భవిష్య పురాణము

178, 179 - కల్పవృక్ష, కల్పలతా దానవిధి

ధర్మజా! పుత్రులు లేని జనుల కోసం ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ దాన విధినుపదేశించాడు. పత్ర, పుష్ప, శాఖా సమన్వితమైన సువర్ణ లేదా రజత కల్పవక్షాన్ని తయారుచేయించాలి. నదీతటంపైగాని, కోవెలలోగాని, ఇంటిలోగాని పదిహస్తాల ప్రమాణం గల సుందర మంటపాన్ని తూర్పువైపు నిర్మించాలి. పది హస్తాల ప్రమాణంలోనే వేదిని కూడా నిర్మించాలి. మండప అగ్నికోణంలో మేఖలాయుక్తమైన ప్రామాణికమైన ఒక అగ్ని కుండాన్ని నిర్మించాలి. వైదిక బ్రాహ్మణులను, ఒక ఉపదేష్ట బ్రాహ్మణుని వరించి తెచ్చుకోవాలి. ఆ కల్పవృక్షాన్ని ఒక ప్రస్థప్రమాణంలో వున్న బెల్లపురాశిపై స్థాపించాలి. వృక్షముయొక్క అయిదుశాఖలపై బ్రహ్మ, అలాగే విష్ణు, శివ, సూర్యుల బొమ్మలను గీయించాలి. కాస్త క్రిందికి వున్న శాఖలపై రతీ మన్మథుల చిత్రాలను గీయించాలి. కల్ప వృక్షానికి తూర్పుభాగంలో ఉప్పు రాశిపై సంతానవృక్షాన్ని స్థాపించి దానిపై గాయత్రిని స్థాపించాలి. కల్పవృక్షానికి దక్షిణభాగంలో నెయ్యిలో మందారనామక దేవ వృక్షాన్ని స్థాపించి దానిపై శ్రీదేవిని స్థాపించాలి. అలాగే పశ్చిమ భాగంలో ఉమాదేవి తోడి పారిజాత వృక్షాన్నీ (జీలకఱ్ఱ రాశిపై) ఉత్తర భాగంలో తిలల రాశిపై సురభీ సహిత హరిచందన వృక్షాన్నీ వుంచాలి. చెఱకు, పూమాలలు, పండ్లు పోసిన ఎనిమిది కలశలను నలువైపులా వుంచి పట్టుబట్టలతో కప్పాలి. అగ్నిని ప్రజ్వలింపజేసి దానిని పూజించి దీపమాలలను వెలిగించి పలురకాల నైవేద్యాలతో కల్పవృక్షాన్ని పూజించి ఇలా ప్రార్ధించాలి:

కామదస్త్వంహి దేవానాం కామవృక్షస్తతః స్మృతః

మయా సంపూజితో భక్త్యా పూరయస్వ మనోరథం (ఉత్తరపర్వం 178/31)

ఆ రాత్రి మహోత్సవం చేయించి జాగరం చెయ్యాలి. బ్రాహ్మణులు హవనాలు గావించాలి. పొద్దున్న స్నానాదులు గావించి తెల్లబట్టలు కట్టుకొని దక్షిణతో కల్పవృక్షాన్ని దానమిచ్చి మూడుమార్లు దానికి ప్రదక్షిణ చేసి ఈ మంత్రాలనుచ్చరించాలి:

నమస్తే కల్పవృక్షాయ వితతార్థ ప్రదాయచ

విశ్వంభరాయ దేవాయ నమస్తే విశ్వమూర్తయే

యస్మాత్‌త్వమేవ విశ్వాత్మా బ్రహ్మ స్థాణు దివాకరాః ।

మూర్తామూర్త పరం బీజ మతః పాహి సనాతనః॥ (ఉత్తర పర్వం 178/37,38)

కల్పవృక్షాన్ని గురువుకీ ఇతర వృక్షాలను ఋత్విజులకీ సమర్పించాలి. ఈ విధంగా ఈ దానం చేసినవారు జన్మాంతంలో సూర్య సమానతేజము గల విమానంపై అప్సరలు ఆహ్వానించగా అధిరోహించి ఇంద్రలోకానికి వెళతారు. మరల పుడమిపై పుట్టవలసి వచ్చినపుడు పరాక్రమం, విద్య, యజ్ఞం, ధర్మం గల రాజులై పుట్టి ఆ జన్మ అయిపోయాక విష్ణులోకాన్ని చేరుకుంటారు.

“పరంధామా! మనిషి యశాన్నీ, లక్ష్మీ సంపన్నతనీ, నిష్పాపజీవనాన్నీ, దీర్ఘాయువునీ పొందగలిగే దానం వుంటే సెలవీయండి” అని అడిగాడు ధర్మరాజు.

“మహారాజా! కనక కల్పలతా దానం వుంది. కల్పవృక్షం దానం చేసే పద్ధతిలోనే దీనినీ చేయాలి. చివర్లో ప్రదక్షిణ చేసి ఈ మంత్రం ద్వారా ప్రార్థించాలి.

నమోనమః పాప వినాశినీభ్యో

బ్రహ్మాండలోకేశ్వర పాల నీభ్యః

ఆశాశతాధిక్య ఫలప్రదాభ్యో

దిగ్‌భ్వస్తథా కల్పలతా వధూభ్యః॥

యాయస్య శక్తిః పరమాప్రదిష్టా

వేదే పురాణే సురసత్తమస్య

తాంపూజయా మీహ పరేణ సామ్నా

సామేశుభం యచ్ఛతు తాం నతోఽస్మి ॥ (ఉత్తర పర్వం 179/10,11)

పది కల్పలతలను పదిమంది బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఇలా ఇచ్చిన వ్యక్తి ఈ లోకంలో ధనవంతుడు, విజయుడు, పుత్రవంతుడు అవుతాడు. మరణించిన తరువాత ఇంద్రలోకంలో ఈ మన్వంతరం ముగిసే దాకా నివాసముంటాడు. మరల పృథ్విపై పుట్టినపుడు చక్రవర్తిగా జన్మిస్తాడు. ఈ దానాన్ని చేసిన స్త్రీ పరమశక్తి సమన్వితుడైన చక్రవర్తికి జన్మనిస్తుంది. ఈ దానాన్ని చూసిన వారికీ అనుమోదించినవారికీ విన్నవారికీ ముక్తి కలుగుతుంది.”