మహారాజా! ఇంద్రుడు, అసురులు, మానవులు కొంత ప్రయత్నించి కూడా జాడ పట్టుకోలేని ఒక రహస్య వ్రతాన్ని మహాభక్తాగ్రేసరుడవు కనుక నీకుపదేశిస్తాను. ఈ పుణ్యప్రద వ్రతము యొక్క నామము విశోక ద్వాదశి వ్రతము. విద్వాంసుడైన వ్రతి ఆశ్వయుజ దశమినాడు అల్పాహారాన్ని స్వీకరించి నియమపూర్వకంగా ఈ వ్రతాన్నారం భించాలి. మరునాడు ఉత్తరం వైపుగాని తూర్పువైపుగాని కూర్చుని పళ్ళుతోముకోవాలి. స్నానాదులు కానిచ్చి ఉపవాసముండి లక్ష్మీకేశవులకు ఘనంగా పూజచేసి ‘రెండవరోజు భోంచేస్తాను’ అనే నియమాన్ని పెట్టుకొని రాత్రి పడుకోవాలి.
మరునాటి ఉదయమే సర్వౌషధాలూ, పంచగవ్యములూ కలసిన నీటిలో స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని తెల్లపూల మాలను మెడలో వేసుకొని విష్ణుభగవానుని కమల పుష్పాలతో పూజించాలి. తరువాత ఒక మండలాన్ని తయారుచేసి మట్టితో వేదిని నిర్మించాలి. అది ఇరవై అంగుళాల పొడవు అంతే వెడల్పు వుండాలి. అది నలుపలుకలుగా సుందరంగా మృదువుగా నున్నగా వుండాలి. తరువాత నది ఇసుకతో లక్ష్మీదేవి ఆకారాన్ని ఒక చిన్నపలకపై వేసి దాన్ని వేదిపై పెట్టి దేవ్యై నమః, శాంత్యై నమః, పుష్ట్యై నమః, లక్ష్మ్యై నమః, శ్రియై నమః, తుష్ట్యై నమః, దృష్ట్యై నమః, హృష్ట్యై నమః - అనే మంత్రాలనుచ్చరిస్తూ ఆ మూర్తికి అర్చన చేసి ఈ మంత్రం ద్వారా ప్రార్థించాలి.
విశోకా దుఃఖనాశాయ।
విశోకా వరదాస్తు మే॥
విశోకా చాస్తు సంతత్యై।
విశోకా సర్వ సిద్ధయైః॥ (ఉత్తరపర్వం 84/16)
తరువాత ఆ పలకని శ్వేతవస్త్రంపై పెట్టి నానా ప్రకారాల పూలతో, వస్త్రాలతో, ఫలాలతో, స్వర్ణమయ కమలాలతో లక్ష్మిని పూజించాలి. ప్రతి ఈ మూడు రాత్రులూ కుశోదకం త్రాగి రాత్రంతా నృత్యగీతాదులతో ఉత్సవం చేయించాలి. ప్రతి నిద్రపోవచ్చు గాని రాత్రి మూడు జాములు గడిచాక పక్కమీది నుండి లేచి శక్త్యనుసారము ఒకటి గాని మూడుగాని బ్రాహ్మణ జంటలను శయ్యపై చేర్చి వస్త్రాలతో, పూల మాలలతో, చందనంతో జలశాయినే నమోఽస్తు అంటూ వారిని పూజించాలి. తెల్లవారగానే స్నానం చేసి మరల ద్విజ దంపతులను పూజించాలి. వారికి మంచి స్థాయి భోజనాన్ని పెట్టించాలి. తరువాత స్వయంగా భోంచేసి పురాణ కథలను వింటూ ఆ రోజును గడపాలి. ప్రతిమాసంలోనూ ఇలాగే చేయాలి.
వ్రతం పూర్తి చేయదలచుకున్నపుడు పక్క పరుపులు, తలగడలు మున్నగు వాటితో ఒక సుందర శయ్యను గుడ - ధేనుతో సహాదానం చేస్తూ భగవంతుని ఇలా ప్రార్థించాలి: ‘స్వామీ! సౌందర్యం, ఆరోగ్యం, ఆనందం నన్నెపుడూ వీడిపోకుండా వరమియ్యి. నీపట్ల నా భక్తి శాశ్వతంగా వుండేలా కరుణించు.’
ఈ వ్రతం వల్ల అభీష్ట వస్తు వియోగ దుఃఖం నశిస్తుంది. ధన సంపత్తి వృద్ధి అవుతుంది. భవసాగర భయముండదు.