యయము, దానము-వీటియందు ప్రాతిభావ్యము (జామీను) అంగీకరింపబడినది. ఆధి (తాకట్టు) వ్యర్థమైనపుడు తాకట్టు పెట్టినవాని పుత్రులచే ఋణము తీర్పింపవలెను. దర్శన ప్రతిభూ (అవసరమైనపుడు నేనీ వ్యక్తిని హాజరుపరచెదను అని జామీను ఉన్నవాడు) గాని, ప్రత్యయ ప్రతిభూ (విశ్వాసము నిమిత్తము జామీను ఉన్నవాడు) గాని మరణించినపుడు వారిపుత్రులు ఋణము చెల్లించనవసరములేదు. దాన ప్రతిభూ (ఆతడు చెల్లించెదను) అని జామీను ఉన్నవాడు చెల్లించవలెను. దాన ప్రతిభూలు చాల మంది ఉన్నపుడు వారు ఋణమును తమవంతు ప్రకారము చెల్లించవలెను. అందరును ఒకే విధముగ (పూర్తిగా తీర్చుటకు జామీను ఇచ్చి) ఉన్నపుడు ధనికుడు తన ఇష్టము వచ్చిన వానినుండి ధనము వసూలు చేసికొనవచ్చును. అందరి సమక్షమున ప్రతిభూ ధనికునకు ఎంతధనము చెల్లించెనో దానికి రెట్టింపు ధనమును, ఆ ప్రతిభూకు, ఋణగ్రహీత చేత ఇప్పించవలెను. ఆడపశువులను ఋణముగా గ్రహించినపుడు వాటి సంతతిని వడ్డీగా తీసికొనవలెను. ధాన్యముపై వడ్డీ, అధికాధికము, మూడురెట్లు, వస్త్రములపై వడ్డీ పెరిగి పెరిగి నాల్గు రెట్లు రసములపై ఎనిమిది రెట్లు కావచ్చును. తాకట్టు పెట్టి ఋణము తీసికొనినప్పుడు ఆ ధనము పెరిగి రెట్టింపు అయిన పిమ్మట గూడ ఋణము చెల్లించి తాకట్టు విడిపించుకొననిచో, ఆ వస్తువు ధనికుని (ఋణదాత యొక్క) సొత్తు అగును. ఇంత కాలము తరువాత విడిపించుకొందునని చెప్పి తాకటు పెట్టినదానిని, ఆ కాలములోపల విడిపించుకొననిచో అది ధనికుని సొత్తు అయిపోవును. కాని ఫలము మాత్రమే అనుభవించుటకు వీలయిన తోట మొదలగునది తాకట్టు పెట్టినచో అది ఎన్నటికిని నష్టము కాదు. దాని స్వత్వము అధిపతికే యుండును.
దాచి ఉంచవలసిన వస్తువు తాకట్టు బెట్టినచో దానిని ధనికుడు అనుభవించినను, ఉపయోగించు పశ్వాదులను తాకట్టు పెట్టినను వాటిపై వడ్డీ ఉండదు. తాకట్టు పెట్టిన వస్తువు పాడైపోయినను, పోయినను ఋణదాత తిరిగి ఇవ్వవలెను. అది దైవ-రాజోప ప్లవములందు పోయినచో ఇవ్వవలసిన పనిలేదు. అట్టి పరిస్థితులలో ఋణ గ్రహీత మరొక వస్తువు తాకట్టుగా ఇవ్వవలెను. లేదా ధనము వడ్డీతో చెల్లించవలెను. చరిత్రమునే బంధకముగా పెట్టి (నమ్మకము మీద) తీసికొన్న ధనమును వడ్డీతో ఇప్పించవలెను. సత్యంకారముతో చేసిన ఋణమును రెట్టింపు చెల్లింపచేయవలెను. తాకట్టు విడిపించుకొన వలసిన సమయము వచ్చినపుడు విడిపించుకొన వచ్చినచో ఇచ్చివేయవలెను. అట్లు కానిచో ధనికుని ఋణము నిచ్చినవాడు, బంధకము విడిపించుకొను సమయమునకు లేనిచో ఆతని కుటుంబమునకు ధనము చెల్లించి బంధకము విడిపించుకొనవలెను. లేదా ఆనాటి వరకు ఎంత వృద్ధియైనదో నిశ్చయము చేయించుకొని, ధనికుడు మరల వచ్చు వరకును బంధకమును ఆతని వద్దనే ఉంచివేయవలెను. కాని ఆనాడు మొదట వడ్డీ ఉండదు. దూరదేశమునకు వెళ్ళిన ధనికుడు అనుకున్న సమయానికి రాజాలక పోయినచో ఋణగ్రహీత విశ్వసనీయుడైన సాక్షుల ఎదుట బంధకమును అమ్మివేసి తనకు రావలసిన సొమ్ము తీసికొనవలెను. ఋణము తీసికొనిన ధనము, వడ్డీ పెరిగి రెట్టింపు అయినచో అంతధనమును ఇచ్చి బంధకమును విడిపించుకొనవలెను. పెట్టి మొదలైన వాటిలో ద్రవ్యము ఉంచి, (సీలుచేసి) అది ఏద్రవ్యమో, ఎంతయో చెప్పకుండ ఇతరుల వద్ద దాచనిచ్చినచో అది ‘ఔపనిధికము’. దానిని ఇచ్చినట్లుగనే తిరిగి ఇచ్చివేయవలెను. కాని అది రాజ, దైవ, తస్కరాదుల ద్వారా నష్టమైనచో తిరిగి ఇవ్వవలసిన పనిలేదు. ఉపనిధి ఉంచినవాడు అడిగినను ఉంచుకొన్నవాడు తిరిగి ఈయకున్నచో దానిని ఆతనికి ఇప్పించి, అంతధనము దండము విధించవలెను. ఉపనిధిని ఉపయోగించి దానిపై ధనము సంపాదించిన వానిని దండించి లాభముతో సహా ఆ వస్తువును తిరిగి ఇప్పించవలెను. యాచిత, అన్వాహిత, న్యాస, నిక్షేపాదుల విషయమున గూడ ఉపనిధికి సంబంధించిన నియమములు వర్తించును. (254)
