మహారాజు యుధిష్ఠిరుడు కోరిన మీదట విద్యాదాన మహిమను గూర్చి శ్రీకృష్ణుడిట్లు చెప్పెను.
“ధర్మనందనా! శుభముహూర్తంలో నొక నలుచదరపు మండలాన్ని నిర్మించి దానిని స్వస్తిక చిహ్నంతోనూ, పూమాలలతోనూ అలంకరించాలి. మండల మధ్యంలో నొక పుస్తకాన్ని స్థాపించి దానిని గంధాక్షత పుష్పాదులతో పూజించాలి. లేఖకుని కూడా పూజించాలి. ఒక బంగారపు లేఖినినీ, వెండి సిరాపాత్రనూ ఇవ్వాలి. లేఖకుడు సుశీలుడు, అప్రమత్తుడు అయి వుండాలి. అనంతరం ఆయన పుస్తకాన్ని వ్రాయడం మొదలెట్టాలి. ఏకాగ్రచిత్తుడై మాత్ర, అనుస్వారం, సంయుక్తాక్షరాలు స్పష్టంగా కుదురుగా వ్రాస్తూ పదములను ప్రత్యేకంగా దూరదూరంగా వ్రాయాలి. ఇలా శివుని పైననో విష్ణువుపైననో పురాణమును ఆగమ, ధర్మశాస్త్రాదులను లిఖించిన లేఖకునికి చివర వస్త్ర ఆభూషణాదులతో సన్మానం చేయాలి. ఆ పుస్తకాన్ని రెండు వస్త్రాల మధ్య భద్రపఱచి దక్షిణతో నొక వ్యుత్పన్నమతి, ప్రియంవదుడు, ఉత్తమ వాచకుడునగు బ్రాహ్మణునికి గాని, లేదా లోకకల్యాణం కోసం వెలసిన మఠాలలో, కోవెళ్ళలోగాని ఇచ్చి వేయాలి. ఈ విధానంలో పుస్తక దానం చేసినవానికి, యజ్ఞ, తీర్థయాత్రల పుణ్యానికి కోటిరెట్లు ఫలం లభిస్తుంది. ఒక వేయి కపిల గోవులను శాస్త్రోక్తంగా దానం చేసిన ఫలం ఒక పుస్తక దానం చేసినవారికి ప్రాప్తిస్తుంది. ఇక పురాణ, రామాయణ, మహాభారత, భగవద్గీతాది పవిత్ర గ్రంథాలను దానం చేస్తే వచ్చే ఫలాన్ని లెక్కింపలేము.
ఇక విద్యా దానం(నేటి సమాజంలోని గురువులు ఇంటివద్ద విద్యను నేర్పి పిల్లల వద్ద ఏమి పుచ్చుకోకుండా వుంటేనే అది విద్యాదానమవుతుంది.) విషయానికి వస్తే దీనిని మించిన దానమేలేదు. ప్రాతర్వేళనే తన శిష్యులకు, వారినుండి ప్రతిఫలాన్ని ఆశించకుండా, వేదాది శాస్త్రాలనూ, నృత్య, సంగీతాది కళలనూ నేర్పేవానితో సమానుడైన పుణ్యాత్ముడెవరు? అలాగే వృత్తి విద్యావేత్తను రప్పించి అతని చేత విద్యార్ధులకు నేర్పించినవాడు అన్ని దానాలూ చేసినవారికన్నా పుణ్యాత్ముడు. చదువుకునేవారికి భోజన, వస్త్ర, భిక్ష, వసతి, పుస్తకాదులనిచ్చు వానికి సకల మనోరథాలూ సిద్ధిస్తాయి. దీర్ఘజీవి అవుతాడు; ధర్మార్థ కామాలు లభిస్తాయి. శస్త్రవిద్య, శాస్త్ర విద్య, అరవై నాలుగు కళలు, జ్ఞాన విజ్ఞానాలు ఇలాంటివి కావాలనుకొని వచ్చేవారికి సహాయం చేయడం మనిషిగా పుట్టి సుఖంగా జీవిస్తున్న వారు తప్పక ఆచరించవలసిన విధి. దీనివల్ల పారమార్థిక లాభముంటుంది. వేయి వాజపేయములు చేసిన ఫలం దక్కుతుంది. దేవాలయాలలో విద్యాదానం చేయువానికి కూడా అదే ఫలం లభిస్తుంది. ఒక కల్పం దాకా విష్ణులోక నివాసప్రాప్తి కూడా వుంటుంది.