భవిష్య పురాణము

80 - 81 - సూర్యనమస్కారం, ప్రదక్షిణ విజయసప్తమీ వ్రతం

నారద మహర్షి సాంబునితో ఇలా అన్నాడు. ‘సాంబా! బ్రహ్మ దిండితో ఒకప్పుడిదే విషయాన్ని చెప్పియున్నాడు. సూర్యునికి నమస్కారం చేయడానికి తలతో నేలను తాకితే చాలు; అప్పటి వరకూ ఆ మనిషి చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి.

ప్రణిధాశిరోభూమౌ నమస్కారపరోరవేః

తత్‌క్షణాత్ సర్వపాపేభ్యోముచ్యతే నాత్రసంశయః (బ్రాహ్మ - 80/10)

భక్తిపూర్వకంగా సూర్యనారాయణునికి ప్రదక్షిణ చేసిన వానికి సప్తద్వీపయైన వసుమతి - అంటే - భూమికి ప్రదక్షిణ మొనరించిన ఫలం దక్కుతుంది. సర్వరోగవిముక్తి, అనాయాస మరణానంతరం సూర్యలోకప్రాప్తి కూడా లభిస్తాయి. ప్రదక్షిణలో పవిత్రతకి భంగం వాటిల్లకుండా మాత్రం చూసుకోవాలి. పాదరక్షలు ధరించి ప్రదక్షిణ చేయరాదు. స్వామి మందిరంలోకి చెప్పులతో వచ్చేవారు. అసిపత్ర - వనమను పేరుగల ఘోర నరకంలో కూలిపోతారు.

ఏ నెలలోనైనా షష్ఠి లేదా సప్తమినాడు ఏకాహారంగాని ఉపవాసంగాని చేసి సూర్య పూజనం చేసేవారికి సూర్యలోక నివాసప్రాప్తి కలుగుతుంది. కృష్ణ సప్తమినాడు శ్వేత కమలాలతోనూ ఇతర సర్వోపచారయుక్తంగా సూర్యదేవుని పూజించినవారికి సర్వపాపవిముక్తి, సూర్యలోకనివాసప్రాప్తి కలుగుతాయి.

సప్తములలో ఏడింటికి నామకరణం చేయబడినది. అవి - జయ, విజయ, జయంతి, అపరాజిత, మహాజయ, నంద, భద్ర. ఆదివారంనాడు పడే శుక్ల సప్తమికి విజయసప్తమియని పేరు. ఆ రోజు చేసే స్నాన, దాన, హోమ, ఉపవాస, పూజనాదులు ఎంత తీవ్రమహాపాతకాలనైనా దగ్ధం చేసివేస్తాయి. ఈ విజయసప్తమి పూజకొఱకు దాని ముందలి పంచమినాడు ఏకభుక్తం, షష్ఠినాట నక్తవ్రతం, సప్తమిరోజు సంపూర్ణ ఉపవాసం చేసి అష్టమినాడు వ్రతపారణం చెయ్యాలి. ఈనాడు చేసిన దాన, హవన, దేవ, పితృపూజలు అక్షయఫలాన్నిస్తాయి.’