ధర్మరాజు అభ్యర్థించిన పిమ్మట ఈ వ్రతాన్ని గూర్చి వాసుదేవుడిలా చెప్పాడు. “ఈ వ్రతాన్ని గూర్చి పాపాల, దోషాల, అపరాధాల వివరాలతో సహా ఒకప్పుడు వసిష్ఠ మహర్షి ఇక్ష్వాకు మహారాజుకి చెప్పాడు.
‘మహాబాహో! ఏ వ్రతానుష్ఠానం వల్ల మనుష్యుల అన్ని కోరికలూ సంపూర్ణంగా తీరుతాయో, సర్వదోష విముక్తి కలిగి మోక్షం ప్రాప్తిస్తుందో, కృత అకృత అన్ని గురుతర పాపాలనూ ఏ వ్రతం పత్తి మూటని అగ్నివలె భస్మం చేస్తుందో ఆ వ్రతాన్నుపదేశిస్తాను.
ముందు ఈ అపరాధాల నామాలనూ లక్షణాలనూ విను.
అనాశ్రమిత్వ అపరాధం - అనగా నాలుగు ఆశ్రమాలలో దేనినీ పాటించకుండా స్వచ్ఛంద నాస్తిక వృత్తి నవలంబించడం.
అనగ్నితాపరాధం - అగ్నిహోత్ర, హవనాది కర్మలను పూర్తిగా వదలివేయుట.
వ్రతహీనత - సత్య, బ్రహ్మచర్యం, ఏకాదశి వంటి తప్పనిసరి వ్రతాలనైనా, కనీసం చేయకుండుట.
అదాతృత్వం - ఏనాడూ ఎవరికీ ఏ దానాన్నీ చేయకుండుట,
ఇవేకాక అశౌచం, నిర్దయత, లోభం, క్షమా శూన్యత, జనపీడ, వాంఛ, అమంగళత, వ్రతభంగం, నాస్తికత, వేదనింద, కఠోరత, అసత్యత, హింస, దొంగతనం, ఇంద్రియ పరాయణత, విమనస్కత, క్రోధం, ఈర్ష్య, ద్వేషం, దంభం, శఠత, ధూర్తత, కటుభాషణ, ప్రమాదం, కుటుంబాన్ని వదలివేయుట, అపూజ్యులను పూజించుట, శ్రాద్ధ త్యాగం, అజపం, బలివైశ్వ దేవాన్నీ పంచయజ్ఞాలను త్యజించుట, సంధ్యాతర్పణా హవనాది నిత్యకర్మలను చేయకుండుట, అగ్నిని ఆర్పుట, ఋతుకాలం కాని వేళలో సంగమించుట, పర్వాదులలో స్త్రీ సహవాసము, చాడీలు, ఇతర స్త్రీ సంగమం, వేశ్యాలంపటం, అపాత్ర దానం, అల్పదానం, అంత్యజ సంగం, మాతా పితలను సేవించకుండుట, తగువులు పెట్టుకొనుట (గిల్లికజ్జాలు), పురాణాలనూ స్మృతులనూ అనాదరించుట, అభక్ష్య భక్షణము, స్వామి ద్రోహం, ఆలోచించకుండా ఆచరించడం, వర్ణం కాని వర్ణం పనిచేయుట, అప్పు నెగ్గొట్టుట, విద్యనూ, శాస్త్రాన్నీ అభ్యసించకుండుట, కామదాసత్వం, భార్యా పుత్రులనూ కన్యలనూ అమ్మివేయుట, పశుమైథునం, వంట చెఱకుకోసం మంచిచెట్టును కొట్టుట, తటాకాదుల జలాలను పాడుచేయుట, విద్యా విక్రయం, స్వవృత్తి పరిత్యాగం, యాచన, కుమిత్రత, స్త్రీ, గో, మిత్రవధ, భ్రూణహత్య, ఇతరుల, శూద్రుల అన్నమును గ్రహించుట, (పౌరోహిత్యం) శూద్రునిచే అగ్నికర్మను చేయించుట, ఇచ్చి వేసిన దానిని మరల పుచ్చు కొనుట, వాచాలత, విధి విహీనంగా కర్మలు చేయుట, ఆర్తవ్యక్తి దుఃఖాన్ని దూరం చేయక పోవుట, బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచోరత్వం, గురుపత్నీ గమనం, పాతకులతో స్నేహం - ఇవన్నీ అపరాధాలు.
అనఘా! భగవంతుడైన సత్యేశుని పూజిస్తే అపరాధాలన్నీ తత్‌క్షణమే నష్టమైపోతాయి. మనుష్యులకు దేవుడే వశమైపోతాడు వ్రతాలు చేస్తే. జగత్పతి విష్ణు భగవానుడు లక్ష్మీ సమేతుడై సత్యరూపి ధ్వజంపై స్థితుడై వుంటాడు. అతనికి తూర్పున వామదేవుడు, దక్షిణంలో నృసింహ భగవానుడు, పశ్చిమంలో కపిలుడు, ఉత్తరంలో వారాహ దైవతము, ఊర్థ్వంలో అచ్యుతుడు ఉంటారు. వీరే బ్రహ్మపంచకాలని తెలుసుకో. ఈయనే సత్యేశుడు. ఈ సత్యేశ భగవానుడు పద్మమునూ, కౌమోదకియను గదను, పాంచజన్యమను శంఖాన్నీ, సుదర్శన చక్రాన్నీ ధరించి దర్శనమిస్తాడు. ఇతని చరణ కమలమునుండియే పవిత్ర గంగానది ఉద్భవించింది. ఇతని శక్తులు ఎనిమిది: జయ, విజయ, జయంతి, పాపనాశిని, ఉన్మీలిని, వంజులి, త్రిస్పృశ, వివర్ధన, భగవంతుడైన హరి శుక్లాంబరధారి, సౌమ్యుడు, ప్రసన్నముఖుడు, సర్వాభరణ యుక్తుడు, శోభాయమానుడు, భక్తిముక్తి ప్రదాత.
ఆయనను ఎలా పూజించాలంటే, మార్గశిరాదిగా పన్నెండు మాసాల్లో రెండు పక్షాలలోనూ ద్వాదశీ, అష్టమి (కుదరకపోతే అమావాస్య) దినాల్లో శుద్ధి చేసుకొని ఉపవాస పూర్వకంగా వ్రతం చేయాలి. నియమగ్రహణం చేసి తటాకంలోగాని పుష్కరంలోగాని ఇంట్లోగాని స్నానం చేసి నిత్య నైమిత్తిక కర్మలను పూర్తి గావించాలి. ఒక పలం ఎత్తు బంగారంతో లక్ష్మీ సహిత సత్యేశుని ప్రతిమ అష్టశక్తి సమన్విత పద్మాసనంతో తయారు చేయించి పాలు నింపిన కుంభంపై స్థాపించాలి. ముందుగా పద్మంలో నున్న కర్ణికపై నెలకొన్న దేవాధిదేవుని యొక్క ఎనిమిది శక్తులనూ పూజించాలి. అనంతరం సత్యేశ భగవానునీ (విష్ణు) సత్యాదేవినీ (లక్ష్మి) విధ్యుక్తంగా వివిధ పాద్యాది ఉపచారాలతో పూజించి ఈ విధంగా ప్రార్థించాలి:
కృష్ణ కృష్ణ ప్రభోరామ రామకృష్ణ విభోహరే।
(ఇక్ష్వాకువు రామకృష్ణులకు బాగా ముందువాడు. వసిష్ఠుడు రామ, కృష్ణ అనే దేవనామాలను అప్పటికే చెప్పడం ఎలా జరిగింది అనే అనుమానం రావచ్చు. కాని ఈ ఇక్ష్వాకు, వసిష్టులు తరువాతి మన్వంతరానికి చెందిన త్రేతాయుగం వారు. ఈ శ్లోకంలో పూజింపబడుతున్న రామకృష్ణులు ముందలి మన్వంతరంలోని ద్వాపర యుగానికి చెందినవారు. వేదంలోనే రామకృష్ణుల ప్రసక్తి వుంది. - అను)
త్రాహిమాం సర్వదుఃఖేభ్యో రమయా సహ మాధవ॥
పూజా చేయం మయాదత్తా పితామహ జగద్గురో॥
గృహాణ జగదీశాన నారాయణ నమోఽస్తుతే॥ (ఉత్తరపర్వం 146/48,49)
తరువాత శక్త్యనుసారము బ్రాహ్మణులకు దానాలిచ్చి వ్రత సమాప్తిని చేయాలి. ఇలా ఏడాది పొడవునా శుక్ల, కృష్ణ పక్షాలు రెండింటిలోనూ చేసి సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన చేయాలి. బ్రాహ్మణునికి నమస్కరించి, ‘హే బ్రాహ్మణ దేవతా! నా సర్వపాపాలూ అపరాధాలూ దూరం కావాలని దీవించండి’ అని ప్రార్థించాలి. బ్రాహ్మణునిలో సత్యేశుడే ప్రవేశించి ‘తథాస్తు’ అంటాడు. తదనంతరం ప్రతిమలను బ్రాహ్మణునకు సమర్పించాలి.’
వసిష్టుడు ఇక్ష్వాకునికి ఇలా ఉపదేశించి నిష్క్రమించాడు.
ధర్మరాజా! బ్రహ్మదేవుడు కూడా ఈ వ్రతం చేసేవారిని ఇలా అనుగ్రహిస్తానని చెప్పి యున్నాడు - ‘వ్రతికి అనంత ఫలాలు కలుగుతాయి. సర్వ వేదాధ్యయనం, సర్వతీర్థ భ్రమణం వల్ల కలిగే పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఈ వ్రతం వల్ల వస్తుంది. ప్రతికి ఈ లోకంలో ధన, ధాన్య, పుత్ర, పౌత్ర, మిత్ర, ఆరోగ్యాది సర్వసుఖాలూ ప్రాప్తిస్తాయి. ధర్మార్థ కామ మోక్షాలు సమయాన్ని బట్టి లభిస్తాయి. ఈ వ్రతాధ్యాయాన్ని చదివిన వారికి విన్నవారికీ కూడా సర్వపాపలూ దూరమవుతాయి.’