అగ్ని మహా పురాణము
కావ్యాది లక్షణ వర్ణనము
అగ్నిదేవుడు పలికెను:
కావ్య నాటక అలంకారాదుల స్వరూపమును చెప్పెదను. ధ్వని, వర్ణము, పదము, వాక్యము - ఇవియే సకల వాఙ్మయము. శాస్త్ర ఇతిహాస కావ్యములు ఈ వాఙ్మయములో అంతర్గతములు. శాస్త్రమునందు శబ్దమునకు ప్రాధాన్యము. ఇతిహాసములందు అర్థమునకు ప్రాధాన్యము. వీటిలో అభిధకే ప్రాధాన్యము. అందుచే కావ్యము ఈ రెండింటి కంటెను భిన్నమైనది. లోకములో నరత్వము దుర్లభము. విద్య ఇంకను దుర్లభము. కవిత్వము ఇంకను దుర్లభము, శక్తి ఇంకను దుర్లభము, వ్యుత్పత్తి ఇంకను దుర్లభము, వివేకము అన్నిటి కంటెను దుర్లభము. ఆ విద్వాంసులు ఎంత ప్రయత్నించినను శాస్త్రము సిద్ధించదు. శాది వర్ణములు, వర్గ, ద్వితీయ చతుర్థాక్షరములు మహా ప్రాణములు వర్ణ సముదాయము పదము సుబంతము తిఙంతము అని - ఇది రెండు విధములు. ఇష్టార్థమును బోధించు పద పంక్తి వాక్యము.
స్పష్టమైన అలంకారములు గలది, గుణములు కలది, దోషములు లేనిది అగు వాక్యము కావ్యము. వేదములు, లోకము, కావ్య హేతువులు, సిద్ధ మంత్రముచే నిర్మించ బడిన కావ్యము అయోనిజము. దేవతలకు సంస్కృతభాషను, మనుష్యులకు త్రివిధ ప్రాకృత భాషలను ప్రయోగించవలెను. గద్యము పద్యము మిశ్రము అని, కావ్యము మూడు విధములు. పాదములులేని పద సముదాయము గద్యము, చూర్ణకము, ఉత్కలికా వృత్త గంధి అని గద్యము మూడు విధములు. చిన్న చిన్న మృదువైన మాటలున్నది చూర్ణకము. దీర్ఘ సమాసములుకలది ఉత్కలికా, ఈ రెండింటికి నడుమ ఏన్నదియు, అత్యంత కుత్సిత విగ్రహము కానిదియు వృత్తచ్ఛాయ కలదియు అగు గద్యము వృత్తగంధి. ఇది ఉత్కటకముగ ఉండదు. ఆఖ్యాయికా, కథ, ఖండ కథ, పరికథ, కథానిక అని గద్య కావ్యము ఐదు విధములు. గ్రంథకర్త యొక్క వంశ ప్రశస్తి అధికముగ ఉండి కన్యాహరణ సంగ్రామ విప్రలంభ విపత్తుల వర్ణనములతో వైదర్భ్యాది రీతులు, భారత్యాది వృత్తులు ప్రవృత్తులు ఉన్నదియు ఉచ్ఛ్వాసములను పేరుగల పరిచ్ఛేదములు కలదియు, చూర్ణక ప్రధానమును, వక్త్రము గాని, అపర వక్త్రముగాని, ఏన్నది అగు గద్యకావ్యము ఆఖ్యాయికా, కవి దేనిలో తన వంశమును శ్లోకములలో సంక్షిప్తముగా చెప్పునో, ముఖ్యార్థమును ప్రవేశ పెట్టుటకు మరియొక కథ చేర్చబడునో పరిచ్ఛేదములుండవో, ఉన్నను లంబకములను పేర్లతో వుండునో అది కథ. దాని మధ్య భాగమున చతుష్పదితో బంధరచన చేయవలెను. కథా ఖండము మాత్రమే ఉన్నది ఖండకథ. ఖండకథా, పరికథలలో, మంత్రి లేదా వైశ్యుడు లేదా బ్రాహ్మణుడు నాయకుడుగా ఉండును. కరుణ రసము ప్రధానము. నాలుగు విధములగు విప్రలంభము వర్ణింపబడును. ఈ రెండింటిలో కథ సమాప్తి పొందదు. లేదా ఖండ కథలో కథాశైలి అనుసరించబడదు. కథా ఆఖ్యాయికల లక్షణములు కలిసి ఉన్నది పరికథా. ప్రారంభమున భయానకము, మధ్యయందు కరుణము, అంతమున అద్భుతము ఉండునది కథానిక. ఇది ఉదాత్తమైనది కాదు.
చతుష్పది అనగా పద్యము. అది వృత్తయు, జాతి అని రెండు విధములు. అక్షర సంఖ్యా నియమము ఉన్నది వృత్తము. ఇది ఉక్థము, కృతిశేషజము అని రెండు విధములు. మాత్రాగణన ఉన్నది జాతియని కాశ్యపుడు చెప్పెను. పింగళుని ప్రకారము సమము, అర్ధసమము, విషమము అని వృత్తము మూడు విధములు. కావ్య సముద్రమును దాటగోరు వారికి ఛందోవిద్య నౌక వంటిది. మహాకావ్యము, కలాపము, పర్యాయ బంధము, విశేషకము, కులకము, ముక్తకము కోశము ఇవన్నియు పద్య సముదాయములే. సర్గలలో విభక్తమై సంస్కృతములో రచింపబడినది మహాకావ్యము. మహా కావ్య స్వరూపమును విడువక దానివలె మరియొక విధమైన రచన చేసినను దోషము లేదు. ఇతిహాస కథను గ్రహించిగాని, మరియొక్క ఉత్తమకథను గ్రహించిగాని మహాకావ్యము రచింపబడును. మంత్రము దూత ప్రయాణము యుద్ధము మొదలైనవి అచ్చట అచ్చట వర్ణింపబడును. అధిక విస్తృతము కాకూడదు. శక్వరి అతశక్వరి, అతజగతి, త్రిష్టుప్, పుష్పితాగ్ర, వక్త్రము మొదలగు సమవృత్త ఛందస్సులను ప్రయోగించవలెను. సర్గల అంతమున ఛందస్సు మార్చవలెను. సర్గలు చాల సంక్షిప్తముగా ఉండకూడదు. ఒక సర్త అతశక్వరి, అష్టి ఛందస్సులతోను, మరియొక సర్గ మాత్రా ఛందస్సులతోను సంకీర్ణమై ఉండవలెను. రాబోవు సర్గ పూర్వసర్గ కంటే ఉత్తమముగా ఉండవలెను. కల్పము చాలా నిందితము. సత్పురుషులకు వానియందు ఆదరము ఉండదు. నగర, సముద్ర, పర్వత, ఋతు, చంద్ర, సూర్య, ఆశ్రమ, వృక్ష, ఉద్యాన, జలక్రీడ, మధుపాన, రతోత్సవ, దూతివచన, కులటా చరిత్రాదుల అద్భుత వర్ణనలతో కావ్యము నిండియుండును. అంధకారము వాయువు, ఇతర రతి విభావములు వర్ణింపబడును. అన్ని విధములగు వృత్తులు ప్రయోగింపబడును. అన్ని భావములచే ప్రభావితమై యుండును. సకలరీతులు సకల రసములు గుణములు అలంకారములు. దీనిని పరిపుష్టము చేయును. ఈ విశేషములు ఉండుటచేతనే ఇది మహా కావ్యము. దానిని రచించినవాడు మహాకవి.
మహా కావ్యము నందు ఉక్తి వైచిత్త్య్రమునకు ప్రాధాన్యము ఉన్నను రసమే దాని జీవనము, కావ్య స్వరూపమువచో వక్రత్వము ఉన్నను ప్రయత్న పూర్వకముగ రసమును పోషించుటచే సిద్ధించును. మహాకావ్య ఫలము చతుర్వర్గ ప్రాప్తి దీనికి నాయకుని పేరుతో పేరు పెట్టవలెను. సమానమైన వృత్తులు కూర్చవలెను. కైశికీ వృత్తిచే కావ్యము కోమలముగా నుండును. ప్రవాస వర్ణనమున్న కావ్యము కలాపము దానిలో పూర్వాను రాగమను శృంగారము ఉండును. సంస్కృతము లేదా ప్రాకృతముతో పాప్త్యాదులను వర్ణించినచో విశేషకము అనేక శ్లోకములకు ఒకే అన్వయమున్నచో కులకము, సందారితకముయని పేరు. ఒక్కొక్క శ్లోకము స్వతంత్రార్థకమైనచో ముక్తకము. అది సత్పురుషులకు చమత్కారము కల్గించవలెను. మహాకవులు ఉత్తమ సూక్తులు కూర్చినది కోశము. అది బ్రహ్మ వలె అపరిచ్ఛిన్న రసభరితమై సహృదయులకు రుచికరముగ నుండును. సర్గలో వేరువేరు వృత్తములను ఉపయోగించుట ఆభాసోపమ శక్తి. అది మిశ్రము ప్రకీర్ణము అని రెండు విధములు. శ్రవ్య అభినేయముల రెండు లక్షణములును ఉన్నది. మిశ్రము సకలోక్తులతో కూడినది. ప్రకీర్ణము. (337)
