“పరంధామా! స్నాన దానజపాదులు స్వల్పంగా చేయగలిగినా అవి అక్షయ పుణ్య కర్మలుగా మారే మాహాత్మ్యమున్న తిథులేవైన కలవా” అని అడిగాడు కౌంతేయుడు.
చెప్పసాగాడు దేవకీసుతుడు.
“మహారాజా! మీకీనాడొక అత్యంత రహస్యమయమైన విషయాన్ని చెప్తాను. ఇంతవఱకూ నేను దీనినింకెవరికీ చెప్పలేదు. వైశాఖ శుద్ధ తదియ, కార్తిక శుద్ధ నవమి, భాద్రపద కృష్ణ త్రయోదశి, మాఘ పున్నమి - ఈ నాలుగూ యుగాది తిథులు అనగా ఈ తిథులలోనే క్రమంగా కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలు ప్రారంభమవుతాయి. ఈ తిథులలో చేసే ఉపవాస, తప, దాన, జప, హోమాది కర్మలకు సాధారణంపై కోటిరెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. వైశాఖ శుక్ల తదియనాడు గంధపుష్ప ధూపదీప నైవేద్యాదులతో నైవేద్య వస్త్ర భూషణాదులతో లక్ష్మీ సహితుడైన నారాయణుని పూజించి భూసురునకు సవత్సయైన లవణ ధేనువును దానమివ్వాలి. కార్తిక శుక్ల నవమినాడు నదిలోగాని తటాకంలోగాని స్నానం చేసి పుష్ప ధూపాది సర్వోపచారాలతో ఉమాసహిత నీలకంఠ స్వామిని పూజించి తిలధేనువును దానమివ్వాలి. భాద్రపద బహుళ త్రయోదశినాడు తర్పణాలు చేసి తేనె, నేతితోటి అనేక ప్రకారాల పక్వాన్నాలతో బ్రాహ్మణునికి భోజనం పెట్టి గోదానం చెయ్యాలి. మాఘపూర్ణిమనాడు సరస్వతీ సహిత బ్రహ్మదేవునకు సర్వోపచారాలతో పూజచేసి సువర్ణం, వస్త్రాలు, అనేక రకాల ఫలాలు, నవనీత - ధేనువులను దానమివ్వాలి.
రాజా! ఈ ప్రకారంగా దానాలు చేసేవారికి మూడు లోకాలలో ఎప్పుడూ దేనికీ యాచించవలసిన అవసరం రాదు. ఈ యుగాదులలో చేసే దానాలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. నిర్ధనులైతే తక్కువగానే దానం చేయవచ్చు. ఆ తక్కువ మాత్రపు దానమే అనంత పుణ్యదాయకమవుతుంది. ఎంత స్తోమతు వుంటే అంతలోనే శయ్య, ఆసనం, గొడుగు, చెప్పులు, వస్త్రాలు, బంగారం, భోజనాదులను భూసురులకు దానం చెయ్యాలి. వీలైనంతమంది బ్రాహ్మణులకు ఈ తిథులలో భోజనం పెట్టాలి. అనంతరం ప్రసన్నమైన మనస్సుతో బంధు, బాంధవ జనులకు భోజనాలు పెట్టించి ‘దాని’ మౌనంగా భోంచెయ్యాలి. యుగాది తిథులలో దానపూజనాదులను చేయడం వల్ల కాయిక, వాచిక, మానసికాది అన్ని రకాల పాపాలూ నశించి దాతకు అక్షయ స్వర్గ నివాస ప్రాప్తి కలుగుతుంది.”