(ఒక్క తెలుగువారే ఢిల్లీ అంటారు. నిజానికది దిల్లీ).
సూతమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. “ఋషులారా! వయహాని (చపహాని) అను పేరు గల రాజు మధ్యభారతంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరంగా స్థాపించి అజమేర్ అను పేరిట బ్రహ్మచే నిర్మితమైన నగరాన్ని పునర్నిర్మించి రాజధానిని చేసుకున్నాడు. ‘అజ’ అనగా బ్రహ్మ, ‘మా’ అనగా లక్ష్మి. లక్ష్మీదేవి ఆ ప్రాంతానికి వచ్చి ఒక సుందర నగరిని నిర్మించడంలో బ్రహ్మకు సహాయపడింది.
అజస్య బ్రహ్మణో మాచలక్ష్మీ స్తత్ర సమాగతా।
తయాచనగరం రమ్యమజమేరతః స్మృతం॥ (ప్రతిసర్గం 4/2/2)
వయహాని పదేళ్ళు రాజ్యపాలనం చేశాడు. అతని కొడుకు తోమరుడు రాజు కాగానే ఒక యేడాదిపాటు భక్తిపూర్వకంగా పరమశివుని యొక్క పార్థివ పూజనం చేశాడు. శివుడు ప్రసన్నుడై అతనికి ఇంద్రప్రస్థమను పేరు గల నగరాన్నొక దాన్ని ప్రదానం చేశాడు. తోమరుని తరువాత అతని పుత్ర పౌత్రులందరినీ తోమరులని వ్యవహరించారు. అంటే తోమరుడు, వంశకర్తయైనాడని అర్థము. అతని కనిష్ఠ పుత్రుడు చయహాని (చౌహాన్) అతడు చయహాని సామల్‌దేవ నామంతో ఈ పృధ్విపై ప్రసిద్ధి చెందాడు. అతని తరువాత అతని వంశంలో మహాదేవుడు, అజయుడూ కూడా అతనిలాగే ఏడేసి సంవత్సరాలే రాజ్యపాలనం చేశారు. అజయుని కొడుకు వీరసింహుడు యాభై సంవత్సరాలు పాలించాడు. అతని కొడుకు బిందుసురుడు పాతికేళ్ళపాటు రాజ్యం చేశాడు. అతనికి వీర యను పుత్రిక, వీర విహాత్తకుడను పుత్రుడూ కలిగారు. బిందుసురుని పుత్రికను విక్రముడు పెండ్లాడాడు.
వీరవిహత్తుని పుత్రుడు మాణిక్యుడూ, మనుమడు మహాసింహుడూ అతనిలాగే యాభయ్యేసి యేళ్ళు పరిపాలించారు. తరువాత వచ్చిన చంద్రగుప్తుడు పాతిక సంవత్సరాలే రాజ్యపాలనం చేశాడు. అక్కడి నుండి ఆ వంశంలో వరుసగా ప్రతాపవాన్, మోహనుడు, శ్వేతరాయుడు, నాగవాహుడు, లోహధారుడు, వీరసింహుడు, విబుధుడు, చంద్రరాయుడు, హరిహరుడు, వసంతుడు, బలాంగుడు, ప్రమధుడు, అంగరాయుడు, విశాలుడు, రాజ్యానికి వచ్చారు. వీరంతా శారంగదేవుడు, మంత్రదేవుడు, జయసింహుడు - రాజ్యానికి వచ్చరు. వీరంతా అర్ధశతాబ్దాలపాటు పరిపాలించినవారే (మోహనుడు మాత్రం ముప్పది సంవత్సరాలే రాజ్యం చేశాడు)
జయసింహుడు సమస్త ఆర్యదేశాన్నీ జయించి తెచ్చిన ధనంతో చాలా పెద్ద యజ్ఞం చేశాడు. ఆయనకు ఉత్తమ ఫలం ప్రాప్తించింది. ఈయనే జయపురమనే నగరాన్ని నిర్మించాడు. (ఇది నేటికీ భారతదేశపు అతి సుందర నగరాల్లో నొకటిగా వెలుగొందుతోంది) జయసింహుడు, అతని పుత్రుడు ఆనందదేవుడు యాభయ్యేళ్ళ చొప్పున రాజ్యపాలనం చేసి స్వర్గస్తులయ్యారు. ఆనందుని కొడుకైన సోమేశ్వరుడు మహాయోధుడు. అతడు అనంగపాలుని కూతురైన కీర్తిమాలినిని పెండ్లాడి ముగ్గురు బలవంతులైన కొడుకులకు తండ్రియైనాడు. అతని జ్యేష్ఠ పుత్రుడు ధుంధుకారుడు మగధకు రాజుకాగా, మధ్యమపుత్రుడు కృష్ణకుమారుడు తన తండ్రిగారి రాజ్యానికీ, కనిష్ఠ పుత్రుడైన మహీరాజ - పృథ్వీరాజు దిల్లీకీ రాజులైనారు. పృధ్వీరాజును సహెూద్దీను (శహబుద్దీన్ గోరీ) అను రాజు మోసం చేసి చంపివేశాడు.