భవిష్య పురాణము

35 - దుర్గాసప్తశతి ఉత్తర చరిత్ర మహిమ పతంజలి మహర్షి ప్రసక్తి

            మహావిద్వాంసుడు, ఉపాధ్యాయుడునగు పతంజలి ముని చిత్రకూట పర్వతంపై నివసిస్తుండేవాడు. ఆయన వేదవేదాంగ తత్త్వజ్ఞుడు, గీతాశాస్త్ర పారంగతుడు, గీతా పారాయణతత్పరుడు, విష్ణుభక్తుడు, సత్యవక్త, వ్యాకరణ మహాభాష్యకారుడు. ఒకప్పుడా శుద్ధాత్ముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. కాశీలో ఆయనకు పరమదేవీ భక్తుడైన కాత్యాయనునితో వాదమేర్పడింది. ఇద్దరు మహానుభావులూ ఒక యేడాదిపాటు చర్చలు ఒరిపారు, వాదించుకున్నారు. చివరికి పతంజలి పరాజితుడైనాడు. ఆయన లజ్జితుడై ఈ విధంగా సరస్వతీ ప్రార్థన చేశాడు.

నమోదేవ్యై మహామూర్త్యై సర్వమూర్త్యై నమోనమః

 శివాయై సర్వమాంగల్యై విష్ణుమాయేచతేనమః

త్వమేవ శ్రద్ధా బుద్ధిస్త్వం మేధా విద్యా శివంకరీ

శాంతిర్వాణీ త్వమేవాసి నారాయణి నమోనమః (ప్రతిసర్గ...2/35/5,6)

 ఈ స్తుతికి ప్రసన్నురాలైన సరస్వతీదేవి వాణి అశరీరవాణిగా వినిపించింది ఇలా: ‘విప్రశ్రేష్ఠా! నువ్వు ఏకాగ్రచిత్తంతో నా ఉత్తర చరిత్రను జపించు. దాని ప్రభావంవల్ల నీకు సర్వజ్ఞత్వం ప్రాప్తిస్తుంది. ఓ పతంజలీ! నీబాధ నాకు తెలుసు. కాత్యాయనుని కన్న గొప్పజ్ఞానివే కాగలవు.’

దేవి వాణి ఇలా వరమీయడంతో పతంజలి వింధ్యవాసినీ దేవి మందిరానికి పోయి అక్కడ శ్రీదుర్గాసప్తశతి ఉత్తర చరిత్రను జపించి, పఠించి సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకొని అటు పిమ్మట జరిగిన శాస్త్ర చర్చల వాదోపవాదాల్లో కాత్యాయనుని ఓడించాడు. తరువాత ఆయన శ్రీకృష్ణమంత్రాన్నీ, భక్తతులసీమాలాదులనూ ప్రచారంలోకి తెచ్చి వాని మహిమనూ ప్రాశస్త్యాన్నీ ప్రజలందరికీ తెలిసేలా చేశాడు. భగవతి విష్ణుమాయ కృపచే యోగాచార్యుడై చిరంజీవిగా నిలిచాడు.

మునులారా ఇది దుర్గాసప్తసతి వల్ల మానవజాతి ఉద్ధరింపబడుతున్న తీరు. అందరికీ శుభం జరగాలి. ఎవరూ దుఃఖితులుగా వుండిపోకూడదు. ఎవరైతే పవిత్రులై ఈ కథలను ప్రతిదినము వింటారో వారికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. అని చెప్పాడు సూతమహర్షి. ప్రతిసర్గపర్వ ద్వితీయఖండం సంపూర్ణం.