భవిష్య పురాణము

163 - విభిన్న పుష్పాలతో సూర్యపూజనా ఫలం

            సుమంతుముని శతానీకునితో ఇలా చెప్పసాగాడు.

            “రాజా ! అమిత తేజస్వియైన సూర్యభగవానునికి స్నానం చేయిస్తున్నపుడు ‘జయ’ మున్నగు మాంగలిక (మంగళకర శబ్దాలనుచ్చరిస్తుండాలి. భేరీ, శంఖాదుల ద్వారా మంగళధ్వనులను చేయిస్తుండాలి. మూడు సంధ్యలలోనూ, వైదిక ధ్వనులను శబ్దింపజేస్తే ఫలితం ఇంకా ఎక్కువవుంటుంది. నీరాజనమిస్తున్నపుడు అన్ని ధ్వనులూ గట్టిగా వినిపించాలి. ఎన్ని క్షణాలపాటు ఈ ధ్వనిపూరిత నీరాజనాన్ని ఇస్తామో అన్ని యుగ సహస్రాల వర్షాలపాటు దివ్యలోకంలో ప్రతిష్ఠితులమవుతాం. సూర్యదేవునికి కపిల గోవు యొక్క పంచగవ్యాలతో, మంత్రపూత కుశయుక్త జలాలతో చేయించే స్నానాన్ని బ్రహ్మస్నానమంటారు. ఏడాది కొక్క మారు బ్రహ్మస్నానం చేయించినా ఆ వ్యక్తులు పాపవిముక్తులై సూర్యలోకంలో ప్రతిష్ఠితులవుతారు.

            మంత్రాలలో పితరులనుద్దేశించి చల్లని నీటితో సూర్యునికి స్నానం చేయించే వాని పితరులు నరకము నుండి విడుదల పొంది స్వర్గానికి వెళతారు. మట్టికుండకు బదులుగా రాగి బిందెను స్నానానికి వాడడం వందరెట్లు శ్రేష్ఠం. వెండి, బంగారు కలశలను వాడితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. సూర్యదర్శనం కంటే స్పర్శనమూ, స్పర్శ కంటె పూజనమూ, పూజ కంటె నేతి స్నానమూ శ్రేష్ఠతరములు. (తర, తమ శబ్దాలు ఆంగ్లంలోని కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీలే. చాలామంది ఇవి ఇంగ్లీషులోనే గాని తెలుగులో లేవనుకుంటున్నారు. కాబట్టి చెప్పవలసి వచ్చింది.) భూలోకంలోగాని మరేలోకంలో గాని ప్రాణి చేసే పాపఫలం సూర్యభగవానునికి ఘృతస్నానం చేయిస్తే శూన్యమైపోతుంది. పురాణశ్రవణం వల్లనైతే ఏడు జన్మాల పాపాలు శూన్యమైపోతాయి.

            ఒక వంద పళాల (ఆరుకిలోల ఇరవై గ్రాముల కొలతతో నీటినిగాని పంచా మృతాలను లేదా ఇతరాలను గాని వాడి చేయిస్తేనే అది ‘స్నాన’మనబడుతుంది. ఇరవై అయిదు పళాల(రెండున్నర కిలోల) ద్రవాలనుపయోగిస్తే ‘అభ్యంగ - స్నాన’ మవుతుంది. రెండు వేల పళాల (నూట ఇరవై నాలుగు కిలోల)తో చేయించే దానిని ‘మహాస్నాన’ మంటారు.

            పుష్ప ఫలయుక్తమైన అర్ఘ్య ప్రదానాన్ని సూర్యభగవానునికి చేసినవారు అఖిలలోక పూజితులై జీవిస్తారు. స్వర్గలోకంలో సకల ఆనందాలనూ అనుభవిస్తారు. అష్టాంగ అర్ఘ్యము

అనగా

ఆపః క్షీరం కుశాగ్రాణి ఘృత దధి తథామధు

రక్తాని కర వీరాణి తథారక్తం చచందనం

అష్టాంగ ఏష అర్ఘ్యో వై బ్రహ్మణా పరికీర్తితః

సతతం ప్రీతి జననో భాస్కరస్య నరాధిప (బ్రాహ్మ 163/37, 38)

            జల, క్షీర, కుశాగ్రభాగ, ఘృత, దధి, మధు, రక్షపుష్ప, రక్తచందనములతో తయారుచేసిన అర్ఘ్యము-ను సూర్యదేవునికి నివేదించిన వానికి వేయి సంవత్సరాల పాటు సూర్యలోకంలో విహరించే భాగ్యమబ్బుతుంది. నరాధిపా! ఇదంటే సూర్యునికి బహుప్రీతి.

            అర్ఘలేదా అర్ఘ్య ప్రదానంలో వెదురు పాత్ర, మట్టికుండ, రాగిపాత్ర, కమల పత్రాల దోనె (దొన్నె) క్రమంగా ఒకదానికంటె నొకటి వందరెట్లు శ్రేష్ఠతరాలు. వెండి, బంగారు పాత్రలైతే లక్షరెట్లు, కోటిరెట్లు ఫలాన్నిస్తాయి.

            దరిద్రుడికీ, ధనికుడికీ ఫలం విషయంలో సమానతవుంటుంది. అంటే దరిద్రుడికి మన్నే బంగారం. వాడు మట్టి పాత్రతో మాత్రమే చేయగలిగినపుడు బంగారు పాత్రతో చేసిన ఫలమేలభిస్తుంది. సూర్యపూజనం చేసినా మోహ, లోభాలను జయించలేని వానికి ఆరెండింటినీ జయించిననాడే ముక్తి లభిస్తుంది. భక్తి, ధర్మం ముఖ్యం. సమర్పణలన్నీ మనస్సుని పూర్తిగా ఆయనపైనే వుంచి చేయాలి. లాభాపేక్ష లేకుండా విధి విధానాలన్నీ పాటిస్తూ శక్తిమేరకు మంత్ర, ఫల, జల, చందన, అర్ఘ్యాదులతో సూర్యభగవానుని పూజించినవాడు ఒక వందకోటి దివ్యసంవత్సరాలు సూర్యలోకంలో సుప్రతిష్ఠితుడై వెలుగొందుతాడు.

            రాజా! నిండైన భక్తితో సూర్యునికి తాళపత్రాలతో చేసిన విసనకర్రను సమర్పించిన వారికి పదివేల సంవత్సరాల దాకా సూర్యలోక నివాసప్రాప్తి కలుగుతుంది. నెమలిపింఛాల విసనకర్రనిచ్చిన వారికి వందకోటి సంవత్సరాల పాటు సూర్యలోకంలో నివసించే మహాభాగ్యమబ్బుతుంది.

            నరశ్రేష్ఠా! వేల పుష్పాలలో గన్నేరు పుష్పం గొప్పది. వేలకొద్దీ పత్రాలలో బిల్వపత్రం, వేలకొద్దీ బిల్వపత్రాలకంటే ఒక కమల పుష్పం, వేలకమల పుష్పాలకంటే ఒక అగస్త్యపుష్పం, వాటికంటే ఒక మోంగర పుష్పం శ్రేష్ఠమైనవి. సహస్రకుశల కంటే ఒక శమీపత్రం శ్రేష్ఠమైతే, వేయి ఆ పత్రాలకంటే ఒక నీల కమలం శ్రేష్ఠమైనది. నిజానికి పుష్పాలన్నిటిలోకి నీలకమలమే శ్రేష్ఠమైనది. ఎర్రగన్నేరు పూలతో నిత్యం సూర్యభగవానుని పూజించేవారు అనంత కల్పాల వరకు సూర్యలోకంలో సూర్యసమానులై శ్రీమాన్‌లని పిలువబడుతూ, పరాక్రములై నివసిస్తారు. మల్లె, గులాబి (ఈ పుష్పం మనదేశంలో పురాణకాలంలో లేదు.) విజయ, తెల్ల జిల్లేడు ఇతరములైన తెల్లని పుష్పాలన్నీ శ్రేష్ఠములుగా పరిగణింప బడతాయి. నాగ - చంపక, సదాబహార్, ముద్గర పుష్పాలు కూడా శ్రేష్ఠమైనవే. కొన్ని పువ్వులకు వాసన వున్నా అపవిత్రములుగా పరిగణింపబడ్డాయి. వాటిని దేవతలపై వేయరాదు. వాసన లేకున్నా పవిత్రంగా నెంచబడిన పూలనే పూజకువాడాలి. సగం వికసించిన పూలతో సూర్యుని పూజించరాదు. పండ్లు దొరకకపోతే పూలు, అవీ లేకుంటే ఆకులు, అవీ అలభ్యంగా వుంటే గరిక లేదా ఔషధగుల్మం దేనిని సమర్పించి, సమర్చించినా సూర్యదేవుడు ప్రసన్నుడౌతాడు. మాఘమాసంలో కృష్ణపక్షంలో సుగంధిత ముక్తా పుష్పాల ద్వారా రోజూ సూర్యపూజనం చేస్తే అనంతఫలాలు ప్రాప్తిస్తాయి. సంయతచిత్తులై గన్నేరు పుష్పాలతో సూర్యపూజనం చేసేవారికి అన్నిపాపాలూ కడుగుకుపోగా సూర్యలోక నివాసం ప్రాప్తిస్తుంది. అగస్త్య పుష్పాలతో ఒకమారు భక్తి పురస్సరంగా పూజించినా పదిలక్షల గోవులను దానం చేసిన పుణ్యం వస్తుంది. స్వర్గవాసమూ లభిస్తుంది.

            మాలతి, రక్తకమలం, మల్లె, పున్నాగ, చంపక, అశోక, తెల్లమందార, కోవిదార, అంధుక, గన్నేరు, పొగడ, శమీ, జిల్లేడు, తగర, కేసర, అగస్త్య, బక, కమల పుష్పాలద్వారా యథాశక్తి సూర్యపూజనం చేసేవారు సూర్యసమాన దేదీప్యమానమైన విమానమునెక్కి సూర్యలోకాన్ని చేరుకుంటారు. నీటినుండి జనించిన పూలతో సూర్యుని పూజించినా సూర్యలోక ప్రాప్తికలుగుతుంది. అన్నిటికన్నా భక్తి ముఖ్యం.”